ఆరేళ్ల పిల్లలకూ పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయి, కారణాలపై డాక్టర్లు ఏం చెబుతున్నారు?

బాలిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాల్యంలోనే యుక్తవయసు రావడానికి అనేక కారణాలుంటాయంటున్నారు వైద్యులు
    • రచయిత, దీపాలి జగ్తాప్, సుశీల సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

"నా ఆరేళ్ల కూతురిలో శారీరకంగా చాలా మార్పులు రావడం చూసి భయపడ్డాను. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటోంది. ఈ మార్పులు నన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి"

మహారాష్ట్రలో సతారా జిల్లాలోని ఓ గ్రామంలో నివసించే అర్చన (పేరు మార్చాం) తన కూతురు గురించి చెబుతున్న మాటలివి.

అర్చన భర్త ఒక రైతు. పొలంలో నిర్మించుకున్న చిన్న ఇంట్లో ఆ కుటుంబం నివసిస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో కూతురే పెద్దది. అయితే, కూతురు తన వయసు కంటే పెద్దగా కనిపించడం ప్రారంభించడంతో ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు అర్చన.

దిల్లీకి చెందిన రాశి కూడా తన కూతురు శరీరంలో మార్పులను చూశారు, మొదట్లో వాటిని ఆమె సాధారణమైనవిగా పరిగణించారు. 40 కిలోల బరువున్న తన ఆరేళ్ల కూతురిని చూసి, ఆరోగ్యంగా ఉన్నట్లు భావించారు.

అయితే ఒకరోజు అకస్మాత్తుగా రాశి కూతురు రక్తస్రావంతో బాధపడింది. డాక్టర్ వద్దకు వెళ్లగా పాపకు రుతుక్రమం వచ్చినట్లు గుర్తించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పీరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్తవయస్సు బాలికలలో 8 నుంచి 13 సంవత్సరాల మధ్య, బాలురలో 9 నుంచి 14 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది.

'అంగీకరించడం కష్టం'

డాక్టర్ చెప్పిన విషయాన్ని ‘‘అంగీకరించడానికి చాలా కష్టపడ్డాను. నా కూతురికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు’’ అని రాశి చెప్పారు.

మరోవైపు, అర్చన పాపను పరిశీలించిన స్థానిక డాక్టర్.. గైనకాలజిస్టును సంప్రదించాలని ఆమెకు సూచించారు.

"అర్చన తన కూతుర్ని మా వద్దకు తీసుకువచ్చారు. పరీక్షల తర్వాత ఆమెకు యుక్తవయస్సు లక్షణాలున్నాయని కనుగొన్నాం. ఆమె శరీర నిర్మాణం 14-15 సంవత్సరాల వయస్సు వారిలా ఉంది. ఆమెకు పీరియడ్స్ ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు" అని పుణేలోని మదర్‌హుడ్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ సుశీల్ గరుడ్ అన్నారు.

బాలికల హార్మోన్ స్థాయి ఆమె వయస్సు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని, దీనికి చాలా కారణాలు ఉండవచ్చని డాక్టర్ సుశీల్ చెప్పారు.

"ఇంట్లో 5 కిలోల పురుగుమందుల డబ్బాలు రెండు ఉన్నాయని, ఆమె కూతురు వాటి చుట్టూ ఆడుకుంటూ ఉంటుందని అర్చన చెప్పారు. కాబట్టి ఆమె హార్మోన్లలో మార్పుకు ఇది ప్రధాన కారణం కావచ్చు" అని డాక్టర్ అభిప్రాయపడ్డారు.

పిల్లల శరీరంలో ఇటువంటి అకాల మార్పులు సంభవించడాన్ని వైద్య భాషలో ప్రీకోషియస్ ప్యుబర్టీ (ముందస్తు యుక్తవయస్సు) అని అంటారని డాక్టర్ సుశీల్ అన్నారు.

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీబీఐ) వెబ్‌సైట్ ప్రకారం.. యుక్తవయస్సు అనేది అబ్బాయి లేదా అమ్మాయి శరీరంలో మార్పులు సంభవించే ప్రక్రియ. ఆ సమయంలో వారి లైంగిక అవయవాలు అభివృద్ధి చెందుతాయి, అవి పునరుత్పత్తి చేయగలవు. యుక్తవయస్సు బాలికలలో 8 నుంచి 13 సంవత్సరాల మధ్య, బాలురలో 9 నుంచి 14 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది.

అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే యుక్తవయస్సు తొందరగా వస్తుందని గైనకాలజిస్ట్ డా.ఎస్.ఎన్.బసు అన్నారు.

"ఇంతకుముందు శారీరక మార్పులు వచ్చిన ఏడాదిన్నర నుంచి మూడేళ్ల తర్వాత ఆడపిల్లలకు పీరియడ్స్ రావడం గమనించాం. ఇపుడు అమ్మాయిలకు మూడు, నాలుగు నెలల్లోనే వస్తున్నాయి" అని డాక్టర్ వైశాఖి రుస్తేగి చెప్పారు.

వైశాఖి రుస్తేగి యుక్తవయసులో హార్మోన్ల రుగ్మతలకు చికిత్స చేసే పిడీయాట్రిషియన్, ఎండోక్రినాలజిస్ట్. ప్రస్తుతం అబ్బాయిలకు యుక్తవయస్సు వచ్చిన ఏడాదిన్నరలోపు గడ్డం, మీసాలు వస్తున్నాయని, అయితే అంతకుముందు అది నాలుగేళ్లు పట్టేదని ఆమె వివరించారు.

ప్రస్తుతం అర్చన, రాశి కుమార్తెలు చికిత్స పొందుతున్నారు.

ముందస్తు పీరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐసీఎంఆర్-ఎన్ఐఆర్ఆర్సీహెచ్ 2వేల మంది బాలికలపై చేసిన అధ్యయనంలో కూతుళ్ల యుక్తవయస్సు సంకేతాలను తల్లులు గుర్తించలేకపోతున్నారని వెల్లడైంది.

కారణాలేంటి?

ఎన్‌సీబీఐ డేటా ప్రకారం.. పిల్లలలో యుక్తవయస్సు అనేక శారీరక, మానసిక మార్పులకు కారణమవుతుంది. శరీరంలోని మార్పులు కూడా వారిలో ఒత్తిడిని కలిగిస్తాయి.

మహారాష్ట్రలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చైల్డ్ హెల్త్ రీసెర్చ్ విభాగానికి చెందిన డాక్టర్ సుచిత్రా సర్వే మాట్లాడుతూ.. ప్రీకోషియస్ ప్యుబర్టీ కేసులు పెరిగాయని తన అధ్యయనంలో తేలినట్లు చెప్పారు.

ఐసీఎంఆర్-ఎన్ఐఆర్ఆర్సీహెచ్ రెండువేల మంది బాలికలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో తల్లులు కూతుళ్ల యుక్తవయస్సు సంకేతాలను గుర్తించలేకపోతున్నారని వెల్లడైంది. ప్రస్తుతం ఈ సంస్థ తొమ్మిదేళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలలో ముందస్తు యుక్తవయస్సుకు సంబంధించిన కారణాలు, నష్టాలను అధ్యయనం చేస్తోంది.

బాలికలలో ముందస్తు యుక్తవయస్సు (ప్రీకోషియస్ లేదా ఎర్లీ ప్యుబర్టీ)కు అనేక కారణాలు ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.

అర్చన ఆరేళ్ల కుమార్తెలో శారీరక మార్పులకు పురుగుమందులే కారణమని ముంబయికి చెందిన డాక్టర్ ప్రశాంత్ పాటిల్ చెప్పారు. ఇది అరుదైన కారణం అయినప్పటికీ, విషపూరితమైన పురుగుమందులు హార్మోన్ల మార్పులకు కారణమవుతున్నందున అవి ముందస్తు యుక్తవయస్సుకు దారితీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

‘’పంటలను కాపాడేందుకు రైతులు పలు రకాల క్రిమిసంహారక మందులు వాడుతుంటారు. ఈ పురుగుమందులు ముక్కు, నోటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆహారం ద్వారా కూడా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అవి హార్మోన్లను నియంత్రించే మెదడులోని గ్రంథిని ప్రభావితం చేస్తాయి’’ అని ముంబయిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ అవినాష్ భోంద్వే అన్నారు.

‘’ఇవికాకుండా కూరగాయలను తొందరగా పండించడానికి లేదా ఆవులు, గేదెల నుంచి ఎక్కువ పాలు పొందడానికి రైతులు హార్మోన్లను వాడుతుంటారు. ఇవి కూడా శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి’’ అని ఆయన చెప్పారు.

పీరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనా సమయంలో పిల్లల్లో ఊబకాయం ఎక్కువవడం కూడా ఎర్లీ ప్యుబర్టీకి కారణమంటున్నారు వైద్యులు

‘ఎప్పుడైనా పీరియడ్స్ రావచ్చు’

ముందస్తు యుక్తవయస్సుకు అనేక కారణాలు ఉండవచ్చని, అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నందున దానికి ఇప్పటివరకైతే ఏ ఒక్క దానినో కారణంగా చెప్పలేమని వైద్యులు అంటున్నారు.

ఐసీఎంఆర్ సహకారంతో ముంబయికి చెందిన బీజే వాడియా హాస్పిటల్ 2020లో ‘ఎర్లీ ప్యుబర్టీ’ శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరం ఆరు నుంచి తొమ్మిదేళ్ల వయస్సు గల బాలికల కోసం నిర్వహించారు.

"ఆరు నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయస్సు గల 60 మంది బాలికలు ‘ఎర్లీ ప్యుబర్టీ’ అనుభవించారు. వీరిలో కొంతమందికి ఎప్పుడైనా పీరియడ్స్ రావచ్చు" అని ఆ ఆసుపత్రి పీడియాట్రిక్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ సుధారావు చెప్పారు.

అంతేకాదు, ఊబకాయం ఉన్న పిల్లలలో ముందస్తు యుక్తవయసు లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. కరోనా సమయంలో పిల్లలలో ఊబకాయం ఎక్కువైందని, అందుకే ఈ సమస్య పెరిగిందని ఆమె వివరించారు.

చిన్నపిల్లల్లో పీరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముందస్తు యుక్తవయస్సుకు ఊబకాయంతో పాటు టీవీ, లేదా మొబైల్ స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండటం, వ్యాయామం లేకపోవడం వంటివి కారణమని వైద్యులు అంటున్నారు

ఎన్నో పరిశోధనలు

ముందస్తు యుక్తవయస్సుకు ఊబకాయంతో పాటు మొబైల్, టీవీ లేదా స్క్రీన్ ఎక్కువగా చూడటం, వ్యాయామం లేకపోవడం వంటివి కూడా కారణమని వైద్యులు చెబుతున్నారు.

ముందస్తు యుక్తవయస్సుకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయని డాక్టర్ బసు చెప్పారు. పురుగుమందులు, ఆహారంలో వాడే ప్రిజర్వేటివ్‌లు, కాలుష్యం, స్థూలకాయం మొదలైనవి బాహ్య కారణాలు కావచ్చన్నారు. అలాగే, జన్యుపరమైన రుగ్మత కూడా కారణమవుతుందని బసు తెలిపారు.

గత రెండు-మూడేళ్లుగా తన ఔట్ పేషెంట్ విభాగంలో ప్రతిరోజూ ఐదు నుంచి ఆరు రుతుక్రమ కేసులు నమోదవుతున్నాయని డాక్టర్ వైశాఖి చెప్పారు.

"ఏప్రిల్‌లో మార్పులను గమనించామని, జూన్-జులైలలో అమ్మాయిలకు రుతుక్రమం మొదలైందని తల్లులు చెబుతున్నారు. ఇప్పుడు అబ్బాయిలకు కూడా అలాంటి కేసులు వస్తున్నాయి" అని డాక్టర్ అన్నారు.

స్క్రీన్ టైమ్ పరోక్షంగా ముందస్తు యుక్తవయస్సును ప్రభావితం చేస్తుందని ఆమె చెప్పారు.

"మెదడు నుంచి విడుదలయ్యే మెలటోనిన్ హార్మోన్ నిద్రకు సహాయపడుతుంది. అంతేకాదు ఈ మెలటోనిన్ మన లైంగిక హార్మోన్ల స్థాయిని తగ్గించడానికి సాయపడుతుంది. అయితే స్క్రీన్ చూసే సమయం పెరగడం వల్ల నిద్ర చక్రం అంటే సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే స్క్రీన్ కాంతి మెలటోనిన్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. దీని కారణంగా లైంగిక హార్మోన్లు త్వరగా విడుదలవుతాయి" అని డాక్టర్ వైశాఖి అన్నారు.

శానిటైజర్లలో ఉండే రసాయనాలు చర్మం ద్వారా రక్తంలోకి ప్రవేశించి హార్మోన్లపై ప్రభావం చూపుతాయని తెలిపారు.

మన శరీరంలో కిస్పెప్టిన్ అనే హార్మోన్ ఉందని, ఇది ప్రీకోషియస్ ప్యుబర్టీని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని డాక్టర్ ఎస్‌ఎన్ బసు చెప్పారు. ఇవన్నీ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని, ముందస్తు యుక్తవయస్సుకు కారణమవుతాయని అభిప్రాయపడ్డారు. కానీ వీటిపై ఇప్పటికీ అధ్యయనం జరుగుతోందని అన్నారు.

అర్చన, రాశి కూతుళ్లకు పీరియడ్స్ కొంత వయస్సు వచ్చే వరకు ఆగేలా ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఆ వయసులోని ఆడపిల్లలకు పీరియడ్స్ సమయంలో తమను తాము చూసుకునేంత పరిపక్వత, పరిశుభ్రత ఉండవని వైద్యులు చెప్పారు.

అదే సమయంలో ప్రీకోషియస్ ప్యుబర్టీ ప్రతికూల ప్రభావాలు మానసికంగా కూడా కనిపిస్తాయని, చుట్టూ ఉన్న ఇతర అమ్మాయిలు వారిని భిన్నంగా చూస్తుంటారని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)