సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కలెక్టరు, అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్‌తో పాటు, ఇతర అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆయన రిమాండ్ రిపోర్టులో పలు విషయాలను పోలీసులు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేరును కూడా ఆ రిమాండ్ రిపోర్టులో పోలీసులు చేర్చారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా కేటీఆర్ సహా పలువురి ఆదేశాల ప్రకారం ఘటన జరిగినట్టుగా పోలీసుల రిమాండ్ రిపోర్టులో రాశారు.
‘‘బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకుడు కేటీఆర్ సూచనల మేరకు ప్రభుత్వాన్ని అపకీర్తి పాలు చేయాలనుకున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచడం లేదా ప్రభుత్వ పేరు చెడగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు’’ అని రిమాండ్ రిపోర్టులో రాశారు.
రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును చేర్చడంపై బీఆర్ఎస్ నేతలు ఇంకా స్పందించలేదు.
కొందరు రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని, నరేందర్ రెడ్డి అనుచరుడు, దుద్యాల మండల బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు బోగమోని సురేశ్ ద్వారా వారిని ప్రభావితం చేశారని పోలీసులు ఆరోపించారు.
ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డిని ఎ1గా, సురేశ్‌ను ఎ2గా పేర్కొన్నారు.
పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు.
ఇదే కేసులో నవంబర్ 12న (మంగళవారం) 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు బుధవారం పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
‘‘ఒక్క నరేందర్ రెడ్డి గారు మాత్రమే కాదు. రేవంత్ అల్లుడి ఫార్మా కంపెనీ కోసం పేద రైతులు ఎవరినైతే అరెస్ట్ చేశారో వారందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. పార్టీ నేతలమంతా లగచర్ల గ్రామానికి వెళ్లి వారికి భరోసా ఇస్తాం. లగచర్లలో గిరిజన రైతులను కొట్టి, చిత్రహింసలు పెట్టిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం, ఎస్టీ కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాం’’ అని కేటీఆర్ అన్నారు.
పట్నం నరేందర్ రెడ్డి 2018-23 మధ్య కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.


ఫొటో సోర్స్, UGC
లగచర్ల గ్రామంలో ఏం జరిగింది?
ఫార్మా విలేజ్ ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై ప్రజలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరగడం చర్చనీయంగా మారింది.
కొడంగల్ ఏరియా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డిపై ప్రజలు కర్రలతో దాడి చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పైనా దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఆయన వాహనం కూడా ధ్వంసమైంది.
ఈ విషయంపై కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు సోమవారం బీబీసీ ఫోన్ చేయగా...‘‘నేను సురక్షితంగా ఉన్నాను. మళ్లీ నా పని చేస్తున్నా’’ అని చెప్పారు.
తర్వాత మీడియాతో మాట్లాడిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్... ‘‘గ్రామస్థులు మమ్మల్ని మాట్లాడటానికే పిలిచారు. అక్కడికి మేం కూడా మాట్లాడటానికే వెళ్లాం. అక్కడ కొందరు వారిని ప్రోత్సహించారు. దాంతో ఈ ఘటన జరిగింది. దీన్ని దాడి అనొద్దు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటుపై నవంబర్ 11న ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు వెళ్లారు.
ముందుగా దుద్యాల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని ఏర్పాట్లు చేశారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, దుద్యాల తహసీల్దారు విజయ్ కుమార్ కూడా అక్కడికి చేరుకున్నారు.
అయితే, ప్రజాభిప్రాయ సేకరణ జరిగే వేదిక వద్దకు రైతులెవరూ రాలేదు. వారంతా దుద్యాల మండలంలోని లగచర్ల అనే గ్రామంలో ఉన్నట్లుగా బాధిత రైతుల తరఫున సురేశ్ అనే వ్యక్తి అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికే వచ్చి ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించాలని కోరారు.
దీంతో అధికారులు లగచర్ల గ్రామానికి చేరుకున్నారు. అప్పుడే ఒక్కసారిగా జనం అక్కడ గుంపుగా చేరారు. ‘కలెక్టర్ గో బ్యాక్..’ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులు ప్రయత్నించారు.
అయితే, ప్రజలు ఎంతకీ వినకపోగా అధికారులపై దాడికి దిగారు.
కలెక్టర్‌ను తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఒక మహిళ వెనక నుంచి చేయి చేసుకున్నట్లుగా వీడియోలో రికార్డు అయ్యింది.
ఈ పరిణామంతో కలెక్టర్, ఇతర అధికారులు అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో జనం రాళ్లు, కర్రలతో అధికారులు, వారి వాహనాలపై దాడికి దిగారు.

ఫొటో సోర్స్, UGC
ఈ ఘటనలో కలెక్టర్ వాహనం వెనుక అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఇతర వాహనాల అద్దాలూ పగిలాయి. దుద్యాల తహసీల్దారు కారుపై ఆందోళనకారులు రాళ్లు విసరడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
మరికొందరు గ్రామస్థులు వాహనాలను తరుముతూ రాళ్లు విసిరారు.
కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసింది. దీనికి స్పెషల్ ఆఫీసర్‌గా వెంకట్ రెడ్డిని నియమించింది.
వెంకట్ రెడ్డిపై ప్రజలు దాడికి దిగారు. కర్రలతో ఆయనను కొట్టారు. ఈ ఘటనలో ఆయన దుస్తులు చిరిగిపోయాయి. ఎలాగోలా సమీప పొలాల్లోకి వెళ్లి వారి నుంచి తప్పించుకున్నారు.
ఈ విషయంపై వెంకట్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆయన అందుబాటులోకి రాలేదు.
‘‘ప్రజాభిప్రాయ సేకరణ ఉందని మాకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. కేవలం ఫార్మా కంపెనీలతో సమావేశం అని చెప్పి గ్రామంలో చాటింపు వేయించారు. రైతులు తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. కొన్ని రోజులుగా మేం ఆందోళనలు చేస్తున్నాం’’ అని స్థానికుడు గోపాల్ నాయక్ చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
ఏమిటీ ఫార్మా విలేజ్? స్థానికుల ఆందోళన ఏంటి?
కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పోలెపల్లి, హకీంపేట, లగచర్ల, దుద్యాల, ఈర్లపల్లి, పులిచెర్లకుంట తండాలో పరిధిలో సుమారు 1,314 ఎకరాలు సేకరించి ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని భావించింది.
ఎకరాకు పది లక్షల రూపాయల పరిహారం, ఇంటి స్థలం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారులు తెలిపారని బాధిత రైతులు చెప్పారు.
ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని, తమ భూములకు ప్రభుత్వం తక్కువ పరిహారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని కొందరు బాధితులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు.
హకీంపేటలో కొందరు బాధిత రైతులు సెప్టెంబరు నెల నుంచి నిరాహార దీక్షలు చేయడమే కాకుండా వివిధ రూపాల్లో ఆందోళనలు కూడా చేస్తున్నారు.
అక్టోబరు 25న కూడా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఆ సమయంలోనూ బాధిత రైతులు అడ్డుకున్నారు.
రోటిబండ తండాలో కాంగ్రెస్ పార్టీ దుద్యాల మండల అధ్యక్షుడు అవిటి శేఖర్‌పై దాడి చేయడంతో పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.
తాజాగా అధికారులు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు యత్నించడంతో దాడి జరిగింది.
ఈ ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు.
‘‘గరీబి హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుండి కిసాన్ హటావో అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారు. రేవంత్ పాలనలో ఐఎఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు.
ఈ విషయంపై పరిగి ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టి.రామ్మోహన్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘ఈ దాడి వెనుక ఎవరున్నారనే విషయంపై విచారణ జరుగుతోంది. ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. విచారణ తర్వాత ఇందులో ఎవరున్నారు? ఎవరి ప్రోత్సాహంతో దాడి జరిగింది? అనే విషయాలు బయటకు వస్తాయి’’ అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














