నాగ్‌పూర్: టాల్కం పౌడర్, గంజి పొడి, కాల్షియంతో మాత్రలను తయారు చేసి ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేశారు, ఈ ముఠా ఎలా పని చేస్తోందంటే..

నాగ్‌పూర్, నకిలీ ఔషధాలు, ప్రభుత్వాసుపత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, భాగ్యశ్రీ రౌత్
    • హోదా, బీబీసీ కోసం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి, వైద్య కళాశాలకు భారీగా నకిలీ ఔషధాలను సరఫరా చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని వెనకున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

‘రిక్లేవ్ 625’ అనే యాంటిబయాటిక్ ఔషధాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి సరఫరా చేశారు. ఈ మందుల్ని ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఇచ్చారు. ఈ వ్యవహారం గురించి నాలుగు కంపెనీల డైరెక్టర్ల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 2023 ఆగస్టు 21న, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని మందుల దుకాణం నుంచి కొన్ని మందుల నమూనాలను పరీక్షల నిమిత్తం ముంబయిలోని ల్యాబ్‌కు పంపారు.

ఆ మందులపై నివేదిక 2024 జులై 31న ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాంతీయ కార్యాలయానికి చేరింది. ఈ మందులు నకిలీవని ఆ నివేదిక స్పష్టం చేసింది.

ఆ తర్వాత ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్‌స్పెక్టర్ నితిన్ భండార్కర్ అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నాలుగు కంపెనీల డైరెక్టర్లపై కేసు నమోదు చేశారు.

ఇతర నిందితులకు నోటీసులు ఇచ్చామని నాగ్‌పూర్‌లోని అజ్ని పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ నితిన్ చంద్ర రాజ్‌కుమార్ బీబీసీకి చెప్పారు.

బీబీసీ
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నాగ్‌పూర్, నకిలీ ఔషధాలు, ప్రభుత్వాసుపత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మందుల సరఫరా?

నకిలీ మందుల సరఫరా రాకెట్ కేవలం నాగ్‌పూర్‌లోనే కాకుండా మహారాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వీటిని సరఫరా చేసినట్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విచారణలో తేలింది.

గతంలోనూ నకిలీ ఔషధాల సరఫరా ఆరోపణలతో కమలేశ్వర్‌ పట్టణంలో విజయ్ చౌదరి, మిహిర్ త్రివేదిలపై కేసు నమోదైంది. ఆ కేసులో అరెస్టైన వారు ఇప్పటికే జైలులో ఉన్నారు.

వీరిద్దరిపై థానే, నాందేడ్, వార్ధాలలో మూడు కేసులు ఉన్నాయి. నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు నకిలీ మందుల సరఫరాకు సంబంధించి ఇప్పుడు మరో కేసు నమోదైంది.

వీళ్లు సరఫరా చేసిన ‘రిక్లేవ్ 625’ అనే ఔషధంలో అమోక్సిసిలిన్ లేదా క్లావులానిక్ యాసిడ్ అనే కీలకమైన పదార్థాలు లేవు. మందుల తయారీ కంపెనీల పేర్లు వేర్వేరుగా ఉన్నాయి.

ఈ ఔషధాలు తయారు చేసినట్లుగా చెబుతున్న కంపెనీలు అసలెక్కడా లేవు. అలాగే ఈ రెండు కేసుల్లోనూ ఔషధాలు ఒకరే సరఫరా చేశారని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్‌స్పెక్టర్ నితిన్ భండార్కర్ చెప్పారు.

నాగ్‌పూర్, నకిలీ ఔషధాలు, ప్రభుత్వాసుపత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాగ్‌పూర్ జిల్లా సర్జన్ కార్యాలయం నుంచి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులకు మందులు సరఫరా అయ్యాయి.

ఔషధంగా టాల్కమ్ పౌడర్ సరఫరా

2023 ఫిబ్రవరిలో కలమేశ్వర్ రూరల్ హాస్పిటల్ నుంచి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రిసిప్ట్ 500 అనే టాబ్లెట్‌ను సేకరించింది. ఈ టాబ్లెట్ల నమూనాలను పరీక్షల నిమిత్తం ముంబైలోని ల్యాబ్‌కు పంపించారు. ఈ మందులు నకిలీవని ఇందులో అసలైన ముడి పదార్ధాలను కలపలేదని ల్యాబ్ పరీక్షల్లో తేలింది.

ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఫిబ్రవరి 2024 న కలమేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మందుల్ని నాగపూర్ జిల్లా సర్జన్ కార్యాలయం నుంచి కలమేశ్వర్ గ్రామీణ ఆసుపత్రికి సరఫరా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ మందులను నాగపూర్ జిల్లా సర్జన్ కార్యాలయం టెండర్ల ద్వారా సేకరించింది. తర్వాత వాటిని జిల్లాలోని గ్రామీణ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశారు. నాగ్‌పూర్ జిల్లా సర్జన్ లాతూర్‌కు చెందిన జై ఎంటర్‌ప్రైజెస్‌కు టెండర్‌ను అప్పగించారు.

జై ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులను విచారించడంతో నకిలీ ఔషధాల ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చిందని సవనెర్ ఏఎస్పీ అనిల్ మస్కే చెప్పారు.

నాగ్‌పూర్, నకిలీ ఔషధాలు, ప్రభుత్వాసుపత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నకిలీ మందుల తయారీకి కేంద్రంగా ఉత్తరాఖండ్‌లోని ఫార్మా సంస్థ

నకిలీ ఔషధాల రాకెట్ ఎలా పని చేస్తుందంటే...

నకిలీ ఔషధల తయారీ రాకెట్ ఎలా పని చేస్తుందనే దాని గురించి అనిల్ మస్కే బీబీసీకి వివరించారు. ప్రభుత్వాసుపత్రులకు ఔషధాలను సరఫరా చేసే టెండర్‌ను లాతూర్‌కు చెందిన బివాండీ అక్వాటిస్ అనే సంస్థ గెలుచుకుంది. ఈ సంస్థ మిహిర్ త్రివేది నుంచి మందుల్ని కొనుగోలు చేసింది.

మిహిర్ త్రివేది ఈ ఔషధాల్ని కబీజ్ జెనరిక్స్‌కు చెందిన విజయ్ చౌదరి నుంచి పొందేవారు. ఈ సంస్థలన్నీ ఔషధాల్ని సరఫరా మాత్రమే చేస్తాయి. వీటిని తయారు చేసే కంపెనీ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉంది. హిమాన్షు అలియాస్ రాబిన్ తనేజా ఉత్తరాఖండ్‌లో నకిలీ మందుల్ని కొనుగోలు చేసేవారు. ఆయన సహరాన్‌పూర్‌లోని రామన్ తనేజాకు వాటిని సరఫరా చేసేవారు. రామన్ తనేజా నుంచి విజయ్ చౌదరి వీటిని కొనేవారు.

విజయ్ చౌదరి నుంచి మిహిర్ త్రివేదికి, ఆయన నుంచి ప్రభుత్వాసుపత్రికి ఔషధాలు సరఫరా చేసే టెండర్లు గెలుచుకున్న వారికి నకిలీ ఔషధాలు చేరేవి.

ఈ వ్యవహారంలో పై నుంచి కింద వరకు కీలకంగా ఉన్న నలుగురు ముంబయిలోని ఓ హోటల్‌లో కలుసుకుని నకిలీ మందులను తయారు చేసేందుకు ప్లాన్ చేశారని పోలీసులు చెప్పారు.

కలమేశ్వర్ రూరల్ ఆసుపత్రికి సరఫరా చేసిన రెసిప్ట్ 500 అనే యాంటీబయాటిక్ టాబ్లెట్‌లో అసలైన ముడి పదార్ధం (ఏపీఐ) లేదు. ఏదైనా యాంటీ బయాటిక్‌లో ఏపీఐ 80 శాతం ఉంటుంది. కానీ రెసిప్ట్ 500లో అది అసలే లేదు.

ఈ ఔషధాన్ని టాల్కం పౌడర్, గంజి పొడి, కాల్షియంతో తయారు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

ఇదొక్కటే కాదు, ఔషధాలను విక్రయించడానికి వారు చూపించిన సర్టిఫికేట్ కూడా నకిలీదని అనిల్ మస్కే చెప్పారు.

ఈ నలుగురు నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారు.

ఈ వ్యవహారంపై నాగపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యులు డాక్టర్ రాజ్‌గజ్‌బియే స్పందన కోసం ప్రయత్నించాం. కానీ ఆయన స్పందించలేదు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)