‘రెండు వారాల్లో 72 పులులు చనిపోయాయి’.. మనుషులే కారణమా?

ఫొటో సోర్స్, Anadolu Agency via Getty Images
ఉత్తర థాయిలాండ్‌లోని చియాంగ్ మై నగరంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం టైగర్ కింగ్‌డమ్ చియాంగ్‌మైలో పదుల సంఖ్యలో పులులు మృతి చెందడంతో అధికారులు విచారణ ప్రారంభించారు.
ఈ పార్క్‌కు చెందిన రెండు చోట్ల రెండు వారాల వ్యవధిలో 72 పులులు చనిపోయాయి. ఇక్కడ సందర్శకులు పులులను తాకి, వాటితో ఫొటోలు దిగే అవకాశం ఉంటుంది.
‘చనిపోయిన పులుల నుంచి సేకరించిన నమూనాల్లో కెనైన్ డిస్టెంపర్ వైరస్ ఉన్నట్టు తేలిందని, అయితే ఈ వ్యాధి ఎలా వ్యాపించిందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు’ అని స్థానిక పశుసంవర్థక శాఖ చెప్పింది.
అధికారులు చనిపోయిన పులులను సోమవారం ఖననం చేసినట్లు తెలిపారు.
ఈ పార్క్‌లో 240కు పైగా పులులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
"అవి అనారోగ్యంతో ఉన్నాయని గుర్తించే సమయానికి చాలా ఆలస్యమైపోయింది" అని జాతీయ పశుసంవర్థక విభాగం డైరెక్టర్ సోమ్‌చువాన్ రతనాముంగ్‌క్లానన్ తెలిపారు.
పిల్లులు, కుక్కలు వంటివాటితో పోల్చినప్పుడు పులుల్లో జబ్బులను గుర్తించడం మరింత కష్టమని ఆయన చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
పులుల కళేబరాల నుంచి సేకరించిన నమూనాల్లో కెనైన్ డిస్టెంపర్ వైరస్‌తో పాటు శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే ఒక బ్యాక్టీరియా కూడా గుర్తించినట్టు గత వారం అక్కడి పశుసంవర్థక శాఖ కార్యాలయం వెల్లడించింది.
కెనైన్ డిస్టెంపర్ వైరస్ అంటువ్యాధి. ఇది శ్వాసకోశ, జీర్ణవ్యవస్థ నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. సాధారణంగా ఇది కుక్కల్లో కనిపించినప్పటికీ, పెద్ద పులులకూ సోకుతుంది. చాలా సందర్భాల్లో ఇది ప్రాణాంతకమవుతుంది.
ప్రాథమిక పరీక్షల్లో పులులు ఫెలైన్ పార్వోవైరస్ బారినపడినట్టు కూడా తేలిందని అధికారులు అంతకుముందు తెలిపారు. అదేవిధంగా కలుషిత కోడిమాంసం తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెంది ఉండవచ్చని తొలుత అనుమానించారు.
చోన్‌బురి ప్రావిన్స్‌లోని ఓ టైగర్ జూలో 2004లో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి కూడా కోడిమాంసమే కారణమని భావించారని బ్యాంకాక్ పోస్ట్ తెలిపింది. ఆ సమయంలో దాదాపు 150 పులులు ప్రాణాలు కోల్పోయాయి.
చియాంగ్ మైలోని పులుల ఎన్‌క్లోజర్‌లో పనిచేస్తున్న పశువైద్యులు లేదా సిబ్బందిలో ఎవరూ కెనైన్ డిస్టెంపర్ బారినపడలేదు.
అయినప్పటికీ, వారిని 21 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచారని థాయ్ పీబీఎస్ తెలిపింది.
జంతు హక్కుల సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. థాయిలాండ్‌లో వినోదం కోసం బంధించిన పులుల దయనీయ పరిస్థితులను ఈ సంఘటన బయటపెట్టిందని పేర్కొన్నాయి.
"బందీగా ఉన్న వన్యప్రాణులు అంటువ్యాధులకు తేలికగా గురవుతాయి" అని థాయిలాండ్‌లోని వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ పేర్కొంది.
పర్యటకులు కూడా ఇలాంటి ఆకర్షణల నుంచి దూరంగా పెడితే ఇలాంటి విషాదాలు చాలా వరకు నివారించవచ్చని పెటా ఆసియా తెలిపింది.
అధికారులు వ్యాధి నియంత్రణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో టైగర్ కింగ్‌డమ్ చియాంగ్ మైను రెండు వారాలపాటు తాత్కాలికంగా మూసివేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














