ఈ ఆడ సింహం బీచ్‌లో ఏం చేస్తోంది?

ఆడ సింహం

ఫొటో సోర్స్, Griet Van Malderen

    • రచయిత, ఇసాబెల్లె గెరెట్‌సెన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నమీబియాలోని ‘ఎడారి సింహాల’ గుంపు ఒకటి సంప్రదాయంగా అవి వేటాడే ప్రాంతాలను విడిచిపెట్టి, అట్లాంటిక్ తీర ప్రాంతానికి తరలివెళ్లింది.

ఇలా వెళ్లిన సింహాల గుంపు ప్రపంచంలోనే ఏకైక సముద్ర సింహాల మందగా మారింది.

ఒక ఫోటోగ్రాఫర్ ఈ సింహాల ప్రవర్తనలో వచ్చిన మార్పును తన కెమెరాలో బంధించారు.

అద్భుతంగా తీసిన ఈ ఫోటోలో.. ఒక ఆడ సింహం నమీబియాలో గులకరాళ్లతో నిండిన బీచ్‌లో కూర్చుని తీక్షణంగా చూస్తూ ఉంది.

దాని వెనుకాలే ఎగసిపడుతున్న అలలు ఒడ్డును తాకుతూ ఉన్నాయి.

తాను వేటాడిన ‘కేప్ ఫర్ సీల్’ (ఒక రకం సీల్‌) కళేబరంపై అది దృష్టి పెట్టింది.

బెల్జియన్ ఫోటోగ్రాఫర్ గ్రీట్ వాన్ మాల్డెరెన్ నమీబియా ఎడారి సింహాల్లో ఒకటైన ‘గామా’ అనే ఆడ సింహాన్ని అద్భుతంగా ఫోటో తీశారు.

స్కెలెటన్ కోస్ట్‌లో(నమీబియాలోని అట్లాంటిక్ తీరం ఉత్తర భాగంలో) ఉన్న కఠిన పరిస్థితులను తట్టుకుని బతికేందుకు సీల్స్‌ను వేటాడటం నేర్చుకుంది గామా.

వాన్ మాల్డెరెన్ తీసిన ఈ ఫోటో, లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం నిర్వహించే ప్రతిష్టాత్మకమైన 'వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ కాంపిటీషన్'‌లో ఎన్నో ప్రశంసలు పొందింది.

''ఇది రోజంతా సీల్‌ కళేబరానికి కాపలాగా ఉంది'' అని వాన్ మాల్డెరెన్ చెప్పారు. ఈ చిత్రాన్ని తన కెమెరాలో బంధించేందుకు మాల్డెరెన్ ఎన్నోరోజులు అక్కడ గడిపారు. కారులో కూర్చుని ఆయన కంటికి రెప్పవేయకుండా గామాను గమనించారు.

''వాటి ప్రవర్తనలో మార్పు ఎలా మొదలైందో చూడటం చాలా అద్భుతం'' అని మాల్డెరెన్ చెప్పారు.

మొత్తం 80 ఎడారి సింహాల్లో కేవలం 12 సింహాలు మాత్రమే స్కెలెటన్ కోస్ట్‌ ప్రాంతంలో నివసిస్తున్నాయి.

ఆహారాన్ని వెతుక్కుంటూ ఇవి అరిద్ నమీబ్ డిజర్ట్ (నమీబ్ ఎడారి) నుంచి అట్లాంటిక్ మహాసముద్రం వైపు తరలి వెళ్లాయి.

ఈ కొత్త ఆవాసానికి అనుగుణంగా 2017లో అవి వాటి ఆహారపు అలవాట్లను, ప్రవర్తనను చాలా మార్చేసుకున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'' ఈ జంతువులు ఎంత బలమైనవో ఈ ఫోటో చూపిస్తుంది. మనుగడ కోసం ఇవి వాటి ఆవాసాలనే మార్చుకున్నాయి'' అని వాన్ మాల్డెరెన్ చెప్పారు.

''ఈ సింహాలు చాలా కఠినమైనవి. జీవితమనేది మనుగడం కోసమే. దీనిలో ప్రతిదీ పోరాటమే'' అని అన్నారు.

వాన్ మాల్డెరెన్ ఈ ఆడ సింహం గామాకు మూడు నెలల వయసు ఉన్నప్పటి నుంచి గమనిస్తూ వచ్చారు. ప్రస్తుతం దీనికి మూడున్నర ఏళ్లు.

ఈ ఆడ సింహం ఒక్కరాత్రిలోనే 40 సీల్స్‌ను చంపే సామర్థ్యంతో భయంకరమైన వేటగత్తెగా మారిందని తెలిపారు.

స్కెలెటన్ కోస్ట్‌లో పెరిగిన సింహాల తొలి తరానికి చెందినదే ఈ గామా అని పర్యావరణ పరిరక్షణ నిపుణులు ఫిలిప్ స్టాండర్ చెప్పారు. 1980 నుంచి నమీబియా ఎడారి సింహాలను ఆయన ట్రాక్ చేస్తున్నారు.

1980ల్లో స్కెలెటన్ కోస్ట్‌ వెంబడి నమీబియా ఎడారి సింహాలు నివసించేవి. కానీ, కరవు, ఆ తర్వాత రైతులతో నెలకొన్న సంఘర్షణతో చాలావరకు వీటి జనాభా తుడిచి పెట్టుకుపోయిందని స్టాండర్ చెప్పారు.

30 ఏళ్ల తర్వాత ఈ జంతువులు మళ్లీ తమ తీర ప్రాంతాన్ని వెతుక్కుంటూ తిరిగి వచ్చినట్లు తెలిపారు.

ఈ జంతువులు ఎటువంటి వృక్ష సంపద లేని, సముద్రపు ఇసుక దిబ్బలు మాత్రమే ఉండే అత్యంత కఠినమైన ప్రదేశంలో జీవించేందుకు అలవాటు పడ్డాయని స్టాండర్ చెప్పారు.

1997లో నాన్-ప్రాఫిట్ డిజర్ట్ లయన్ కన్జర్వేషన్ ట్రస్ట్‌ను ఆయన నెలకొల్పారు.

''ఎడారి సింహాలు చాలా ప్రత్యేకమైనవి'' అని స్టాండర్ తెలిపారు. మిగతా ఏ సింహాలతో పోల్చినా అతిపెద్ద నివాస ప్రాంత పరిధి వీటికి ఉంటుందని చెప్పారు.

ఎడారి సింహం నివసించే ప్రాంతం సగటున 12 వేల చదరపు కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు.

సెరెంగేటిలో (టాంజానియాలోని వన్యప్రాణి రక్షిత ప్రాంతం) సింహం నివసించే ప్రాంతం సుమారు 100 చదరపు కిలోమీటర్లు.

నీరు లేకపోయినా ఇవి బతకడం అలవాటు చేసుకున్నాయని స్టాండర్ తెలిపారు. అవి తినే మాంసం నుంచే వాటి హైడ్రేషన్‌ను చాలావరకు పొందుతూ ఉంటాయని చెప్పారు.

''సవన్నా (చెట్లు, పొదలతో కూడిన విశాలమైన గడ్డి భూమి) ఆవాసాల్లో కూర్చున్న లేదా లయన్ కింగ్‌లో మాదిరి పెద్ద బండరాయిపై పడుకున్న సింహాలను మనం చూసేవాళ్లం. కానీ, బీచ్‌లో కూర్చున్న సింహాన్ని చూడటం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా వింతగా, అసాధారణంగా అనిపిస్తుంది'' అని లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియానికి చెందిన లైఫ్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సీనియర్ రీసెర్చర్ నటాలీ కూపర్ తెలిపారు.

సముద్ర సింహాలు

ఫొటో సోర్స్, Griet Van Malderen

సవన్నా సింహాలతో పోలిస్తే ఎడారి సింహాలు చిన్న చిన్న గ్రూప్‌లుగా ప్రయాణిస్తుంటాయని కూపర్ తెలిపారు. వాటికి కావాల్సిన ఆహారం కోసం చాలా దూర ప్రాంతాలకు చిన్న గ్రూప్‌లుగా తిరుగుతూ ఉంటాయని, ఇలా తిరిగేటప్పుడు సింహాలను ఫోటో తీయడం చాలా సవాలుతో కూడుకున్నదని చెప్పారు.

''ఫోటోగ్రాఫర్‌గా ఇది చాలా అద్భుతం. ఎందుకంటే, ఈ సింహాలు నిత్యం తిరుగుతూనే ఉంటాయి'' వాన్ మాల్డెరెన్ చెప్పారు.

''ఇవి కనీసం పడుకుని నిద్రపోవు. నిత్యం వాటి మనుగడ కోసం వేటాడుతూనే ఉంటాయి'' అని తెలిపారు.

కరవు ప్రభావ పరిస్థితులతో మైదాన ప్రాంతాల్లో అవి వేటాడే జీవులు ఆస్ట్రిచ్‌లు, స్ప్రింగ్‌బాక్స్, ఓరిక్స్ తగ్గిపోయిన తర్వాత 2015లో సింహాలు తిరిగి సముద్రాన్ని గుర్తించాయి. తీరప్రాంతాల్లో వేటాడటాన్ని ప్రారంభించాయి.

''పర్యావరణ మార్పు ఈ ఎడారి సింహాలను సముద్ర వద్దకు తీసుకెళ్లింది. అట్లాంటిక్ తీర ప్రాంతంలోని బీచ్‌ల వెంబడి బతికేందుకు అసాధారణమైన మార్గాలను అవి తప్పనిసరి పరిస్థితుల్లో అనుసరించాల్సి వచ్చింది'' అని తెలిపారు.

30 ఏళ్ల కిందట తొలిసారి ఎడారి ఆడ సింహాల మీద అధ్యయనం చేసినప్పుడు, అవి జిరాఫీలను వేటాడటంలో స్పెషలిస్టులుగా గుర్తించామని తెలిపారు.

సింహాలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం ఈ సీల్ కాలనీ ఈ సింహాలకు కాస్త ఊపిరి తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది.

2025 మార్చిలో తీర ప్రాంతంలో రెండు పిల్లలు పుట్టాయని వాన్ మాల్డెరెన్ చెప్పారు.

నమీబియా ఎడారి సింహాలకు మాత్రమే సముద్ర జీవులను వేటాడే సింహాలుగా పేరుంది. ''వీటిని మేం సముద్ర సింహాలు చెబుతుంటాం. ఎందుకంటే, సముద్ర పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడాన్ని, సముద్రం నుంచి ఆహారాన్ని పొందడాన్ని ఇవి నేర్చుకున్నాయి'' అని స్టాండర్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)