Alaskan Malamute: ఈ పెంపుడు కుక్క బరువు 82 కేజీలు

మెత్తని చెవులు, చిన్న పాదాలు, ముద్దొచ్చే కళ్లు.
ఎమీ షార్ప్ ఎంతో ఇష్టంగా అలస్కన్ మలామ్యూట్ జాతికి చెందిన కుక్క పిల్లను పెంచుకునేందుకు తెచ్చుకున్నారు.
అయితే ఈ కుక్కపిల్ల ఊహించని స్థాయిలో బరువు పెరిగింది.
దాంతోపాటే ఎమీ షార్ప్ బాధ్యత పెరుగుతూ వచ్చింది.
‘దాని మెడకు వేసే కాలర్... బెల్ట్ అంత పెద్దగా ఉంటుంది. ఇది ఇంత పెద్దగా అవుతుందని మేం అస్సలు అనుకోలేదు’ అని ఎమీ నవ్వుతూ చెప్పారు.


‘82 కేజీలు ఎప్పుడు పెరిగిందో తెలియలేదు’
ఈ కుక్క పేరు మాల్. దాని వయసు ఇప్పుడు అయిదేళ్లు. అది పెద్దదైపోయింది. దాని బరువు 82 కేజీలు.
అది చూడడానికి షెట్లాండ్ పోనీ(ఒక రకం చిన్న గుర్రం)లా కనిపిస్తుంది. ఇప్పుడే కాదు 27 ఏళ్ల ఎమీ జీవితంలో పెద్దకుక్కలు ఎప్పుడూ భాగమే.
13 ఏళ్ల హస్కీ చనిపోయిన తర్వాత అలస్కన్ మలామ్యుట్ పప్పీని తెచ్చుకోవాలని ఎమీ కుటుంబం నిర్ణయించుకుంది. మంచులో నడవగలిగే కుక్కలివి. ఇవి వాతావరణ పరిస్థితులు తట్టుకునే రకం కుక్కలు.
మాల్‌ను వాకింగ్‌కి తీసుకెళ్లినప్పుడు దాని శక్తి తెలుస్తుందని ఎమీ చెప్పారు.
''ఎవరు ఎవరిని నడిపిస్తున్నారు'' అని నన్నడుగుతుంటారు. చాలామంది తలతిప్పి చూస్తుంటారు. అటుగా ప్రయాణించే వాళ్ల కళ్లు ఆశ్చర్యంగా చూస్తున్న విషయం అర్ధమైపోతుంటుందని ఆమె చెప్పారు.

‘పెంచడం ఆషామాషీ వ్యవహారం కాదు’
ఉత్తర-పశ్చిమ అలస్కాలోని కొట్జెబ్యూ సౌండ్ తీరప్రాంతంలో ఉండే ఇన్యుట్ తెగ నుంచి అలస్కా మలామ్యుట్ పేరు వచ్చిందని అమెరికాకు చెందిన కెన్నెల్ క్లబ్ తెలిపింది.
సాధారణంగా ఈ జాతి కుక్కలు 34 నుంచి 39 కేజీల బరువు పెరుగుతాయని, వాటికి ''డబుల్ కోట్''గా పేర్కొనే ప్రత్యేకమైన ఒత్తయిన జూలు ఉంటుందని, ఆర్కిటిక్ ఉష్ణోగ్రతల్లో అవి వేడిగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుదని పీడీఎస్ఏ(పీపుల్స్ డిస్పెన్సరీ ఫర్ సిక్ యానిమల్స్) తెలిపింది.
తన కుక్క ఇంత పెద్దగా ఎప్పుడు పెరిగిందో తాను మొదట గమనించలేదని, దాని ఒంటికి, మెడకు వేసే బెల్టులు పట్టకుండా పోయాయని, అప్పుడే తానిది గుర్తించానని ఎమీ చెప్పారు.
అది ఇంకా ఇంకా పెద్దదవుతూ వచ్చిందని ఆమె అన్నారు.
మాల్ జూలును శుభ్రం చేసేవారిని గుర్తించడం మాకెదురైన సమస్యల్లో ఒకటి.
ఎవరూ దొరకకపోవడంతో ఇటీవల ఆమె సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు.
ఆమె పోస్టుకు వందల లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. మాల్ సైజ్ చూసి సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోయారు. సాయం చేస్తామని ముందుకొచ్చారు.
సెలూన్‌లో అప్పాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తోంటే ఫేస్‌బుక్‌లో పెద్ద కుక్క పోస్టు చూశారా అని ఒకరు ఎమీని అడిగారు.
''అది నాదే'' అని ఎమీ నవ్వుతూ బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇంటినిండా కుక్క జూలు పడుతుంటుంది’
ఎమీ చేసిన విజ్ఞప్తికి సరైన ఫలితం దక్కింది. మాల్ ఏ జాతికి చెందిన కుక్కో తెలుసుకున్న ఒకరు దాన్ని జూలు కట్ చేయడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు.
''ఆర్కిటిక్ డాగ్ క్లాస్‌లో మాల్‌ను ఫోర్ బై ఫోర్ వర్షన్‌గా భావిస్తారు. భారీ స్థాయి బరువులను ఎక్కువదూరం లాక్కెళ్లడానికి ఈ రకానికి చెందిన కుక్కలను ఉపయోగిస్తారు'' అని యూకేలో అలస్కన్ మలామ్యుట్ క్లబ్‌కు చెందిన జోన్ షీహాన్ చెప్పారు.
ఈ రకం కుక్క అద్భుతంగా ఉన్నప్పటికీ, వాటిని పెంచుకోవడంలో అనేక సమస్యలు ఎదురవుతాయని ఆమె హెచ్చరించారు.
''చూడడానికి బాగా ముద్దుగా కనిపించే ఆ కుక్కను పెంచుకోవాలనుకుంటే దానికి బాగా జూలు ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ కుక్క జూలు మంచం మీద పడుతుంది. తినే ఆహారంలో పడుతుంది. దుస్తులకు అంటుంది. అన్నిచోట్లా ఉంటుంది'' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘నేనిప్పుడు ఇంటికి రాను’
మాల్‌ను పెంచే క్రమంలో దాని బలం కారణంగా ఎమీ లెక్కలేనన్నిసార్లు అనేక సమస్యలును ఎదుర్కొన్నారు. వాకింగ్‌కు తీసుకెళ్లినప్పుడు తరచుగా అది కూర్చుండిపోయి లోపలకు రానని మొరాయిస్తుంటుంది.
''నేను దాన్ని లేపలేను. అప్పుడు చుట్టుపక్కలవాళ్లు బయటకు వచ్చి వాళ్లు దాన్ని లేపడానికి ప్రయత్నిస్తారు'' అని ఎమీ చెప్పారు.
''నేను ఇంటికి రావడానికి ఇప్పుడు రెడీగా లేను అన్నట్టుగా అది అక్కడ పడుకుంటుంది. అది గట్టిగా అరుస్తుంది కూడా'' అని ఆమె చెప్పారు.
ఇలాంటి అనుభవాలు ఎదురైనా ఆ కుక్కను పెంచుకోవడంపై తనకెప్పుడూ చిరాకు కలగలేదని ఎమీ అన్నారు.
పెద్ద కుక్కలను కొనుక్కునేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. ముద్దొచ్చే కుక్కతో తన జీవితం చాలా బాగుందని ఆమె సంతోషం వ్యక్తంచేశారు.
''అది చాలా బాగుంటుంది. ఇదంతా మాల్ ప్రపంచం. మేం దాని ప్రపంచంలో జీవిస్తున్నాం'' అంతే అని ఎమీ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














