‘‘నా భార్యను వ్రతానికి కూర్చోమ్మంటే తనకు అప్పటికే పెళ్లయిందని చెప్పింది’’

- రచయిత, గణేష్ పోల్, శ్రీకాంత్ బంగాలే
- హోదా, బీబీసీ ప్రతినిధులు
‘‘రైతు కుటుంబాల్లోని అబ్బాయిలకు అంత త్వరగా పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో విసుగు చెంది ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లి కావడం లేదనే తొందరలో ముందూ వెనుకా చూడకుండా నేనూ పెళ్లి చేసుకున్నాను. దాదాపు 5 లక్షలు నష్టపోయాను’’
పెళ్లి పేరుతో తనకు జరిగిన మోసం గురించి జున్నర్‌కు చెందిన సాగర్ చెప్పిన మాటలివి.
ప్రస్తుతం మహారాష్ట్రలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో 30 ఏళ్లు దాటుతున్నవారికి తరచూ ‘‘పెళ్లి ఎప్పుడనే’’ ప్రశ్న ఎదురవుతోంది.
ఈ రోజులలో అమ్మాయిల ఆలోచనలు ‘‘పల్లెలో ఉంటూ పొలంలో పనిచేసుకునే అబ్బాయిని పెళ్లిచేసుకోం’’ అన్నట్టుగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వెనుక అనేక కారణాలున్నాయంటున్నారు.
గ్రామాల్లో అబ్బాయిలతో పోల్చుకుంటే ఆడపిల్లల జననరేటు తక్కువగా ఉండటం, పెళ్లి విషయంలో వారికి భారీ అంచనాలు ఉండటం, పొలాల్లో పని చేసేందుకు ఇష్టపడక పోవడం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిల స్వేచ్ఛను అణచివేయడం లాంటివి దీనికి కారణాలు కావచ్చని నిపుణులు అంటున్నారు.

ఈ పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాలో జీవించే అబ్బాయిలకు జీవిత భాగస్వామి దొరకడం కష్టంగా మారింది.
కొంతమంది మధ్యవర్తులు దీన్నొక ఆసరగా చేసుకుంటున్నారు. ఇలాంటి గ్రూపులు చాలా ఉన్నాయని బాధిత యువకులు చెబుతున్నారు. వయసుమీరినవారు పెళ్లికావడం లేదనే ఆలోచనతో ఈ గ్రూపులకు బాధితులుగా మారుతున్నారు.
మరోపక్క పెళ్లి పేరుతో లక్షలాదిరూపాయలు నష్టపోతున్నా, ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు.
అసలేమిటీ నకిలీ పెళ్లిళ్లు... ఈ రాకెట్ ఎలా పనిచేస్తుంది? పెళ్లి కోసం యువత వేస్తున్న తప్పటడుగులు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
మోసమని ఎలా తెలిసిందంటే..
సాగర్ మహారాష్ట్రలోని జున్నర్ తాలూకాకు చెందిన రైతు. కూరగాయలు పండించి పుణే, ముంబయి మార్కెట్‌లో అమ్ముతారు.
వ్యవసాయంలో సంపాదిస్తున్న సొమ్ముతో ఆయన కుటుంబం ఆర్థికంగా బాగానే ఉంది. అయినా సాగర్‌కి పెళ్లి కురదడం లేదు.
అనేక ప్రయత్నాల తర్వాత, కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఆయనకు పెళ్లి కుదిరింది.
"కొన్నేళ్ల పాటు ప్రయత్నించిన తర్వాత నాకు 2023 మేలో పెళ్లి కుదిరింది. త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ అమ్మాయి కుటుంబం తొందర పెట్టింది" అని సాగర్ తన పెళ్లి గురించి చెప్పారు.
"ఆ సమయంలో నేను అమ్మాయితో నేరుగా మాట్లాడదామనుకున్నాను. ఈ విషయం మా అమ్మ వాళ్లకు చెప్పింది. అయినా నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. పెళ్లయిన వారం రోజుల తర్వాత అనుమానం వచ్చింది" అని సాగర్ అన్నారు.
హిందూ ధర్మంలో పెళ్లయిన తర్వాత పెళ్లి కుమారుడి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం, భార్యాభర్తలిద్దరూ కలిసి దేవాలయానికి వెళ్లడం ఆనవాయితీ.
పెళ్లయిన తర్వాత సాగర్ తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన భార్య ఆ పూజలో పాల్గొనేందుకు నిరాకరించారు. దీంతో తమ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని సాగర్ చెప్పారు.
"ఆచారం ప్రకారం మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని నా తల్లిదండ్రులు చెప్పారు. అయితే నా భార్య ఒప్పుకోలేదు. దీంతో ఆమెను గట్టిగా నిలదీయడంతో తనకు అప్పటికే పెళ్లయిందని చెప్పింది" అని సాగర్ వివరించారు.
తాను మోసపోయానని గ్రహించిన సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, SAGAR
పెళ్లి కాని పల్లెటూరి యువకులే లక్ష్యం
ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.
పెళ్లిళ్లకు మధ్యవర్తిత్వం పేరుతో కొంతమంది ముఠాగా ఏర్పడి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా మోసపోయింది సాగర్ ఒక్కరే కాదు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇలా జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. కొన్ని రోజుల క్రితం విజయవాడలోనూ ఇలాంటి సంఘటన జరిగింది.
"నాకు జరిగనట్లే చాలా మందికి జరిగింది. అయితే ఇలా మోసపోయిన వాళ్లు ఊళ్లో పరువు పోతుందని ఫిర్యాదు చేయడం లేదు. ఇలాంటి సంఘటనలకు సమాజంతో పాటు పాలనా యంత్రాంగం కూడా కారణం" అని సాగర్ అన్నారు.
పోలీసులు మాత్రం మోసపోయిన వాళ్లు ఫిర్యాదు చేయాలని, అప్పుడే మోసగాళ్లను పట్టుకోగలమని చెబుతున్నారు. సాగర్‌ను మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొన్ని రోజుల్లోనే వాళ్లకు బెయిల్ వస్తుంది.
చట్టం నుంచి తప్పించుకోవడం తేలికనే ఉద్దేశంతోనే ఇలాంటి మోసాలు చేస్తున్నారని సాగర్ అసహనం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా మోసం చేస్తున్నారు?
గ్రామీణప్రాంతాలలో నివసించే యువకులకు పెళ్లి చేస్తామంటూ మోసం చేసే గ్యాంగులు అనేక మార్గాల్లో డబ్బు దోచుకుంటున్నారు.
"పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నప్పుడే, అమ్మాయి తల్లికి అనారోగ్యంగా ఉందని, వారి ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పారు. దీంతో మేం వాళ్లకు సాయం చేశాం. నేను బ్యాంక్ నుంచి అప్పు తీసుకుని మరీ వాళ్లకు ఇచ్చాను" అని సాగర్ చెప్పారు.
"పెళ్లికి ముందు వాళ్లు లక్షా 25వేల రూపాయలు తీసుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి నాకు మరో 25వేల రూపాయల ఖర్చైంది" అని తెలిపారు
కొన్ని కేసుల్లో పెళ్లి తర్వాత అమ్మాయిలు భర్త ఇంట్లో నగలు, డబ్బు తీసుకుని పారిపోతున్నారు.
ఇలాంటివి బయటపడిన తర్వాత చూస్తే అమ్మాయితో పాటు ఆమె వెనుక పెద్ద గ్యాంగ్ ఉన్నట్లు తేలుతోందని పోలీసులతో పాటు బాధిత కుటుంబాల వారు చెబుతున్నారు.
"పెళ్లి సమయంలో మేం ఆమెకు 10వేల రూపాయల విలువైన వెండి ఆభరణాలు చేయించాం. ఆమె వద్ద ఉన్న రెండున్నర తులాల మంగళ సూత్రం మేం చేయించిందే. ఒక నెక్లెస్ కూడా ఇచ్చాం. నేను మొత్తం రూ.5 లక్షల రూపాయలు మోసపోయాను" అని సాగర్ చెప్పారు.
"పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ముఠాలు పుష్పవతి అయిన పేద అమ్మాయిల్ని గుర్తిస్తారు. వారికి డబ్బులిస్తామని చెప్పి ఇందులోకి లాగుతారు. దీనికి సంబంధించి సెప్టెంబర్‌లో ఒక కేసు నమోదైంది" అని బీడ్ జిల్లాలోని వద్వానీ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ వర్షా వగాడే బీబీసీతో చెప్పారు.
"ఓ కంప్లైంట్‌లో ఫిర్యాదు దారు అందించిన వివరాల ప్రకారం పెళ్లైన 8 రోజుల తర్వాత మీ పుట్టింటికి వెళ్లిపోవచ్చని వాళ్లు ఆమెతో చెప్పారు. అత్త గారింటి నుంచి ఆమెను తీసుకెళ్లడానికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. దీంతో అత్తగారి కుటుంబం అమ్మాయిని వాళ్లతో పంపలేదు. ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది" అని వగాడే చెప్పారు.
ఇలాంటి సంఘటనలు మరో రెండు తమ దృష్టికి వచ్చాయన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ముఠాగా ఏర్పడి..
పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ ముఠాలో 7 నుంచి 8 మంది ఉంటారు.
వారిలో పెళ్లికూతురి తల్లి, పెళ్లి కూతురు, ఓ మధ్యవర్తి, మేనమామా, అత్తలు, మామలతో పాటు పెళ్లి కూతురిని పుట్టింటికి తీసుకెళతామని చెప్పే పరో ఇద్దరు ఉంటారు.
ఈ ముఠాలోని మధ్యవర్తి పెళ్లి కాని యువకులను గుర్తించి పెళ్లి సంబంధం ఉందని చెబుతారు. ఆ తర్వాత పెళ్లి కూతురు మేనమామలు, అత్తలు రంగంలోకి దిగుతారు. మాటలు కుదిరిన తర్వాత పెళ్లి కోసం తొందర పెడతారు. పెళ్లికి ముందు పెళ్లి కూతురు లేదా ఆమె తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగా లేదని డబ్బులు గుంజుతారు.
ఇందులో మరో రకం మోసం ఏంటంటే పెళ్లి కూతురు అనాథ అని, ఆమె తన అత్త దగ్గర పెరుగుతోందని చెబుతారు. అత్తకు కొంత సొమ్ము చెల్లిస్తేనే పెళ్లవుతుందని నమ్మ బలుకుతారు.
అలా పెళ్లయిన కొన్ని రోజులకు అమ్మాయి నగలు, డబ్బుతో పారిపోతుంది.
సాగర్ తనకు జరిగిన మోసం గురించి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనేక మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు.
"ఇలాంటి మోసాలపై బాధితులు వెంటనే ఫిర్యాదు చేయాలి. కానీ పరువు పోతుందని ఆలోచించి ముందుకు రావడం లేదు" అని జున్నర్ డీఎస్పీ ధనంజయ్ పాటిల్ అన్నారు.

అమ్మాయిలు కూడా బాధితులే
పెళ్లి విషయంలో మోసపోయిన సాగర్ తన భార్యగా వచ్చిన యువతి కూడా బాధితురాలే అని బీబీసీతో చెప్పారు.
జున్నర్ తాలుకాలో ఆమె చాలా పెళ్లిళ్లు చేసుకుంది. నాలాగే అనేక మంది ఆమె చేతిలో మోసపోయారని ఆమె తనతో చెప్పిందని సాగర్ వెల్లడించారు.
"ఒక మధ్యవర్తి మాత్రమే కాదు. ఇదంతా నడిపించేందుకు వెనుక పెద్ద ముఠా ఉంది. "ఇదంతా ఎందుకు సహిస్తున్నావు" అని నేనామెను అడిగాను. దానికామె "నాకు వేరే మార్గం లేదు" అనిచెప్పింది. మొదటి భర్త ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు" అని సాగర్ వివరించారు.
బీబీసీ మరో బాధిత యువకుడితో మాట్లాడింది.
పేరు బయటపెట్టవద్దంటూ ఆయన తన అనుభవాన్ని వివరించారు.
"నా భార్య నాతో ఏడాదిన్నర నుంచి ఉంటోంది. తను నాతో ఉన్నప్పుడు బాగానే ఉండేది. ఇంట్లో డబ్బు కూడా ముట్టుకునేది కాదు. అయితే అప్పుడప్పుడు పుణేలోని తన అత్త ఇంటికి వెళ్లి వస్తుండేది"
"ఒకసారి అలా వెళ్లినప్పుడు అక్కడ మరో పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి ఫోటోలను మేం ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాం. ఈ విషయం గురించి ప్రశ్నిస్తే ఆమె నాతో పెళ్లికి ముందు, తర్వాత కూడా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. ఆమెను ఒక ముఠా ఉపయోగించుకుంటున్నట్లు అప్పుడే తెలిసింది" అని అయన చెప్పారు

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వివాహాల విషయంలో మధ్యవర్తులు, మ్యాట్రిమోనీల ద్వారా మోసపోకుండా ఉండేందుకు కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.
- మధ్యవర్తులు, మ్యాట్రిమోనీలు ఇచ్చే వివరాలను స్వయంగా పరిశీలించుకోవాలి.
- పెళ్లి కూతురు, ఆమె కుటుంబం గురించి పూర్తి సమాచారం సేకరించాలి. కుటుంబం, బంధువులు, విద్య, ఉద్యోగం, ఆస్తుల గురించిన వివరాలు తెలుసుకోవాలి.
- అమ్మాయి గ్రామానికి లేదా ఇంటికి స్వయంగా వెళ్లి వివరాలు తెలుసుకోవాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా, తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసినా వెంటనే ఫిర్యాదు చేయాలి.
- అమ్మాయి కుటుంబం, ఇతర వివరాలు తెలుసుకునేందుకు స్థానికులతో మాట్లాడి సమాచారం తీసుకోవాలి.
- ఆన్‌లైన్‌లో వచ్చే సమాచారాన్ని తనిఖీ చేసువాలి. పెళ్లికి ముందు రకరకాల కారణాలు చెప్పి డబ్బులు అడిగితే, వాళ్లు చెప్పే కారణాల్లో నిజముందో లేదో ప్రత్యక్షంగా వెళ్లి తెలుసుకోవడం మంచిది.
- మధ్యవర్తి ద్వారా వివాహం కుదిరితే, సదరు మధ్యవర్తి మీకు బాగా తెలుసా? ఆయన గతంలో వివాహాలు కుదిర్చారో లేదో కనుక్కోవాలి. అవసరం అనుకుంటే గతంలో ఆయన కుదిర్చిన వివాహాల సమాచారం నిజమో కాదో నిర్ధరించుకోవాలి.
- పెళ్లి ద్వారా మోసపోయినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
- పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా మోసగాళ్ల గురించి ప్రపంచానికితెలిసే అవకాశం ఉంటుంది. దీని వల్ల మరి కొందరు మోసపోకుండా ఉంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














