ఒక భార్య, ఇద్దరు భర్తలు : ఏమిటి ఈ ఆచారం?

ఫొటో సోర్స్, ALOK CHAUHAN
- రచయిత, సౌరభ్ చౌహాన్
- హోదా, బీబీసీ కోసం
హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లా షిల్లాయ్ గ్రామంలో ఇటీవల జరిగిన ఓ పెళ్లి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
కున్హాట్ గ్రామానికి చెందిన సునీత చౌహాన్ అనే యువతి ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులను పెళ్లి చేసుకున్నారు.
షెడ్యూల్డ్ తెగ అయిన హట్టీ కమ్యూనిటీలో బహుభర్తృత్వం (ఒకరి కంటే ఎక్కువమంది భర్తలు ఉండటం) ఆచారం కింద ఈ వివాహం జరిగింది. దీనిని స్థానిక భాషలో 'జోడిదారా' లేదా 'జజ్దా' అని పిలుస్తారు.
సిర్మౌర్‌లోని ట్రాన్స్‌గిరి ప్రాంతంలో జరిగిన ఈ వివాహానికి వందలాది మంది గ్రామస్తులు, బంధువులు హాజరయ్యారు. సంప్రదాయ వంటకాలు, జానపద గీతాలు, నృత్యాలు ఈ కార్యక్రమాన్ని మరింతగా గుర్తుండిపోయేలా చేశాయి.
వివాహమనేది సాంస్కృతిక సంప్రదాయానికి తార్కాణమైనప్పటికీ, ఈ పెళ్లి వర్తమాన పరిస్థితులలో అనేక ప్రశ్నలను లేవనెత్తింది.


ఫొటో సోర్స్, ALOK CHAUHAN
అసలేమిటీ ఆచారం?
వధువు కుటుంబానిది సర్మౌర్ జిల్లాలోని కన్హట్ గ్రామం. ఇది పెళ్లి కొడుకు గ్రామం షిలాలీ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రెండు కుటుంబాలు హట్టీ తెగకు చెందినవే. ఈ తెగ సిర్మౌర్ జిల్లాలో ట్రాన్స్‌గిరి ప్రాంతంలో నివసిస్తుంది. అలాగే ఉత్తరాఖండ్‌లోని జౌన్‌సార్‌బవర్ , రావాయిజౌన్ పూర్ ప్రాంతాలలో నివసిస్తుంది.
ఈ తెగలో బహుభర్తృత్వం (ఒకరికంటే ఎక్కువమంది భర్తలు) చాలా కాలంగా ఉంది. పూర్వీకుల ఆస్తిని, ఐక్యతను కాపాడటమే ఈ ఆచారం ముఖ్య ఉద్దేశమని దీని గురించి తెలిసినవారు చెబుతారు.
ఈ ఆచారంలో, ఒక మహిళ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులను వివాహం చేసుకుంటుంది. ఇంటి బాధ్యతలను పరస్పర అంగీకారంతో నిర్వహిస్తారు. సిర్మౌర్ తో పాటు శిమ్లా, కిన్నోర్, లాహోల్ స్పితిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సంప్రదాయం కనిపిస్తుంది.
'జోడిదార సంప్రదాయం మా అస్తిత్వం. ఆస్తి విభజనను నివారించడానికి, వరకట్న వ్యవస్థను నివారించడానికి, అన్నదమ్ముల మధ్య ఐక్యతను కాపాడటానికి, పిల్లలను పెంచడానికి ఇది సహాయపడుతుంది" అని స్థానిక నివాసి కపిల్ చౌహాన్ చెప్పారు.
షిల్లాయ్ ప్రాంతంలోని దాదాపు ప్రతి గ్రామంలో నాలుగైదు కుటుంబాలు ఈ పద్ధతిని అనుసరిస్తాయని ఆయన చెప్పారు.
ఇటీవల తన పెళ్లి గురించి వస్తున్న వార్తల గురించి కపిల్ చౌహాన్ ను ప్రశ్నించగా.. 'ఈ విషయం నాకు చాలా కాలంగా తెలుసు. ఇది అకస్మాత్తుగా జరగలేదు. ఇది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఇది మాకు గర్వకారణమని, వధువు, వరుడు, వారి కుటుంబాలు సుఖంగా ఉన్నంత కాలం ఇతరులు ఇందులో చేయగలిగింది ఏమీలేదు’’ అన్నారు.
దీనిని అంగీకరించాలని, సహజీవనంతో కూడా ప్రజలు సౌకర్యవంతంగా ఉంటారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ALOK CHAUHAN
పెళ్లి ఎలా చేస్తారు?
జులై 12న ఈ వివాహ వేడుక నిర్వహించారు.
పెళ్లి కూతురు, ఆమె ఇద్దరు భర్తలు చదువుకున్నవారే. పెళ్లి కుమార్తె సునీతా చౌహాన్ ఐటీఐ చదివారు.
ప్రదీప్ నేగి రాష్ట్ర ప్రభుత్వ జల్ శక్తి విభాగంలో, కపిల్ నేగి విదేశాల్లో ఆతిథ్య రంగంలో పనిచేస్తున్నారు.
ఈ పెళ్లి గురించి సునీతా చౌహాన్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఈ సంప్రదాయం గురించి నాకు తెలుసు. దాన్ని నేను అనుసరిస్తున్నాను’’
‘‘మా సంస్కృతిలో, ఇది నమ్మకం, సంరక్షణ, భాగస్వామ్య బాధ్యతకు సంబంధించినది" అని ప్రదీప్ నేగి చెప్పారు.
‘‘విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ ఈ బంధానికి కట్టుబడి ఉన్నాను, ఈ బంధానికి స్థిరత్వం, ప్రేమను ఇవ్వాలనుకుంటున్నా’’ అని కపిల్ నేగి తెలిపారు.
ఈ వివాహం సాంప్రదాయ రామల్సర్ పూజా పద్ధతి ప్రకారం జరిగింది. ఈ విధానంలో ప్రదక్షిణలకు బదులు 'సింజ్' చేస్తారు. ఈ విధానంలోఅగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయరు. కానీ దాని ముందు నిలబడి ప్రతిజ్ఞ చేస్తారు.
జోడి-దారా సంప్రదాయంలో ఊరేగింపు వధువు వైపు నుంచి వరుడి ఇంటికి వెళ్తుంది. అందుకే ఈ సంప్రదాయాన్ని ఇతర భారతీయ వివాహ సంప్రదాయాల కంటే భిన్నంగా భావిస్తారు.

ఫొటో సోర్స్, ALOK CHAUHAN
ఎప్పటిదీ ఆచారం?
హిమాచల్ ప్రదేశ్‌లో, జోడిదారా ఆచారం 'వాజీబ్ ఉల్ అర్జ్' అనే వలసరాజ్యాల కాలం నాటి రెవెన్యూ పత్రంలో నమోదు అయి ఉంది. ఈ పత్రం గ్రామాల సామాజిక, ఆర్థిక పద్ధతులను నమోదు చేస్తుంది. జోడిదారాను హట్టి సమాజ సంప్రదాయంగా గుర్తిస్తుంది.
వ్యవసాయ భూమి విభజనను నిరోధించడం, కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడం ఈ ఆచార ఉద్దేశం అని పేర్కొన్నారు.
హిందూ వివాహ చట్టం ఏకపత్నీవ్రత వివాహాలను మాత్రమే చెల్లుబాటు అయ్యేవిగా పరిగణిస్తుంది, అందుకే ఇటువంటి వివాహాల చట్టపరమైన స్థితి గురించి ప్రశ్నలు తలెత్తుతాయి.
"రెండు వివాహాలు ఒకేసారి జరిగాయి కాబట్టి, హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 5, ఇండియన్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (BNS)లోని సెక్షన్ 32 వర్తించవు" అని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు న్యాయవాది సుశీల్ గౌతమ్ అన్నారు.
జోడిదారా సంప్రదాయ మూలాలు ట్రాన్స్ గిరి ప్రాంతంలో లోతుగా ఉన్నాయని నమ్ముతారు. ఇది మహాభారతంలోని ద్రౌపది కథతో ముడిపడి ఉంది, అందుకే చాలా మంది దీనిని 'ద్రౌపది ప్రాత' అని కూడా పిలుస్తారు.
హిమాచల్ ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. పర్మార్ తన 'పాలియాండ్రీ ఇన్ ది హిమాలయాస్' అనే పుస్తకంలో ఈ ఆచారం వెనుక ఉన్న సామాజిక ఆర్థిక కారణాలను వివరంగా ప్రస్తావించారు.
‘‘ఈ పద్ధతి కొండ ప్రాంతాల క్లిష్ట పరిస్థితుల్లో అభివృద్ధి చెందింది, అక్కడ పరిమిత వ్యవసాయ భూమిని కలిపి ఉంచడం అవసరం’’ అంటారు ఆయన.
‘‘ఈ ఆచారం సామాజిక ఆమోదాన్ని కలిగి ఉంది. సమాజ ఐక్యత సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. దీనిని సమాజ విలువల పరిరక్షణగా చూడాలి’’ అని హట్టి సమాజానికి చెందిన పండితుడు, సామాజిక కార్యకర్త అమిచంద్ హట్టి అన్నారు.
ఈ సంప్రదాయం చాలా పాతదని, కుటుంబ ఐక్యతను కాపాడుకోవడమే దీని ఉద్దేశమని సెంట్రల్ హట్టి కమిటీ ప్రధాన కార్యదర్శి కుందన్ సింగ్ శాస్త్రి అంటున్నారు.

ఫొటో సోర్స్, ALOK CHAUHAN
సామాజిక, నైతిక చర్చ
ఈ వివాహం తర్వాత, సామాజిక, నైతిక చర్చ కూడా ప్రారంభమైంది. కొంతమంది దీనిని వ్యక్తిగత ఎంపికకు సంబంధించిన విషయంగా భావిస్తుండగా, కొన్ని సంస్థలు ఇది మహిళల హక్కులకు విరుద్ధమని చెబుతున్నాయి.
‘‘ఈ ఆచారం మహిళలను దోపిడీ చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది’’ అని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే అన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిపిఐ(ఎం) మాజీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఓంకార్ షాద్ కూడా దీనిని చట్ట విరుద్ధమైనదిగా అభివర్ణించారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమ మంత్రి, షిల్లై ఎమ్మెల్యే హర్షవర్ధన్ చౌహాన్ మాట్లాడుతూ, ‘‘ఇది షిల్లై పాత సంప్రదాయం. ప్రదీప్, కపిల్ ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడం ద్వారా వారి సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించారు’’ అని చెప్పారు.
మరో 4 ఆచారాలు
జోడి-దారా కాకుండా, మరో నాలుగు సంప్రదాయ వివాహ ఆచారాలు కూడా హట్టి సమాజంలో ప్రబలంగా ఉన్నాయి.
గర్భధారణ సమయంలోనే పిల్లల వివాహం నిర్ణయిస్తారు. అయితే, బిడ్డ పెద్దయ్యాక అతని/ఆమె సమ్మతి ఇచ్చిన తర్వాతే వివాహం జరుగుతుంది.
జాజ్దా వివాహంలో, వరుడి తరపు వారు వివాహాన్ని ప్రతిపాదిస్తారు అంగీకారం తెలిపిన తరువాత ఆచారాలు పూర్తవుతాయి. ఈ సంప్రదాయంలో కూడా, 'సింజ్' ను వర్తింపజేయడం ద్వారా వివాహం జరుగుతుంది.
ఖితైయో వివాహం అంటే వివాహిత తన అత్తమామలతో సంబంధాలు తెంచుకుని వేరొకరిని వివాహం చేసుకోవడం.
ఒక స్త్రీ తన కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా పురుషుడిని వివాహం చేసుకుంటే దానిని హార్ వివాహంగా పరిగణిస్తారు.
గతంలో పోలిస్తే ఇప్పుడు జోడిదారాను పాటించేవారి సంఖ్య చాలా తగ్గిందని నిపుణులు అంటున్నారు.
‘ఈ ఆచారం ఇప్పుడు కొన్ని గ్రామాల్లో మాత్రమే కనిపిస్తోంది. చాలా వివాహాలు నిశ్శబ్దంగా జరిగిపోతుంటాయి’’ అని సామాజిక కార్యకర్త రమేష్ సింగ్టా అంటున్నారు.
కానీ ఇటీవలి వివాహం సోషల్ మీడియాలో విస్తృత దృష్టిని ఆకర్షించింది.
హట్టి కమ్యూనిటీ మొత్తం జనాభాపై అధికారిక డేటా లేదు. కానీ షెడ్యూల్డ్ తెగలలో ఈ కమ్యూనిటీని చేర్చాలనే డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినప్పుడు, అంచనా వేసిన జనాభా 2.5 నుండి 3 లక్షల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో సిర్మౌర్‌లోని ట్రాన్స్‌గిరి ప్రాంతం నుండి దాదాపు 1.5 నుండి 2 లక్షల మంది ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














