‘ఏడాది బాలుడు కోబ్రాను కొరికి చంపేశాడు’

cobra

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సీటూ తివారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బిహార్‌లోని బేతియాలో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఏడాది వయసున్న బాలుడు ఓ పాముని పళ్లతో కొరకడంతో అది చనిపోయింది.

చనిపోయిన పాము విషపూరితమైన కోబ్రా అని చిన్నారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

గత గురువారం(జూలై 24) ఈ ఘటన జరిగింది. ఇప్పుడా బాలుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాడు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడు.

పశ్చిమ చంపారన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ జిల్లా కేంద్రం బేతియా.

బేతియా జిల్లా. మఝౌలియా బ్లాక్‌లోని మోహ్చి బనకట్వా గ్రామానికి చెందిన సునీల్ సాహ్ ఐస్‌క్రీమ్ అమ్ముతుంటారు.

సునీల్ సాహ్‌కు ఏడాది వయసున్న గోవింద్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు. ఈ గోవింద్ కుమారే పళ్లతో పామును కొరికాడని స్థానికులు చెప్పుకుంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బిహార్, కోబ్రా, పాముకాటు

ఫొటో సోర్స్, Alok Kumar

''బాలుడి తల్లి ఇంటి వెనుక పని చేసుకుంటున్నారు. ఆమె కట్టెలు సర్దుతుండగా పాము బయటికొచ్చింది. అక్కడే కూర్చుని ఆడుకుంటున్న గోవింద్ ఆ పామును పట్టుకుని పళ్లతో కొరికాడు. అది మేం చూశాం. అది కోబ్రా పాము'' అని బాలుడి నాయనమ్మ మతిసరీ దేవి చెప్పారు.

''పామును కొరికిన తర్వాత, బాలుడు కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మేం వెంటనే మఝౌలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాం. వారు బేతియాలోని ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. ఇప్పుడు గోవింద్ ఆరోగ్యంగా ఉన్నాడు'' అని ఆమె తెలిపారు.

''బాలుడిని శనివారం(జూలై 27) సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు. వాడి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సావన్ నెలలో పాములు బయటకు రావడం సాధారణం. కానీ, మా ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి'' అని మఝౌలియాకి చెందిన స్థానిక జర్నలిస్ట్ నెయాజ్ అన్నారు.

బిహార్, కోబ్రా, పాముకాటు

ఫొటో సోర్స్, Alok Kumar

పామును కొరికితే ఏమవుతుంది?

గోవింద్ కుమార్‌ను గురువారం సాయంత్రం బేతియాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్పించారు. పీడియాట్రిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ కుమార్ సౌరభ్ బాలుడికి చికిత్స అందించారు.

''పిల్లవాడిని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ముఖం వాచి ఉంది. నోటి చుట్టూ వాపు ఉంది. బాలుడు పామును నోటితో కొరికి కొంత భాగాన్ని తిన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు'' అని డాక్టర్ కుమార్ సౌరభ్ చెప్పారు.

''ఒకేసారి రెండు రకాల కేసులు వచ్చాయి. ఒక పిల్లవాడిని కోబ్రా కాటు వేసింది, మరొక బాలుడు కోబ్రాను కొరికాడు. ఈ ఇద్దరు పిల్లలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు'' అని ఆయన తెలిపారు.

''ఒక మనిషిని కోబ్రా కాటేసినప్పుడు, దాని విషం మన రక్తంలోకి వెళుతుంది. రక్తంలోకి ప్రవేశించే విషం న్యూరోటాక్సిసిటీకి కారణమవుతుంది, ఇది మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మరణించే అవకాశం ఉంది'' అని డాక్టర్ కుమార్ సౌరభ్ బీబీసీతో చెప్పారు.

''ఒక పామును మనిషి కొరికినప్పుడు విషం నోటి ద్వారా జీర్ణాశయంలోకి చేరుతుంది. మనిషి శరీరం ఆ విషాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది, (అంటే, జీర్ణాశయంలోని ఆమ్లాలు, ఎంజైమ్‌ల వంటివి ఈ విషాన్ని పాక్షికంగా నిష్ప్రభావం చేస్తాయి, అందువల్ల అంతగా రక్తంలోకి చేరదు), ఆ తర్వాత బయటకు వస్తుంది. ఈ రెండు సందర్భాల్లోనూ విషం ఉంటుంది, కానీ మొదటి కేసులో విషం నాడీ వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. రెండో కేసులో మానవ శరీరం విషాన్ని బయటకు పంపుతుంది'' అని డాక్టర్ సౌరభ్ వివరించారు.

మనిషి పామును కొరికినప్పుడు కూడా చెడు ప్రభావం ఉంటుందని, ''పాముని కరిచినప్పుడు, ప్రేగులో పుండు(అల్సర్) వంటి రక్తస్రావం జరిగే ప్రదేశం ఉంటే.. అప్పుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది'' అని డాక్టర్ కుమార్ సౌరభ్ చెప్పారు.

బిహార్, కోబ్రా, పాముకాటు
ఫొటో క్యాప్షన్, వర్షాకాలంలో పాము కాటు ఘటనలు పెరుగుతాయి.

'స్నేక్ బైట్ క్యాపిటల్'

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 80 వేల నుంచి లక్షా 30 వేల మంది పాము కాటు కారణంగా మరణిస్తున్నారు.

భారత్‌లో ఏటా సగటున 58 వేల మంది పాము కాటుతో మరణిస్తున్నారు. దీనివల్లే, భారత్‌కు ''ప్రపంచ పాముకాటు రాజధాని''(స్నేక్ బైట్ క్యాపిటల్) అనే ట్యాగ్‌ వచ్చింది.

బిహార్ రాష్ట్ర ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ (హెచ్ఎంఐఎస్) డేటా ప్రకారం, 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి మధ్య, పాము కాటుతో 934 మంది చనిపోయారు.

దేశవ్యాప్తంగా పాము కాటుతో మరణిస్తున్న వారి సంఖ్యను సరిగ్గా నమోదు చేయడం లేదని కేంద్రప్రభుత్వ నివేదిక తెలిపింది.

పాములు కాటేసినప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే ఆసుపత్రులకు రాగలుగుతున్నారని, దీంతో పాముకాటు మరణాలు తక్కువగా రిపోర్టవుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది.

దేశంలో 70 శాతం పాముకాటు మరణాలు బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్‌లలో నమోదవుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)