అవసరం లేకపోయినా ఫోన్ చూసే అలవాటు మానడం ఎలా?

ఫోన్, సోషల్ మీడియా, డిజిటిల్ డిటాక్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాజ్‌వీర్ కౌర్ గిల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీ మొబైల్ ఫోన్ బాగా పనిచేస్తోంది. దానికెలాంటి సమస్యాలేదు. అదే సమయంలో మీకు చాలా ఖాళీ సమయం ఉంది. కానీ మీరు మీ ఫోన్ చూడడం లేదు…అప్పుడేం జరుగుతుంది?

మొదట్లో మీకేం చేయాలో అర్థం కాకపోవచ్చు, కానీ మీకు అలాంటి అవకాశం వస్తే, మీరు ఆ సమయాన్ని పూర్తిగా మీకోసం కేటాయించుకోవాలి.

చాలా కాలంగా వాయిదా పడిన పనులను పూర్తి చేయాలి. పుస్తకం చదవడం, అసంపూర్తిగా ఉన్న పెయింటింగ్ పూర్తి చేయడం లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటివి. దీన్నే డిజిటల్ డిటాక్స్ అంటారు.

ఒకప్పుడు మనిషి జీవితంలో, అభివృద్ధిలో ముఖ్యమైన భాగంగా ఉన్న వాటి ప్రాముఖ్యాన్ని డిజిటల్ డిటాక్స్‌తో మనం మళ్ళీ అర్థం చేసుకోవచ్చు.

మనం డిజిటల్ పరికరాలపై ఎంతగా ఆధారపడుతున్నామంటే, వాటిని దూరంగా ఉంచడానికి కూడా ఇప్పుడు మనకు యాప్‌లు అవసరం. అందుకే డిజిటల్ డిటాక్స్ యాప్‌ల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ యాప్‌లు ఎలా పనిచేస్తాయో, డిజిటల్ డిటాక్స్ కోసం మనమేం చేయాలో తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫోన్, సోషల్ మీడియా, డిజిటిల్ డిటాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొబైల్ ఎక్కువగా చూడడం ఒంటరితనానికి దారితీస్తుందని నిపుణులు చెప్పారు.

డిజిటల్ డిటాక్స్ యాప్స్ అంటే ఏంటి?

ఐఫోన్‌లు, ఆండ్రాయిడ్ ఫోన్‌ల్లోని యాప్ స్టోర్‌లలో పదులసంఖ్యలో డిజిటల్ డిటాక్స్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇవి స్క్రీన్ సమయాన్ని తగ్గించడంలో, డిజిటల్ పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడే ప్రత్యేక యాప్‌లు.

అంటే, మిమ్మల్ని ఫోన్ స్క్రీన్ నుంచి దూరంగా ఉంచి నిజ జీవితానికి కనెక్ట్ చేయడమే వీటి ఉద్దేశం.

''మీతో మీరు కనెక్టవడమే కాకుండా.. ఇతరులతో, ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి మీ ఫోన్‌ను అన్‌ప్లగ్ చేయండి'' అని గూగుల్ ప్లే స్టోర్‌లోని డిజిటల్ డిటాక్స్ యాప్ చెబుతోంది.

''మీరెప్పుడూ ఫోన్‌లోనే ఉంటున్నారా..? ప్రపంచం నుంచి దూరం అవుతారని భయపడుతున్నారా..? నెట్‌వర్క్ రాకపోతే విపరీతమైన ఆందోళన చెందుతున్నారా..? మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే డిటాక్స్ అవ్వాల్సిన సమయం వచ్చింది'' అని కూడా అది చెబుతుంది.

ఈ యాప్‌లు సాధారణంగా నిర్ణీత సమయం వరకు ఫోన్‌ను షట్‌డౌన్ చేస్తాయి. ఈ సమయం 10 నిమిషాల నుంచి 10 రోజుల వరకు, ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ సమయం వరకు...ఇలా ఎలా అయినా ఉండొచ్చు.

మీ ఫోన్‌ను ఎంతసేపు స్విచ్‌ఆఫ్‌లో ఉంచాలో మీరే నిర్ణయించుకోవచ్చు.

ఈ సమయంలో అన్ని సోషల్ మీడియా యాప్‌లు కూడా పనిచేయవు. అత్యవసర కాల్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కొన్ని యాప్‌లు ఫోన్ కాల్స్‌ను అనుమతిస్తాయి. కొన్ని యాప్‌లు కాల్స్‌పై సమయ పరిమితిని కూడా విధిస్తాయి.

అయితే, డిజిటల్ డీటాక్స్ యాప్‌ను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం కూడా ముఖ్యం.

digital detox

డిజిటల్ డిటాక్స్ యాప్‌లు ఎలా పని చేస్తాయి?

ముందే చెప్పినట్టు ఈ యాప్‌లు మీ మొబైల్ ఫోన్‌ను నిర్ణీత సమయం వరకు షట్ డౌన్ చేస్తాయి. అయితే కొన్ని యాప్‌లు ఏ సోషల్ మీడియా యాప్‌లను షట్ డౌన్ చేయాలో, ఏది చేయకూడదో ఎంచుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తాయి.

ఇది నేను స్వయంగా ఆచరించి చూశా. ఓ సెలవు రోజు కాసేపు ఫోన్ నుంచి ఎందుకు విరామం తీసుకోకూడదన్న ఆలోచన వచ్చింది. ఒక యాప్ సాయంతో, నా ఫోన్‌ను దాదాపు మూడు గంటల పాటు డిటాక్స్ మోడ్‌లో ఉంచాను.

అయితే, నా అలవాటు ప్రకారం, ఈ సమయంలో నేను ఒకటి లేదా రెండుసార్లు ఫోన్ తీసి చూశాను. అప్పుడు స్క్రీన్‌పై కొన్ని ఆసక్తికరమైన సందేశాలు సలహా రూపంలో కనిపించాయి.

అవేంటంటే...

  • మీరు కాసేపు నడవొచ్చు.
  • మీకు ఇష్టమైన వంటకం వండుకోవచ్చు.
  • మీరు కుటుంబంతో కూర్చుని టీ తాగుతూ సమయం గడపవచ్చు.
  • మీరు తోటపని చేయొచ్చు.

స్క్రీన్ మీద ఇలాంటి మెసేజ్‌లు చాలా వస్తూనే ఉన్నాయి. దీంతో నేను ఫోన్ పక్కన పెట్టేశాను. నిజం చెప్పాలంటే, ఈ మూడు గంటలు నాకు రోజులో అత్యంత అర్థవంతమైన సమయంగా అనిపించింది. నా మనసు, మెదడు కొంత విశ్రాంతి పొందాయి. నేను రిలాక్స్‌డ్‌గా ఉన్నాను.

సాధారణంగా, డిజిటల్ డిటాక్స్ యాప్‌లు ఫోన్ వినియోగాన్ని అవసరమైన పనులకు మాత్రమే పరిమితం చేస్తాయి.

digital detox

డిజిటల్ డిటాక్స్ ఎందుకు అవసరం?

ది హిందూ పత్రికలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. భారత్‌లో 86 శాతం వయోజనుల దగ్గర స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. వారిలో 30 శాతం ప్రతిరోజూ దాదాపు ఆరు గంటలు స్క్రీన్‌పై గడుపుతున్నారు. స్నేహితులతో మాట్లాడడానికో, లేదా సోషల్ మీడియాలోనో లేదా వినోదం కోసం యూట్యూబ్‌లోనో, లేదంటే గేమింగ్ సైట్‌లలోనో సమయం వెచ్చిస్తున్నారు.

రెడ్‌సీర్ స్ట్రాటజీ 2024 నివేదిక ప్రకారం , భారతదేశంలో సగటు స్క్రీన్ సమయం 7.3 గంటలు(సుమారు 7గంటల 18నిమిషాలు).

ఈ స్క్రీన్ సమయం ఇంత ఎక్కువగా ఉండడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు.

''సొంత ఇళ్లల్లో కుటుంబాలతో నివసిస్తున్నప్పటికీ మనం మనల్ని ఒంటరులను చేసుకుంటున్నాం'' అని ఫ్యామిలీ సైకాలజిస్ట్ జస్లీన్ గిల్ చెప్పారు.

''మనిషి స్వభావం ఒంటరిగా జీవించడం కాదు, సమాజంలో జీవించడం. మనుషులు కలిసి జీవించే ధోరణితోనే సమాజం కూడా ప్రారంభమైంది. అనవసరమైన స్క్రీన్ సమయం మనల్ని పరిమితంగా మార్చేస్తోంది. మనం మనకిష్టమైనవారితో మాట్లాడటానికి బదులుగా ఫోన్‌లో సమయం గడపడానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాం'' అని ఆమె చెప్పారు.

ఫోన్, సోషల్ మీడియా, డిజిటిల్ డిటాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డిజిటల్ డిటాక్స్‌తో ఫోన్ స్విచ్చాఫ్ చేసి, ఇష్టమైన, అవసరమైన పనులు చేసుకోవచ్చు.

‘మానసిక, శారీరక వ్యాధులు తప్పవు’

''మెదడుకు సంబంధించిన అనేక వ్యాధులు ఒంటరితనంతో ముడిపడిఉంటాయి. మీరు మీ బాధలను లేదా సమస్యలను ఎవరితోనూ పంచుకోనప్పుడు, అలాంటి విషయాలలో సహాయం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై ఆధారపడినప్పుడు, పరిస్థితి మానసిక అనారోగ్యంగా మారుతుంది'' అని జస్లీన్ హెచ్చరించారు.

పరస్పరం మాట్లాడుకోవడం, అనుభవాలు, ఆలోచనల మార్పిడితో మనిషి అభివృద్ధి ముడిపడి ఉందని, ఇది ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయిందని ఆమె చెప్పారు.

ఆరోగ్యకరమైన మనస్సు, ఆరోగ్యకరమైన శరీరం గురించి జస్లీన్ చెప్పారు.

''మనిషి మెదడు చాలా శక్తివంతమైనది, అది ఆరోగ్యకరమైన వ్యక్తిని అనారోగ్యానికి గురిచేయొచ్చు.. అలాగే, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు తన సెల్ఫ్ పవర్‌తో ఆరోగ్యవంతంగా ఉండే దిశగా ముందుకు సాగవచ్చు'' అని ఆమె తెలిపారు.

''కానీ ఒంటరితనం ఎక్కువ కాలం కొనసాగితే, ప్రజలు మానసిక వ్యాధులతో పాటు శారీరక వ్యాధుల బాధితులుగా మారే రోజు ఎంతో దూరంలో లేదు'' అని ఆమె హెచ్చరించారు.

ఫోన్, సోషల్ మీడియా, డిజిటిల్ డిటాక్స్

ఫొటో సోర్స్, Getty Images

డిజిటల్ డిటాక్స్ అనుభవం

పాఠశాల ఉపాధ్యాయుయిని అమర్‌జిత్ కౌర్‌కు జూన్‌లో సెలవులు గడుపుతున్నప్పుడు ఓ విషయం అర్ధమైంది. సాధారణ రోజుల్లో స్కూల్ నుంచి, పిల్లల నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి తనకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీనివల్ల తన పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని ఆమె గ్రహించారు.

సెలవులు మొత్తం తన పిల్లలతో గడపాలని ఆమె అనుకున్నారు. ఆమె పిల్లలలో ఒకరు 6వ తరగతి, మరొకరు 10వ తరగతి చదువుతున్నారు.

కానీ రెండు వారాలు గడిచిన తర్వాత కూడా ఆమె పిల్లలతో గడపలేకపోయారు. దీనికి కారణం వారు మొబైల్ ఫోన్లతో బిజీగా ఉండటం.

అమర్‌జిత్ కూడా సోషల్ మీడియాలోనో లేదా బంధువులు లేదా స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతూనో ఎక్కువ సమయం గడిపారు.

ఆ తర్వాత, ఆమె తన ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించారు. ఇది చాలా కష్టమైన విషయమని, తన దృష్టి పదే పదే ఫోన్ వైపు మళ్లిందని ఆమె చెప్పారు.

''ప్రత్యేకంగా ఏమీ చూడాల్సిన అవసరం లేకపోయినా, నేను వాట్సాప్ చూసేదాన్ని'' అని ఆమె చెప్పారు.

చివరకు ఓ ఫ్రెండ్ సలహా మేరకు ఆమె డిజిటల్ డీటాక్స్ యాప్ సాయం తీసుకున్నారు.

''నేను అలాంటి యాప్ గురించి ఎప్పుడూ వినలేదు. మొదటి రోజు నా ఫోన్‌ను కేవలం రెండు గంటలు స్విచ్ ఆఫ్ చేసాను. నా పిల్లలను కూడా అలాగే చేయమని అడిగాను. వారు అంగీకరించారు'' అని ఆమె చెప్పారు.

''ఆ తర్వాత నుంచి సెలవుల్లో దాదాపు ఎనిమిది గంటల పాటు నా ఫోన్‌ను స్విచ్చాఫ్‌లో ఉంచాను. ఇది నాకు చాలా సమయాన్నిచ్చింది. మనశ్శాంతిని కల్పించింది. మిగిలిన సెలవురోజుల్లో నేను పిల్లలతో సమయం గడిపాను. వారిని బాగా అర్థం చేసుకున్నాను'' అని అమర్‌జిత్ కౌర్ చెప్పారు.

ఇప్పుడు డిజిటల్ డిటాక్స్ తన జీవితంలో ఒక భాగమైందని ఆమె అన్నారు.

స్కూలు పిల్లలకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి డిజిటల్ డిటాక్స్ మరింత ముఖ్యమైనదిగా మారుతోందని జస్లీన్ గిల్ చెప్పారు.

''విద్యార్థులు స్క్రీన్ నుంచి దూరంగా ఉండటం ద్వారా ఎక్కువగా దృష్టి పెట్టగలరు. వాయిదా పద్ధతిని పక్కన పెట్టడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇది సాయపడుతుంది'' అని జస్లీన్ అంటున్నారు.

ఫోన్ లేకపోతే మన ముఖ్యమైన పనులు చాలా వరకు ఆగిపోవచ్చు, కానీ మనిషి అలవాట్లు, అవసరాలను మరచిపోకూడదని జస్లీన్ సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)