ఒక వ్యక్తి దగ్గర ఎన్ని సిమ్ కార్డులు ఉండొచ్చు? పరిమితి దాటితే ఏమవుతుంది?

మొబైల్ కనెక్షన్లు

ఫొటో సోర్స్, Getty Images

దేశంలో కొత్త ‘టెలికాం చట్టం- 2023’ ఇటీవలే అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఎవరి పేరు మీదైనా పరిమితికి మించి ఫోన్ కనెక్షన్లు ఉండకూడదు. అలా ఉంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.

ఇంతకీ ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉండవచ్చు? మీకు తెలియకుండా మీ పేరుపై ఎవరైనా సిమ్ కార్డ్ కొనుగోలు చేస్తే ఏం చేయాలి?

ఇలాంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వాట్సాప్ చానల్

ఒకరి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉండవచ్చు?

టెలీకమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (డీవోటీ) నిబంధనల ప్రకారం ఒకరి పేరు మీద తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ ఉండకూడదు.

అయితే, ఈ సిమ్ కార్డుల నిబంధన కొన్ని రాష్ట్రాల్లో మరో విధంగా ఉంది.

అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ ప్రజలు తమ పేరు మీద ఆరు సిమ్ కార్డులు మాత్రమే ఉంచుకోవచ్చు.

మొబైల్ కనెక్షన్లు

ఫొటో సోర్స్, Getty Images

పరిమితికి మించి సిమ్ కార్డులు తీసుకుంటే ఏం చేయాలి?

ఎవరైనా కొత్త సిమ్‌ కార్డు కొనుగోలు చేసేటపుడు వారి పేరు మీద ఎన్ని నంబర్లున్నాయో టెలికాం కంపెనీలు తెలియజేస్తాయి.

ఒక వ్యక్తి తన పేరు మీద అనుమతించిన కనెక్షన్‌ల కంటే ఎక్కువ ఉంటే, వాటిని సమీక్షించుకోవాలని టెలికాం కంపెనీలు కస్టమర్లకు సలహాలు ఇస్తున్నాయి. అదనపు కనెక్షన్‌ల గురించి హెచ్చరిస్తున్నాయి.

అదనంగా కనెక్షన్లు ఉంటే దానిని మరొకరి పేరుకు బదిలీ చేసుకోవచ్చు, లేదా రద్దు చేసుకోవచ్చు.

మొబైల్ కనెక్షన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి?

మన ధ్రువీకరణ పత్రాలపై ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో టెలికాం ఉద్యోగుల అవసరం లేకుండా, మనమే స్వయంగా చెక్ చేసుకోవచ్చు.

దీని కోసం టెలికాం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుంది.

ఈ వెబ్‌సైట్‌లో మీ ప్రస్తుత మొబైల్ నంబర్‌‌తో లాగిన్ కావాలి. తర్వాత మీ ధ్రువీకరణ పత్రంపై ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? ఆ మొబైల్ నంబర్లు ఏమిటో పూర్తి జాబితా వస్తుంది.

మొబైల్ కనెక్షన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కువ కనెక్షన్లు ఉంటే ఏం చేయాలి?

ఆ వెబ్‌సైట్‌ జాబితాలో మీరు తీసుకోని నంబర్ కనిపిస్తే, అది మీది కాదని సదరు టెలికాం విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు.

అంతేకాదు, మీరు గతంలో కొనుగోలు చేసిన నంబర్ అయి ఉండి, ఇప్పుడు దాని అవసరం లేకపోయినా రిపోర్టు చేయవచ్చు.

ఆ జాబితాలో కనిపించిన మీ నంబర్ల పక్కన 'నాట్ మై నంబర్ (నా నంబర్ కాదు)', 'నాట్ రిక్వైర్డ్ (అవసరం లేదు)', ' రిక్వైర్డ్ (అవసరం)' అనే ఆప్షన్లు ఉంటాయి.

ఎవరైనా మీకు తెలియకుండా ఆ జాబితాలోని నంబర్ కొనుగోలు చేస్తే, మీరు ఆ నంబర్ పక్కనే ఉన్న 'నాట్ మై నంబర్' ఆప్షన్ ఎంచుకోవాలి.

మీ పాత నంబరై ఉండి, దానిని ప్రస్తుతం వాడకున్నా, మీకు అవసరం లేదనుకున్నా సదరు నంబర్ పక్కన ‘నాట్ రిక్వైర్డ్’ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ఎలాంటి శిక్షలు ఉన్నాయి?

కొత్త టెలికాం చట్టంలో శిక్షకు సంబంధించి ప్రత్యేకంగా ఏమీ ప్రస్తావించలేదు, కానీ ఇందులోనే "మోసం లేదా వంచన ద్వారా మరొకరి పేరు మీద మొబైల్ కనెక్షన్లు పొందడం" అనే విషయాలను నేరంగా పరిగణించింది. ఈ కనెక్షన్ల కేసు ఈ నేరం కిందకి వస్తుంది.

దీని ప్రకారం దోషులకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)