హైటెన్షన్ విద్యుత్ టవర్ల దగ్గర సెల్‌ఫోన్ మాట్లాడటం ప్రమాదమా, అక్కడ ఇళ్లు కూడా కట్టుకోకూడదా?

ఫొటో సోర్స్, Getty Images
17 ఏళ్ల సంతోష్ తమిళనాడులోని ఆవడి పక్కనే ఉన్న తిరుముల్లైవాయల్‌లో ఉంటారు. ఇటీవలే 12వ తరగతి పరీక్షలు రాశారు. మార్చి 29న తన ఇంటి టెర్రస్‌పై మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా అనుకోని ఘటన జరిగింది.
ఆ హైవోల్టేజీ విద్యుత్ లైన్ నుంచి సంతోష్ మీదకు ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించింది. దీంతో అతని శరీరం కాలిపోయింది, స్పృహతప్పి పడిపోయాడు.
సంతోష్ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని రక్షించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
90 శాతం కాలిన గాయాలతో అడ్మిట్ అయిన సంతోష్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నాడు. ఈ ఘటనపై తిరుముల్లైవాయల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఆ ప్రాంతంలో ఇళ్లు, వ్యవసాయ భూములపై అధిక ఓల్టేజీ విద్యుత్ లైన్లు వెళ్లడంపై పలు వివాదాలున్నాయి.
ఇంటి కోసం భూమిని కొనుగోలు చేసేటపుడు దాని పైన లేదా సమీపంలో హైవోల్టేజీ విద్యుత్ లైన్లు ఉంటే ఆ భూమిని కొనుగోలు చేసేందుకు ప్రజలు భయపడుతున్నారు.
ఇంతకీ సంతోష్ విద్యుదాఘాతానికి గురవడానికి కారణం హైవోల్టేజీ కరెంటు తీగల కింద నిలబడి ఫోన్ మాట్లాడటమేనా?

ఫొటో సోర్స్, Getty Images
కండక్టర్ అయినపుడే..
“సెల్‌ఫోన్ నుంచి వచ్చే విద్యుదయస్కాంత వికిరణానికి, అధిక-వోల్టేజీ విద్యుత్ లైన్ల ద్వారా ప్రవహించే విద్యుత్‌కి డైరెక్ట్ కనెక్షన్ లేదు’’ అని అన్నామలై యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ప్రొఫెసర్ శక్తివేల్ చెబుతున్నారు.
“అధిక-వోల్టేజ్ విద్యుత్ లైన్ల కింద నిలబడి మాట్లాడితే ఒక రకమైన శబ్దం వస్తుంది కానీ, మనిషిలో విద్యుత్ ప్రవహించదు. ఎందుకంటే అధిక-వోల్టేజీ విద్యుత్ లేదా గృహ విద్యుత్ అనేవి వైర్లు లేదా కండక్టర్ లేకుండా ప్రసారం కావు” అని ఆయన చెప్పారు. అయితే గాలి ఒక విద్యుద్వాహకమని ప్రొఫెసర్ శక్తివేల్ గుర్తుచేస్తున్నారు.
"గాలి ఎక్కువ తేమగా మారితే విద్యుత్ వాహకత పెరుగుతుంది. అలాంటి సమయంలో అధిక-వోల్టేజ్ విద్యుత్ లైన్లు ఇంటిపై నుంచి వెళ్లినపుడు మనం భూమి, ఆ తీగల మధ్య నిలబడితే, రెండింటి మధ్య కండక్టర్ అవుతాం" అని అన్నారు.
అలాంటి సందర్భంలో మన చేతిలో సెల్ ఫోన్ ఉన్నా లేకున్నా మన శరీరంలో విద్యుత్ ప్రవహిస్తుందని ఆయన అంటున్నారు.
సెల్‌ఫోన్ విద్యుదయస్కాంత వికిరణం అధిక-వోల్టేజ్ విద్యుత్ మార్గంలో జోక్యం చేసుకుంటుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు.
ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ లేదా సెల్ ఫోన్ టవర్ల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని ఎలాంటి ఆధారాలు లేవని ప్రొఫెసర్ శక్తివేల్ చెప్పారు.
“ఉదాహరణకు రైల్వేస్టేషన్‌లు లేదా రైళ్ల పైన ఉన్న అధిక-వోల్టేజీ విద్యుత్ లైన్ల కింద కొంతమంది విద్యుదాఘాతానికి గురైనట్లు మేం రిపోర్టులు చూశాం. ఎందుకంటే మానవ శరీరం భూమి, వైర్ల మధ్య కండక్టర్‌గా మారుతుంది, విద్యుత్ ప్రవహిస్తుంది. యువకుడు ఉన్న ప్రాంతంలో హైవోల్టేజీ విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండొచ్చు. కాబట్టి శరీరం కాంటాక్ట్ అయి, ఇది జరిగి ఉండవచ్చు” అని ప్రొఫెసర్ శక్తివేల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వర్షాకాలంలో ప్రమాదం..
అధిక-వోల్టేజీ విద్యుత్ లైన్లు తక్కువ ఎత్తులో ఉండటం కాకుండా ప్రమాదాలకు మరే ఇతర కారణాలున్నాయా? అని అడిగినప్పుడు “గాలిలో తేమ పెరిగినప్పుడు దాని విద్యుత్ వాహకత పెరుగుతుంది. ఇది వర్షాకాలంలో ఎక్కువగా జరుగుతుంది. అప్పుడు విద్యుత్ ప్రవహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యుత్ షాక్‌లు కూడా సంభవిస్తాయి. అందువల్ల వర్షాకాలంలో లేదా గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు అధిక వోల్టేజ్ విద్యుత్ లైన్ల కింద నిలబడకూడదు” అని ప్రొఫెసర్ శక్తివేల్ సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
అధిక ఓల్టేజీ విద్యుత్ లైన్లు ఉన్న భూమిని కొనొచ్చా?
భూమి పైన హైవోల్టేజీ విద్యుత్ టవర్లు, విద్యుత్ లైన్లు వెళితే ఆ భూమిని కొని ఇల్లు కట్టుకోవాలా అనే ప్రశ్న చాలామందిలో నెలకొంది.
“విద్యుత్ లైన్ల కింద ఉన్న బంజరు భూమిని ఇళ్లు లేదా వ్యవసాయం కోసం కొనొచ్చు” అని తమిళనాడు పవర్ బోర్డు ఇంజనీర్ ఒకరు అన్నారు.
‘‘అలాంటి భూముల్లో వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. ఆ భూముల్లో వరి, కూరగాయలు వంటి చిన్న పంటలు మాత్రమే పండించాలి. కొబ్బరి వంటి పొడవైన చెట్లను పెంచడం నిషేధం. ఆ ప్రాంతంలో భూమి తక్కువకు వస్తుందని కొంటుంటారు. కానీ, హైవోల్టేజీ కరెంటు తీగలు తక్కువ ఎత్తులో ఉంటే అక్కడి వాళ్లకు అంత ఎక్కువ ప్రమాదం” అని చెప్పారు.
“విద్యుత్ రెండు రకాలు.. హై-టెన్షన్ లైన్ , లో-టెన్షన్ లైన్. హైటెన్షన్ లైన్‌లో 50KW కంటే తక్కువ విద్యుత్ ప్రవహిస్తే ఇంటికి, వైర్లకు మధ్య 10 అడుగుల దూరం ఉండాలి.
50 నుంచి 200 KWకు 15 అడుగుల గ్యాప్ ఉండాలి. 110 KW లేదా అంతకంటే ఎక్కువుంటే అదనపు హై-టెన్షన్ లైన్ అంటారు. ఇది చాలాదూరం వరకు విద్యుత్‌ను మోసుకెళ్లగలదు. అందులో వాడే వైర్లు కూడా చాలా బరువుగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ నిబంధనలను అనుసరించి నిర్ణీత వ్యవధిలో ఇళ్లను నిర్మించాలి'' అని అధికారి తెలిపారు.
“కొంతమంది పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఈ దూరాన్ని సరిగ్గా పాటించరు. అటువంటి పరిస్థితులలో అనేక ప్రమాదాలు జరుగుతాయి. మేం కూడా చాలా చోట్ల తనిఖీలు చేశాం, హైటెన్షన్ లైన్ వెళ్లే ప్రాంతాల్లో 15 అడుగుల లోపు ఇళ్లు నిర్మిస్తే వాటికి కరెంటు ఇవ్వడం లేదు" అని ఆయన అన్నారు.
భూమి కొనేటపుడు ఈ జాగ్రత్త తప్పనిసరి
‘‘వర్షాకాలం ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ విద్యుత్ స్తంభాల కింద కూడా నిలబడకూడదు. ముఖ్యంగా హైవోల్టేజీ విద్యుత్ లైన్లు, టవర్లు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం మేము పాలిమర్‌ను ఇన్సులేటర్‌గా ఉపయోగిస్తున్నాం. దీంతో సాధ్యమైనంత వరకు ప్రమాదాలను నివారిస్తున్నాం. అయితే ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ప్రజలు భూమిని కొనుగోలు చేసేటపుడు జాగ్రత్త వహించాలి" అని తమిళనాడు పవర్ బోర్డ్ ఇంజనీర్ వివరించారు.
హై ఓల్టేజీ విద్యుత్ లైన్లకు, ఇంటికి మధ్య దూరం తక్కువగా ఉన్న ఏరియాల్లో విద్యుత్ లైన్లపై అధిక కరెంట్ ప్రవహిస్తే ఇంట్లోని విద్యుత్ ఉపకరణాలు పాడైపోతాయి.
అలాంటి ప్రాంతాల్లో ఇంటి కోసం స్థలం కొనుగోలు చేసేటప్పుడు ఎలక్ట్రీషియన్‌ను సంప్రదించడం మంచిదని తమిళనాడు విద్యుత్ బోర్డు అధికారి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- రాంలీలా మైదానంలో ‘ఇండియా’ మెగా ర్యాలీ: ‘అరవింద్ కేజ్రీవాల్‌ను మోదీ ఎలా జైల్లో పెడతారు’- సునీతా కేజ్రీవాల్
- ఓపెన్‌హైమర్: అణు దాడులతో కకావికలమైన జపాన్ ప్రజలు.. ఆ బాంబుల తయారీపై వచ్చిన చిత్రం చూసి ఏమన్నారు?
- బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదం: అర్ధరాత్రి, కరెంట్ పోయింది, నౌక కంట్రోల్ తప్పింది... రెండు నిమిషాల్లోనే విధ్వంసం
- గోమూత్రంతో పసుపు రంగు, విఖ్యాత భారతీయ వర్ణచిత్రాలను దీంతోనే వేశారా? 1908లో ఆంగ్లేయుల కాలంలో దీన్ని ఎందుకు నిషేధించారు
- ఎలిహు యేల్: భారతీయులను బానిసలుగా మార్చి సంపన్నుడిగా ఎదిగిన ఈయన అసలు చరిత్ర ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














