వర్చువల్ కిడ్నాప్ అంటే ఏంటి... ఈ కిడ్నాపర్లు విదేశాలలోని విద్యార్థుల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

వర్చువల్ కిడ్నాప్

ఫొటో సోర్స్, Getty Images

వర్చువల్ కిడ్నాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికాలోని తన పౌరులను, ప్రత్యేకించి విద్యార్థులను చైనా రాయబార కార్యాలయం కోరింది.

కై జుయాంగ్ అనే 17 ఏళ్ళ చైనా విద్యార్థి కనిపించకుండా పోయి, ఉటా పర్వత ప్రాంతాలోని ఓ తాత్కాలిక క్యాంప్ సైట్‌లో డిసెంబర్ 31న సురక్షితంగా కనిపించిన తరువాత చైనా రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది.

తమ కుమారుడు అపహరణకు గురైనట్టు కిడ్నాపర్లు ఫొటోలు పంపారని, అతనిని విడుదల చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని కై జువాంగ్ తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి తెలిపారు.

సైబర్ కిడ్నాపర్లు బాధితులను తాము కిడ్నాప్ అయినట్టుగా భావించుకునేలా చేసి, వారో ఏకాంత ప్రదేశంలో తమను తాము బందీలుగా ఊహించుకునేలా చేస్తారు. అయితే ఈ వ్యవహారాన్నంతా కిడ్నాపర్లు ఫేస్‌టైమ్, లేదంటే స్కైప్ ద్వారా గమనిస్తుంటారు.

తరువాత ఇటు బాధితుడిని, అటు కుటుంబసభ్యులు కూడా తాము దీనికి తలొగ్గకపోతే మరొకరికి హాని జరుగుతుందనే నమ్మకాన్ని కలిగిస్తారు.

ఇలాంటి ట్రిక్ వల్లే కై తల్లిదండ్రులు 80వేల అమెరికన్ డాలర్లు (దాదాపు 67 లక్షల రూపాయలు )చైనాలోని కిడ్నాపర్ల బ్యాంకు ఎకౌంట్‌కు జమచేశారని స్థానిక పోలీసులు తెలిపారు.

వర్చువల్ కిడ్నాపర్లు

ఫొటో సోర్స్, RIVERDALE POLICE

ఫొటో క్యాప్షన్, 17 ఏళ్ళ కైజుయాంగ్‌ను ఉటా గ్రామీణ ప్రాంతంలో పోలీసులు కనుగొన్నారు

వర్చువల్ కిడ్నాప్ అంటే ఏమిటి?

దాదాపు రెండు దశాబ్దాలుగా పోలీసులకు ఈ వర్చువల్ కిడ్నాపింగ్ గురించి అవగాహన ఉందని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది.

సైబర్, డిజిటల్ , లేదా వర్చువల్ కిడ్నాప్‌ అనేక రూపాలలో జరుగుతుంది. అయితే వీటి సారాంశం ఎవరో ఒకరిని అపహరించినట్టుగా భ్రమ కల్పించడమే. తరువాత బాధితులు తమ అయినవారి కోసం పెద్ద మొత్తంలో డబ్బు కట్టకపోతే వారికేదో హాని కలుగుతుందనే ట్రిక్కే కిడ్నాపర్ల ఆయుధం.

 మాములుగా జరిగే కిడ్నాప్‌లా మాదిరి కాకుండా వర్చువల్ కిడ్నాపర్లు ఎవరినీ కిడ్నాప్ చేయరు. కాకపోతే మోసం, బెదిరింపుల ద్వారా, తమ పథకం బయటపడకముందే త్వరితగతిన డబ్బు చెల్లించేలా వారు బాధితులపై ఒత్తిడి తెస్తారని ఎఫ్‌బిఐ పేర్కొంది.

వర్చువల్ కిడ్నాప్

ఫొటో సోర్స్, New South Wales police

ఫొటో క్యాప్షన్, చైనా విద్యార్థులు కిడ్నాప్‌కు గురైనట్టు చూపుతున్న ఫోటోలు ఆస్ట్రేలియా పోలీసులకు లభించాయి.

చైనా విద్యార్థులు ఎందుకు లక్ష్యంగా మారారు?

సంపన్న పశ్చిమ దేశాలలో చదువుకునే చైనా విద్యార్థులను సైబర్ కిడ్నాపర్లు లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.

సెప్టెంబర్ 2023లో మోసగాళ్ళ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని షెఫీల్డ్‌కు వెళ్ళే అంతర్జాతీయ విద్యార్థులను యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యార్క్‌షైర్ పోలీసు విభాగంలో మోసాలపై పనిచేసే సమన్వయ బృందం హెచ్చరించింది.

యూకే వ్యాప్తంగా యూనివర్సిటీలు, కాలేజీలలో చదువుకునే చైనా విద్యార్థులే ఈ స్కామ్‌ చేసేవారికి లక్ష్యంగా మారుతున్నారని ఈ బృందం పేర్కొంది.

చైనా రాయబార కార్యాలయమో, కస్టమర్ సర్వీస్, లేదంటే చైనా పోలీసులమనో, రాయల్ మెయిల్ పేరుతోనో బాధితులకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి.

వీరు తామో అంతర్జాతీయ నేరాన్ని విచారిస్తున్నామని, ఇందుకోసం బాధితులు చైనాలోని బ్యాంకు ఎకౌంట్‌కు భారీగా డబ్బు పంపితే చెక్ చేసి పంపుతామని చెబుతారు.

కొన్ని కేసులలో అయితే ఈ నేరగాళ్ళ తమకు సహకరించాలని బాధితులను బెదిరిస్తారని దక్షిణ యార్క్‌షైర్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పకూడదంటూ బాధితుడికి వీరు ఆదేశాలు జారీచేస్తారు.

కోట్లాదిరూాపాయలు చెల్లిస్తున్న బాధితులు

వర్చువల్ కిడ్నాప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వర్చువల్ కిడ్నాప్‌లు జరిగే దేశాలలో యూకే కూడా ఉంది.

ఆస్ట్రేలియాలో 2023 అక్టోబరులో న్యూ సౌత్ వేల్స్ (ఎన్‌ఎస్‌డబ్ల్యు) పోలీసులు వర్చువల్ కిడ్నాపింగ్ కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించారు. చైనా నుంచే ఈ స్కామ్ జరుగుతోందని న్యూ సౌత్ వేల్స్ డిటెక్టివ్ సూపరింటెండెంట్ జోసెఫ్ డయోహి చెప్పారు.

ఈ మోసానికి పాల్పడేవారు బాధితుడినే చైనా అధికారుల్లా నటించమని కోరి, మరో బాధితుడికి వల వేస్తారు.

‘‘ఈ మోసగాళ్ళు చేసే ట్రిక్కుల వల్ల బాధితులు రాష్ట్రాలే కాదు, ఏకంగా దేశాలే విడిచిపెట్టి వెళ్ళేలా చేస్తారు. కొందరు థాయ్‌లాండ్ నుంచి కాంబోడియాకు వెళ్ళిన బాధితులు ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియాలో కూడా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కూడా వెళ్ళినవారున్నారంటూ’’ డిప్యూటీ సూపరింటెండెంట్ డయోహి చెప్పారు.

ఒక్క అక్టోబరులోనే 20 నుంచి 23 ఏళ్ళ వయసు మధ్య ఉన్న చైనా యువకులను చైనా అధికారుల పేరుతో ఈ మోసగాళ్ళు కాంటాక్ట్ చేశారని ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ న్యూ సౌత్ వేల్స్ పోలీసులను ఉటంకిస్తూ తెలిపింది.

బాధితులు 33,8,880 ( దాదాపు 2 కోట్ల 83 లక్షల రూపాయలు) డాలర్లు చెల్లించాలని లేదంటే చైనాలో జరిగిన నేరంలో వీరిని ఆ దేశం నుంచి బహిష్కరించాల్సి వస్తుందని బెదిరించారు.

ఇలాంటి సంఘటనలో 20 ఏళ్ళ యువకుడు సిడ్నీలో చేతులకు బేడీలు వేసి, షాంఘై పోలీసుల తరపున అడిలైడ్, విక్టోరియాలోని బాధితులకు అధికారిక పత్రాలు ఇవ్వడానికి విమానంలో వెళ్ళాలని బలవంతం చేశారు.

ఈ కేసులో బాధిత కుటుంబం 135739 ( సుమారు 1 కోటి 14 లక్షల రూపాయలు) డాలర్లు చెల్లించాల్సి రావడంతో వారు న్యూ సౌత్ వేల్స్ పోలీసులను ఆశ్రయించారు.

2020లో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఓ హెచ్చరిక జారీచేశారు. చైనా విద్యార్థులను ఫోన్ కాల్స్ ద్వారా మభ్యపెట్టే మోసం గురించి వారీ హెచ్చరిక చేశారు. దాదాపు 8మంది పిల్లలు తాము వర్చువల్ కిడ్నాప్ బారినపడి, 1355538 డాలర్లు (సుమారు 11 కోట్ల 29 లక్షల రూపాయలు) చెల్లించినట్టు తెలిపారు.

 2020 ఏప్రిల్లోనూ ఇటువంటి సంఘటన ఒకటి సిడ్నీ నగర శివార్లలో జరిగింది. ఇక్కడ నివసించే చైనా కుటుంబంలోని ఓ విద్యార్థిని తాను కిడ్నాప్ ‌కు గురైనట్టు నమ్మి దాదాపు 203300 డాలర్లను (దాదాపు 1 కోటి 70 లక్షలరూపాయలు) చెల్లించింది. దీనిపై విచారణ జరపగా, ఆ విద్యార్థిని ఇంట్లో సురక్షితంగానే కనిపించింది.

జపాన్‌లో కూడా కొంతమంది బ్లాక్’మెయిలర్లు చైనా విద్యార్థులను ఇలాగే బెదిరించారని జపాన్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.

ఇలాంటి మరో ఘటనలో చైనా విద్యార్థిని తల్లిదండ్రులు 42,300 (దాదాపు 33 లక్షల రూపాయలు)డాలర్లు చైనా బ్యాంకు ఖాతాలో వేశారు. తమ కుమార్తెపై దాడి జరుపుతున్నట్టుగా ఉన్న ఫోటోను చూశాకా వారీ మొత్తాన్ని పంపారు.

ఆ తరువాత ఈ విద్యార్థినికి చైనా ప్రజాభద్రతాధికారి నంటూ ఓ బెదిరింపు కాల్ చేశారు. ఆమెపై ఓ అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, ఇందులోంచి తప్పించుకోవాలంటే కిడ్నాప్ అయినట్టుగా నాటకమాడి తల్లిదండ్రుల నుంచి డబ్బు వచ్చేలా చేస్తే జైలుశిక్ష పడకుండా తప్పించుకోవచ్చని చెప్పారు.

విదేశాలలో చదువుకునే చైనా విద్యార్థులు తమకు వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అఫీషియల్ కాల్స్ పేరుతో వచ్చే వాటి గురించి స్థానిక అధికారుల వద్ద విచారించాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)