ఆమె ఫొటోలు వాడుకుని ఆన్‌లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు

ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, హన్నా అజాలా, లవ్ జెనెసా టీమ్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

వెనెసాకు దాదాపు ప్రతి రోజూ మగవాళ్ల నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. గతంలో ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నామని భావించి ఆమెకు వారు మెసేజ్‌లు పంపిస్తుంటారు.

(ఈ కథనలో కొన్ని అభ్యంతరకర విషయాలు ఉండవచ్చు.)

కొంతమంది అయితే ఆమె తమ భార్య అనుకుంటుంటారు. కొందరు కోపంగా మెసేజ్ చేస్తారు, ఇంకొందరు తమ డబ్బు తమకు ఇవ్వాలని అడుగుతుంటారు. రోజువారీ ఖర్చుల కోసం, హాస్పిటల్ బిల్స్ కోసం, ఆమె బంధువుల సహాయార్థం తాము డబ్బు పంపించామని, అది తిరిగి ఇవ్వాలని అడుగుతుంటారు.

కానీ, అదంతా ఒక అబద్ధం. వెనెస్సాకు ఈ మగవాళ్లంతా ఎవరో కూడా తెలియదు. ఒకప్పుడు శృంగార వినోద రంగంలో పనిచేసిన వెనెస్సాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను 2000 సంవత్సరంలో కొందరు ఆమెకు తెలియకుండా వాడుకుని రొమాంటిక్ స్కాండల్‌లో అనేక మందిని మోసం చేశారు. ఈ విషయం వెనెస్సాకు తెలియదు. వెనెస్సా ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాటిని ఎరగా వేసి కొందరు మోసగాళ్లు డబ్బు దోచుకున్నారు. ఈ స్కామ్‌ను ‘క్యాట్ ఫిషింగ్’ అంటారు.

ఈ కుంభకోణంలో మోసపోయినవారు వెనెస్సాకు మెసేజ్‌లు పెడుతుంటారు.

‘నేను చాలా బాధపడ్డాను. నన్ను నేను నిందించుకునేదాణ్ని. నా ఫోటోలు అక్కడ లేకుంటే ఈ మగవాళ్లంతా మోసపోయేవాళ్లు కారు’ అని వెనెస్సా బాధపడ్డారు. (వెనెస్సా ఎవరనేది తెలియకుండా ఉంచేందుకు ఆమె పూర్తి పేరు ఈ కథనంలో వాడడం లేదు)

వెనెస్సా సుమారు ఎనిమిదేళ్ల పాటు ‘క్యామ్ గర్ల్’గా పనిచేశారు. వెబ్‌క్యామ్‌ల సహాయంతో ఇంటర్నెట్‌లో తన శృంగార వీడియోలు ప్రసారం చేసేవారామె. ఆ వీడియోలు చేసే ప్రారంభకాలంలో ఆమె సిగ్గుపడేవారు. దాంతో జానెస్సా బ్రెజిల్ అనే ఆల్టర్ ఇగోను (తనకు తానుగా ఒక ప్రత్యామ్నాయ అస్తిత్వాన్ని ఆపాదించుకోవడం) సృష్టించుకోవాలని నిర్ణయించుకుని ‘ఇది నేను కాదు.. జెనెస్సా. కాబట్టి సిగ్గుపడాల్సిన పనిలేదు’ అనుకుంటూ ఆ వీడియోలు చేసేవారు.

వెనెస్సా

కొంతకాలం పాటు అంతా బాగానే గడిచింది. తన వీడియోలను ఇష్టపడేవారితో సంబంధాన్ని ఎంజాయ్ చేశారామె. తన వీడియోలు చూడడడానికి, ఆమెతో మాట్లాడడానికి 20 డాలర్లు(సుమారు రూ. 1600) చెల్లించేవారు.

ఆమె ఈ కెరీర్‌లో ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు ఏడాది 10 లక్షల డాలర్లు(రూ. 8.25 కోట్లు) వరకు సంపాదించేవారు. జానెస్సా(వెనెస్సా) తన సొంత వెబ్‌సైట్, బ్రాండ్‌తో ఆన్‌లైన్‌లో పాపులర్ అయినప్పటికీ 2016లో ఆమె ఆన్‌లైన్ ప్రొఫైల్ అంధకారంలో చిక్కుకుంది.

‘పాడ్‌కాస్ట్ లవ్’ కోసం జానెస్సాను సంప్రదించడానికి గాను ఆమె ఎక్కడున్నారో కనుగొనడానికి మాకు 9 నెలలు పట్టింది. అక్కడ ఆమె తన అపార్ట్‌మెంట్‌లో మాతో మాట్లాడారు. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడేవారు తన ఇమేజ్, వీడియో కంటెంట్‌ను వాడుకునే అవకాశం దొరక్కూడదనే తాను ఈ వృత్తిని వదిలేసినట్లు చెప్పరామె.

సింబాలిక్

తాను లైవ్ షో చేసే సమయంలో చాట్‌లో ఓ వ్యక్తి చేసిన పోస్ట్‌తో అసలు ఏంజరుగుతుందన్నది ఆమెకు తెలిసింది. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడేవాళ్లు తనలా నటిస్తూ మగవాళ్లతో చాట్ చేస్తున్నారని ఆమె తెలుసుకున్నారు.

లైవ్ షో సమయంలో ఓ వ్యక్తి చాటింగ్‌లోకి వచ్చి తనకు భర్తనని క్యామింగ్ ఆపాలని కోరినప్పుడు అదంతా చిలిపిగా చేస్తున్న పనిగా ఆమె భావించారు. విషయం ఈమెయిల్ చేయమని ఆయనకు జానెస్సా సూచించారు.

ఇలా తన లైవ్ షో సమయంలో అనేక మంది చాట్‌లో మెసేస్ చేస్తుండడం ఎక్కువైందని, తన ఐడెండీటిని నిరూపించాలనీ కొందరు కోరారని ఆమె చెప్పారు.

ఇలా నిరంతరం ఎవరో ఒక మెసేజ్ చేస్తుండడం... ఈమెయిల్ చేస్తుండడం.. ఆన్‌లైన్‌లోనే గొడవ పడుతుండడంతో ఆమె వ్యాపారం దెబ్బతింది.

తొలుత ఆమె ప్రతి ఈమెయిల్‌కూ జవాబిచ్చేందుకు ప్రయత్నించారు. అందుకోసం గంటల కొద్దీ సమయం వెచ్చించాల్సి వచ్చేది.

తనకు మేనేజరుగా వ్యవహరించే తన భర్త కూడా ఈ మెసేజ్‌ల వ్యవహారం చూడడం ప్రారంభించారని వెనెస్సా చెప్పారు. ఆన్‌లైన్ మోసగాళ్ల చేతిలో ఆ పురుషులు కోల్పోయిన డబ్బుకు వెనెస్సా బాధ్యురాలు కారని ఆయన వారితో చెప్పేవారు.

‘మోసపోయిన ఈ కుర్రాళ్లు మోసగాళ్లకు పంపించిన డబ్బంతా కనుక నాకే వచ్చుంటే నేను బిలియనీర్ అయ్యుండేదాన్ని. ఈ చిన్న అపార్ట్‌మెంట్‌లో ఎందుకు ఉంటాను?’ అన్నారామె.

చాలామంది మగవాళ్లు ఆడవాళ్ల గురించి పట్టించుకుంటారు, అది వారి సహజ గుణం, తాము అంతకుముందెన్నడూ కలవని ఆడవాళ్లకు కూడా సంకోచించకుండా డబ్బు పంపడానికి ఈ గుణమే కారణం అన్నారు వెనెస్సా.

‘వారి దగ్గర డబ్బు లేకపోయినా ఇవ్వడానికి సిద్ధమవుతారు. ఆ మహిళలు తమను ప్రేమిస్తున్నారని వారు అనుకుంటారు’ అని చెప్పారు వెనెస్సా.

రాబర్టో మారిని ఒక ఇటాలియన్, ఆయన వయసు 30 ఏళ్లుంటుంది. జానెస్సా నకిలీ ప్రొఫైల్‌ మాయలో ఆయన చిక్కుకున్నాడు.

వెనెస్సా ఫొటోలతో హన్నా అనే పేరుతో రాబర్టో మారినిని మోసం చేశారు. సార్డినియా ద్వీపంలో తన వ్యాపారాన్ని అభినందిస్తూ హన్నా ఫేస్‌బుక్‌లో పంపిన మెసేజ్‌తో వారి సంభాషణ మొదలై ఇంకా ముందుకెళ్లింది. మూడు నెలల పాటు మెసేజ్‌లు, ఫొటోలు, ప్రేమభరితమైన సందేశాలు పంపించుకున్న తరువాత ఆమె(హన్నా) డబ్బు కావాలని ఓసారి అడిగారు.

ఫోన్ పాడైందని చెప్పి డబ్బు తీసుకున్నారు స్కామర్లు.. అలాఅలా అనేక కారణాలతో రాబర్టో నుంచి డబ్బు తీసుకున్నారు.

ఆమెతో మెసేజ్‌లు కాకుండా ఫోన్లో మాట్లాడాలని రాబర్టో చాలాసార్లు ప్రయత్నించినా ఆ సమయానికి ఫోన్ పాడైనట్లో, ఇంకేదైనా కారణమో చెప్పేవారు స్కామర్లు.

హన్నా కోసం ఆన్‌లైన్లో వెతుకుతున్నప్పుడు అనేక ఫొటోలు, వీడియోలు దొరికాయి రాబర్టోకు. అవన్నీ అడల్ట్ ఎంటర్‌టైనర్ జానెస్సా బ్రెజిల్(వెనెస్సా)కు చెందినవే తప్ప హన్నావి కావని గుర్తించాడు రాబర్టో.

డేటింగ్ యాప్

దీంతో అయోమయానికి గురైన రాబర్టో జానెస్సా బ్రెజిల్ లైవ్ షోలో పాల్గొని ‘నువ్వు నిజంగా జానెస్సావేనా?’ అని చాట్‌లో అడిగారు. అయితే, జానెస్సా నుంచి సమాధానం రాలేదు.

వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో ఆయన జానెస్సాకు ఈమెయిల్ చేశారు. తనకు వేలాదిగా వస్తున్న ఈమెయిళ్లలో జానెస్సా రాబర్టో మెయిల్‌ను చూశారు.

‘నేను అసలైన జానెస్సాతో మాట్లాడాలనుకుంటున్నాను’ అని 2016లో రాబర్టో మెయిల్ పంపించగా ‘నేనే నిజమైనా జానెస్సా’ అని ఆమె సమాధానమిచ్చారు.

గతంలో తామిద్దరం మాట్లాడుకున్నామా లేదా అనేది తెలుసుకోవడానికి ఆయన మరికొన్ని ప్రశ్నలు అడిగారు.

ఇద్దరి మధ్య కొన్నాళ్లపాటు మెయిళ్లు సాగాయి. రాబర్టో ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నాడు. నాలుగేళ్ల కాలంలో ఆయన 2,50,000 డాలర్లు(సుమారు రూ. 2 కోట్లు) చెల్లించాడు. తన సేవింగ్స్ అన్నీ ఖర్చయిపోయిన తరవాత స్నేహితుల నుంచి, బంధువుల నుంచి అప్పులు తీసుకుని మరీ డబ్బులు పంపించారు రాబర్టో.

తాను మోసపోయినట్లు గుర్తించిన తరువాత రాబర్టో సోషల్ మీడియాలో మిగతావారిని హెచ్చరించడం ప్రారంభించారు. జానెస్సా ఫొటోలను ఉపయోగించి నకిలీ ప్రొఫైళ్లలో మోసాలు చేస్తున్నారని ఆయన ఆన్‌లైన్‌లో పోస్టింగులు పెట్టేవారు. ఆయన్ను గుర్తించి మేం మాట్లాడాం. అయితే... ఈ వ్యవహారంలో జానెస్సాకు కూడా సంబంధం ఉందని రాబర్టో భావిస్తున్నారు.

‘ఇది స్కామ్’ అని ఆన్‌లైన్ రొమాన్స్ స్కామ్‌లను అధ్యయనం చేసిన ఫిలడెల్ఫియాకు చెందిన క్రిమినల్ లాయర్ ఆన్సుల్ రేగ్ చెప్పారు.

ఆన్‌లైన్‌లో ఇలాంటి మోసాలు చేసే ముఠాలు ఎలా పనిచేస్తాయో ఆమె వివరించారు. ప్రేమ భావనలు, శృంగార చేష్టలతో ఆకర్షించి డబ్బు అడగడం ప్రారంభిస్తారు. డబ్బు ఇవ్వకపోతే బెదిరింపులు ఉంటుంటాయి.

రాబర్టో చిక్కుకున్న స్కామ్ ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్ చేసినట్లు ఆన్సుల్ రేగ్ చెప్పారు. తుర్కియే, చైనా, అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, నైజీరియా వంటివాటితో పాటు అనేక దేశాలు కేంద్రంగా ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు ఆన్సుల్ చెప్పారు.

ఈ కేసులో మోసపోయిన రాబర్టో డబ్బు పంపించింది ఘనా దేశానికి. ఘనా కేంద్రంగా ఇలాంటి ఆన్ లైన్ మోసాలు జరుగుతుంటాయి. అక్కడ సకావా బాయ్స్ అనే ఆన్‌లైన్ స్కామర్ల గ్రూప్ ఉంది. ఇలాంటి మోసాలు చేయడంలో ఆరితేరిన ఓఫా అనే యువకుడు ఇదంతా ఎలా చేస్తారో చెప్పాడు. వేరొకరిలా నటిస్తూ మోసం చేయడం కష్టమే అని, చాలా ఓపిగ్గా, తెలివిగా ఇదంతా చేయాలని చెప్పాడు. తాను చేసింది తప్పే అయినప్పటికీ దాని వల్ల 50 వేల డాలర్లు సంపాదించినట్లు చెప్పాడు.

జానెస్సా ఫొటోలను చూసిన ఓఫా ఆ ఫొటోలను ఉపయోగించిన తాను ఎవరినీ మోసం చేయలేదని చెప్పాడు.

మరోవైపు ఈ మోసాల ప్రభావం తీవ్రం కావడంతో వెనెస్సా 2016లో కేమ్ గర్ల్ పని మానేశారు. తన ఇంటిని, భర్తను కూడా వదిలిపెట్టి కొత్త జీవితం ప్రారంభించారామె. థెరపిస్ట్‌గా శిక్షణ తీసుకుంటూ తన కథను రాస్తున్నారు వెనెస్సా.

తన ఫొటోలతో జనాలను మోసం చేశారని ఆమె అధికారులకు ఫిర్యాదు చేయలేదు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆమె అనుకున్నారు.

అలా ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనను పోర్న్ స్టార్‌లా చూస్తారని, తనను చూసి నవ్వుతారని ఆమె అంటున్నారు.

అయితే, ఈ ఘటనల తరువాత ఆమె మరింత దృఢంగా మారారు. ఆమె క్యామ్ గర్ల్ వృత్తి మానేసినా కూడా ఆమె ఫొటోలతో ఆన్‌లైన్ మోసగాళ్లు బాధితులను మోసం చేయడం ఆగదని ఆమెకు అర్థమైంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి