క్రిప్టో కరెన్సీ: 31,000 కోట్లు మోసం చేసిన అమెరికా మోస్ట్ వాంటెడ్ మహిళ

రుహా ఇగ్నాసివ

సుమారు రూ.31 వేల కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీ స్కామ్ చేసిందనే ఆరోపణలతో ఒక మహిళ కోసం అమెరికా వెతుకుతోంది.

టాప్-10 మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఆమెను చేర్చిన ఎఫ్‌బీఐ, ఆచూకీ తెలిపిన వారికి సుమారు లక్ష డాలర్లు బహుమతి ఇస్తామని ప్రకటించింది.

బల్గేరియాకు చెందిన రూహా ఇగ్నాసివ, 'వన్ కాయిన్' పేరుతో 2014లో క్రిప్టో కరెన్సీ తీసుకొచ్చినట్లు ప్రకటించారు. 'వన్ కాయిన్‌'ను విక్రయించిన వారికి కమిషన్లు ఇవ్వడం మొదలు పెట్టారు.

అలా 'వన్ కాయిన్' ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.31 వేల కోట్లు పోగేసుకుని రూహా ఇగ్నాసివ బోర్డు తిప్పేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు.

2017 నుంచి రూహా ఇగ్నాసివ కనిపించకుండా పారిపోయారు. 'వన్ కాయిన్'కు అసలు విలువే లేదని, ఇతర క్రిప్టో కరెన్సీల మాదిరిగా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని రూపొందించలేదని ఎఫ్‌బీఐ వెల్లడించింది. క్రిప్టో కరెన్సీ ముసుగులో చేపట్టిన ఒక పాంజీ స్కీమ్ అని వారు తెలిపారు.

'సరైన సమయంలో క్రిప్టో కరెన్సీ మోసానికి ఆమె తెరతీశారు. క్రిప్టో కరెన్సీ హవా మొదలైందని, ముందుగా కొనుగోలు చేసే వారికి భారీ లాభాలు వస్తాయని ఆమె ప్రచారం చేశారు.' అని మన్‌హాటన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అధికారి వివరించారు.

ఎఫ్‌బీఐ టాప్-10 మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఏకైక మహిళ రూహా ఇగ్నాసివానే.

ద మిస్సింగ్ క్రిప్టో క్వీన్

రూహా ఉదంతాన్ని 'ది మిస్సింగ్ క్రిప్టో క్వీన్' అనే పుస్తకం రాశారు జేమీ బార్ట్‌లెట్. 'ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో పేరును చేర్చడం వల్ల ఆమె త్వరలోనే పోలీసులకు దొరికే అవకాశం ఉంది. 2017లో ఆమె పరారీ అయిన తరువాత చోటు చేసుకున్న కీలక పరిణామం ఇది.' అని జేమీ అన్నారు.

సుమారు 500 మిలియన్ డాలర్లతో పారిపోవడం వల్లే రూహా అధికారుల నుంచి తప్పించుకోని తిరగగలుగుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఆమె దగ్గర అనేక రకాల నకిలీ పత్రాలు ఉండే అవకాశం ఉంది. తన వేషధారణ కూడా మార్చుకొని ఉంటుంది. అలాగే ఆమె బతికి ఉండే అవకాశాలు కూడా లేవనే వాదనలు కూడా ఉన్నాయి.' అని జెమీ చెప్పుకొచ్చారు.

రూహా ఇగ్నాసివ చిత్రాలను విడుదల చేసిన ఎఫ్‌బీఐ

ఫొటో సోర్స్, FBI

ఫొటో క్యాప్షన్, టాప్-10 మోస్ట్ వాంటెడ్ లిస్టులో రూహా ఇగ్నాసివ పేరును ఎఫ్‌బీఐ చేర్చింది.

చివరి సారి 2017లో బల్గేరియా నుంచి గ్రీస్ వెళ్లే విమానంలో రూహా ఇగ్నాసివ కనిపించారు.

తాను, తన స్నేహితులు సుమారు 2 లక్షల 50 వేల యూరోలు 'వన్‌ కాయిన్‌'లో పెట్టినట్లు జెన్ మెక్ఆడమ్ గతంలో బీబీసీకి తెలిపారు.

'ఈ అవకాశం వదులుకోవద్దంటూ ఒక ఫ్రెండ్ నాకు మెసేజ్ పంపించారు. ఆ లింక్ క్లిక్ చేసి వన్ కాయిన్ వెబినార్‌లో పాల్గొన్నా. ఆ తరువాత గంట పాటు మా జీవితాలను వన్ కాయిన్ ఎలా మారుస్తుందో చెప్పారు.

ఈ వెబినార్ చూస్తునారంటే మీరు అదృష్టవంతులు. ఇది బిట్ కాయిన్ మాదిరిగా సంచలనం సృష్టించనుంది. దీని హవా ఇప్పుడే ప్రారంభమవుతోంది.' అని వెబినార్‌లో ఊదరగొట్టారని మెక్‌ఆడమ్ వివరించారు.

కానీ ఆ తరువాత కొన్ని నెలలకు అదంతా మోసమని తెలిసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)