ఒక ఉద్యోగంలో ఎంతకాలం ఉంటే మంచిది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బ్రయాన్ లుఫ్కిన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉద్యోగాల విషయంలో ప్రపంచం వేగంగా మారిపోతోంది. కొత్త కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఉపాధి మార్గాలు విస్తృతమవుతున్నాయి. అలాంటప్పుడు ఒక ఉద్యోగంలో కనీసం ఒక ఏడాది పాటు ఉండాలనే నియమం ఇంకా వర్తిస్తుందా?
చేస్తున్న ఉద్యోగం నచ్చకపోయినా కనీసం ఒక సంవత్సరం పాటూ అందులో ఉండడం ముఖ్యం అనేది ఒక సాధారణంగా చాలామంది పెట్టుకునే నియమం. ఆఫీసులో పరిస్థితులు బాగోలేకపోయినా వృత్తిపరమైన నిబద్ధత, స్థిరత్వాన్ని ప్రదర్శించడం మేలు చేస్తుందన్నది ఒక భావన.
అయితే, మహమ్మారి కాలంలో ఉద్యోగాలు, పనివేళలు, కార్యాలయాల్లో ఊహించని రీతిలో మార్పులు వచ్చాయి. ఇలాంటప్పుడు కూడా ఈ నియమం వర్తిస్తుందా?
కావొచ్చు అంటున్నారు నిపుణులు. ఒక ఏడాది నియమం వెనకాల ఉన్న అంశాలకు ఎప్పటికీ కాలం చెల్లదని అంటున్నారు.
యజమానుల వైపు నుంచి చూస్తే కనీసం ఒక ఏడాది పాటైనా ఉద్యోగంలో స్థిరంగా ఉండని వ్యక్తికి ఆ ఉద్యోగం ఇవ్వడం దండగ పని.
ఉద్యోగి వైపు నుంచి చూస్తే... ఒక ఏడాది పాటు స్థిరంగా ఉద్యోగం చేయడం అనేది పని పట్ల వారికి ఉన్న విధేయతను సూచిస్తుంది.
అంతే కాకుండా, 12 నెలలు నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఇవన్నీ ఒక త్రైమాసికంలో నేర్చుకోలేకపోవచ్చు.
కాగా, కెరీర్ నిర్మించుకునే విధానంలో వస్తున్న మార్పులకు, మహమ్మారి తోడై ఉద్యోగాల్లో మరిన్ని సౌలభ్యాలను తీసుకువచ్చింది.
పద్ధతిగా ఎక్కువ కాలం ఉద్యోగం చేసేవారి కోసం యజమానులు చూస్తున్నప్పటికీ, కెరీర్‌లో ఒకటి, రెండు సార్లు ఏడాది కన్నా తక్కువ కాలంలో ఉద్యోగాలు మారిపోయినవారిని పెద్దగా తప్పుబట్టక్కర్లేదు.
అలా మారడానికి తగిన కారణాలు వివరిస్తే దాన్నో లోపంగా పరిగణించక్కర్లేదని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
స్థిరత్వాన్ని నిరూపించుకోవడం
ఓ కొత్త ఉద్యోగంలో చేరడం అనేది పెద్ద విషయం. దానికోసం అనేక సర్దుబాట్లు చేసుకోవలసి వస్తుంది. దానికి పూర్తిగా అలవాటు పడడానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఒక ఏడాది నియమం పనికొస్తుంది.
"ఒక సంవత్సరం తరువాత సాధారణంగా ఉద్యోగులు పురోగతి సాధించినట్లు భావిస్తారు. అలాగే, తమ బృందంలో ఎవరు ఎలాంటి వాళ్లన్నది కూడా వారికి ఒక అవగాహన వస్తుంది. సంస్థలో ప్రభావం చూపడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, వారు ఎలా ఎదిగారో చూపించడానికి ఒక సంవత్సరం పడుతుంది. కొత్త ఉద్యోగం వెతుక్కుంటున్నప్పుడు పాత ఉద్యోగంలో ఏడాది పాటు ఏమేమి చేశారో చెప్పేందుకు కావలసినంత సరుకు మీ దగ్గర సమకూరుతుంది. తదుపరి ఉద్యోగానికి మీరు అర్హులు అనే విషయాన్ని స్పష్టం చేయడానికి ఏడాది కాలం పాటు మీరు పడిన శ్రమ సహకరిస్తుంది" అని 'గ్లాస్‌డోర్' జాబ్స్ సైట్‌లో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ సీనియర్ మేనేజర్ అలిసన్ సలివన్ చెప్పారు.
ఒక ఉద్యోగంలో కొన్ని నెలలు మాత్రమే పనిచేస్తే ఉద్యోగి వ్యక్తిత్వం, వృత్తి నిబద్ధతపై సందేహాలు వెలువడవచ్చు.
"నిబద్ధత లేకపోవడం, నిలకడలేనితనం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎదగడానికి ప్రయత్నించకపోవడం, టీమ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వదిలివెళ్లిపోవడం.. ఈ లక్షణాలన్నీ వేగంగా ఉద్యోగాలు మార్చేవారికి ఉంటాయని గతంలో భావించేవారు" అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని సైద్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ మైఖేల్ స్మెట్స్ అన్నారు.
ఒకటి, రెండుసార్లు త్వరత్వరగా ఉద్యోగాలు మారడాన్ని అర్థం చేసుకోవచ్చుగానీ, అదే పనిగా తరచూ ఉద్యోగాలు మారేవారి వివరణ నమ్మశక్యం కాదని సలివన్ అభిప్రాయపడ్డారు.
ఒక సంవత్సరం లోపే ఉద్యోగం వదిలి వెళ్లిపోయేవారిపై సంస్థలు కూడా బోలెడంత టైమ్, డబ్బు ఖర్చు పెట్టాలని అనుకోవు. గత ఉద్యోగాలలో నిలకడ లేని వారిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి మొగ్గు చూపవు.
"చేస్తున్న ఉద్యోగం గురించి మీకు ఎన్ని సందేహాలున్నా, కనీసం ఒక ఏడాది పాటు అందులో ఉండడం మేలు. ఏడాది కన్నా తక్కువ కాలం ఉంటే ఎంప్లాయర్స్‌కు అనుమానాలు మొదలవుతాయి" అని సలివన్ అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కొత్త వాస్తవం?
ఒక ఏడాది నియమాన్ని గతంలో ఎక్కువగా విశ్వసించేవారుగానీ, ఈమధ్య కాలంలో దాని ప్రాధాన్యం తగ్గిందనే చెప్పవచ్చు.
మహమ్మారికి ముందు కూడా ఉద్యోగాలు, పనితీరులో వేగంగా వచ్చిన మార్పుల కారణంగా ఈ నియమం బ్రేక్ చేసినా తప్పుబట్టేవారు తక్కువయ్యారు.
"ముందు తరాలవారు తమ కెరీర్‌లో ఎక్కువ భాగం ఒకే సంస్థలో గడిపేవారు. కానీ ప్రస్తుత తరం అలా ఆలోచించట్లేదు" అంటూ బోస్టన్‌లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ జేమీ లాడ్జ్ వివరించారు.
అయితే, ముందు తరాలకన్నా ఇప్పటి తరం తరచూ ఉద్యోగాలు మారుతుందని చెప్పడానికి స్పష్టమైన డాటా లేదు.
కానీ, ఈరోజుల్లో చాలా మంది తమ కెరీర్‌లో పైకి వెళ్లేందుకు, కొత్త నైపుణ్యాలను పొందేందుకు లేదా మెరుగైన ప్యాకేజీని పొందేందుకు తరచూ ఉద్యోగాలు మారుతున్నారు. టెక్ కంపెనీల్లాంటి వాటిల్లో తరచూ ఉద్యోగాలు మారడం అనేది సర్వసాధారణం.
"తరచూ ఉద్యోగాలు మారడం అనేది ఇప్పుడు ఒక ఛాయిస్‌గా మారింది. ఈ ధోరణి ఉద్యోగి కన్నా ఉద్యోగం ఇచ్చేవారి గురించి ఎక్కువ తెలియజేస్తుంది" అని స్మెట్స్ అభిప్రాయపడ్డారు.
ఉద్యోగి పనితీరు, శ్రేయస్సులకు ప్రాధాన్యమిచ్చే సంస్థల కోసం ఇప్పటి తరం వెతుక్కుంటోంది. పరిస్థితులు బాగోలేకపోయినా ఒకే సంస్థలో ఉండాలన్న నియమమేమీ వారికి లేదు.
మహమ్మారి తరువాత ఇలాంటి ఆలోచనలు మరింత పెరిగాయి. దాంతో, తరచూ ఉద్యోగాలు మారడమూ పెరిగింది. ఈ రాజీనామా పర్వంలో మళ్లీ కొత్త ఉద్యోగులను వెతుక్కోవడానికి సంస్థలు కష్టపడుతున్నాయి.
"ఆరోగ్య రక్షణ, భద్రత, తీరైన పనివేళలు కావాలని ఇప్పటి తరంలో ఉద్యోగులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహమ్మారి తరువాత ఈ ఆలోచన మరింత పెరిగింది. మహమ్మారి కారణంగా అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు. పై కారణాలతో ఉద్యోగాలు విడిచిపెట్టినవారూ అధికమే. ఈ నేపథ్యంలో యజమానులు ఉపాధి అంతరాలను, పరిస్థితుల్లో వస్తున్న మార్పును, ట్రెండ్‌ని అర్థం చేసుకుంటున్నారు" అని సలివన్ అన్నారు.
ఎంత అర్థం చేసుకున్నా, తక్కువ కాలంలో ఉద్యోగం వదిలిపెట్టినట్లు సీవీలో కనిపిస్తే యజమానులు వివరణ కోరుకుంటున్నారని స్మెట్స్ అన్నారు.
"కొత్త ఉద్యోగంలో చేరడం పాత ఉద్యోగాన్ని తప్పించుకోడానికా లేక దీనివల్ల అభివృద్ధి ఉంటుందనుకుంటున్నారా తెలుసుకోవడం యజమానులకు ముఖ్యం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కారణాలు వివరించడం ముఖ్యం
ఇంతకు ముందు ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారు, ఏ పరిస్థితుల్లో విడిచిపెట్టారని యజమానులు తెలుసుకోవాలనుకుంటారని స్మెట్స్ అన్నారు.
"టీమ్ ఇబ్బందుల్లో ఉనప్పుడు వదిలేశారా, మీ విధులను సరిగ్గా అప్పగించి వచ్చారా, వెళ్లిపోతున్న విషయాన్ని ముందే సంస్థ యజమానులకు చెప్పారా.. ఏడాది కన్నా ముందే ఉద్యోగాన్ని వదిలిపెట్టినా అది సక్రమంగా చేశారా లేదా అనేది యజమానులు చూస్తారు. ఈ వివరాలన్నీ ఒప్పించేట్లు ఉంటే మీ నిబద్ధతపై అనుమానాలు రావు."
ఉద్యోగ ప్రకటనలో వివరించిన దానికి, వాస్తవంలో ఉద్యోగానికి మధ్య అంతరం ఉందంటే, అది వివరించి చెప్పడం ముఖ్యం అని లాడ్జ్ అన్నారు.
"కొంతమంది ప్రకటనల్లో ఏమిస్తారో, దానికి భిన్నంగా విధులను అప్పగిస్తారు. లేదా ప్రకటనలో చెప్పిన అన్ని అంశాలూ విధుల్లో ఉండవు. అలాంటప్పుడు ఏడాది లోపే ఆ ఉద్యోగం విడిచిపెడితే ఫరవాలేదు. కానీ, అది వివరించి చెప్పగలగాలి."
అయితే, పాత ఉద్యోగం ఎందుకు వదిలేశారో చెప్పడం ముఖ్యమైనప్పటికీ, పాత ఉద్యోగంలో లోపాల కన్నా, కొత్త ఉద్యోగం మీకు ఎందుకు ముఖ్యమో యజమానులకు వివరించి చెప్పడం మేలు చేస్తుందని సలివన్ అన్నారు.
"గత అనుభవాల గురించి ఇంటర్వ్యూలలో అడిగినప్పుడు, అవి చెప్పుకునేంత మంచివి కాకపోతే కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించడం అవసరం. పాత ఉద్యోగాల అనుభవాల కన్నా, కొత్త ఉద్యోగం వైపుకు దృష్టి మళ్లించి, దీన్లో మీకూ, సంస్థకూ ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో చెప్పడం మేలు."
కొత్త ఉద్యోగానికి మీరు అర్హులని ఒప్పించగలిగితే గతంలో తరచూ ఉద్యోగాలు మారినా సంస్థ యజమానులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు.
"తుదకు, సంస్థకు మీరెంత ఉపయోగపడతారన్నదే ఎంప్లాయర్స్‌కు ముఖ్యం" అని సలివన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- లా చదివితే లాయరే కానక్కర్లేదు
- గూగుల్‌కు వ్యతిరేకంగా పోరాడి గెలిచిన మహిళ
- బార్క్‌లో ఉద్యోగం పొందడం ఎలా?
- లఖీంపుర్ ఖేరీ హింసపై సిట్ రిపోర్ట్: రైతులను తొక్కించేందుకు పక్కా ప్రణాళికతో కుట్ర, కేంద్ర మంత్రి కొడుకుపై హత్య కేసు
- మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్
- వ్లాదిమిర్ పుతిన్: 'రహస్యంగా ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేశా'
- పరాగ్ అగర్వాల్: సిలికాన్ వ్యాలీలో భారత సంతతి సీఈవోల ఆధిపత్యానికి కారణమేంటి?
- జపాన్: ‘గృహిణి’ బాధ్యతల నుంచి తప్పుకుని, ఉద్యోగాల్లోకి వస్తున్న మహిళా శక్తి
- చైనాను ఆపడం ఇప్పుడు అమెరికాకు ఎందుకంత కష్టం
- ఒక బాలిక యదార్థ గాధ: "నా చేతులు పట్టుకుని అసభ్యంగా... నేను వారికి అభ్యంతరం చెప్పలేక.."
- ‘మహిళలైతే న్యాయం అందించడంలో ముందుంటారు’ - బీబీసీ 100 మంది మహిళలు
- విమానంలో ఉద్యోగం... ఎయిర్ హోస్టెస్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








