చైనాను ఆపడం ఇప్పుడు అమెరికాకు ఎందుకంత కష్టం

ఫొటో సోర్స్, Getty Images
2001లో ప్రపంచ గమనంలో మార్పులు తీసుకొచ్చే రెండు కీలక ఘటనలు జరిగాయి.
9/11 దాడుల అనంతర పరిణామాలపై ప్రపంచం తలమునకలై ఉంది. కానీ అక్కడికి సరిగ్గా మూడు నెలల తర్వాత డిసెంబర్ 11న జరిగిన ఒక కార్యక్రమంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) కేంద్ర బిందువుగా ఉంది.
9/11ల దాడుల కన్నా మరింత ఎక్కువగా ప్రపంచాన్ని, ప్రజల జీవితాలను, జీవనోపాధిని మలుపు తిప్పగల కార్యక్రమం అది.
డబ్లూటీవోలోకి చైనా ప్రవేశం అమెరికా, యూరప్ సహా చాలా ఆసియా దేశాల ఆటను మార్చేసింది. నిజానికి పారిశ్రామికంగా మంచి వనరులు (ఉదాహరణకు చమురు, ఖనిజాలు) ఉన్న ప్రతి దేశంపై ఇది ప్రభావం చూపింది.
భౌగోళికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో కీలకమైన దీని గురించి అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వెనకున్న అసమతుల్యతకు మూలం ఇది. ఉత్పాదక ఉద్యోగాలను చైనాకు అవుట్ సోర్సింగ్ ఇవ్వడంపై జీ7 దేశాల్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.
ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన విలువల్లో ఒకటైన ఆర్థిక స్వేచ్ఛను అమలు చేయడం వల్ల, రాజకీయ స్వేచ్ఛా మార్గాన్ని అనుసరించే వీలు చైనాకు లభిస్తుందని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వంటి వాళ్లు అప్పట్లో సూచించారు.
కలలు కనే శక్తితో పాటు ఆ కలలను నెరవేర్చుకునే శక్తి ఉన్న వాళ్లు ఎక్కువ డిమాండ్ చేస్తారని ఆయన అన్నారు.

కానీ ఈ వ్యూహం బెడిసికొట్టింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా చైనా తన ప్రస్తుత స్థితికి ఎదగడం అప్పటి నుంచే ప్రారంభించింది. త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. ఈ విషయంలో దాన్ని అడ్డుకునే వాళ్లెవరూ కనిపించడం లేదు.
'రాజకీయ నియంత్రణ, ఇన్నోవేటివ్ సొసైటీని కలిగి ఉండలేరు' అన్న పాశ్చాత్యుల అభిప్రాయం తప్పని చైనా ఆర్థిక మోడల్ ఎంతోకొంత నిరూపించిందని ఈ వారంలో జరిగిన వాషింగ్టన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అసోసియేషన్ ప్యానల్‌లో చార్లెనీ బార్షఫ్‌స్కై చెప్పారు.
ఆమె అమెరికా వాణిజ్య ప్రతినిధి. నిజానికి చైనా డబ్ల్యూటీవో ఒప్పందం విషయంలో చర్చలు జరిపింది ఈమె.
చైనా ఇన్నోవేటివ్ సామర్థ్యం దాని ఆర్థిక మోడల్ వల్ల మరింత పెరిగిందని చెప్పలేమని ఆమె వివరించారు. కానీ పాశ్చాత్తులు అననుకూల వ్యవస్థలుగా భావించేవన్నీ తప్పనిసరిగా అననుకూల వ్యవస్థలు కావాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2000 సంవత్సరం వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చౌకగా లభించే ప్లాస్టిక్ సంబంధిత ఎలక్ట్రానిక్ వస్తువులను అత్యధికంగా తయారు చేసే దేశాల్లో ఒకటిగా చైనా ఉంది. ఇది ముఖ్యమైన విషయమే. కానీ ప్రపంచ గతిని మార్చేంత కీలకమైంది కాదు.
కానీ ప్రపంచ వాణిజ్యం టాప్ జాబితాలో చైనాకు చోటు దక్కడంతో ప్రపంచవ్యాప్తంగా సమూల మార్పులకు నాంది పడింది. పని చేసేందుకు ఉత్సాహం చూపించే చైనా కార్మికుల సైన్యం, అత్యాధునిక హైటెక్ ఫ్యాక్టరీలు, చైనా ప్రభుత్వం-పాశ్చాత్య బహుళజాతి కంపెనీల మధ్య ఉన్న సంబంధాలు కలసి ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చేశాయి.
చౌకగా లభించే చైనా కార్మిక సైన్యం పాశ్చత్య దేశీయుల జీవన ప్రమాణాలకు అవసరమైన వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టింది. దాంతో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల సప్లై చెయిన్‌లోకి చైనా సులువుగా ప్రవేశించగలిగింది. ఆర్థికవేత్తలు దీన్ని 'సప్లై షాక్' అని పిలుస్తుంటారు. దీని ప్రభావం కూడా షాకింగ్‌గానే ఉంది. దాని ప్రభావం తాలుకా ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చేరడంతో చైనా గణనీయమైన ఆర్థిక విజయాలను సాధించింది. కటిక పేదరికాన్ని రూపుమాపింది. డబ్ల్యూటీవోలో చేరకముందు 50 కోట్ల మంది పేదరికంలో ఉండేవారు. ప్రస్తుతం పేదరికం ఏమీ లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే డాలర్లలో చెప్పినప్పుడు చైనా ఆర్థిక రంగం విలువ 12 రెట్లు పెరిగింది. విదేశీ మారక నిల్వలు 16 రెట్లు పెరిగి 2.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
చైనా.. 2000 సంవత్సరంలో వస్తువుల ఎగుమతుల్లో ప్రపంచంలో ఏడో అతిపెద్ద దేశంగా ఉంది. కానీ త్వరలోనే అది మొదటిస్థానానికి చేరుకుంది. అప్పటికే 8శాతంగా ఉన్న చైనా వృద్ధి రేటు.. రాకెట్ వేగంతో పరుగులు తీసింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన బూమ్‌తో 14శాతానికి చేరింది. అయితే, గతేడాది చైనా వృద్ధి రేటు 15శాతంగా నమోదైంది.

ప్రపంచ వాణిజ్యానికి కంటైనర్ షిప్పులు చాలా కీలకంగా భావిస్తారు. డబ్ల్యూటీవోలో చేరిన ఐదు సంవత్సరాల తర్వాత నౌకల్లో చైనాకు వచ్చి పోయే కంటైనర్ల సంఖ్య రెట్టింపు అయింది. వీటి సంఖ్య 4 కోట్ల నుంచి 8 కోట్లకు చేరింది. ఇక డబ్ల్యూటీవోలో చేరిన పదేళ్ల తర్వాత అంటే 2011లో చైనాకు వచ్చిపోయే కంటైనర్ల సంఖ్య సుమారు 13 కోట్లకు చేరింది.
గతేడాది వీటి సంఖ్య 24.5 కోట్లు. అయితే, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమింటంటే.. చైనాకు వెళ్తున్న కంటైనర్లలో సగం వరకు ఖాళీ కంటైనర్లే ఉంటున్నాయి. కానీ చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్తున్న కంటైనర్లన్నీ దాదాపు పూర్తిగా నిండుగా ఉంటున్నాయి. అంటే వస్తువులు చైనా నుంచి ఇతర దేశాలకు ఎగమతి అవుతున్నాయన్న మాట.
అంతేకాదు.. హైవేలను కూడా చైనా వివరీతంగా విస్తరించింది. 1997లో 4700 కిలోమీటర్లుగా ఉన్న హైవేల నెట్‌వర్క్ 2020 నాటికి 1,61,000 కిలోమీటర్లకు విస్తరించింది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద హైవే నెట్‌వర్క్. రెండు లక్షలకు పైగా జనాభా ఉన్న దాదాపు 99 శాతం పట్టణాలను ఈ హైవేలు కలుపుతున్నాయి.
అత్యాధునిక సరకు రవాణా సౌకర్యాలతో పాటు తన ఉత్పాదకతను పెంచుకోవడానికి చైనాకు వనరులు చాలా అవసరం. అంటే లోహాలు, ఖనిజాలు, శిలాజ ఇంధనం చాలా అవసరం. చైనాలో అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్, ఎలక్ట్రికల్ ఉపకరణాల పరిశ్రమకు ఉక్కు చాలా అవసరం.
చైనా తొలిసారిగా 2005లో ఉక్కు ఎగుమతి చేసింది. ఆ తర్వాత క్రమంగా ప్రపంచంలోనే అత్యధిక స్టీల్ ఎగుమతిదారుగా అవతరించింది.
1990లో చైనా ఏడాదికి 10 కోట్ల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసింది. కానీ డబ్ల్యూటీవోలో చేరిన తర్వాత చైనా ఉక్కు ఉత్పత్తి భారీగా పెరిగింది. 2012 నాటికి అది ఏడాదికి 70 కోట్ల టన్నులకు చేరింది. 2020 నాటికి చైనా స్టీల్ ఉత్పత్తి వంద కోట్ల టన్నులకు చేరింది.
ప్రపంచ స్టీల్‌లో చైనా ఇప్పుడు 57శాతం ఉత్పత్తి చేస్తోంది. అంటే 2001లో మిగతా అన్ని ప్రపంచదేశాలు కలిసి ఉత్పత్తి చేసిన స్టీల్ కంటే ఎక్కువ ఇప్పుడు ఒక్క చైనానే స్టీల్ ఉత్పత్తి చేస్తోంది. సెరామిక్ టైల్స్, ఈ పరిశ్రమలో ఉన్న ఇతర వస్తువుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇక ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బొమ్మలు, ఫర్నిచర్ సరఫరాలో కూడా చైనా ఆదిపత్యం కొనసాగుతోంది. చైనా పోటీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి ధరలు తగ్గాయి.
2000 సంవత్సరం నుంచి 2005 మధ్యలో చైనా దుస్తుల ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా ఐదో వంతు నుంచి మూడోవంతుకు చేరింది.
2005 తర్వాత టెక్ట్స్‌టైల్ ఇండస్ట్రీలో విధించిన ఉత్పత్తి పరిమితులు కూడా ఎత్తేశారు. ఆ తర్వాత చైనాలో ఉత్పత్తి మరింత ఊపందుకుంది. అయితే, చైనాలో ఉత్పత్తి ఖరీదైనదిగా మారడంతో బంగ్లాదేశ్, వియత్నాం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాటి ఉత్పత్తి తరలివెళ్లింది. దాంతో గతేడాది దుస్తుల ఉత్పత్తి 32శాతానికి తగ్గింది.
"చైనా డబ్ల్యూటీవోలో చేరడం.. అమెరికా, పాశ్చాత్య దేశాల్లో ఉద్యోగాలను కొల్లగొట్టే చారిత్రక పొరపాటని నేను నమ్మను. కానీ కేటాయింపులు లేదా ప్రయోజనాలు అసమానంగా ఉన్నాయని గుర్తించాను" అని డబ్ల్యూటీవోలో చైనా చేరడానికి బాధ్యులైన ఆదేశ మంత్రి లాంగ్ యోగ్టూ చెప్పారు. చైనా స్వయంగా అభివృద్ధి చెందినప్పుడు.. అది మిగిలిన ప్రపంచానికి ఎగుమతి మార్కెట్‌ను అందించిందని అన్నారు.
కొన్ని రంగాలపై చైనా పోటీ ప్రభావాన్ని అంచనా వేయడంలో, ఆ ప్రభావం పడకుండా నివారించడంలో అమెరికా రాజకీయాలు విఫలమయ్యాయి.
సంపద అసమానంగా పంపిణీ జరిగినప్పుడు, స్వదేశీ విధానాల ద్వారా ఆ పంపిణీ సమంగా ఉండేలా ఒక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ ఆ పని చేయడం అంత సులువు కాదు అని లాంగ్ యోగ్టూ చెప్పారు.
ఇతరులపై నిందలేయడం సులువు. కానీ నెపం ఇతరులపైకి నెట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకోవడం లేదు. చైనా లేకపోతే, అమెరికా తయారీ పరిశ్రమ మెక్సికోకు వెళ్లి ఉండేదని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దానికి ఆయనొక ఉదాహరణ చెప్పారు. ఒక చైనీస్ గ్లాస్ తయారీదారు అమెరికా ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఆయనకు పోటీపడి పనిచేసే కార్మికులు దొరకలేదు. అమెరికా కార్మికుల పొట్టలు నా కంటే పెద్దవిగా ఉన్నాయని ఆయన నాతో చెప్పారు అని చైనా మంత్రి తెలిపారు.
అంటే డబ్ల్యూటీవోలో చైనా ఒక గణనీయమైన విజయం సాధించింది. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలను మార్చడానికి అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం తొందరపడటం లేదు. వాణిజ్యంపై అనుమానాలు నిజమే. చైనా డబ్ల్యూటీవో సభ్యత్వాన్ని ఉపయోగించుకుని, పశ్చిమ దేశాలకు వస్తువులను తయారు చేసిచ్చే పాత్ర కంటే ఎక్కువే పోషించింది.
ఉదాహరణకు కాలుష్య రహిత ఆర్థిక విప్లవానికి అవసరమైన అరుదైన మెటేరియల్స్ కోసం చైనా వ్యూహాత్మకంగా భాగస్వాములను కలిగి ఉంది.
దౌత్యపరంగా, ఆర్థికంగా చైనాను కట్టడి చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో యూరప్, ఆసియాలో మిత్రుల సాయం కోరుతోంది.
20 సంవత్సరాలు గడిచాయి. ఎవరూ పెద్దగా గుర్తించని ఒక చిన్న నిర్ణయం కారణంగా ప్రపంచ దిశ మారిపోయింది. చైనాకు ఇది ఘన విజయం. పాశ్చాత్య దేశాల భౌగోళిక, రాజకీయ వ్యూహం బెడిసికొట్టింది. ఆ నిర్ణయం వల్ల నిజానికి చైనా రాజకీయంగా పశ్చిమ దేశాల మాదిరిగా మారకుండా.. పశ్చిమ దేశాలే ఆర్థికంగా చైనాలా మారుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ వెబ్సైట్, యాప్ ట్విటర్ అకౌంట్ హ్యాక్
- టోర్నడో బీభత్సం.. అమెరికాలో 70 మందికి పైగా మృతి
- జనరల్ బిపిన్ రావత్ అనంతరం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయ్యేదెవరు, అర్హతలేమిటి
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- అంకోర్ సామ్రాజ్యం అభివృద్ధి, అంతం రెండిటికీ నీరే కారణమా
- బుద్ధుడి గురించి ఈ విషయాలు తెలుసా?
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












