చైనా నిర్మిస్తున్న ఈ గ్రామాల గురించి భారత్ ఎందుకు ఇబ్బంది పడుతోంది?

భూటాన్-చైనా ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమృత శర్మ
    • హోదా, బీబీసీ మానిటరింగ్

డోక్లాంకు దగ్గరగా ఉన్న భూటాన్ భూభాగంలో చైనా గ్రామాలను నిర్మిస్తున్నట్లు ఆధారాలు లభించాయి.

చైనా చర్య భారత్‌ను ఇబ్బంది పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. చైనా ఈ ప్రాంతాల్లో తన ఆధిక్యతను పెంచుకునేందుకు ఇదంతా చేస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

చైనీస్ మిలిటరీ డెవలప్‌మెంట్ పై అధ్యయనం చేసే అంతర్జాతీయ పరిశోధకుడు నవంబరు17న డెట్రెస్ఫా అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి ఈ శాటిలైట్ చిత్రాలను షేర్ చేశారు. ఈ చిత్రాలు 2020-2021 మధ్యలో భూటాన్‌కు చైనాకు మధ్యలో ఉన్న వివాదాస్పద ప్రాంతం డోక్లాం దగ్గర చైనా చేపట్టిన నిర్మాణ కార్యక్రమాలను చూపిస్తున్నాయి.

చైనా 14 దేశాలతో సుమారు 22,457 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. కానీ, భారతదేశం, భూటాన్‌లతో మాత్రమే చైనాకు సరిహద్దు వివాదాలున్నాయి.

చైనా నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాలు డోక్లాంకు దగ్గరగా ఉండటంతో ఈ చర్య భారత్‌ను కలవర పెట్టింది. చైనా చేపట్టిన నిర్మాణ కార్యక్రమాల పట్ల 2017లో చైనా, భారత సైన్యం మధ్య ఘర్షణ ఏర్పడింది.

చైనా భూటాన్ ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images

భారత్ భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకు ముప్పు

జూన్ 2020లో గాల్వాన్ లోయ దగ్గర భారత్, చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలయింది.

అయితే, చైనా భూటాన్‌లో నిర్మాణాలు చేపడుతోందని తెలిసిన తర్వాత ఆందోళన మరింత పెరిగింది. ఇండియా, చైనాల మధ్యనున్న ఒక చిన్న దేశం భూటాన్ .

చైనాతో భూటాన్ 477 కిలోమీటర్ల పొడవున్న సరిహద్దును పంచుకుంటోంది. ఇది భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది.

ఈ సరిహద్దు చైనా సిలిగురి కారిడార్‌లోకి ప్రవేశించనివ్వకుండా రక్షణ కవచంగా పని చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లోకి చేరుకోవడానికి భారత్‌కు ప్రధాన మార్గంగా ఉన్న దీనిని 'చికెన్స్ నెక్' అని కూడా అంటారు.

"డోక్లాం దగ్గర చైనా చేపడుతున్న కార్యక్రమాలు భారతదేశ భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలకు తీవ్రంగా ముప్పు కలిగించవచ్చు" అని విశ్లేషకులు జజతి కే పట్నాయక్, చందన్ కే పాండా అవుట్‌లుక్‌లో ప్రచురితమైన వ్యాసంలో పేర్కొన్నారు.

చైనా భూటాన్‌లోకి చొరబడుతున్న అంశాన్ని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తీవ్రంగా పరిగణించింది.

"భూటాన్ భూభాగం పై చైనా చేపట్టిన కొత్త నిర్మాణాలు భారతదేశానికి ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే భూటాన్‌కు వారి విదేశీ వ్యవహారాల విధానం, సైన్యానికి ఇస్తున్న శిక్షణ గురించి సూచనలిచ్చాం" అని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ అన్నారు.

చైనా భూటాన్ ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images

చైనా- భూటాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం పట్ల ఆందోళన

2021 అక్టోబరు 14న చైనా, భూటాన్‌ల మధ్య 1984 నుంచి నడుస్తున్న సరిహద్దు వివాదం పరిష్కరించుకునేందుకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది కూడా భారత్‌ను ఆందోళన పెడుతోంది.

అయితే, భారత్ ఈ ఒప్పందం పట్ల చాలా జాగ్రత్తగా స్పందించింది. "ఇరు దేశాల మధ్య జరిగిన అవగాహనా ఒప్పందాన్ని మేము నోట్ చేశాం" అని పేర్కొంది.

భూటాన్, చైనాకు దిల్లీలోని దౌత్య కార్యాలయాల ద్వారా నేరుగా దౌత్య సంబంధాలు లేకపోవడంతో ఇరుదేశాలు ఆ ఒప్పందాన్ని బహిర్గతం చేయలేదు.

ఇది భూటాన్ చైనా మధ్య జరిగిన సరిహద్దు ఒప్పందమా? అదే అయినట్లయితే ఇది భారత్‌ను కలవరపెట్టే విషయమే" అని కలొనెల్ డన్‌వెర్ సింగ్ ట్వీట్ చేశారు.

డోక్లాం ట్రైజంక్షన్ దగ్గర భారత్ చైనా సైన్యం మధ్య 73 రోజుల పాటు ప్రతిష్టంభన ఏర్పడిన నాలుగేళ్ల తర్వాత ఈ ఒప్పందం జరగడం కూడా భారత్‌కు ఆందోళన కలిగించే విషయంగా ఉంది.

"2017లో చైనా వ్యూహాత్మకంగా కీలకమైన డోక్లాం భూభాగంలో ఒక రోడ్డు నిర్మించే ప్రయత్నం చేయడంతో భారత్ ఈ ఒప్పందం గురించి ఆసక్తి ప్రదర్శిస్తోంది" అని ప్రభుత్వ అనుకూల పత్రిక దైనిక్ జాగరన్ కథనంలో రాసింది.

"కానీ, భౌగోళిక రాజకీయ విషయాల్లో భారత్ ఆలోచన సంకుచితంగా ఉంది" అని చైనా గ్లోబల్‌టైమ్స్‌లో రాసిన సంపాదకీయంలో భారత్‌ను విమర్శించింది.

"ఇది రెండు సార్వభౌమ దేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం. దీనిని భారత్ వేలెత్తి చూపితే, భారతదేశం ఒక చిన్న బలహీన దేశపు సార్వభౌమత్వాన్ని నాశనం చేస్తున్నట్లు ప్రపంచానికి నిరూపించినట్లవుతుంది" అని ఆ సంపాదకీయంలో పేర్కొంది.

కానీ, భారతదేశానికి భూటాన్‌తో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా , చైనా భూటాన్ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలను న్యూదిల్లీ దగ్గరగా పర్యవేక్షించాల్సి ఉంటుంది.

"భూటాన్ సిలిగురి కారిడార్‌ను ఆనుకుని ఉండటంతో ఆ దేశం భారతదేశ జాతీయ భద్రతకు చాలా కీలకం. భూటాన్ భూభాగం విషయంలో ఏ చిన్న రాజీకి వచ్చినా కూడా అది ఈశాన్య ప్రాంతంలో భారత్ భద్రత పై ప్రభావం పడుతుంది" అని హిందూస్తాన్ టైమ్స్ కథనం పేర్కొంది.

ఛగ్లాగామ్

చైనా భూసరిహద్దు చట్టాలు

ఒక వైపు భారత్-చైనాల మధ్య సరిహద్దుల విషయంలో ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో చైనా కొత్త భూసరిహద్దు చట్టాన్ని జారీ చేయడం కూడా భారత్‌ను కలవర పెడుతోంది.

ఈ చట్టంలో చైనాకు 14 దేశాలతో ఉన్న సుమారు 22,000 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతంలో భద్రత నిర్వహణకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ఈ ఏడాది అక్టోబరు 23న ఆమోదించిన ఈ చట్టం 2022 జనవరి 01 నుంచి అమలులోకి వస్తుంది.

చైనా ఏకపక్ష నిర్ణయం పట్ల భారత్ గట్టిగా స్పందించింది. "ఈ చట్టాన్ని అనుసరించి ఇండియా చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని ఏకపక్షంగా మార్చే చర్యలను చైనా తీసుకోదని భావిస్తున్నాం" అని పేర్కొంది.

"ఇతర దేశాలతో చైనాకున్న సరిహద్దులను నిర్వహించుకుంటూ ఇండియా, భూటాన్ మధ్యనున్న సరిహద్దు వివాదాలను కూడా చైనాకు అనుగుణంగా పరిష్కారం చేసుకోవాలని చూస్తున్నట్లు ఈ కొత్త సరిహద్దు చట్టం సూచిస్తోంది" అని అనిర్బన్ భౌమిక్ అనే విశ్లేషకుడు అన్నారు.

సరిహద్దుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ చట్టం ఆమోదం పొందడం కూడా ఇరు దేశాల చర్చల పై ప్రభావం చూపిస్తుంది.

"సరిహద్దు వివాదం విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో ఈ చట్టం ఎందుకు జారీ చేశారు? దీంతో మీరు చాలా స్పష్టమైన సంకేతాలను పంపిస్తున్నారు. ఇదిప్పుడు చట్టంగా మారడంతో భవిష్యత్తులో జరిగే ఒప్పందానికి అంగీకారం ఎలా కుదురుతుంది?" అని ఒక మిలిటరీ అధికారి ప్రశ్నించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక లో ప్రచురితమైన వ్యాసం పేర్కొంది.

కానీ, ఈ కొత్త చట్టాన్ని ఇండియా కాస్త పెద్దది చేసి భూతద్దంలో చూపిస్తోందని చైనా విశ్లేషకులు ఆరోపించారు.

"ఈ చట్టాన్ని ఇండియా స్థిమితం లేకుండా సాధారణంగా చేసి మాట్లాడటం వల్ల ఇరు దేశాల మధ్య జరుగుతున్న సరిహద్దు చర్చలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది" అని క్వాన్ షావ్ లిన్ గ్లోబల్ టైమ్స్ తో అన్నారు.

చైనా భూటాన్ ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌కు ఆందోళన కలిగించే అంశం

కానీ, ప్రస్తుతం చైనా భూటాన్ భూభాగంలో చేపట్టిన నిర్మాణాలు, భూటాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం, మరో వైపు బీజింగ్‌తో సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం భారత్ ముందు కనిపిస్తున్న నిజమైన అంశాలు.

కానీ, చైనా భూటాన్‌లో చేపడుతున్న నిర్మాణాలు, చైనా అరుణాచల్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించి ఆ భూభాగాన్ని తమదిగా చెప్పుకుంటున్న కథనాలు భారత్ భద్రతకు ముప్పు కలిగించేవిగా కనిపిస్తున్నాయి.

"భూటాన్ సహాయంతో, డోక్లాంకు చుట్టు పక్కలనున్న వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చైనా చూస్తోంది. ఇదే గనక జరిగితే, చైనా సైన్యం సిలిగురి కారిడార్ వైపు దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇది భారత్‌కు భద్రత విషయంలో ఆందోళన కలిగించే అంశం" అని విశ్లేషకులు జజతి, చందన్ చెప్పారు.

భారత్ భూటాన్ మధ్యనున్న సంబంధాలను కూడా సవాలు చేయమని చైనా భూటాన్‌కు చెబుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

"భూటాన్ తన సరిహద్దు వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతోంది" అని చైనా విశ్లేషకులు ఈ ఒప్పందం పై ఇరు దేశాలు సంతకం చేసిన వెంటనే గ్లోబల్‌టైమ్స్‌తో మాట్లాడుతూ అన్నారు. ఈ ఒప్పందం భారత్‌కు ముప్పు కలిగిస్తుందనే వాదనలను తిప్పికొట్టారు.

భూటాన్‌లోకి ప్రవేశించేందుకు చైనా తన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండగా, భారత్ మాత్రం తనకు వ్యూహాత్మకంగా ఉన్న భూటాన్‌కు ఇచ్చే మద్దతు విషయంలో మరింత నమ్మకాన్ని కలిగించగలగాలి. "భారతదేశానికున్న శక్తిసామర్ధ్యాల దృష్ట్యా భూటాన్ చైనాతో సంప్రదింపులు జరిపేందుకు భారతదేశం సహాయం చేయవచ్చు" అని విశ్లేషకుడు సూదన్ కస్తూరి సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)