క్యూబ్‌శాట్స్: ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?

ఫొటో సోర్స్, NASA
- రచయిత, క్లెయిర్ బేట్స్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
క్యూబ్‌శాట్ అనేది చిన్నదైన, శక్తిమంతమైన సాంకేతిక సాధనం. షూ బాక్స్ పరిమాణంలో ఉండే ఈ చిన్న శాటిలైట్లను ప్రొఫెసర్ బాబ్ ట్విగ్స్ తయారు చేశారు. 1999లో విద్యార్థులకు విద్యా సాధనంగా వీటిని ఆయన రూపొందించారు.
''పరిమాణంలో చిన్నదవ్వడం వల్ల అందులో ఎక్కువగా ఏమీ అమర్చలేం. ఈ శాటిలైట్లతో ఉన్న సమస్య ఇదే. అందుకే వాటి డిజైన్‌కు తగినట్లుగా, అదనపు వస్తువులు అందులో జోడించడాన్ని ఆపేయాల్సి వచ్చింది'' అని బాబ్ నవ్వుతూ చెప్పారు.
సంప్రదాయక శాటిలైట్లతో పోలిస్తే వీటిని వేగంగా, తక్కువ ఖర్చుతో రూపొందించవచ్చు. ప్రయోగాలు కూడా నిర్వహించవచ్చు. అందుకే అనేక యూనివర్సిటీలు, స్టార్టప్‌లు, ప్రభుత్వాలు రూపొందించిన వందలాది క్యూబ్‌శాట్స్ భూమి చుట్టూ తిరుగుతున్నాయి.
ప్రపంచాన్ని మార్చేయడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి ఆరు ఉత్తేజకరమైన క్యూబ్‌శాట్ ప్రాజెక్టుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
1.అడవుల నిర్మూలనను ఆపడం
ప్రపంచవ్యాప్తంగా అటవీ నిర్మూలన సమస్యను పరిష్కరించడానికి శాటిలైట్ కంపెనీ ప్లానెట్‌తో నార్వే ప్రభుత్వం చేయి కలిపింది.
ప్లానెట్ కంపెనీకి చెందిన 180 క్యూబ్‌శాట్స్ కూటమి, నిరంతరం భూమి చిత్రాలను తీస్తుంటుంది. ఈ శాటిలైట్లలో అమర్చిన కెమెరాల రిజల్యూషన్ పిక్సెల్‌కు 3మీటర్లుగా ఉంటుంది. అందుకే ఇవి అంతరిక్షం నుంచి కూడా చెట్ల నరికివేతను సంబంధించిన సాక్ష్యాలను తయారుచేయగలవు.
''64 ఉష్ణ మండల దేశాల్లో అటవీ నిర్మూలనకు కారణాలను తెలిపే డేటా కోసం నార్వే ప్రభుత్వం డబ్బులు చెల్లించింది'' అని ప్లానెట్ సీఈవో విల్ మార్షల్ వెల్లడించారు.
''ఆయా దేశాలకు చెందిన అటవీశాఖ మంత్రులకు, అటవీ నరికివేత ఎక్కడ జరుగుతుందో మేం తెలియజేస్తాం'' అని ఆయన పేర్కొన్నారు.
2. అంతరించిపోతున్న జంతువులను కనిపెట్టడం
ఈ ఏడాది ప్రారంభంలో ఇటలీ, కెన్యా దేశాలకు చెందిన విద్యార్థులు 'వైల్డ్‌ట్రాక్‌క్యూబ్-సింబా' అనే ఉపగ్రహాన్ని పంపించారు. ఈ మినీ ఉపగ్రహం కెన్యా జాతీయ పార్కులోని పక్షులు, క్షీరదాలను పర్యవేక్షిస్తుంది.
''మానవులకు, వన్యప్రాణులకు మధ్య కాన్‌ఫ్లిక్ట్ ఉంది. ఉదాహరణకు రైతుల పంట పొలాలపై దాడి చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, కొన్నిసార్లు ప్రజల ప్రాణాలు పోవడానికి కూడా ఏనుగులు కారణమయ్యాయి'' అని నైరోబీ ఇంజనీరింగ్ విద్యార్థి డేనియల్ కియారీ చెప్పారు.
''ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మేం వన్యప్రాణులకు సహాయపడాలనుకున్నాం. అందుకే వాటి కదలికలపై నిఘా పెట్టాం. ఒకవేళ పొరపాటున వాటి ఆవాసాల నుంచి బయటకు వచ్చినా... అవి గ్రామాల్లోకి చేరకముందే వాటి జాడను తెలుసుకునే వీలుంటుంది'' అని చెప్పుకొచ్చారు.
వచ్చే ఏడాది రేడియో ట్యాగ్స్‌తో వన్యప్రాణులను అనుసంధానించాలని ప్రణాళికలు చేస్తున్నారు. దీనివల్ల అవి ఉన్న ప్రాంతంతో పాటు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవచ్చని ఆశిస్తున్నారు.
''ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములను వేటాడటం కెన్యాలో సాధారణ సమస్యగా మారిపోయింది.''
''ఈ రేడియో ట్యాగ్‌లు, వన్యప్రాణుల గుండె కొట్టుకునే రేటును పరిశీలిస్తుంటాయి. ఏదైనా జంతువు చనిపోతే వెంటనే ఇవి గుర్తిస్తాయి'' అని డేనియల్ పేర్కొన్నారు.
వన్యప్రాణుల కోసం ప్రవేశపెట్టిన క్యూబ్‌శాట్ మూడేళ్ల పాటు పనిచేయనుంది. సాధారణంగా క్యూబ్‌శాట్ ఉపగ్రహాలు రెండు నుంచి ఐదేళ్ల వరకు పనిచేస్తాయి. ఆ తర్వాత అవి వాతావరణంలోనే కాలిపోతాయి. ఇది, అవి ఆర్బిట్‌లో ఎంత ఎత్తులో తిరుగుతున్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
3. ఆధునిక బానిసత్వాన్ని బహిర్గతం చేయడం
నిర్బంధ బానిసత్వపు రహస్యపు ప్రపంచం గురించి తెలుసుకోవడానికి నాటింగ్‌హామ్ యూనివర్సిటీలోని 'ద రైట్స్ ల్యాబ్' శాటిలైట్ చిత్రాలను ఉపయోగిస్తుంది.
ఈ ల్యాబ్, ఇటీవల క్యూబ్‌శాట్ చిత్రాల ఆధారంగా గ్రీస్‌లో తాత్కాలికంగా ఏర్పాటైన బంగ్లాదేశీ ఫ్రూట్ వర్కర్లకు సంబంధించిన క్యాంపులను కనిపెట్టింది.
''ఈ అనధికార స్థావరాలు కాలక్రమేణా ఎలా మారుతున్నాయో మనం చూడొచ్చు'' అని ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తోన్న ప్రొఫెసర్ డొరీన్ బోయడ్ చెప్పారు.
''అక్కడ కొత్త కొత్త స్థావరాలు ఏర్పాటు కావడాన్ని మనం గమనించొచ్చు'' అని ఆయన చెప్పారు.
ఈ టీమ్ ఒక స్థానిక ఎన్జీవోతో కలిసి పనిచేసింది. ఫొటోల ద్వారా వారు కనిపెట్టిన శిబిరాలను ఈ ఎన్జీవో సందర్శించింది.
''వారు అక్కడి వలసదారులతో మాట్లాడారు. అక్కడి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో అనే అంశంపై మరింత సమాచారాన్ని పొందారు. మేం ఈ ప్రాంతంలో 50 అనధికార నివాసాలను గుర్తించాం'' అని వారు చెప్పారు.
4.స్పేస్ జంక్‌ను శుభ్రం చేయడం
రష్యా తమ పాత గూఢచారి శాటిలైట్ పైకి క్షిపణిని ప్రయోగించి ఇటీవలే అంతర్జాతీయ దేశాల ఆగ్రహానికి గురైంది. క్షిపణి ప్రయోగం కారణంగా శాటిలైట్ వేలాది ముక్కలుగా ధ్వంసమై భూమి లోపలి కక్ష్యలోనే తిరుగుతున్నాయి.
పనికిరాని ఉపగ్రహాలు, రాకెట్ ప్రయోగంలోని వివిధ దశల్లో వెలువడిన ఇతర పదార్థాలు కలిపి దాదాపు 30,000 ముక్కల స్పేస్ జంక్ ఉన్నట్లు గ్లోబల్ నెట్‌వర్క్‌లు గుర్తించాయి.
కానీ వాస్తవానికి అంతరిక్షంలో ఇంకా చాలా వ్యర్థాలు ఉండొచ్చు. అవి కూడా చాలా చిన్నవిగా గుర్తించడానికి వీల్లేకుండా ఉండొచ్చు. కానీ అవి స్పేస్‌క్రాఫ్ట్‌లోని ఉపగ్రహాలు, వ్యోమగాములకు కలిగించే ప్రమాదం మాత్రం చాలా పెద్దది.
స్పేస్ జంక్‌ను క్లీన్ చేయడంలో చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ ఉన్న ఉపగ్రహం చెత్త ఏ దేశానికి చెందిందో కూడా తెలియదు. అందుకే అంతరిక్షంలో వేగంగా తిరుగుతూ సమస్యలు సృష్టిస్తోన్న ఈ వ్యర్థాల సమస్యకు ఆచరణాత్మక పరిష్కారాన్ని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.
అందుకు క్యూబ్‌శాట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీటి ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో చెత్తను క్లీన్ చేస్తున్నారు. 2018లో యూరోపియన్ రిమూవ్‌డెబ్రిస్ అనే ఉపగ్రహం హార్పూన్, వల సహాయంతో రెండు క్యూబ్‌శాట్స్‌లను పట్టుకోగలిగింది.
ఈ ఏడాది ఈఎల్ఎస్ఏ-డి అనే అంతరిక్ష నౌకను జపాన్ కంపెనీ ఆస్ట్రోస్కేల్ ప్రారంభించింది. అది అయస్కాంత వ్యవస్థను ఉపయోగించి విజయవంతంగా క్యూబ్‌శాట్‌ను పట్టుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
5. గాలిమరలను అమర్చడం
తక్కువ ధరకు ఇంటర్నెట్ సంబంధిత అంశాలను మనకు అందించడానికి అనేక క్యూబ్‌శాట్స్ గ్రూపులు పైన పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో సెన్సర్లతో ఉన్న వస్తువులను, ప్రజలను కలిపేందుకు ఈ నెట్‌వర్క్ ఉపయోగపడుతుంది.
కొంతమంది రైతులు, పశుశాలల్లో నీటి మట్టాలను గురించి తెలుసుకునేందుకు సెన్సర్లను ఉపయోగిస్తారు. వీటివల్ల తరచుగా అక్కడి వెళ్లి నీటి మట్టాలను పరీక్షించే పని తప్పుతుంది.
పునరుత్పాదక శక్తి వనరులను మరింత సమర్థంగా వాడుకోవడంలో కూడా క్యూబ్‌శాట్స్ ఉపయోగపడతాయి.
గాలిమరలను(విండ్ మిల్స్) ఏడాదిలో రెండుసార్లు మాత్రమే పరిశీలిస్తారు. ఒకవేళ గాలిమర బ్లేడ్ పాడైపోతే, క్యూబ్‌శాట్స్ ఇచ్చే సమాచారం ఆధారంగా నెలల ముందుగానే అక్కడికి వెళ్లి మరమ్మతులు చేయొచ్చు.
పింగ్ సర్వీసెస్ అనే ఒక కంపెనీ గాలి మరలు తిరిగినప్పుడు వెలువడే శబ్ధాన్ని పరీక్షించడానికి ఒక సెన్సార్‌ను తయారుచేసింది.
శబ్ధంలో తేడా ఆధారంగా సెన్సార్, గాలిమర బ్లేడ్‌లో లోపం తలెత్తినట్లు గుర్తిస్తుంది. వెంటనే క్యూబ్‌శాట్ నెట్‌వర్క్ ఆధారంగా టర్బైన్ ఆపరేటర్‌కు ఈ సమాచారాన్ని చేరవేస్తుంది. దీనివల్ల గాలి మరల్లో సమస్యలను వీలైనంత తొందరగా, సమర్థవంతంగా పరిష్కరించడం కుదురుతుంది.

ఫొటో సోర్స్, ASTROSCALE
అంతరిక్షం లోతుల్ని జల్లెడ పట్టడం
దాదాపు చాలా క్యూబ్‌శాట్స్ ఉపగ్రహాలు భూమిపై ఏం జరుగుతుందో పరీక్షిస్తున్నాయి. కానీ కొన్ని క్యూబ్‌శాట్స్ మాత్రం నక్షత్రాల వైపు తమ దృష్టి సారించాయి.
2018లో నాసా తొలిసారి క్యూబ్‌శాట్స్‌ను అంతరిక్షంలోకి పంపింది. అంగారక గ్రహంపైకి ఇన్‌సైట్ ల్యాండర్ దిగగానే మార్కో-ఎ, బి కీలక సమాచారాన్ని పంపించాయి.
వచ్చే ఏడాది అర్టేమిస్ 1 రాకెట్ ద్వారా మరో 10 క్యూబ్‌శాట్స్‌లను పంపించనుంది. జీవకోటిపై డీప్ స్పేస్ రేడియేషన్ ప్రభావాన్ని పరీక్షించడం, చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద నీటి నిల్వలు అధ్యయనం చేయడమే లక్ష్యంగా ఈ క్యూబ్‌శాట్స్‌లను పంపనుంది.
ఈ లక్ష్యాలన్నీ, ఏదో ఒక రోజు మానవులను చంద్రునిపైకి తీసుకెళ్లాలనే కార్యక్రమంలో భాగంగానే రూపొందించారు.
ఇవి కూడా చదవండి:
- త్రిపుర: ఈ రాష్ట్రంలో మత ఘర్షణల వెనుక అసలు నిజాలేంటి - బీబీసీ పరిశోధన
- అద్భుతం: చికిత్స లేకుండానే హెచ్ఐవీ వైరస్‌ను తరిమేసిన మహిళ శరీరం
- ఆంధ్రప్రదేశ్: శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరించుకున్న జగన్ ప్రభుత్వం
- ఒత్తిడి తట్టుకోవడానికి గంజాయిని ఆశ్రయిస్తున్న అమ్మలు, ఇది ఆరోగ్యానికి ప్రమాదం కాదా
- మంటల్లో చిక్కుకున్న బస్సు, 45 మంది మృతి
- వైఎస్ జగన్: ‘అమరావతి ప్రాంతం అంటే నాకు వ్యతిరేకత లేదు.. నా ఇల్లూ ఇక్కడే ఉంది’
- 44 ఏళ్ల వయసులో ఐఐఎంలో రెండు బంగారు పతకాలు సాధించిన విశాఖ గృహిణి
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
- ‘ఆన్లైన్ చదువులకు లక్షల్లో ఫీజులు కట్టాం... ఏమీ అర్థం కాలేదని చెబితే ఏమంటారో’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












