రహస్యం: చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి

ఫొటో సోర్స్, Getty Images
2016లోశాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉన్న ఒక గ్రహశకలాన్ని కనిపెట్టారు. కామో' ఓవాలెవా అనే ఈ గ్రహశకలం పుట్టుక రహస్యం ఛేదించేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు.
ఇది భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఉందన్న విషయం తప్ప ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇతర వివరాలేమీ తెలియవు.
అయితే, ఇటీవల జరిగిన ఒక పరిశోధన దీని పుట్టుక గురించి కొన్ని ఆధారాలను తెలియజేస్తోంది. ఇది చంద్రుని నుంచి ఊడిపడిన భాగం కావచ్చని అంటున్నారు.
"ఇది సాధారణ గ్రహ శకలం అయితే కాదు.. మేం ఊహించినట్లుగా కనిపించడం లేదు" అని అరిజోనా యూనివర్సిటీలో ఖగోళ శాస్త్రజ్ఞుడు బెంజమిన్ షార్కీ అన్నారు. ఆయన అధ్యయనం నేచర్ పత్రికలో ప్రచురితమయింది.
"చంద్రుడు, ఉల్క ఢీకొనడం వల్ల చంద్రుని నుంచి ఈ భాగం విడిపోయి ఉంటుందని, బెంజమిన్ సహ అధ్యయనకర్త వుయాన్ శాంచెజ్ అన్నారు. ఇది చంద్రుని ఉపరితలం నుంచి విడిపోయి రాలి ఉండవచ్చు."
అయితే, కామో' ఓవాలెవా స్వభావం గురించి తెలుసుకోవాలంటే మాత్రం శాంపిళ్ళను సేకరించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ దశాబ్దంలో ఎప్పుడైనా అది జరగవచ్చు. శాంచెజ్ చెబుతున్న సిద్ధాంతం నిజమే కావచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కానీ, కామో' ఓవాలెవా ఎలా ఉంటుంది?

ఫొటో సోర్స్, NASA/JPL-Caltech
పాక్షిక ఉపగ్రహం
కామో' ఓవాలెవా ను 2016లో మొదటిసారి హవాయిలో ఉన్న పాన్ స్టార్స్1 టెలీస్కోప్ సహాయంతో కనిపెట్టారు. దీనిని గతంలో 2016 హెచ్ ఓ3 అని పిలిచేవారు. దీనికి శాస్త్రవేత్తలు హవాయియన్ అనే పేరు పెట్టారు.
ఇది సుమారు 40 మీటర్ల పొడవు ఉంటుంది. దీనిని చంద్రుడు అనడం కంటే, పాక్షిక ఉపగ్రహంగా పరిగణించవచ్చు.
"భూమికున్న పాక్షిక ఉపగ్రహం భూమితో పాటూ సహ కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. ఇది సూర్యుని చుట్టూ తిరుగుతూ భూమికి దగ్గరగా ఉంటుంది" అని శాంచెజ్ వివరించారు.
చంద్రుడు భూమి చుట్టూ తిరిగితే, కామో' ఓవాలెవా సూర్యుని చుట్టూ సమాంతర మార్గంలో తిరుగుతుంది. ఒకవేళ భూమి అంతమైపోయినా ఈ రాయి మాత్రం ప్రస్తుతం ఉన్న కక్ష్యలో తిరుగుతూనే ఉంటుంది.
శాస్త్రవేత్తలు ఇప్పటి వరకూ 8 పాక్షిక ఉపగ్రహాలను కనిపెట్టారు. వీటిలో కామో' ఓవాలెవా మాత్రం అధ్యయనానికి అనువుగా ఉంది.
"మిగిలిన పాక్షిక ఉపగ్రహాల కంటే దీనిని అధ్యయనం చేయడం సులభం. సంవత్సరానికొక్కసారి ఏప్రిల్ నెలలో ఈ శకలం కాంతివంతంగా తయారవుతుంది. ఆ సమయంలో భూమి నుంచి టెలిస్కోప్ ద్వారా దానిని గమనించవచ్చు" అని శాంచెజ్ చెప్పారు.
మిగిలిన ఉపగ్రహాలు కనిపించవు. దాంతో, వాటిని విశ్లేషించడం సాధ్యం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక ప్రత్యేకమైన శిల
ఈ గ్రహ శకలాన్ని గమనించినప్పుడు, ఇది ఒక అసాధారణమైన ఎర్రని రంగులో ఉందని ఖగోళ శాస్త్రజ్ఞులు అంటున్నారు.
దీనిని బట్టి, అందులో లోహ ఖనిజాలున్నాయని తెలుస్తోంది.
"ఈ శకలం తయారైన విధానాన్ని తెలుసుకునేందుకు ఉపరితలం పై సూర్యరశ్మి ఎలా ప్రతిఫలిస్తుందో అధ్యయనం చేశారు. ఈ శకలం సిలికేట్ ఖనిజాలతో రూపొందిందని కనుగొన్నాం. అని శాంచెజ్ చెప్పారు.
"అయితే, ఇది చంద్రుని పోలికలకు దగ్గరగా ఉండటం మా దృష్టిని ఆకర్షించింది. భూమికి దగ్గరగా ఉన్న ఇతర గ్రహ శకలాలపై నిర్వహించిన అధ్యయనాల కంటే భిన్నంగా కనిపించింది" అని చెప్పారు.
1970లలో అపోలో మిషన్లు చంద్రమండలం నుంచి తీసుకొచ్చిన నమూనాతో దీనికి కొంత పోలికలున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
"ఇది మా దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి ప్రయత్నాన్ని చేయడం ఇదే మొదటిసారి. ఇది భూమి పాక్షిక ఉపగ్రహం సూర్యుని చుట్టూ తిరగడం వల్ల చంద్రుని నుంచి పుట్టి ఉంటుందనే అనుమానాన్ని కలుగచేసింది" అని శాంచెజ్ వివరించారు.
భూమికి దగ్గరగా ఉన్న కొన్ని ఇతర శకలాల నుంచి కూడా కామో' ఓవాలెవా పుట్టి ఉండవచ్చని మరికొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. దీనికి, భూమితోనూ, చంద్రునితోనూ ఎటువంటి సంబంధం ఉండి ఉండకపోవచ్చని అంటున్నాయి.

ఫొటో సోర్స్, Tony873004
కానీ, ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఇప్పటి వరకు లభించిన సమాచారం వారు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని సమర్ధిస్తోందని అంటున్నారు.
"ఇది మేం కచ్చితంగా చెప్పలేం. అలా అని, అది భూమికి సమీపంలోని గ్రహ శకలాల నుంచి పుట్టి ఉండొచ్చనే సిద్ధాంతాన్నీ తీసిపారేయలేం. దీని గురించి కచ్చితంగా చెప్పాలంటే మాత్రం వాటి నమూనాలను సేకరించడం తప్పనిసరి" అని శాంచెజ్ చెప్పారు.
వాటిని సేకరించడం పెద్ద కష్టమైన పని కాకపోవచ్చు.
చైనా ప్రణాళికలు ముందుకు సాగితే, బీజింగ్ ఈ దశాబ్ధంలో కామో' ఓవాలెవా దగ్గరకు ప్రయాణించే రోబోటిక్ మిషన్‌ను లాంచ్ చేస్తుంది. దాంతో, నమూనాలను తేవచ్చు.
వాటిని పరిశీలించిన తర్వాతే, కామో' ఓవాలెవా చంద్రునిలో భాగమో కాదో తేలుతుంది.
ఇవి కూడా చదవండి:
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- జపాన్ దీవుల్లోని కొండకోనల్లో దాగిన ప్రాచీన ఆలయాల విశేషాలు...
- పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
- జమ్మూ: క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, ఇది ఎందుకు అంత ప్రమాదకరం?
- జపాన్: సముద్ర గర్భంలో అంతుచిక్కని ‘ప్రాచీన నగరం’
- ఆల్ఫ్స్ పర్వతాల్లో మంచు వింతగా ఎరుపు రంగులో ఎందుకుంది
- అమెరికాలో 15 రాష్ట్రాలను వణికిస్తున్న చేప
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- భారీ తిమింగలాలతో పాటు ఎన్నో సముద్ర జీవులను చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం
- సుమత్రా: జీవవైవిధ్యం పరిరక్షణ కోసం ఒక యువతి ఒంటరి పోరాటం
- అనంతపురం విషపు సాలీడు ఎందుకు అంతరించిపోతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










