ప్రాయియా సెంట్రల్: సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...

ఫొటో సోర్స్, Courtesy of Cassio Wollmann
బాలెనారియో కాంబోరియును బ్రెజిలియన్ దుబాయ్ అని పిలుస్తారు.
బ్రెజిల్ దక్షిణ భాగంలోని ఈ నగరంలో సుమారు ఒకటిన్నర లక్షల మంది నివసిస్తున్నారు.
ఈ నగరానికి ఒక ఆశ్చర్యకరమైన రికార్డు ఉంది.
సావో పాలో, రియో డి జెనీరో వంటి మెగా నగరాల పరిమాణంతో పోలిస్తే అతి చిన్న నగరం బాలెనారియో కాంబోరియు. అయినాకానీ.. దక్షిణ అమెరికా ఖండంలోని టాప్ టెన్ అతి ఎత్తైన నివాస భవనాల్లో ఆరు భవనాలు ఈ నగరంలోనే ఉన్నాయని కౌన్సిల్ ఆఫ్ టాల్ బిల్డింగ్స్ అండ్ అర్బన్ హాబిటేట్ సమాచారం చెప్తోంది. కానీ ఈ ఖ్యాతితో పాటు ఒక చీకటి కోణం కూడా ఉంది.
ఈ అత్యంత పొడవైన భవనాలు ఎక్కువ భాగం ప్రఖ్యాత బీచ్ ప్రాయియా సెంట్రల్ వెంటే ఉన్నాయి.
ఈ భవనాలు ఎంత ఎత్తుగా, ఎంత దగ్గరగా ఉన్నాయంటే.. ఈ బీచ్ సూర్యుడ్ని కోల్పోయింది.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
‘‘మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఈ ఆకాశహర్మ్యాలు సూర్యుడ్ని అడ్డుకుంటాయి. బీచ్ మొత్తం నీడలో మునిగిపోతుంది’’ అని స్థానిక నివాసి సబ్రినా సిల్వా బీబీసీతో చెప్పారు.
సిల్వా ఇదే నగరంలో పుట్టి పెరిగారు. ప్రాయియా సెంట్రల్ బీచ్‌లో తాను సేదతీరి పదిహేనేళ్లు దాటిపోయిందని ఆమె తెలిపారు.
ఆకాశహర్మ్యాల నీడ వల్ల ఆ బీచ్‌లో చలి, చీకటి బాగా పెరిగాయని చెప్పారు.
ఆ భవనాల నీడలు ఈ బీచ్‌ను ఎలా కబళిస్తున్నాయో వివరించే ఫొటోలు, టైమ్ ల్యాప్స్ వీడియోలు సోషల్ మీడియాలో లెక్కకు మిక్కిలిగా పోస్టయ్యాయి.
‘‘ఈ భవనాల మధ్య సన్నని సందుల నుంచి వచ్చే సూర్యుడి వెలుతురులో జనం ఇరుకుగా చేరి సన్‌బాత్ చేయాల్సి రావటం మరింత దారుణం. అప్పుడు పరిస్థితి నరకప్రాయంగా ఉంటుంది. అందుకే నేనసలు అక్కడికి వెళ్లను’’ అని సిల్వా వివరించారు.

ఫొటో సోర్స్, Cleiton Marcos de Oliveira
ఇంకా తగ్గని ప్రజాదరణ...
పరిస్థితి ఇలావున్నా కూడా ప్రాయియా సెంట్రల్ ఇంకా అత్యంత ప్రజాదరణ గల బీచ్‌గానే కొనసాగుతోంది.
కోవిడ్-19 కాలంలో కూడా ఎండ ఉన్న రోజుల్లో బీచ్ అభిమానులు ఆంక్షలను ధిక్కరించి మరీ రావడంతో ఈ బీచ్ రద్దీగానే ఉంది.
ప్రాయియా సెంట్రల్ బీచ్ అనేది ఇప్పుడు కేవలం ఒక పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదని.. మెరుపులీనే ఈ ఎత్తైన భవనాల వల్ల అంతకన్నా కాస్త ఎక్కువగానే మారిందని సిల్వా వంటి స్థానికులు చెప్తున్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
చరిత్రకారుడు ఇసాకాబార్బా వంటి వారు.. లేని సమస్య గురించి ఎక్కువగా ఆందోళన వ్యక్తమవుతోందని అంటారు.
‘‘కాలం మారింది. చాలా మంది ఎండలో మాడటానికి ఇష్టపడరు. ఎందుకంటే అది ఆరోగ్యానికి హానికరం కావచ్చు. బీచ్‌లో నీడ వల్ల జనం బకెట్ల కొద్దీ చమటలు కక్కకుండా తేలికగా వ్యాయామం చేయచ్చు’’ అని బీబీసీతో వ్యాఖ్యానించారు బార్బా.
‘‘ఈ ఆకాశహర్మ్యాలు నిజంగా సమస్య అయినట్లయితే.. జనం ఎందుకు వస్తారు? ప్రాయియా సెంట్రల్ బీచ్ ఇప్పుడు ఉన్న విధంగానే వారికి హాయిగా ఉందేమో’’ అన్నారాయన.

ఫొటో సోర్స్, Cleiton Marcos de Oliveira
పర్యాటక ఆకర్షణ...
బాలెనారియో కాంబోరియు నిజంగా ఇప్పటికీ చాలా ప్రజాదరణ గల పర్యాటక కేంద్రం.
2019లో దాదాపు పది లక్షల మంది ఈ నగరాన్ని సందర్శించారని పర్యాటక అధికారులు చెప్తున్నారు. మొత్తం బ్రెజిల్‌లో అత్యధికంగా పర్యాటకులు వచ్చిన ప్రాంతాల్లో ఇదొకటిగా నిలిచింది.
ఈ నగరం.. సంపన్నులకు, ప్రముఖులకు ప్రీతిపాత్రమైన క్రీడామైదానం కూడా: ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమర్ ఈ ఏడాది ఆరంభంలో ఈ నగరంలోని ఒక కొత్త లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో 57 లక్షల డాలర్లతో ఒక పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు.
నగరంలోని బార్లు, రెస్టారెంట్లు, నైట్‌క్లబ్‌లతో కూడిన విస్తారమైన వినోద రంగం కూడా దేశీయంగా, అంతర్జాతీయంగా సందర్శకులను ఆకర్షిస్తోంది.
ప్రాయియా సెంట్రల్‌లో లండన్ ఐ తరహా జెయింట్ వీల్ కూడా ఉంది. ఈ ఖండం మీద అతి ఎత్తైన జెయింట్ వీల్స్ లో ఇదొకటి.
అంతేకాదు.. రియో డి జెనీరో వంటి ప్రముఖ సముద్ర తీర నగరాలతో పోలిస్తే బాలెనారియో కాంబోరియు చాలా సురక్షితమైనది కూడా.
బ్రెజిల్‌లో నివసించటానికి ఉత్తమ ప్రాంతాల జాబితాలో ఈ నగరం నాలుగో స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇసుక పోషణ...
ప్రాయియా సెంట్రల్ బీచ్ ఇసుక తీరాన్ని విస్తరించటానికి 2001లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 71 శాతం మంది మద్దతు తెలిపారు.
ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత.. బీచ్ 25 మీటర్ల నిడివిని దాదాపు రెట్టింపు చేయటానికి ‘ఇసుక పోషణ’ ఆపరేషన్ చేపట్టనున్నట్లు మేయర్ ఫాబ్రీసియో ఒలివీరా గత క్రిస్మస్ ముందు ప్రకటించారు.
‘‘ఈ ఆపరేషన్ చేపడుతోంది ఆకాశహర్మ్యాల నీడల కారణంగా కాదు. కానీ.. బీచ్ మరింత వెడల్పుగా ఉంటే సూర్యకాంతి ఇంకా ఎక్కువగా వస్తుందనేది నిజం’’ అని ఒలివీరా బీబీసీతో పేర్కొన్నారు.
అయితే.. బీచ్‌ను పరిపుష్టం చేయటం వల్ల చివరికి మరిన్ని ఆకాశహర్మ్యాలు వెలుస్తాయని విమర్శకులు అంటున్నారు. నిజానికి బీచ్‌ను విస్తరించే ప్రణాళికలను కూడా ఆమోదించటానికి ముందే.. ఇప్పటికే రెండు కొత్త ఆకాశహర్మ్యాల నిర్మాణం కూడా మొదలైంది. ఇవి రెండూ 2024 నాటికి పూర్తవుతాయి.
అయితే ఈ భయాలు నిరాధారమంటారు నగర మేయర్.
‘‘ప్రాయియా సెంట్రల్ అనేది మా నగరానికి గుండె. దీనిని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని మేం కోరుకుంటున్నాం. వేరే బీచ్‌లలో పర్యావరణ కారణాల రీత్యా నిర్మాణాలకు అనుమతి లేదు. పర్యావరణం విషయంలో మేం రాజీపడేది లేదు’’ అని ఆయన వాదిస్తున్నారు.
‘‘ఏదేమైనా ‘బ్రెజిలియన్ దుబాయ్’గా ఉండటం వ్యాపారానికి మంచిది. ఈ ఆకాశహర్మ్యాలు మా నగరానికి అంతర్జాతీయంగా కూడా ఖ్యాతిని ఆర్జించాయి’’ అని చెప్పారాయన.

ఫొటో సోర్స్, Cleiton Marcos de Oliveira
ఆకాశాన్ని తాకుతూ...
అయితే.. బాలెనారియో కాంబోరియులో నిర్మాణ పరిశ్రమ వృద్ధి చెందటానికి ప్రధాన కారణం నిట్టనిలువుగా నిర్మాణాలు చేపట్టటం.
ఈ నగరం గత నాలుగు దశాబ్దాలుగా సెలవుల విడిదిగా ప్రజాదరణ పొందటం వల్ల రియల్ ఎస్టేట్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగింది.
నిర్మాణాలు చేపట్టడానికి అందుబాటులో ఉన్న నేల తక్కువగా ఉండటంతో పాటు.. భవనాల ఎత్తు మీద ఆంక్షలు విధించని స్థానిక చట్టం వల్ల.. నిర్మాణ సంస్థలు అంతకంతకూ ఎత్తైన భవనాలు నిర్మించటం మొదలుపెట్టాయి.
ఉదాహరణ అంటారా? 2013లో విల్లా సెరెనా ట్విన్ టవర్స్ - రెండూ 159 మీటర్ల ఎత్తు గల 49 అంతస్తుల భవనాలు – బ్రెజిల్‌లో అత్యంత పొడవైన జంట నివాస భవనాలుగా నిలిచాయి.
కానీ 2020 చివరి నాటికి దేశంలోని టాప్ టెన్ ఆకాశహర్మ్యాల్లో ఆరు భవనాలు ఈ నగరం నుంచే ఉన్నా కూడా.. అందులో ఈ ట్విన్ టవర్స్‌కి చోటు లేకుండాపోయింది.

ఫొటో సోర్స్, Courtesy of Isaque Borba
నీడల వేట...
ఈ నిట్టనిలువు అభివృద్ధి విషయంలో ఇతర ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాలెనారియో కాంబోరియులో పెరుగుతున్న జనాభా సాంద్రత రీత్యా 2028 నాటికి తీవ్ర నీటి కొరత తలెత్తుతుందని పర్యావరణ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్కస్ పొలెట్ ఒక అధ్యయనంలో హెచ్చరించారు.
రాబోయే ఈ సమస్యను పరిష్కరించటం కోసం ఒక రిజర్వాయరు నిర్మాణానికి తాము ప్రణాళికలను సమర్పించామని మేయర్ ఒలివీరా చెప్తున్నారు. అయితే దీనికి పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈలోగా సమస్యలు పెరిగిపోతున్నాయి.
‘‘నగర జనాభా ఏటా దాదాపు మూడు శాతం చొప్పున పెరుగుతోంది. ప్రాయియా సెంట్రల్ పునరభివృద్ధితో అది మరింత ఆకర్షణీయంగా మారితే పరిస్థితి ఇంకా విషమిస్తుంది’’ అంటారు ప్రొఫెసర్ పొలెట్.
ఇటీవలి సంవత్సరాల్లో, ముఖ్యంగా వేసవి సెలవుల్లో నీటి సరఫరా సంక్షోభాలు తలెత్తాయి.
‘‘ఈ కాలంలో పర్యాటకులు, సెలవులకు వచ్చే వారితో స్థానిక జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడు ఎనిమిది లక్షల మందిని దాటిపోతుంది’’ అని పొలెట్ చెప్పారు.
‘‘ఈ సమస్యతో పోలిస్తే ప్రాయియా సెంట్రల్‌లో ఆకాశహర్మ్యాల నీడ అనేది కేవలం ఒక కళాత్మక సమస్య మాత్రమే’’ అని ఆయన అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Handout/Emaed
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా క్రికెటర్లు స్లెడ్జింగ్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- సిరాజ్‌పై మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు.. హైదరాబాద్ క్రికెటర్‌పై ఆస్ట్రేలియాలో విద్వేషం కక్కిన ప్రేక్షకులు
- ‘అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- జస్ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరుస్తున్న బౌలింగ్ సంచలనం
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- ‘ఎవరికీ ద్రోహం చేయలేను... అందుకే ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నా’
- మాంసం ‘హలాల్’: ఒక మతం నిబంధనలను ఇతర మతాలపై రుద్దుతున్నారా?
- మిల్లీమీటరు పురుగు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడింది
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- దేశ విభజన సమయంలో కరాచీలో హిందువులను, సిక్కులను ఎలా ఊచకోత కోశారు.. ఆస్తులను ఎలా లూటీ చేశారు
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








