జస్‌ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరుస్తున్న బౌలింగ్ సంచలనం

జస్‌ప్రీత్ బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జెఫ్ లెమన్
    • హోదా, ఆస్ట్రేలియా క్రికెట్ కామెంటేటర్, జర్నలిస్ట్

ఇండియా క్రికెటర్ జస్‌ప్రీత్ బూమ్రా బౌలింగ్ మొదటిసారి చూస్తున్న వారెవ్వరూ చూపు తిప్పుకోలేరు.

బూమ్రా బంతిని వెయ్యడమే తమాషాగా వేస్తాడు. వెన్ను నిటారుగా నిలబెట్టి మోకాళ్లు కాస్త వంచుతూ, మోచేతులు బయటకి పొడుచుకు వచ్చేలా అర చేతుల్లో బంతిని పట్టుకుని...మంచి దేశవాళీ గుర్రం చిన్న కంచె దూకి వస్తున్నట్లు ఉంటుంది.

కుడి చేతి వాటం బౌలర్లు సాధారణంగా ముందు ఎడం చేతిని కాస్త పైకి లేపి ఊతం కోసం కిందకు తీసుకొస్తారు. కానీ బూమ్రా పరిగెత్తుకుంటూ వచ్చి అంపైర్‌కి దగ్గరవుతూ ఉండగా కుడి చేతినే పైకి లేపి దాన్నుంచే ఊతం తీసుకుని బంతి వేస్తాడు. తరువాత ఎడమ చేయి కూడా కొంచం పైకి లేపి..రెండు చేతులు కిందకు దింపేస్తాడు.

బంతి క్షణాల్లో మెరుపు వేగంతో బ్యాటును చేరుకుంటుంది. బూమ్రా గంటకు 90 మైళ్ల (144 కిమీ) వేగంతో బంతి విసురుతాడు.

ఒక్కోసారి యార్కర్, ఒక్కోసారి రివర్స్ స్వింగ్ వేస్తాడు. మరోసారి కుడివైపు బ్యాటుకు దగ్గరగా పడినట్టే పడి బంతి మరోవైపు మరలిపోతుంది (సీమ్ బౌలింగ్).

బూమ్రా బంతి వేస్తున్నప్పుడు చాలా తక్కువ దూరం పరిగెత్తి వేగంగా బంతి విసురుతాడు. రోజంతా ఆడినా అలిసిపోడు.

"అతను ఫిరంగిలాగ దూసుకొస్తాడు. తక్కువ దూరం పరిగెత్తి మెల్లిగా వస్తాడు. అతను వస్తున్నాడన్న సంగతి మనం గమనించేలోపే చెయ్యి పైకెత్తి ఫిరంగిలాగ బంతి వదులుతాడు" అంటూ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ బెన్ కటింగ్ బూమ్రా బౌలింగ్‌ను అభివర్ణించారు.

కటింగ్, బూమ్రాతో కలిసి ఐపీఎల్‌లో ముంబై జట్టుకు మూడు సీజన్లు ఆడాడు.

"శిక్షణలో భాగంగా పలుమార్లు బూమ్రా బంతిని ఎదుర్కొన్నాను. వాంఖడే స్టేడియంలో మంచు పడి బంతి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు..బూమ్రా బౌన్సర్ వేస్తే నా పక్కటెముకలకు తగులుతుంది, నేను కొట్టలేకపోవచ్చు. అందుకే కొన్నిసార్లు ఆఫ్ సైడ్ స్టంప్స్‌కు కాస్త వెలుపల నిల్చునేవాడిని. అలా నిల్చుంటే బూమ్రా యార్కర్ వేస్తాడు" అని కటింగ్ చెప్పాడు.

బూమ్రా స్టార్ బౌలర్‌గా రాణించడానికి ఇవన్నీ కారణాలు.

బుమ్రా బౌలింగ్ శైలి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బుమ్రా బౌలింగ్ యాక్షన్

బూమ్రా చూడ్డానికి కూడా చక్కగా ఉంటాడు. స్టైలిష్‌గా ఉండే గడ్డం, అందమైన నవ్వు, మందపాటి కళ్లద్దాలు, శరీరానికి అతుక్కున్నట్లు ఉండే జీన్స్...సాధారణ క్రికెటర్ల ఫ్యాషన్ కన్నా మెరుగ్గా ఉంటుంది అతని స్టైల్.

గ్రౌండ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. సాధారణ మధ్య తరగతి కుటుంబంనుంచి వచ్చిన బూమ్రా గల్లీ క్రికెట్ ఆడుతూ, కృషితో ఐపీఎల్‌లోకి వచ్చి..తరువాత భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి మన్నికైన, అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌గా ఎదిగాడు.

"నాకు ఈ బౌలింగ్ యాక్షన్ ఎలా వచ్చిందో కచ్చితంగా చెప్పలేను. చిన్నప్పుడు టీవీలో క్రికెట్ చూస్తూ బౌలర్ల యాక్షన్లు కాపీ చేసేవాడిని. అన్నీ కలగాపులగమైపోయి ఈ యాక్షన్ నాకు వచ్చిందనుకుంటా. బంతి వేసేముందు తక్కువ పరిగెడతాను ఎందుకంటే నేను ఎక్కువగా టెన్నిస్ బంతితో ప్రాక్టీస్ చేసేవాడిని. మా ఇంటి వెనకాల చిన్న జాగా ఉండేది. అక్కడే నేను క్రికెట్ ఆడేవాడిని. ఆ చిన్న జాగాలో ఎక్కువ పరిగెత్తేంత స్థలం ఉండేది కాదు. అలా బంతి వేసే ముందు తక్కువ పరిగెత్తడం అలవాటైంది" అని 2018లో ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా బూమ్రా చెప్పాడు.

బూమ్రా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచీ వచ్చాడు. చిన్నతనంలో వాళ్ల ఇంటి అపార్మెంట్ వెనక ఉన్న కార్ పార్కింగ్ స్థలంలో క్రికెట్ ఆడుతూ ఉండేవాడు.

భారతదేశం తరపున ఆడిన గుజరాతీ క్రికెటర్ల సంఖ్య తక్కువే. ఆ రకంగా బూమ్రాకు జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగేందుకు దారి కఠినతరమైంది.

బూమ్రాకు ఐదు ఏళ్లు ఉన్నప్పుడు తండ్రి చనిపోయారు. తన తల్లి స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు.

బూమ్రాకు చిన్నప్పటినుంచీ క్రికెట్ పిచ్చి ఉండేది. స్కూల్లో క్రికెట్ ఆడేవాడు. స్కూల్ టీంనుంచీ రాష్ట్ర స్థాయికి వచ్చి..2013లో ఐపీఎల్‌లోకి వచ్చాడు.

"నాకు బూమ్రా నేపథ్యం, పరిస్థితుల గురించి బాగానే తెలుసు. ఎందుకంటే తను చాలా నెమ్మదస్తుడు, ఎంతో వినయంగా ఉంటాడు. తనతో ఏమైనా మాట్లాడొచ్చు" అని కటింగ్ చెప్పాడు.

"బూమ్రా ఎంత మంచి యార్కర్ వేస్తాడంటే..చిన్నప్పుడు ఇంట్లో వాళ్ల అమ్మ నిద్రపోతున్నప్పుడు హాల్‌లో క్రికెట్ ఆడుతుండేవాడు. శబ్దానికి ఆమెకు మెలకువ రాకుండా ఉండేలా బంతిని పూర్తిగా నియంత్రిస్తూ, బ్యాటుకు కొంచెం ముందుగా పడేట్లు యార్కర్లు వేసేవాడు" అని కటింగ్ వివరించాడు.

అలా ప్రాక్టీస్ చేస్తూ, పట్టుదలతో, కృషితో బూమ్రా ఈరోజు అత్యుత్తమ బౌలర్‌గా ఎదిగాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లో భాగంగా మెల్బోర్న్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో బూమ్రా మొదటి ఇన్నింగ్‌లో నాలుగు వికెట్లు, మొత్తం మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసి ఇండియాకు విజయాన్ని సాధించి పెట్టాడు.

సరిగ్గా రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా ఆడిన మ్యాచ్‌లో కూడా ఫస్ట్ ఇన్నింగ్‌లో ఆరు వికెట్లు, మొత్తం మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసి భారత్‌కు ఆధిక్యాన్ని తెచ్చి పెట్టి సీరీస్ గెలిచేందుకు బాటలు వేశాడు.

2016లో బుమ్రా బంతికి గాల్లోకి ఎగిరిన డేవిడ్ వార్నర్ బ్యాట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2016లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే డేవిడ్ వార్నర్ బ్యాట్‌ను గాల్లోకి ఎగరగొట్టిన బుమ్రా బంతి

అంతకు రెండేళ్ల ముందు 2016లో ఆస్ట్రేలియాలోనే బూమ్రా వన్ డే క్రికెట్ డెబ్యూ ఆడాడు.

ఆ సిరీస్‌లో బూమ్రా మొదట నాలుగు మ్యాచుల్లోనూ సరిగ్గా ఆడలేకపోయాడు. కానీ ఐదవ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 330 పరుగులు చేసింది. బూమ్రా 10 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి చాలా ముఖ్యమైన స్టీవ్ స్మిత్, జేమ్స్ ఫాక్నర్ వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా భారీ స్కోరు చెయ్యకుండా అడ్డుకున్నాడు. తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా మెరుగ్గా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిచింది.

మూడు రోజుల తరువాత అడిలైడ్‌లో బూమ్రా టీ20 అరంగేట్రం చేశాడు. అందులో కూడా మూడు వికెట్లు తీసి 23 పరుగులిచ్చి ఇండియా విజయానికి తోడ్పడ్డాడు. ఇండియా 3-0 తో సీరీస్ గెలిచింది. అప్పటినుంచీ బూమ్రా వెనక్కి తిరిగి చూడలేదు.

అప్పడు అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీలలో అతని బౌలింగ్ చూశాక...బాగా వేస్తున్నాడుగానీ తొందరగానే ఆటనుంచీ నిష్క్రమిస్తాడు, ఒక ఐపీఎల్ సంచలనం అంతే..అని అనిపించక మానదు.

ఇలాంటివాళ్లు అనేకమంది వచ్చారు. వచ్చినంత వేగంగా వెనక్కి వెళిపోయారు. ఫాస్ట్ స్పిన్నర్ అనీ, స్లో క్విక్ అనీ, క్యారం-ఫ్లికర్, నకల్-బాలర్, స్లింగ్‌షాట్, టాంగిల్-ఫూటెడ్..ఇలా ఎంతోమంది సంచలనాత్మకంగా వచ్చి, అంతే వేగంగా నిష్క్రమించారు.

కానీ బూమ్రా అలా కాదు. తన బంతి వేగం ఒక్కటే కొలత కాదు. ఏళ్ల తరబడి స్థిరంగా ఆడుతూ, జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టే విధంగా పొదుపుగా బౌలింగ్ చేస్తూ నిలదొక్కుకున్నాడు.

నిలకడ, కచ్చితత్వం తన సొత్తు. ఎక్కడా తడబాటు లేకుండా ఐపీఎల్‌నుంచీ నేరుగా అంతర్జాతీయ క్రికెట్‌కు వచ్చి రాణిస్తున్న అరుదైన క్రికెటర్లలో బూమ్రా ఒకడు. లిమిటెడ్ ఓవర్ మ్యాచ్‌లనుంచీ, టెస్ట్ క్రికెట్ దాకా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.

2018లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సీరీస్‌లో మూడో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ఇండియా విజయానికి కారకుడయ్యాడు. తరువాత నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో టెస్ట్‌లో మరో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌లతో ఆడిన సీరీస్‌లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అగ్రస్థానంలో నిలబడ్డాడు.

ఏడు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి ఆంటిగ్వాలో బూమ్రా కనబర్చిన ప్రతిభను విజ్డెన్ మ్యాగజీన్ కొనియాడుతూ ‘2019లో అత్యుత్తమ ప్రదర్శనగా’ పేర్కొంది. తరువాత జమైకాలో 6-27 స్కోరుతో అదే ప్రతిభను కొనసాగించాడు.

బుమ్రా

ఫొటో సోర్స్, Reuters

అయితే, బూమ్రా గ్రౌండ్‌లో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడనుకుంటే పొరపాటే. తనకు తాను చాలా అధికస్థాయిలో ప్రమాణాలు పెట్టుకుంటాడు. వాటిని అందుకోలేకపోతే తనకి కోపం వస్తుంది..కాలితో బలంగా నేలను తంతాడు లేదా తనని తాను తిట్టుకుంటాడు. అయితే ఆ కోపం ఎక్కువసేపు నిలవదు. తొందరగానే తన పెదవులపైకి చిరునవ్వు వచ్చేస్తుంది.

"తను ఒక ఫాస్ట్ బౌలర్ అంటే నమ్మలేం..అంత స్నేహపూర్వకంగా ఉంటాడు" అని కటింగ్ తెలిపాడు. అయితే, బౌలింగ్ చేసేటప్పుడు మాత్రం వికెట్ తీయడం, పొదుపుగా పరుగులు ఇవ్వడం మాత్రమే ధ్యేయంగా ఉంటాడు.

బూమ్రా తక్కువ కాలంలోనే ఉత్తమ బౌలర్‌గా ఎదిగాడు. ఎనిమిదేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ మూడేళ్ల క్రితమే టెస్ట్ క్రికెట్‌లోకి వచ్చాడు. ఇప్పటివరకూ 16 టెస్టులు ఆడాడు. అయితే, ఇంతవరకూ ఇండియాలో ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లో బూమ్రా లీడ్ బౌలర్ మాత్రమే కాదు, చివరి వరకూ నిలబడగలిగే సత్తా ఉన్న ఆటగాడు కూడా.

ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ ముందే గాయాలబారిన పడ్డారు. అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో మొహమ్మద్ షమీ భుజానికి గాయమైంది. మెల్బోర్న్‌లో ఉమేష్ యాదవ్ కాలికి గాయమైంది.

2018-19లో భారత్‌ను విజయపథంలోకి నడిపించిన ఫాస్ట్-బౌలింగ్ బృందం 2020-21లో కనిపించకుండా పోయింది.

ఇప్పటినుంచీ భారం అంతా బూమ్రా భుజాల మీదే ఉంది. జట్టులో మరి కొందరు మంచి బౌలర్లు ఉన్నప్పటికీ ఇండియాకు గెలుపు సాధించి పెట్టే ప్రధాన బాధ్యత బూమ్రా భుజాలపైనే ఉంది.

ఈ సీరీస్‌లో ఒక మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది, ఒక మ్యాచ్ ఇండియా గెలిచింది. ప్రస్తుతం మూడో టెస్ట్ జరుగుతోంది.

కానీ ఏం ఫరవాలేదు. బాధ్యతలు భుజాన వేసుకోడానికి, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి జస్‌ప్రీత్ బూమ్రా ఎప్పుడూ వెనుకాడడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)