ఇండోనేసియా: ‘శ్రీవిజయ ఎయిర్ విమానం బ్లాక్‌బాక్స్‌లు గుర్తించాం’

విమాన శకలాలు

ఫొటో సోర్స్, EPA

సముద్రంలో కూలిపోయిన బోయింగ్ 737 విమానం బ్లాక్ బాక్స్‌‌లను తాము గుర్తించామని ఇండోనేసియా అధికారులు తెలిపారు.

విమానం కూలిన ప్రాంతంలో సముద్రంలో నావికాదళానికి చెందినవారు, ఇతర సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రెండు ఫ్లైట్ రికార్డర్లును కూడా వెలికితీయనున్నట్లు చెప్పారు.

శనివారం 62 మందితో ప్రయాణిస్తున్న శ్రీవిజయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం జకార్తా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలింది.

సముద్రంలో విమాన శకలాలు

ఫొటో సోర్స్, Reuters

విమానం కూలిన ప్రాంతానికి పది బోట్లలో గజ ఈతగాళ్లను పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానం భాగాలుగా భావిస్తున్న శిథిలాలను విశ్లేషిస్తున్నారు.

గాలింపు చర్యల బృందం రెండు బ్యాగులను తీసుకొచ్చిందని జకార్తా పోలీసుల అధికార ప్రతినిధి యుశ్రీ యూనస్ తెలిపారు.

బ్లాక్ బాక్స్

ఫొటో సోర్స్, EPA

''మొదటి బ్యాగులో ప్రయాణికుల వస్తువులు ఉన్నాయి. రెండో బ్యాగులో ప్రయాణికుల శరీర భాగాలు ఉన్నాయి. ఈ భాగాలు ఎవరివో గుర్తించే పరిశోధన జరుగుతోంది''అని ఆయన వివరించారు.

శనివారం రాత్రి కావడంతో నిలిపివేసిన గాలింపు చర్యలను ఆదివారం తెల్లవారుజామునే మళ్లీ ప్రారంభించారు. నాలుగు విమానాలను కూడా గాలింపు చర్యలకు ఉపయోగిస్తున్నారు.

పోంటియానాక్ వెళ్తున్న ఈ విమానం 10 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన తరువాత సంబంధాలు తెగిపోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ flightradar24.com చెబుతోంది.

విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్లు ఇండోనేసియా రవాణా మంత్రి బుది కర్యా సమాదీ చెప్పారు. ప్రయాణికుల్లో 10 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపారు.

విమాన శకలాలు

ఫొటో సోర్స్, Reuters

‘సముద్రంలో కూలిపోవడం చూశాం’

పేలుడు శబ్దం వినిపించిందని.. పేలడం చూశామనీ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

స్థానిక మత్స్యకారుడొకరు 'బీబీసీ ఇండోనేసియా'తో మాట్లాడుతూ.. సముద్రంలో విమానం కూలిపోవడం చూసినట్లు చెప్పారు.

''పిడుగు పడినట్లుగా విమానం సముద్రంలో కూలిపోయింది.. నీళ్లలో పడి పేలిపోయింది'' అని చెప్పాడాయన.

''మా ఓడకు సమీపంలోనే కూలింది. ప్లైఉడ్ లాంటి కొన్ని ముక్కలు మా ఓడను తాకాయి కూడా. ప్రమాదాన్ని చూసిన వెంటనే ఒడ్డుకు చేరుకుందామని మా కెప్టెన్ నిర్ణయించారు'' అన్నారాయన.

ఇండోనేసియా విమాన ప్రమాదం

విమాన శిథిలాలంటూ కొన్ని ఫొటోలు ఇండోనేసియా టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

లాంకాంగ్ ద్వీపానికి చెందిన చాలామంది విమానానికి సంబంధించిన వస్తువులు వంటివి తాము చూశామని 'బీబీసీ ఇండోనేసియా'కు చెప్పారు.

ఇండోనేసియా విమాన ప్రమాదం

లఖీ ద్వీపం, లాంకాంగ్ ద్వీపం మధ్య సముద్ర జలాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీకి చెందిన అధికారి బంబాంగ్ సుర్యో అజీ చెప్పారు.

విమాన శిథిలాలు వంటివి కొన్ని కనిపించాయని.. అయితే, అవి గల్లంతైన విమానానివేనా కావా అన్నవి పరిశీలిస్తున్నారని అజీ చెప్పారు.

''విమానం కచ్చితంగా ఎక్కడ కూలిపోయిందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. రాత్రి సరికి కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తిస్తాం. రెండు ద్వీపాల మధ్య ఉన్న సముద్ర జలాలు 20 నుంచి 23 మీటర్ల లోతు ఉంటాయి'' అని అజీ చెప్పారు.

గల్లంతైన విమానం కోసం సమాచారం సేకరిస్తున్నామని శ్రీవిజయ విమానయాన సంస్థ చెప్పింది.

గల్లంతైన విమానం ఇటీవల రెండు భారీ ప్రమాదాలకు గురైన 737 మ్యాక్స్ మోడల్ విమానం కాదు.

2018 అక్టోబరులో ఇండోనేసియాకు చెందిన లయన్ ఎయిర్ సంస్థ విమానం సముద్రంలో కూలిపోవడంతో 189 మంది మరణించారు.

తాజాగా గల్లంతైన విమానం 26 ఏళ్ల పాతది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)