బోయింగ్: 737 మాక్స్ విమానాల ఉత్పత్తి జనవరిలో తాత్కాలికంగా నిలిపివేత

ఫొటో సోర్స్, Getty Images
సమస్యాత్మకంగా మారిన తమ 737 మ్యాక్స్ విమానాల ఉత్పత్తిని జనవరిలో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విమాన తయారీ సంస్థ బోయింగ్ వెల్లడించింది.
ఈ మోడల్ విమానాలు రెండు కూలిపోయి 300 మందికి పైగా ప్రయాణికులు చనిపోవటంతో, గత తొమ్మిది నెలలుగా ఈ మోడల్ విమానాల ఉపయోగాన్ని ఆపేశారు. అయినప్పటికీ బోయింగ్ ఈ మోడల్ విమానాల ఉత్పత్తిని కొనసాగించింది.
బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లోని ఒక కొత్త ఫీచర్‌లో సమస్యలు తలెత్తటం వల్ల ఇండొనేసియా, ఇథియోపియాల్లో కూలిపోయాయి.
అయితే, ఈ ఏడాది చివరి కల్లా ఈ మోడల్ విమానాలను మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని బోయింగ్ ఆశాభావంతో ఉంది.
కానీ, అంత వేగంగా ఈ విమానాలు మళ్లీ ప్రయాణించటానికి అవసరమైన ధ్రువీకరణ ఇవ్వటం జరగదని అమెరికా నియంత్రణ సంస్థలు స్పష్టం చేశాయి.

ఫొటో సోర్స్, AFP
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో సియాటిల్ కేంద్రంగా ఉన్న బోయింగ్ సంస్థ అమెరికాలో అతి పెద్ద ఎగుమతిదారుల్లో ఒకటి. సమస్యాత్మక 737 మ్యాక్స్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, ఆ మోడల్ విమానంతో ముడిపడి ఉన్న కార్మికులను తొలగించబోమని బోయింగ్ ఒక ప్రకటనలో చెప్పింది. అయితే, ఉత్పత్తిని నిలిపివేయటం వల్ల పంపిణీదారుల మీద, విస్తృత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
''737 మ్యాక్స్ విమాన సేవలను సురక్షితంగా పున:ప్రారంభించటం మా అత్యున్నత ప్రాధాన్యం'' అని బోయింగ్ తెలిపింది. ''ఈ మోడల్ నవీకరణ మీద మన నియంత్రణ సంస్థలు, వినియోగదారులు, ప్రయాణించే ప్రజలకు విశ్వాసం కలిగేలా చేయటానికి.. దీనిని తిరిగి సర్వీసులోకి రావటానికి అనుమతించే ప్రక్రియ, తగిన శిక్షణా అవసరాలను నిర్ణయించే ప్రక్రియ అసాధారణ స్థాయిలో ఉండి తీరాలని మాకు తెలుసు'' అని చెప్పింది.
ఈ విమానం మొదటిగా 2018 అక్టోబరులో ఇండొనేసియాలో కూలిపోయినపుడు, అలాంటి ప్రమాదాలు మరిన్ని జరిగే ముప్పు ఉంటుందన్న సంగతి అమెరికా విమానయాన నియంత్రణ సంస్థలకు తెలుసని గత వారం కాంగ్రెస్ (పార్లమెంటు) విచారణలో నివేదించారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ మోడల్ విమానం డిజైన్‌లో మార్పులు చేయకపోతే, వాటి జీవిత కాలంలో డజనుకు పైగా విమానాలు కూలిపోవచ్చునని ఫెడరల్ ఏవియేషన్ విశ్లేషించింది.
అయితే, 2019 మార్చిలో ఇథియోపియాలో రెండో విమానం కూలిపోయే వరకూ కూడా ఈ 737 మ్యాక్స్ విమానాల వాడకాన్ని నిలిపివేయలేదు.
ఈ రెండు విమాన ప్రమాదాలకు ప్రధాన కారణమని భావిస్తున్న ఆటోమేటెడ్ కంట్రోల్ సిస్టమ్‌ను బోయింగ్ రీడిజైన్ చేస్తోంది.
ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాలన్న నిర్ణయం అనూహ్యమైనదని ప్రయాణ రంగ విశ్లేషకుడు హెన్రీ హార్ట్‌వెల్డ్ పేర్కొన్నారు. ఇది, ''బోయింగ్, దాని సరఫరాదారులు, విమానయాన సంస్థల మీద భారీ ప్రభావం చూపుతుంది'' అని చెప్పారు.
''ఇందులో పాలుపంచుకుంటున్న విమానయాన సంస్థలతో పాటు 737 మ్యాక్స్ సరఫరా శ్రేణిలో భాగంగా ఉన్న దాదాపు 600 పైగా సంస్థలకు.. స్వయంగా బోయింగ్‌లోనూ కల్లోలం సృష్టిస్తుంది'' అని విశ్లేషించారు.
ఈ మోడల్ విమానాల వినియోగాన్ని నిలిపివేయటం వల్ల ఇప్పటికే బోయింగ్ సంస్థకు 900 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తుందన్న ఊహాగానాల మధ్య బోయింగ్ షేర్ల ధరలు సోమవారం నాడు 4 శాతం పైగా పడిపోయాయి.
తమ దగ్గర 737 మ్యాక్స్ విమానాలు మొత్తం 400 నిల్వ ఉన్నాయని, వాటిని వినియోగదారులకు పంపిణీ చేయటం మీద దృష్టి కేంద్రీకరిస్తామని బోయింగ్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా విమానయాన సంస్థలు ఈ మోడల్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చినప్పటికీ, వీటిలో సాఫ్ట్‌వేర్ సమస్యలను పరిష్కరించటం కోసం డెలివరీని తాత్కాలికంగా ఆపివేశారు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ జామియా యూనివర్సిటీ ఆందోళనల్లో పోలీసులే బస్సుకు నిప్పంటించారా...
- ఉల్లి మన ఆహారంలో ఎలా భాగమైంది? దాని చరిత్ర ఏంటి...
- భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం... ఈ లోయ లోతు 11,500 అడుగులు
- యూఎస్బీ కండోమ్ అంటే ఏమిటో తెలుసా?
- సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- అభిప్రాయం: భారతదేశం ఆర్థిక మాంద్యానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉందా?
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
- షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూ: ‘అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి..’
- ఉరి తాడు ఒక్క బక్సర్ జైల్లోనే ఎందుకు తయారవుతోంది?
- భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం... ఈ లోయ లోతు 11,500 అడుగులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








