ఉరి తాళ్లను దేశంలో ఆ ఒక్క చోటే ఎందుకు తయారు చేస్తారు

ఫొటో సోర్స్, BBC/GETTY
- రచయిత, నీరజ్ ప్రియదర్శి
- హోదా, బీబీసీ కోసం
భారత్‌లో చాలా అరుదైన కేసుల్లోనే దోషులకు ఉరిశిక్షలు పడుతుంటాయి. అంతే అరుదుగా, ఆ శిక్షలు అమలు చేసేందుకు ఉపయోగించే తాడు కూడా దేశంలో ఒక్క చోటే లభిస్తుంది. అదే బిహార్‌లోని బక్సర్ సెంట్రల్ జైలు.
గాంధీ హంతకుడు గాడ్సే నుంచి ముంబయి దాడుల్లో దోషిగా తేలిన కసబ్ వరకూ భారత్‌లో ఉరిశిక్షను ఎదుర్కొన్న ఖైదీల చుట్టూ బక్సర్ ఉరితాడే బిగుసుకుంది.
10 ఉరితాళ్లు చేయించాలని బక్సర్ జైలు అధికారులకు ఇటీవల ఆదేశాలు వచ్చాయి. దీంతో ఈ జైలు మరోసారి వార్తల్లోకెక్కింది.
ఈ తాళ్లు ఎవరిని ఉరి తీసేందుకన్న విషయంపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమాచారం ప్రకారం భారత్‌లో ఇప్పటివరకూ దాదాపు 1500 మందికి కోర్టులు ఉరిశిక్ష విధించగా, 21 మందికి దాన్ని అమలు చేశారు.
అయితే, ఉరిశిక్షల కోసం బక్సర్ తాడునే ఎందుకు వాడుతున్నారు? వేరే చోట్ల అది ఎందుకు తయారుకావడం లేదు?
ఈ ప్రశ్నకు బక్సర్ జైలు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ అరోరా సమాధానం ఇచ్చారు.
భారత ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ఉరి తాళ్ల తయారీపై దేశంలో నిషేధం ఉందని, ఒక్క బక్సర్ సెంట్రల్ జైలుకు మాత్రమే దాని నుంచి మినహాయింపు ఉందని ఆయన బీబీసీతో చెప్పారు.
ఈ నిషేధం బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతోందని అన్నారు. ఉరితాళ్ల తయారీకి అవసరమైన యంత్రం దేశంలో ఒక్క బక్సర్‌లో మాత్రమే ఉందని వివరించారు.

ఫొటో సోర్స్, Neeraj Priyadarshy/BBC
బక్సర్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
ఉరితాళ్ల తయారీ యంత్రాన్ని బ్రిటీష్ పాలకులు బక్సర్‌లో మాత్రమే ఎందుకు పెట్టారు? మిగతా చోట్ల కూడా పెట్టే వీలు ఉంది కదా?
''అందుకు జవాబు బ్రిటీష్ పాలకులే చెప్పగలుగుతారు. నాకు తెలిసినంతవరకూ ఈ నిర్ణయం వెనుక వాతావరణ పరిస్థితులకు ముఖ్య పాత్ర ఉంది'' అని విజయ్ కుమార్ అన్నారు.
''ఉరి తీసేందుకు ఉపయోగించే తాడు చాలా మృదువుగా ఉంటుంది. ఇందుకోసం చాలా మృదువైన నూలును వాడాల్సి ఉంటుంది. బక్సర్ జైలు గంగా నది ఒడ్డున ఉంది కాబట్టి ఇక్కడ ఆ యంత్రం పెట్టి ఉంటారు. అయితే, ఇప్పుడు నూలును మృదువుగా మార్చే అవసరం లేకుండా పోయింది. రెడీమేడ్‌గా ఉన్న నూలు వస్తోంది'' అని చెప్పారు.
బక్సర్ జైలు ఇచ్చిన సమాచారం ప్రకారం చివరగా 2016లో పటియాలా జైలుకు ఉరితాడును పంపించారు.
భారత్‌లో ఆఖరిగా ఉరిశిక్ష అమలైంది 2015లో. ముంబయి బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ మెమెన్‌కు ఈ శిక్షను అమలు చేశారు. అందుకు ఉరితాడు బక్సర్ నుంచే వెళ్లింది.
బక్సర్‌లో ఉరితాళ్ల తయారీ కోసం నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే, వీళ్లు నేరుగా తాళ్లను తయారుచేయరని జైలర్ సతీశ్ కుమార్ సింగ్ చెప్పారు.
''ఉరితాళ్లను ఇక్కడి ఖైదీలే తయారుచేస్తారు. ఆ సిబ్బంది వారికి శిక్షణ ఇస్తారు. సూచనలు చేస్తారు. ఈ పని ఓ సంప్రదాయంలా మారింది. పాత ఖైదీల నుంచి కొత్త ఖైదీలు దాన్ని నేర్చుకుంటుంటారు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా చేస్తారంటే..
ఉరితాడు తయారీ కోసం జే34 అనే నూలును వాడతారని జైలు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ అరోరా చెప్పారు.
గతంలో ప్రత్యేకంగా దాన్ని పంజాబ్ నుంచి తెప్పించేవారని, ఇప్పుడు ఇతర సప్లయర్స్ నుంచి వస్తోందని అన్నారు.
''తాడును చేయడం ఎక్కువగా చేత్తో చేసే పనే. దారాలను తాడులా అల్లేందుకు మాత్రమే యంత్రం పనిచేస్తుంది. మొదట 154 నూలు దారపు పోగులుండే ఉండలను తయారు చేస్తారు. ఇలాంటివి ఆరు ఉపయోగించి.. 16 అడుగల పొడవుండే తాడును అల్లుతారు'' అని విజయ్ కుమార్ వివరించారు.
తాడు తయారీలోని చివరి దశ మొత్తం ప్రక్రియలో అన్నింటి కన్నా ముఖ్యమైందని జైలర్ సతీష్ కుమార్ సింగ్ అన్నారు.
''మేం తాడు తయారు చేసి పంపిస్తాం. అది తీసుకున్న జైలు వాళ్లే ఫినిషింగ్ ప్రక్రియను చేసుకుంటారు. తాడును మృదువుగా, మెత్తగా మార్చడమే ఫినిషింగ్. ఉరి తాడు వల్ల ఎలాంటి గాయాలూ కాకూడదని, కేవలం ప్రాణం మాత్రమే పోవాలని నియమనిబంధనలు ఉన్నాయి. అందుకే ఫినిషింగ్ చాలా కీలకం'' అని అన్నారు.
మొదట్లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉరితాడు తయారవుతుండేదని కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 'మనీలా తాడు' బాగా ప్రాచుర్యం పొందింది కూడా.
''1880లో బక్సర్ జైలు ఏర్పాటైంది. అప్పుడే బ్రిటీష్ పాలకులు ఇక్కడ ఉరితాడు తయారీ యంత్రం పెట్టి ఉండొచ్చు. అయితే, జైలు రికార్డుల్లో మాత్రం దాని గురించి సమాచారం ఏమీ లేదు. పాత రికార్డులను తిరగేస్తే, ఒక అంచనాకు రావొచ్చు'' అని సతీష్ కుమార్ అన్నారు.
''బ్రిటీష్ పాలన కాలంలో బక్సర్ అతిపెద్ద సైనిక స్థావరంగా ఉండేది. ఇక్కడి జైలు కూడా దేశంలో అతిపెద్దదైన జైళ్లలో ఒకటిగా ఉండేది. సహజంగానే అత్యధిక మంది ఖైదీలు ఇక్కడ ఉండేవారు'' అని స్థానిక పాత్రికేయుడు బబ్లూ ఉపాధ్యాయ్ అన్నారు.
''చాలా కాలం క్రితమే ఇక్కడ పెద్ద పారిశ్రామిక షెడ్‌ను బ్రిటీష్ పాలకులు నిర్మించారు. తాళ్లు మాత్రమే కాదు, ఫినాయిల్, సబ్బుల వంటి చాలా వస్తువులు ఇక్కడ ఖైదీలు తయారుచేస్తుంటారు'' అని వివరించారు.
''జైలు పక్కనే గంగా నది ఉంది. నీళ్లు అందుబాటులో ఉంటాయి. తాళ్లను నానబెట్టడం, ఆరబెట్టడం తేలిక. అందుకే ఉరితాళ్ల తయారీకి బ్రిటీష్ పాలకులు దీన్ని ఎంచుకుని ఉంటారు'' అని ఉపాధ్యాయ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉరి తాడు తయారీ చేసే పని.. కొందరు ఖైదీలకు తమపై పడిన శిక్షను తగ్గించుకునేందుకు ఒక మార్గం.
సత్ప్రవర్తనతో మెలిగేవారికి, జైల్లో పనులు చేసేవారికి శిక్ష తగ్గించవచ్చని జైలు మాన్యువల్ చెబుతోంది.
''ఒక నెల బాగా పనిచేస్తే, ఆ ఖైదీకి రెండు రోజుల శిక్ష తగ్గుతుంది. ఆదివారం ఓవర్‌టైమ్ చేసినా, అదనంగా మరో రోజు శిక్ష తగ్గుతుంది'' అని జైలు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ అరోరా అన్నారు.
''మిగతా విషయాలు ఖైదీ ప్రవర్తన తీరు మీద ఆధారపడి ఉంటాయి. ఖైదీలు మంచి ప్రవర్తనతో ఉండి, కష్టపడి పనిచేస్తే ఏడాదిలో కనీసం 105 రోజుల శిక్ష తగ్గించుకోవచ్చు'' అని అన్నారు.
బక్సర్ జైల్లో ప్రస్తుతం ఉరిశిక్ష పడిన ఖైదీలు ఇద్దరున్నారు. ఉరి తాడు ప్రక్రియలో వారు పాలుపంచుకోరని జైలర్ సతీష్ కుమార్ అన్నారు.
''ఉరిశిక్ష పడ్డవారు ప్రత్యేక ఖైదీలుగా ఉంటారు. వారికి ఎలాంటి పనులూ ఇవ్వం. ఉరిశిక్ష జీవిత ఖైదుగా మారినవారు, జీవితఖైదు అనుభవిస్తున్నవారు ఉరి తాడు తయారీ పనుల్లో ఉంటారు'' అని వివరించారు.
ఇంతకీ బక్సర్‌లో తయారయ్యే ఉరితాడు ధర ఎంతో తెలుసా?
''పటియాలాకు పంపినప్పుడు దాని ధర రూ.1725. కానీ, ఇప్పుడు ముడి వస్తువుల ధరలు పెరిగాయి. తాడు మెడ చుట్టూ బిగుసుకునేందుకు ఉపయోగించే ఇత్తడి బుష్ ధర కూడా పెరిగింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఉరితాడు ధరను రూ.2120గా నిర్ణయించాం'' అని సతీష్ కుమార్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూ: ‘అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. నేను మళ్లీ వస్తా’
- హిట్లర్ ఆరాధనలో మునిగితేలిన హిందూ మహిళ
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- వెయ్యి మంది ప్రాణాలు తీసిన హంతకుడు.. కెమెరాల ముందు తన పాత్రలో తనే నటించాడు..
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
- దీపావళి టపాసులు భారత్‌లోకి ఎలా వచ్చాయి?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: చనిపోయే దాకా దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి?
- శాన్ జోస్ యుద్ధ నౌక: సాగర గర్భంలోని నౌకలో లక్షల కోట్ల సంపద... దక్కేది ఎవరికి?
- అజ్ఞాతంలో ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు.. గాలిస్తున్న లాహోర్ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








