శాన్ జోస్ యుద్ధ నౌక: 300 ఏళ్ల కింద సముద్రంలో మునిగిన స్పెయిన్ నౌకలో లక్షల కోట్ల సంపద... దక్కేది ఎవరికి?..

కార్టాజినా తీరం
ఫొటో క్యాప్షన్, కార్టాజినా తీరంలోని సముద్ర గర్భంలో శాన్ జోస్ యుద్ధ నౌక, అందులోని అపార సంపద భద్రంగా ఉన్నాయి
    • రచయిత, విక్టోరియా స్టంట్
    • హోదా, బీబీసీ ట్రావెల్

అది 1708 సంవత్సరం. జూన్ 8వ తేదీ. కొలంబియాలోని కార్టాజినా తీరంలో సముద్రం మీద ఓ నౌక ఉంది. దాని పేరు శాన్ జోస్. అదో యుద్ధ నౌక. బ్రిటిష్ వారితో యుద్ధం చేస్తోంది. అకస్మాత్తుగా అది మంటల్లో చిక్కుకుంది. అర్థరాత్రి కరీబియన్ సముద్రంలో మునిగిపోయింది. అదృశ్యమైపోయింది. దానితో పాటు.. దాదాపు 600 మంది మనుషులు కూడా. అయితే, అందులో 2000 కోట్ల డాలర్ల విలువ చేసే బంగారం, వెండి, ఆభరణాలు కూడా ఉన్నాయి.

ఆ నౌక శతాబ్దాలుగా సాగరగర్భంలో ఆచూకీలేకుండా ఉండిపోయింది. కానీ.. 2015లో దీని చుట్టూ ఉన్న రహస్యం వీడిపోవటం మొదలైంది. అది ఎక్కడుందో కనిపెట్టామని కొలంబియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

నాలుగేళ్లు గడచిపోయాయి. నౌక ఇంకా కొలంబియా సముద్ర జలాల్లోలోనే ఉంది. 600 మీటర్ల లోతున. అయినా.. ఆ నౌక తమదని.. అందులో ఉన్న నిధులు తమకే చెందుతాయనే గొడవ మొదలైంది.

మునిగిపోయిన నౌకల్లో అత్యంత సంపన్నమైన నౌకగా 'హోలీగ్రెయిల్' అని పేరుపడ్డ శాన్ జోస్ ఖచ్చితంగా ఎక్కడుందన్న విషయాన్ని కొలంబియా ప్రభుత్వం ప్రకటించలేదు.

కానీ.. కార్టాజినాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రొజారియో దీవుల సమీపంలో ఉన్నట్లు చెప్తున్నారు. ఆ దీవుల్లోని బీచ్‌లకు వెళ్లే పర్యాటకులను అటూ ఇటూ చేరుస్తూ అనేక మోటారుబోట్లు నిత్యం ఈ జలాల మీదుగా తిరుగుతుంటాయి. అలా వెళుతున్నపుడు, వస్తున్నపుడు.. శాన్ జోస్, అందులోని అపార నిధులు మన కింద నీటి అడుగున ఎక్కడో ఉన్నాయని ఆలోచించకుండా ఉండటం కష్టం.

కార్టాజినా తీరం

ఫొటో సోర్స్, travel4pictures/Alamy

ఫొటో క్యాప్షన్, స్పెయిన్ యుద్ధనౌక శాన్ జోస్ 1708లో కార్టాజినా తీరంలో మునిగిపోయినపుడు అందులో 2,000 కోట్ల డాలర్ల విలువైన బంగారు, వెండి, ఆభరణాలు ఉన్నాయి

నిజానికి, ఈ నౌక చుట్టూ ఎంతో కాలంగా ఎన్నో ఊహలు అల్లుకున్నాయి. నోబెల్ బహుమతి గ్రహీత గాబ్రియెల్ గార్సియా మార్క్విజ్ రాసిన 'లవ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కలరా' నవలలో శాన్ జోస్ గురించి రాశారు. నవలలోని ప్రధాన పాత్ర ఫ్లోరెంటినో అరీజా.. సాగర గర్భంలోకి ఈదుకుంటూ వెళ్లి అందులోని సంసదను తీసుకువచ్చి తన జీవిత కాల ప్రేయసికి అందించాలని ప్రణాళిక రచిస్తాడు.

రొజారియో దీవుల్లో అతి పెద్దదైన ఇస్లా గ్రాండ్‌లో విహారానికి బొగోటా నుంచి కుటుంబంతో సహా వచ్చారు బిబియానా రోజాస్ మేజియా. ''ఈ కరీబియన్ మంత్రముగ్ధం చేస్తుంది. మా దేశంలో ఉన్న మార్మిక వాస్తవికత (మాజికల్ రియలిజం) ఇది. శాన్ జోస్ యుద్ధనౌకలో ఎంత సంపద ఉందనేది మాకు తెలియదు. కానీ.. అదో గొప్ప లెజెండ్'' అంటారామె.

శాన్ జోస్ యుద్ధ నౌక 1708 మే నెలాఖర్లో పనామాలోని పోర్టోబెలో ఓడరేవు నుంచి బయలుదేరింది. నాడు స్పెయిన్ నియంత్రణలో ఉన్న పెరూలో వసులు చేసిన బంగారం, వెండి, విలువైన రాళ్లను ఆ ఓడలో నింపారు. వాటి విలువ నేడు 1,000 కోట్ల డాలర్ల నుంచి 2,000 కోట్ల డాలర్ల వరకూ ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ఈ సంపదను నాటి స్పెయిన్ చక్రవర్తి నాలుగో ఫిలిప్‌కు అందించాల్సి ఉంది. నాడు స్పెయిన్ వారసత్వ యుద్ధానికి నిధులు సమకూర్చటానికి తన వలస రాజ్యాల వనరుల మీద ఆయన ఆధారపడ్డారు.

అపార సంపదతో బయలుదేరిన శాన్ జోస్ యుద్ధ నౌక మరమ్మతు కోసం కార్టాజినాలో స్వల్ప కాలం ఆగాల్సిన పరిస్థితి. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తొలుత క్యూబాలోని హవానాకు, అక్కడి నుంచి స్పెయిన్‌కు సుదీర్ఘ ప్రయాణం చేయాలి.

స్పెయిన్‌తో యుద్ధం చేస్తున్న బ్రిటన్.. తమ మీద దాడి చేయటానికి కార్టాజినాలో నౌకలను మోహరించి ఉండవచ్చునని శాన్ జోస్ కెప్టెన్ జోస్ ఫెర్నాండెజ్ డి శాంటిలాన్‌కు తెలుసు. అయినా మరమ్మతు ఆయన కార్టాజినా వైపు నౌకను నడిపించారు.

రొజారియో దీవులు

ఫొటో సోర్స్, Victoria Stunt

ఫొటో క్యాప్షన్, రొజారియో దీవుల సమీపంలోని సాగర జలాల్లో శాన్ జోస్ యుద్ధనౌక మునిగి ఉందని చెబుతున్నారు

జూన్ 8వ సాయంత్రానికి శాన్ జోస్‌లోని సంపద కోసం యుద్ధం మొదలైంది. బ్రిటిష్ నౌకాదళం పిస్టళ్లు, కత్తులు, కరవాలాలతో మూడు సార్లు శాన్‌ జోస్‌ మీదకు వెళ్లి దానిని తన నియంత్రణలోకి తీసుకోవాలని ప్రయత్నించిందని.. గొంజాలో జునీజా చెప్పారు. ఆయన కార్టాజినాలోని మ్యూజియం ఆఫ్ కరీబియన్ క్యురేటర్‌గా పనిచేస్తున్నారు.

''ఆ పోరాటంలో శాన్ జోస్ గెలిచే పరిస్థితిలో ఉంది. కానీ.. చివరికి ఆ పరిస్థితి ఎలా దిగజారిందన్నది మనకు తెలియదు'' అన్నారాయన. శాన్ జోస్ యుద్ధ నౌక తెరచాపను కోల్పోయి ఉండవచ్చునని, లేదంటే నౌకలో ఉన్న వారు కెప్టెన్ మీద తిరుగుబాటు చేసి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏదేమైనా.. ఈ నౌక, దీనిలోని సంపద సముద్ర జలాల్లో మునిగిపోవాలని ఇరు పక్షాల్లో ఎవరూ కోరుకోలేదు. అయితే.. శాన్ జోస్‌ను బ్రిటిష్ వారికి అప్పగించి వట్టి చేతులతో స్పెయిన్‌కు తిరిగి వెళ్లటానికి ఇష్టపడని కెప్టెన్.. నౌకలోని మందుగుండుకు నిప్పుపెట్టి స్వయంగా నౌకను పేల్చివేయాలని ఉంటాడని జునీజా విశ్లేషిస్తున్నారు.

అలా సముద్రంలో మునిగిపోయిన ఈ నౌకను.. మూడు వందల సంవత్సరాలు పైగా గడచిపోయిన తర్వాత.. అమెరికాకు చెందిన వూడ్స్ హోల్ ఓషనోగ్రాఫిక్ ఇన్‌స్టిట్యూషన్ నిర్వహణలోని రెముస్ 6000 అనే రోబోటిక్ సబ్‌మెరీన్ కనిపెట్టిందని 2015 నవంబర్ 27న అధికారికంగా ప్రకటించారు.

కేవలం రోబోటిక్స్ సాయంతో స్వయంగా సంచరించగల ఈ జలాంతర్గామి పొడవు నాలుగు మీటర్లు. ఇది సముద్ర ఉపరితలానికి ఆరు కిలోమీటర్ల లోతు వరకూ అన్వేషణ కొనసాగించగలదు.

శాన్ జోస్

ఫొటో సోర్స్, Timewatch Images/Alamy

ఫొటో క్యాప్షన్, శాన్ జోస్ యుద్ధనౌక మరమ్మతుల కోసం కార్టాజినాలో ఆగుతున్నపుడు బ్రటిష్ నౌకాదళం దాని మీద దాడిచేసింది

అది శాన్ జోస్ మీద కేవలం 9 మీటర్ల లోతుకు దిగి ఆ యుద్ధ నౌకను.. అందులోని డాల్ఫిన్ బొమ్మలు చెక్కిన కంచు ఫిరంగులను ఫొటోలు తీయగలిగింది. ఆ ఫొటోలద్వారా ఇది శాన్ జోస్ యుద్ధ నౌక్ అని పరిశోధకులు గుర్తించారు.

ఈ శాన్ జోస్ యుద్ధ నౌక 300 ఏళ్ల యూరప్ వలస పాలన చరిత్రకు ప్రతినిధి అని కొలంబియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ డైరెక్టర్ ఎర్నెస్టో మాంటెనీగ్రో పేర్కొన్నారు.

కొలంబియా తీరానికి ఆవల సముద్రంలో మునిగిపోయి.. ఇంకా ఆచూకీ తెలియని నౌకల సంఖ్య దాదాపు 1,000 వరకూ ఉందని అంచనా. శాన్ జోస్ నౌక కొలంబియా జలాల్లోనే కనిపించినప్పటికీ.. అది ఈ దేశ సరిహద్దులోనే ఉంటుందన్న గ్యారెంటీ లేదు.

ఈ నౌకలోని సంపదలో తమకు భాగం ఉందని స్పెయిన్ వాదిస్తోంది. అయితే.. ఒకప్పటి పెరూలో భాగమైన బొలీవియా ఆదివాసీ ప్రాంతం ఖారా ఖారా.. ఆ సంపదలో తమకూ వాటా వస్తుందని పట్టుపడుతోంది. శాన్ జోస్ యుద్ధ నౌక ఈ ప్రాంతం నుంచే ఆ సంపదను వసూలు చేసి తీసుకెళ్లింది.

అంతేకాదు.. శాన్ జోస్ నౌక 40 ఏళ్లుగా కోర్టు కేసుల్లో చిక్కుకుంది. అమెరికాకు చెందిన 'సీ సెర్చ్ ఆర్మడా' అనే సంస్థ తాను 1980ల ఆరంభంలోనే ఈ నౌకను కనిపెట్టానని.. ఆ సమయంలో కొలంబియాతో తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం అందులోని సంపదలో తనకు సగం వాటా దక్కుతుందని దావా వేసింది. కొలంబియా సుప్రీంకోర్టు 2007లో ఆ సంస్థకు అనుకూలంగా తీర్పు చెప్పింది.

శాన్ జోస్

ఫొటో సోర్స్, Courtesy of ICANH

ఫొటో క్యాప్షన్, రెముస్ 6000 అనే రోబోటిక్ జలాంతర్గామి శాన్ జోస్ ఆచూకీని కనుగొన్నదని 2015 నవంబర్ 27న అధికారికంగా ప్రకటించారు

శాన్ జోస్‌ యుద్ధ నౌకను కొలంబియా కనిపెట్టిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు యువాన్ మాన్యూల్ సాంటోస్ 2015లో ప్రకటించినపుడు.. సీ సెర్చ్ ఆర్మడా సంస్థ సాయంతో దానిని గుర్తించామని చెప్పలేదు.

అలాగే.. శాన్ జోస్ మీద, అందులోని సంపద మీద సీ సెర్చ్ ఆర్మడాకు ఎలాంటి హక్కూ లేదని.. ఎందుకంటే తాము ఈ నౌకను గుర్తించామంటూ వారు చెప్పిన అక్షాంశ-రేఖాంశాలకు - నౌక వాస్తవంగా ఉన్న ప్రాంతానికి పొంతన లేదని కొలంబియా ఉపాధ్యక్షురాలు మార్తా లూసియా రామిరెజ్ గత జూన్‌లో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసు ఇంకా కొలంబియా సుప్రీంకోర్టులో నడుస్తోంది.

శాన్ జోస్ యుద్ధ నౌకను వెలికి తీయటానికి ఈ ఏడాది మరొక ప్రైవేటు కంపెనీతో కాంట్రాక్టు ఖరారు చేసుకోవటానికి సిద్ధమైన కొలంబియా ప్రభుత్వం.. ఆ ఒప్పందాన్ని ఆపివేసింది.

ప్రస్తుతానికి.. 2015 గాలింపులో పాలుపంచుకున్న మారిటైమ్ ఆర్కియాలజీ కన్సల్టెంట్స్ (ఎంఏసీ) ఒక్కటే ఇందులో వాటాకు పోటీపడుతోంది. మరొక ప్రైవేటు సంస్థతో ఒప్పందం అంటే.. శాన్ జోస్‌లోని సంపదలో - పురావారసత్వ సంపదగా కొలంబియా నిర్ణయించని సంపదలో - ఆ సంస్థకు కూడా వాటా ఇవ్వాల్సి వస్తుంది.

అయితే.. శాన్ జోస్ యుద్ధ నౌక గురించి సంపూర్ణంగా తెలుసుకునే హక్కు మానవాళికి ఉందని.. ఆ నౌకకు కొలంబియా సమర్థవంతమైన సంరక్షక పాత్ర పోషించాలని చరిత్రకారుడు ఫ్రాన్సిస్కో మునోజ్ అభిప్రాయపడ్డారు.

యువాన్ మాన్యూల్ సాంటోస్

ఫొటో సోర్స్, EFE News Agency/Alamy

ఫొటో క్యాప్షన్, శాన్ జోస్ యుద్ధనౌక ఆచూకీని కనుగొనటం చరిత్రలో అతిగొప్ప అన్వేషణల్లో ఒకటని కొలంబియా మాజీ అధ్యక్షుడు యువాన్ మాన్యూల్ సాంటోస్ పేర్కొన్నారు

అంటే.. ఈ నౌకలోని సంపదలన్నిటినీ పూర్తిగా ప్రజలకు ప్రదర్శిస్తూ ఒక మ్యూజియం నెలకొల్పాలని ఆయన పేర్కొన్నారు. కొలంబియా ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు చెప్పింది.

అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో తొందరపాటు ఉండకూడదని నిపుణులు అంటున్నారు.

''ఈ నౌక 300 ఏళ్ల పాటు సముద్రంలో మునిగివుంది కనుక.. ఈ నౌకను పరిరక్షించాల్సిన హక్కు లభిస్తుంది'' అని జలాంతర్గ పురాశాస్త్రవేత్త యువాన్ గిలెర్మో మార్టిన్ పేర్కొన్నారు. ''ఈ నౌకను వెలికితీసే పని చేపట్టే పరిస్థితులు ప్రస్తుతం కొలంబియాలో లేనట్లయితే.. ఆ పని చేపట్టనవసరం లేదు'' అని అభిప్రాయపడ్డారు.

శాన్ జోస్‌ను వెలికితీసే వరకూ కార్టాజినా నివాసులు, పర్యటకులు... ఈ మ్యూజియం కోసం చాలా కాలం వేచి ఉండక తప్పదు. ఈ నౌక తమ సరిహద్దుల్లోనే ఉంటుందన్న గ్యారంటీ కూడా కొలంబియాకు ఇంకా దక్కలేదు.

ఇప్పటికైతే.. కార్టాజినా, రొజారియో దీవులను సందర్శించే పర్యాటకులు.. ఈ సముద్ర జలాల్లోకి చూస్తూ అక్కడ సాగరగర్భంలో ఉన్న ఈ నౌకను, అందులో భద్రంగా ఉన్న పురాసంపదను ఊహించుకునే వెసులుబాటు ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)