నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?

జపాన్‌లో ఓ ప్రొఫెసర్ తన విద్యార్థులకు వ్యాస రచన పరీక్ష పెట్టారు. కాసేపయ్యాక, వ్యాసం రాసేశాను అంటూ ఓ అమ్మాయి 'ఖాళీ' పేపర్‌ను ఆ ప్రొఫెసర్ చేతిలో పెట్టింది. ఆ పరీక్షలో ఆమెకే అత్యధిక మార్కులు వచ్చాయి. ఎలా?
ఆమె ఇచ్చిన పేపర్ చూసేందుకు ఏమీ రాయనట్లుగానే తెల్లగా కనిపిస్తుంది. కానీ, దాని మీద కంటికి కనిపించని (ఇన్‌విజిబుల్) సిరాతో వ్యాసం రాసి ఉంది. దానిని గుర్తించిన ప్రొఫెసర్ ఆ వ్యాసాన్ని పూర్తిగా చదవకుండానే అత్యధిక మార్కులు వేశారు.
జపాన్‌లోని మియీ విశ్వవిద్యాలయంలో నింజా చరిత్ర చదువుతున్న విద్యార్థి ఈమీ హాగా (19) ఆ వ్యాసం రాశారు.
'అబురిదాషి' అనే నింజా టెక్నిక్‌లో సోయాబీన్స్‌ను కొన్ని గంటల పాటు నానబెట్టి, రుబ్బి ఇన్‌విజిబుల్ సిరాను తయారు చేస్తారు. హాగా తనే స్వయంగా ఆ ఇంకును తయారు చేశారు.
ఆమె ఇచ్చిన పేపర్‌ను ప్రొఫెసర్ ఇంటికి తీసుకెళ్లి గ్యాస్ పొయ్యి మీద వేడి చేసినప్పుడు పదాలు కనిపించాయి.
"చిన్నప్పుడు ఆ టెక్నిక్ గురించి ఓ పుస్తకంలో చదివాను. ఇలా రాయాలన్న ఆలోచన ఎవరికీ రాదన్న నమ్మకంతో, అలా చేశాను" అని హాగా బీబీసీతో చెప్పారు.
ప్రస్తుతం యూనివర్సీటీలో మొదటి సంవత్సరం చదువుతున్న హాగా, చిన్నప్పటి నుంచే టీవీలలో నింజా యానిమేషన్ షోలు చూసేదాన్నని తెలిపారు.
ఇటీవల నింజా మ్యూజియంను సందర్శించిన తర్వాత అక్కడ తెలుసుకున్న విషయాల గురించి వ్యాసం రాయాలని ప్రొఫెసర్ యూజీ యమడ చెప్పారు.
"సృజనాత్మకంగా రాసిన వారికి అత్యధిక మార్కులు వేస్తానని మా ప్రొఫెసర్ అన్నారు. దాంతో, ఎలాగైనా అందరికంటే భిన్నంగా వ్యాసం రాయాలని అనుకున్నాను. కొద్దిసేపు ఆలోచించాను. అప్పుడు అబురిదాషి టెక్నిక్ గుర్తుకొచ్చింది" అని హాగా వివరించారు.

ఆ సిరా తయారీ కోసం సోయాబీన్స్‌ను రాత్రంతా నానబెట్టారు. తెల్లారి వాటిని రుబ్బి, వస్త్రంలో వేసి రసాన్ని పిండారు. ఆ రసాన్ని నీటితో కలిపారు.
రెండు గంటలపాటు ఆ మిశ్రమాన్ని నిల్వ ఉంచిన తర్వాత, సన్నని బ్రష్‌తో మందమైన జపనీస్ పేపర్ మీద ఆమె వ్యాసం రాశారు.
అలా రాసిన పదాలు సిరా ఆరిపోయిన తర్వాత కనిపించవు. అయితే, ఖాళీ పేపర్ అనుకొని ఆ ప్రొఫెసర్ దానిని చెత్తబుట్టలో పడేయలేదు. ఎందుకంటే, ఆ పేపర్ మీద ఒక చోట "ఈ పేపర్‌ను వేడి చేయాలి" అని సాధారణ ఇంకుతో చిన్న నోట్ రాసి ఉంది.

నింజాల గురించి
- నింజుత్సు (వీరవిద్య)ను ఉపయోగించే వ్యక్తిని నింజా అంటారు.
- నింజా సంప్రదాయం జపాన్‌లో భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటి వందల ఏళ్ల నాటిది.
- నింజాలు గూఢచర్యం, వ్యూహాలు రచించడంలో నిపుణులని చెబుతుంటారు.
- అమెరికన్ సినిమా 'ఎంటర్ ది నింజా' లాంటి వాటితో నింజాలకు ప్రాచుర్యం లభించింది. కానీ, హాలీవుడ్ సినిమాలలో నింజాల గురించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా చూపించారన్న విమర్శలు ఉన్నాయి.

ఆ అమ్మాయి రాసిన వ్యాసం చూడగానే ఆశ్చర్యపోయానని ప్రొఫెసర్ యూజీ యమడ బీబీసీతో చెప్పారు.
"కోడ్ భాషల్లో రాసిన వ్యాసాలను గతంలో చూశాను. కానీ, అబురిదాషి టెక్నిక్‌తో రాయడాన్ని ఎప్పుడూ చూడలేదు. మొదట ఆమె రాసిన పదాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయో లేదో అని కొంచెం అనుమానం వచ్చింది. కానీ, ఆ పేపర్‌ను మా ఇంటికి తీసుకెళ్లి గ్యాస్ పొయ్యి మీద వేడి చేయగానే దాని మీద ఉన్న పదాలు స్పష్టంగా కనిపించాయి. అద్భుతం అనిపించింది. దాంతో, ఆ వ్యాసాన్ని పూర్తిగా చదవక ముందే, ఏమాత్రం సంకోచింకుండా పూర్తి మార్కులు వేసేశాను. ఒకవేళ ఆ పేపర్‌ను మీడియాకు చూపించాల్సి వస్తుందేమో అన్న ఆలోచనతో, ఆ పేపర్‌లో కొంత భాగాన్ని వేడి చేయకుండా అలాగే ఉంచాను. అందుకే దానిని పూర్తిగా చదవలేదు" అని ప్రొఫెసర్ వివరించారు.
"వ్యాసాన్ని సృజనాత్మకంగా రాసేందుకు నేను పడిన శ్రమను ప్రొఫెసర్ గుర్తిస్తారన్న విశ్వాసం నాకు ఉంది. అందుకే, నేను రాసిన విషయాలలో ప్రత్యేకత ఏమీ లేకపోయినా, తక్కువ మార్కులు వస్తాయని నేను ఆందోళన చెందలేదు" అని హాగా చెప్పారు.
(టోక్యోలోని బీబీసీ ప్రతినిధి హిదేహరు తమూరా అందించిన సమాచారంతో ఈ కథనం రాశాం)
ఇవి కూడా చదవండి:
- నారోహితో: జపాన్ కొత్త చక్రవర్తి ఎవరు? ఈ రాజవంశం ఎందుకంత ప్రత్యేకం?
- ఉద్యోగులను ఆఫీసులో ఎక్కువ సేపు పనిచెయ్యనివ్వని డ్రోన్
- బోన్సాయ్: 400 ఏళ్ల వయసున్న చెట్టు దొంగతనం
- టోక్యో ఒలింపిక్స్: పాత సామానుతో.. పతకాల తయారీ
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- అక్కడ 18 ఏళ్లుదాటినా పెద్దవారు కాదు
- చైనా, జపాన్ల మధ్య ఆకస్మిక స్నేహబంధం
- కారును అడ్డగించి, తుపాకి గురిపెట్టి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు
- నోబెల్ శాంతి పురస్కారం: అబియ్ అహ్మద్ తూర్పు ఆఫ్రికాలో శాంతిని నెలకొల్పారా?
- ఊబకాయంపై ఏడు అపోహలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- సిరియాలో కుర్దులపై టర్కీ 'సైనిక చర్య' ఎందుకు? దీనివల్ల జరగబోయేది ఏమిటి?
- అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు అలెక్సీ లియోనోవ్ కన్నుమూత.. ఆ నడకలో జరిగిన ప్రమాదం ఏంటంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








