ఇచట అమ్మానాన్నలు, భార్యాభర్తలు అద్దెకు ఇవ్వబడును

ఫొటో సోర్స్, Getty Images
"నా వయసు 38 ఏళ్లు. నాకిప్పుడు 25 కుటుంబాలు ఉన్నాయి, 35 మంది పిల్లలు ఉన్నారు. అయితే, ఆ పిల్లలు నా సంతానం కాదు. నేను వారికి 'అద్దె తండ్రి'ని మాత్రమే. అంటే... డబ్బులు తీసుకుని వారికి నాన్నలా నటిస్తాను" అని యూచి ఇషీ చెప్పారు.
జపాన్‌లో "ఫ్యామిలీ రొమాన్స్" పేరుతో ఇషీ ఒక సంస్థను నడుపుతున్నారు. తల్లిదండ్రులను, స్నేహితులను, బంధువులను ఆ సంస్థ అద్దెకు ఇస్తుంది.
ఈ సంస్థలో 2,200 మంది ఉద్యోగులు ఉన్నారు. వారు ప్రమాదాలలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు, కుటుంబ కలహాలతో విడిపోయిన వారికి లేదా మరేదైనా కారణాలతో ఆత్మీయులను కోల్పోయిన వారికి తల్లిలా, తండ్రిలా, తమ్ముడిలా, సోదరిలా, సోదరుడిలా, బాబాయిలా, మామయ్యలా, అత్తలా, తాతయ్య,లా నానమ్మలా, అమ్మమ్మలా వ్యవహరిస్తారు (నటిస్తారు). అందుకు డబ్బులు (అద్దె) తీసుకుంటారు.
"నేను 35 మంది పిల్లలకు తండ్రిగా వ్యవహరిస్తున్నాను. వారంలో రెండు మూడు రోజులు వెళ్లి వారితో ఓ నాలుగు గంటలపాటు గడుపుతాను" అని ఇషీ చెప్పారు.
పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ సంస్థకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.
మరి, అంతమంది పిల్లలకు "తండ్రి"గా వ్యవహరించడం, డబ్బులు తీసుకుని పరిచయం లేని కుటుంబాలలో సభ్యుడిగా నటించడం ఎలా అనిపిస్తుంది? అన్న విషయాలను సంస్థ నిర్వాహకుడు యూచి ఇషీ బీబీసీతో పంచుకున్నారు.

నకిలీ కానీ...
"ఫ్యామిలీ రొమాన్స్ సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన నాకు 14 ఏళ్ల క్రితం వచ్చింది. అందుకు కారణం నా స్నేహితురాలికి ఎదురైన ఒక సమస్య. ఒకసారి నా స్నేహితురాలు తన కొడుకుని ఓ ప్రైవేటు స్కూలులో చేర్పించేందుకు తీసుకెళ్లింది. అయితే, పిల్లవాడితో పాటు అతని తల్లిదండ్రులు ఇద్దరూ రావాలని ఆ స్కూలువాళ్లు అన్నారు. కానీ, ఆమె ఒంటరి మహిళ. దాంతో, తప్పని పరిస్థితిలో తనకు భర్తగా నటిస్తూ నేను వెళ్లాను" అని ఇషీ చెప్పారు.
"నేను ఆ అబ్బాయికి నాన్నగా నటించాలని అనుకున్నాను. కానీ, నేను, ఆ బాలుడు.. ఒకే కుటుంబ సభ్యులు అన్నట్లుగా సరిగా నటించలేకపోయాం. దాంతో, అలా ఇబ్బందులు పడేవారికి ప్రొఫెషనల్ సేవలు అందిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఫ్యామిలీ రొమాన్స్ సంస్థ" అని ఆయన చెప్పుకొచ్చారు.
"నేను నకిలీ బంధువునే, కానీ ఆ నాలుగు గంటల పాటు మీ సొంత కుటుంబ సభ్యుడిగా, ఆత్మీయతను పంచుతాను, ప్రాణ స్నేహితుడిగా వ్యవహరిస్తా" అని అంటున్నారు ఇషీ.

ఫొటో సోర్స్, Getty Images
అద్దెకు స్నేహితులు, కుటుంబ సభ్యులు
ఈ సంస్థ వినియోగదారుల్లో విభిన్న రకాల అవసరాలు కలిగిన వ్యక్తులుంటారు.
కొందరు తమకు జీవిత భాగస్వామిగా నటించే వ్యక్తి కావాలంటూ వస్తారు. అందుకు వారి ఎత్తు, వయసుకు తగ్గట్టుగా ఉండే పురుషుడు లేదా మహిళను ఈ సంస్థ ఎంపిక చేసి పంపిస్తుంది.
తమకు స్నేహితులు లేరని బాధపడేవారు కూడా ఈ సంస్థ నుంచి స్నేహితులను అద్దెకు తీసుకోవచ్చు.
"మేము వారికి ఎంతో కాలంగా స్నేహితులం అన్నట్లుగా నడుచుకుంటాం. కలిసి షాపింగ్‌కు వెళ్తాం. సరదాగా చాటింగ్ చేస్తాం. డిన్నర్ పార్టీలలో పాల్గొంటాం" అని ఇషీ చెప్పారు.
కొందరు వృద్ధులు తమకు కొడుకులు, కోడళ్లు, బిడ్డలు, మనుమలు, మనుమరాళ్లు అద్దెకు కావాలంటూ వస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
తండ్రి పాత్రకు భారీ డిమాండ్
'తండ్రి' పాత్రకు డిమాండ్ అధికంగా ఉంటుందని ఇషీ చెప్పారు.
జపాన్‌లో ఏటా దాదాపు 2 లక్షల జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. తండ్రి లేదా తల్లి ఎవరో ఒకరు మాత్రమే కలిగిన కుటుంబాలు ఏటా భారీగా పెరిగిపోతున్నాయి. వారంతా తమ వద్దకు వస్తున్నారని ఆయన తెలిపారు.
అయితే, ఎంత నటించినా, సొంత కుటుంబ సభ్యుడు లేని లోటును మాత్రం ఎవరూ పూడ్చలేరని ఇషీ అంటున్నారు.
తండ్రి పాత్రలోనూ కొందరు చాలా మృదు స్వభావం కలిగిన వ్యక్తి కావాలంటారు, చాలా కఠినంగా వ్యవహరించే వ్యక్తి ఉంటే పంపించండని మరికొందరు అడుగుతారు.
చిన్న పిల్లలు 'తండ్రి' కావాలంటూ వచ్చినప్పుడు వారి నాన్న ఎందుకు రావట్లేదు? అన్న పూర్తి వివరాలను ఈ సంస్థ నిర్వాహకులు తెలుసుకుంటారు.
పిల్లలకు తండ్రిగా నటించిన తర్వాత 'బాయ్...' చెబుతూ వారిని విడిచి వెళ్లిపోయేటప్పుడు ఎంతో బాధగా ఉంటుందని ఇషీ అంటున్నారు.
"అంతసేపు నాన్నా.. నాన్నా అంటూ మాతో ఆడుకుంటారు. మేం వారిని ప్రేమగా చూసుకుంటాం. వారిని వదిలి వెళ్లేటప్పుడు కలిగే బాధ మాటల్లో చెప్పలేం. మమ్మల్ని వదిలివెళ్లొద్దు అంటూ పిల్లలు ఏడుస్తుంటారు, వెంటపడుతుంటారు. వారిని ఒప్పించడం చాలా కష్టం" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా ఐదు కుటుంబాల్లో సభ్యుడిగా ఉండొచ్చు. కానీ, ఇషీ తానే ఆ సంస్థను స్థాపించారు కాబట్టి ఆయన 25 కుటుంబాలలో 'అద్దె సభ్యుడి'గా నటిస్తున్నారు.
ఆ 25 కుటుంబాలకు చెందిన మొత్తం 35 మంది పిల్లలు ఇషీని తమ సొంత తండ్రిగా భావిస్తారు. ఆ కుటుంబాల తరఫున ఆయనకు 69 నకిలీ బంధుత్వాలు ఉన్నాయి.
"నేను ఒక కుటుంబం వద్దకు వెళ్తున్నప్పుడు.. ఆ కుటుంబ సభ్యుల వివరాలన్నీ రాసి ఉన్న నోట్‌బుక్‌ను వెంట తీసుకెళ్తా. అప్పుడప్పుడు కొందరు పిల్లల ముద్దు పేర్లను మరచిపోతుంటాను. అలాంటప్పుడు వెంటనే బాత్రూంలోకి వెళ్లి నోట్‌బుక్‌లో చూసుకుంటా" అని ఇషీ చెప్పారు.
ఈ నకిలీ బంధుత్వాల కారణంగా తన సొంత బంధుత్వాలపై ఎలాంటి ప్రభావం లేదని ఆయన అంటున్నారు.

ఇషీ అసలు వివాహమే చేసుకోలేదు, సొంత సంతానం లేదు. ఇకముందు వివాహం చేసుకోనని చెబుతున్నారు.
తాను పెళ్లి చేసుకుని సొంత కుటుంబాన్ని ప్రారంభిస్తే, ఆ 25 కుటుంబాల పిల్లలతో తనకున్న అనుబంధం దెబ్బతింటుందేమో అనిపిస్తోందని ఆయన అంటున్నారు.
ఈ సంస్థ ఉద్యోగులతో పాటు, వినియోగదారులకు కొన్ని కఠినమైన షరతులు ఉంటాయి. వారు చేతిలో చేయి వేయొచ్చు. కానీ, ముద్దు పెట్టుకోకూడదు, శృంగారంలో పాల్గొనకూడదు.
ఈ సంస్థ మొత్తం 30 రకాల సేవలు అందిస్తుంది. అందులో ఒక్కో సేవకు ప్రత్యేకంగా నియమ నిబంధనలు ఉంటాయి.
వినియోగదారులు నాలుగు గంటలకు 20,000 యెన్లు (రూ. 12,800) చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణం, ఆహారం ఖర్చులు అదనం.
ఇవి కూడా చదవండి:
- ట్రంప్‌తో డేటింగా.. నో నో!
- ఇచట పెళ్లి కొడుకుల్ని అద్దెకివ్వబడును!
- కేంద్ర సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం
- #ENGvSA ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 311/8.. దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 312
- క్రికెట్ ప్రపంచకప్ 2019 షెడ్యూలు.. ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు?
- మోదీ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్‌ను ఎందుకు ఆహ్వానించలేదు?
- ‘ఆంధ్రప్రదేశ్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్దాం’.. జగన్‌కు మోదీ శుభాకాంక్షలు
- పాకిస్తాన్‌కు నిద్రలేకుండా చేస్తున్న పాతికేళ్ల కుర్రాడు
- వరల్డ్ కప్ 1983: టీమ్ ఇండియా తొలి ప్రపంచ కప్ విజయం వెనుక కథ ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








