ఇచట పెళ్లి కొడుకుల్ని అద్దెకివ్వబడును!

పెళ్లికి ముందే తల్లయ్యే యువతుల సంఖ్య పెరుగుతోంది. దాంతోపాటే నకిలీ పెళ్లిళ్లూ పెరుగుతున్నాయి. ఫలితంగా అలాంటి పెళ్లిళ్లు చేసే వ్యాపారమూ విస్తరిస్తోంది. వియత్నాంలో ప్రస్తుతం కనిపిస్తోన్న పరిస్థితి ఇది.
ఆ దేశంలో అబార్షన్ల సంఖ్య ఎక్కువ. గతేడాది అధికారికంగా 3లక్షలకు పైగా అబార్షన్లు నమోదయ్యాయి.
పెళ్లికిముందే చాలామంది యువతీయువకులు ఇళ్లు అద్దెకు తీసుకొని కలిసుంటున్నారు. దాంతో అవాంఛిత గర్భాల సంఖ్యా పెరుగుతోంది.
పెళ్లికాకుండానే తల్లవుతోన్న చాలామంది యువతులు, సమాజం తమ గురించి ఏమనుకుంటుందోనని భయపడుతున్నారు.
అలాంటి వారి భయాన్ని కొన్ని సంస్థలు వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నాయి.
నకిలీ పెళ్లిళ్లు జరిపించి వారి సమస్యను గట్టెక్కిస్తున్నాయి.
యువతులు కూడా వీరి సేవల్ని బాగా వాడుకుంటున్నారు. అలా ఈ నకిలీ పెళ్లి సేవల్ని వినియోగించుకున్న వాళ్లలో ‘ఖా’ అనే యువతి కూడా ఉన్నారు.
‘ఖా’ పెళ్లికి ముందే తల్లయ్యారు. ఆ విషయం తెలిస్తే తన తల్లిదండ్రులు అవమానంతో కుంగిపోతారేమోనని ఆమె భయపడ్డారు. ఆ సమయంలోనే ఆమెకు నకిలీ పెళ్లిళ్లు జరిపించే ఓ సంస్థ గురించి తెలిసింది. దాని సాయంతో ఆమె తన సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేశారు.

‘నాకు అందరిలానే నిజంగా పెళ్లి జరిగినట్లు కనిపించడానికి ఓ సంస్థ అన్ని ఏర్పాట్లూ చేసింది. ఓ పెళ్లి కొడుకుని అద్దెకు తీసుకొచ్చింది. అద్దె బంధువులనూ ఏర్పాటు చేసింది’ అన్నారు ఖా.
ఈ నకిలీ పెళ్లికి 1500 డాలర్లు ఖర్చయ్యాయి. ఖా కడుపులో ఉన్న బిడ్డ తండ్రే వాటిని భరించాడు. అతడికి గతంలోనే మరో పెళ్లయింది.
అందరి దృష్టిలో ఇప్పుడామెకు పెళ్లయింది. కొన్నాళ్ల తరవాత భర్త తనను వదిలేసి వెళ్లాడని అందరికీ చెప్పడానికి ఖా నిర్ణయించుకుంది.
పెళ్లికిముందే తల్లయిన విషయం చెప్పి అవమానపడటం కంటే విడాకులు తీసుకున్న మహిళగా ఉండటమే మంచిదని ఆమె అభిప్రాయం.
ఇలా డబ్బు తీసుకొని నకిలీ పెళ్లిళ్లు చేసే వ్యాపారం వియత్నాంలో బాగా విస్తరిస్తోంది.
ఆ దేశంలో 15ఏళ్లు పైబడ్డ 70శాతం మంది పౌరులు పెళ్లయినవాళ్లే. దేశంలో సగం జనాభా 30ఏళ్ల లోపు వారే.
అవాంఛిత గర్భాలతో పాటు సమాజానికి భయపడేవారి సంఖ్యా పెరుగుతుండటంతో నకిలీ పెళ్లిళ్ల ట్రెండ్ కూడా ఎక్కువవుతోంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









