‘సాగర కన్య’లో సర్పాలు.. విశాఖ షిప్‌యార్డులోని ఓడలోకి పాములెలా చేరాయి? ఎలుకల కోసమే వచ్చాయా?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 5 నిమిషాలు
గత మూడు నెలలుగా విశాఖ షిప్ యార్డులో నిలిపి ఉంచిన ఒక నౌకలోకి వెళ్లేందుకు ఉద్యోగులు, కార్మికులు భయపడుతున్నారు. ఆ నౌక పేరు సాగరకన్య. అది ఒక సముద్ర పరిశోధన నౌక. ఆ నౌకలో పాములు ఉన్నాయంటూ తరచూ వార్తలు వస్తున్నాయి. కొన్నిసార్లు పాములు కనిపించడంతో కార్మికుల్లో భయం నెలకొంది.
ఈ నౌక మరమ్మతుల కోసం అండమాన్ నుంచి విశాఖ షిప్ యార్డ్‌కి సుమారు వంద రోజుల క్రితం వచ్చింది. మార్చ్ 3న ఆ నౌకలో ఒక పాము కనిపించింది. దానిని స్థానిక స్నేక్ క్యాచర్ నాగరాజు టీం పట్టుకుంది.
"అది నాగుపాము. దాదాపు 8 అడుగుల పొడవు ఉంది" అని నాగరాజు బీబీసీతో చెప్పారు.
"అక్కడికి నేను వెళ్లినప్పుడు, ఓడలో కొండచిలువ ఉన్నట్లు కార్మికులు వీడియోలు చూపించారు. అంతకు ముందు కూడా పాముందని ఫోన్ కాల్ వచ్చింది. వెళ్లాను కానీ.. దొరకలేదు" అని నాగరాజు బీబీసీతో అన్నారు.
ఆ నౌకలో పాములు ఉన్నాయంటూ కొంత గందరగోళం ఏర్పడిన మాట వాస్తవమేనని.. కానీ ప్రస్తుతం అలాంటిదేమీ లేదని షిప్‌యార్డ్ ఏజీఎం ఇనాయతుల్లా బేగ్ బీబీసీతో చెప్పారు.

అసలు నీట్లో ఉండే నౌకలోకి పాములెలా వస్తాయి? అవి సముద్ర పాములా?
ఈ విషయాల్లోకి వెళ్లే ముందు, సాగరకన్య నౌక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, UGC
సాగరకన్య నౌక విశేషాలు
'సాగర కన్య' ఓషన్ రీసెర్చ్ వెసెల్. సముద్రంపై శాస్త్రీయ పరిశోధనలు చేయడానికి ప్రత్యేకంగా సిద్ధం చేసిన నౌక ఇది. ఇందులో సిబ్బంది, శాస్త్రవేత్తలు కలిపి మొత్తం 40 మంది వరకు ఉండేందుకు సౌకర్యాలు ఉంటాయి. ఈ నౌకను ప్రధానంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, ఇతర సముద్ర పరిశోధన సంస్థలు ఉపయోగిస్తాయి.
ఈ నౌక సముద్ర ఉష్ణోగ్రత, లవణీయత, ప్రవాహాల వేగం, సముద్ర అడుగు భాగం పరిశోధనలు, ఖనిజాల అన్వేషణ, సముద్రంలో వాతావరణ మార్పులు వంటివి అధ్యయనం చేస్తుంది.
సాగరకన్య నౌక ప్రధానంగా హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో పరిశోధనలు చేస్తుంది.
నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఈ నౌకను కొంతకాలంగా అండమాన్‌లోని జెట్టీలో నిలిపి ఉంచారు.
అయితే దీనిని ఒక వ్యాపార సంస్థ కొనుగోలు చేసి మళ్లీ ఉపయోగించాలనే ఆలోచనతో.. మరమ్మతుల కోసం విశాఖ షిప్‌యార్డ్‌కు తీసుకువచ్చిందని షిప్‌యార్డ్ అధికారులు చెప్పారు.
అధ్యయన నౌకలో పాములు ఉన్నాయా?
మూడు నెలల క్రితం విశాఖ షిప్ యార్డ్‌కు చేరుకున్న సాగరకన్య నౌకను మరమ్మతుల కోసం జెట్టీలో ఉంచారు.
అయితే కొందరు కార్మికులు లోపలికి వెళ్లినప్పుడు.. పాములు కనిపించాయంటూ వారంతా బయటకు పరుగులు తీశారు.
"రెండు నెలల కిందట షిప్ రిపేర్ వర్క్ పనికి వచ్చాను. మెషిన్ వైపు వెళ్తుండగా...నౌకలో పాముతో పాటు రెండు పిల్లలు కూడా ఉన్నాయంటూ కేకలు వినిపించాయి. దాంతో అందరం భయపడిపోయి బయటకు వచ్చేశాం. ఇప్పుడు కొందరు ధైర్యం చేసి పని చేస్తున్నారు. మూడు రోజుల కిందట కూడా ఒక పాము కనిపించింది. దాన్ని పట్టుకున్నారు" అని షిప్ యార్డులో కూలి పనులకు వెళ్లే లక్ష్మణ్ చెప్పారు.
ఈ నౌక అండమాన్ నుంచి వచ్చింది. అది అండమాన్‌లో చాలా కాలం జెట్టీలోనే నిలిపి ఉంచారు. జెట్టీలో ఎక్కువ కాలం ఉండటంతో అక్కడ కొన్ని పాములు చేరే అవకాశం ఉందని షిప్ యార్డ్ ఏజీఎం బేగ్ బీబీసీతో చెప్పారు.
ప్రస్తుతం షిప్ మరమ్మతులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే దీనిని తిరిగి పంపించేస్తామని ఇనాయతుల్లా బేగ్ తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
పాములు ఓడలోకి ఎందుకెళ్లాయి..!
జెట్టీల్లో ఉంచిన ఓడల్లోకి పాములు వెళ్లే అవకాశం ఉంటుందా అని సముద్రంపై పరిశోధన నౌకల ద్వారా అధ్యయనాలు నిర్వహించే విశాఖలోని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఇంచార్జ్ గా పని చేసి పదవీ విరమణ చేసిన భామిరెడ్డితో బీబీసీ మాట్లాడింది.
"ఓడలను నెలల తరబడి జెట్టీలో ఉంచినప్పుడు అక్కడ పాములు చేరే అవకాశం ఉంది. జెట్టీల్లోని ఎలుకలు ఓడలోకి చేరతాయి. వాటి కోసం అక్కడ గ్యాంగ్ వే (నేల నుంచి షిప్‌లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకునే చిన్నవంతెన మార్గం) మీదుగా పాములు వచ్చి ఉండవచ్చు. అలాగే లంగరేసిన తాళ్ల నుంచి కూడా షిప్ లోకి వెళ్లే అవకాశం ఉంది’ అని భామిరెడ్డి చెప్పారు.
విశాఖలోని ఎఫ్ఎస్ఐకి చెందిన నౌక షికారాలోనూ నాలుగేళ్ల కిందట పాము వచ్చింది. అప్పడు స్నేక్ క్యాచర్‌ను పిలిపించి దానిని పట్టుకున్నామని భామిరెడ్డి గుర్తు చేసుకున్నారు.
"నిరుడు డాక్ యార్డ్‌లోని ఒక షిప్ లోకి పాము వచ్చింది. దానిని నేనే పట్టుకున్నాను" అని స్నేక్ క్యాచర్ నాగరాజు చెప్పారు.
పాములు షిప్పుల్లోనే ఎందుకుండిపోతాయంటే...
ప్రస్తుతం పాములు ఉన్నాయంటున్న నౌకలోనే గతంలో పరిశోధనలు చేసిన ఏయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ సి. మంజులత బీబీసీతో మాట్లాడారు.
"పోర్ట్‌ల దగ్గర ఎలుకలు చాలా ఉంటాయి. పాములు వాటిని తినడానికి షిప్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఎక్కడైనా చీకటి ఉంటే అక్కడ దాక్కునేందుకు మంచి స్థలంగా పాములు భావిస్తాయి. జెట్టీలో నెలల తరబడి కదలకుండా ఉండే షిప్ లోపల కూడా చీకటిగానే ఉంటుంది. షిప్‌లో ఒక ఎలుకని పాము తింటే...కొన్ని రోజుల వరకు దానికి ఆహారం అక్కర్లేదు. దాంతో అక్కడే ఉండిపోతుంది" అని ఆమె చెప్పారు.
అలాగే నౌకలో ఇంజిన్ రూమ్ దగ్గర వేడి, స్టోర్ రూమ్‌లలో చీకటి ఉంటాయి. ఇవి పాములకు దాక్కునేందుకు అనువైన ప్రదేశాలు.
షిప్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వల్ల ఎలుకలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి కోసం పాములు కూడా షిప్‌లోకి వచ్చే అవకాశముందని ఏయూ జువాలజీ ప్రొఫెసర్ సి.మంజులత బీబీసీతో చెప్పారు.
"1986లో నేను ఆ నౌకలో 35 రోజులు ఉన్నాను. పరిశోధనల కోసం అండమాన్ వెళ్లాను." అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
నాగుపాము, కొండచిలువ..
సాగరకన్య నౌకలో నాగుపాముని పట్టుకున్నానని స్నేక్ క్యాచర్ నాగరాజు చెప్పడంతో పాటు...కొండ చిలువ కూడా ఆ షిప్‌లో ఉందనే వీడియోలు కార్మికులు తనకి చూపించారని తెలిపారు. అవే కాకుండా మరికొన్ని చిన్న పాములు, మరో రకం పాములు చూశామని చెప్పారని నాగరాజు బీబీసీతో అన్నారు.
దాదాపు మూడు గంటలు వెతికిన తర్వాతే ఆ నాగుపాము దొరికిందని నాగరాజు చెప్పారు.
"అండమాన్‌లో అండమాన్ కోబ్రా అనే జాతి ఉంది. ఇది మనం నాగుపాము అని పిలిచే రకం. కొండ చిలువలుగా పిలిచే పాము జాతికే చెందిన ఇండియన్ రాక్ ఫైథాన్ అండమాన్ దీవుల్లో ఉంటాయి. ఇవి పెద్ద పాములే కానీ నెమ్మదిగా ఉంటాయి" అని ప్రొఫెసర్ సి. మంజులత బీబీసీకి చెప్పారు.
సముద్రంలో కూడా సీ స్నేక్స్‌గా వ్యవహరించే పాములు ఉంటాయని, అవి ప్రధానంగా హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్రం ప్రాంతాల్లో కనిపిస్తాయని ప్రొఫెసర్ మంజులత చెప్పారు.
అయితే ఇవి నౌకల్లోకి రావడం అరుదని ఆమె తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














