ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం: అంతర్జాతీయ చట్టాలను ఎవరు ఉల్లంఘించారు?

ఫొటో సోర్స్, Amirhossein Khorgooei/ISNA/West Asia News Agency via Reuters
- రచయిత, లూయీ బారుష్
- హోదా, డబ్ల్యూఎస్ఎల్ గ్లోబల్ జర్నలిజం
- చదివే సమయం: 7 నిమిషాలు
అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై చేసిన దాడులు.. ప్రతిగా ఇరాన్ చేపట్టిన ప్రతీకార చర్యలు ఇప్పటివరకు చాలా మంది పౌరుల ప్రాణాలను బలిగొన్నాయి.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఈ యుద్ధాన్ని ఖండిస్తూ, రెండు పక్షాలూ అంతర్జాతీయ చట్టాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
రెండు పక్షాలూ తాము సరిగ్గానే వ్యవహరిస్తున్నామని వాదిస్తున్నప్పటికీ, ఇరాన్‌పై జరిగిన ప్రారంభ దాడులు చట్టబద్ధమైనవా కాదా అని నిర్ణయించడానికి ఒకసారి గతాన్ని పరిశీలించాలి.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన భయంకరమైన సంఘటనల తర్వాత రూపొందించిన అంతర్జాతీయ చట్ట ప్రమాణాలను మళ్లీ చూడాల్సి ఉంది. ఆ చట్టాలకు చాలా దేశాలు అంగీకారం తెలిపాయి.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై బాంబు దాడులు మొదలుపెట్టినప్పుడు... ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని, అవి అమెరికా మిత్రదేశాలను ముప్పు అని.. త్వరలో అమెరికాను కూడా టార్గెట్ చేస్తాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

అయితే మార్చి 2న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ 'ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేయబోతుందని అమెరికా ప్రభుత్వానికి ముందే తెలుసు. ఆ తర్వాత ఇరాన్ అమెరికాను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భావించారు. అందుకే అమెరికా ముందుగానే ఇరాన్‌పై దాడి చేయాల్సి వచ్చింది' అని అన్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ బీబీసీ రేడియో 4 టుడే కార్యక్రమంలో మాట్లాడుతూ... 'బాంబు తయారీకి ఇరాన్ ప్రణాళికలు' తమ దాడులకు కారణమని అన్నారు.
ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై, అలాగే అమెరికా సైనిక స్థావరాలు ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలపై దాడులు చేసింది. దీన్ని ఇరాన్ ‘ఆత్మరక్షణ చర్య’గా పేర్కొంది.
ఈ యుద్ధంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రకారం ఇరాన్‌లో 780 మందికి పైగా మరణించారు. ఇందులో ఒక పాఠశాలపై అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడిలో మరణించిన 165 మంది బాలికలు, సిబ్బంది ఉన్నారు.
అయితే ఈ దాడి తామే చేశామని అమెరికాగానీ, ఇజ్రాయెల్‌గానీ ఇంకా అంగీకరించలేదు.
సోమవారం లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కూడా 50 మందికి పైగా మరణించారు.
మరోవైపు ఇజ్రాయెల్, ఇతర గల్ఫ్ దేశాలలో ఆరుగురు అమెరికన్ సైనికులు సహా పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు.

ఫొటో సోర్స్, EPA
ఈ దాడులు చట్టపరంగా సమర్థనీయమా?
అమెరికా–ఇజ్రాయెల్ తొలుత చేసిన దాడులను సమర్థించుకోవడానికి కావలసిన చట్టపరమైన అనుకూలతలు కనిపించడం లేదు. అదే సమయంలో, ఇరాన్ చేసిన ప్రతిదాడి కూడా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా పరిగణించవచ్చు అని బీబీసీతో మాట్లాడిన న్యాయనిపుణులు అంటున్నారు.
ఒక దేశం సాధారణంగా మరో దేశంపై సైనిక శక్తిని ఉపయోగించడానికి అనుమతి లేదు, ప్రత్యేక మినహాయింపులు అమలులో ఉన్నప్పుడే అది సాధ్యం అని ఐక్యరాజ్యసమితి చార్టర్( ఇది ఈ సంస్థ ప్రాథమిక పత్రం)లో ఉంది.
ఇందులో రెండు ప్రధాన నిబంధనలు:
- ఆర్టికల్ 2(4): మరొక దేశానికి వ్యతిరేకంగా బలప్రయోగం లేదా బలప్రయోగ బెదిరింపులను నిషేధిస్తుంది.
- ఆర్టికల్ 51: సాయుధ దాడికి ప్రతిస్పందనగా బలప్రయోగాన్ని అనుమతిస్తుంది.

ఫొటో సోర్స్, Reuters
అయితే ఇప్పుడు చట్టపరమైన ప్రశ్న ఏంటంటే.. ఇరాన్ నుంచి ఏదైనా దాడి జరుగుతుందన్న బెదిరింపు ఉందా? అనేది.
బ్రిటన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్‌లో అంతర్జాతీయ న్యాయ నిపుణురాలు సుసాన్ బ్రో మాట్లాడుతూ, "దాడి జరగబోతుందనే స్పష్టమైన, నిర్ధరిత సాక్ష్యం" ఉండాలి. కానీ అలాంటి ఆధారాలేవీ తనకు కనిపించలేదని అన్నారు.
ప్రఖ్యాత మానవ హక్కుల న్యాయవాది సర్ జియోఫ్రీ నైస్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. 1998 నుంచి 2006 వరకు అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్‌లో యుగోస్లావియా మాజీ అధ్యక్షుడు స్లోబోడాన్ మిలోషేవిచ్‌పై విచారణకు ఆయన నేతృత్వం వహించారు.
"ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు" అని ఆయన చెప్పారు.
"యుద్ధం ప్రారంభమే చట్టవిరుద్ధం అయ్యే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.
ఇరాన్‌పై ఈ సైనిక చర్య చట్టవిరుద్ధం అని అమెరికాలోని చాలా మంది డెమోక్రటిక్ నాయకులు అంటున్నారు. ఎందుకంటే యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్‌కే ఉంది.
అయితే, కమాండర్-ఇన్-చీఫ్ హోదాలో, అమెరికా అధ్యక్షుడు అధికారిక యుద్ధ ప్రకటన లేకుండా కొన్ని పరిమిత సైనిక చర్యలు చేపట్టవచ్చు.

ఫొటో సోర్స్, Reuters
2025 జూన్‌లో మూడు అణు కేంద్రాలపై బాంబు దాడి తర్వాత అమెరికా.. ఇరాన్‌తో చర్చలు జరపడానికి ప్రయత్నించిందని అయితే ఇరాన్ ప్రతిసారి తన అణు ప్రణాళికల నుంచి వెనక్కి తగ్గేందుకు నిరాకరించింది' అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
ఇరాన్ తన అణుశక్తిని మళ్లీ నిర్మించుకుంటోంది, అమెరికా మిత్రదేశాలు, విదేశాల్లో ఉన్న అమెరికా సైనికులు, చివరికి అమెరికా భూభాగాన్నికూడా లక్ష్యంగా చేసుకునేలా దీర్ఘ శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేస్తోంది అని ఆయన వాదించారు.
"అమెరికా లేదా ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడిచేయలానే నిర్ణయం తీసుకునే ముందు నుంచే, ఇరాన్ తమ క్షిపణి దళాలను దాడి కోసం సిద్ధం చేస్తున్నట్లు సూచించే అనేక నివేదికలు ఉన్నాయి" అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలి పరిపాలన సమయంలో ఆయన నిఘా , భద్రతా బృందంలో భాగమైన ఎజ్రా కోహెన్ అన్నారు.
'ఇరాన్ భారీ అణు ప్రణాళిక కలిగి ఉంది, కానీ కానీ అణు ఆయుధాలు తయారు చేయడానికి స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆధారాలు లేవు' అని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ రాఫెల్ గ్రాసీ సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు.
ఇరాన్ చాలాఏళ్లపాటు దీర్ఘ శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయలేకపోయిందని యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) మే 2025 పేర్కొంది.
నిరుడు జరిగిన 12 రోజుల ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో ఇరాన్ అణుశక్తి పూర్తిగా నాశనమైందని ట్రంప్ గతంలో చెప్పిన మాట, ఇప్పుడు ఇరాన్ నుంచి ముప్పు ఉందని చెబుతుండడంతో ఈ రెండిటికీ పోలికే లేదని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
అంతర్జాతీయ చట్టంలో అతిపెద్ద వివాదం ఏమిటంటే దాడి చేసే అవకాశం ఉంది అన్న నిర్వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
'సాధారణంగా ముందస్తు చర్య అంటే "దాడి ఖచ్చితంగా జరగబోతున్న చివరి క్షణంలో దాన్ని ఆపడం' అని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ నిపుణుడు మార్క్ వెల్లర్ వివరిస్తున్నారు.
ఒక దేశం ఆత్మరక్షణలో బలాన్ని ఉపయోగించడం ఎప్పుడు చట్టబద్ధం అవుతుంది? అనే విషయంపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోందని సుసాన్ బ్రో అన్నారు. దాడి ప్రారంభమైన తర్వాత మాత్రమే అని కొంతమంది అంటుంటే, మరికొందరు మాత్రం దాడి త్వరలో జరగబోతుందని విశ్వసనీయమైన ఆధారాలు ఉంటే, దాన్ని అడ్డుకోవడానికి చేసిన చర్యలు సమంజసమైనవిగా పరిగణించవచ్చని భావిస్తున్నారు.
ఆత్మరక్షణ చర్యలు నిజంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే సమంజసమవుతాయి, అలాగే ప్రతిస్పందన కూడా అవసరమైనంత పరిమితంగా ఉండాలి అని సుసాన్ చెప్పారు.
1967 ఆరు రోజుల యుద్ధంలో ఈజిప్టుపై ఇజ్రాయెల్ చేసిన దాడి ఆధునిక చరిత్రలో ముందస్తు ఆత్మరక్షణకు అత్యంత ప్రసిద్ధ ఉదాహరణలలో ఒకటి అని వెల్లర్ , బ్రో ఇద్దరూ అంగీకరిస్తున్నారు.
ఆ సమయంలో ఈజిప్టు సైన్యం సరిహద్దు వద్ద గుమిగూడి దాడి చేస్తుందని చాలా మంది నమ్మారని, కానీ అప్పుడు కూడా ఇజ్రాయెల్ చర్యలు వివాదాస్పదంగా పరిగణించారని బ్రో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్ ప్రతీకార చర్య చట్టబద్ధమైనదేనా?
ఇరాన్ కూడా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించి ఉండవచ్చని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ "విచక్షణారహిత దాడులు" అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని వెల్లర్ అన్నారు.
ఇరాన్ ఆత్మరక్షణ కోసం అని చెప్పుకున్నప్పటికీ ప్రతిస్పందన దామాషా ప్రకారం ఉండాలి అని సర్ జియోఫ్రీ నైస్ అంటున్నారు.
"ఇరాన్ ఉపయోగిస్తున్న క్షిపణులు వాటి దిశ, లక్ష్యంలో కచ్చితత్వం లేకపోవడంతో వాటిని సులభంగా అసమానమైనవిగా, చట్టవిరుద్ధంగా పిలుస్తారు" అని ఆయన అన్నారు.
దుబాయ్‌లోని ప్రసిద్ధ ఫెయిర్‌మాంట్ హోటల్‌పై ఇరాన్ దాడిని ఉదహరిస్తూ.. "ఇది సైనిక లక్ష్యం కాదు పౌర నిర్మాణం" అని బ్రో అన్నారు.

ఫొటో సోర్స్, West Asia News Agency via Reuters
చట్టవిరుద్ధమైన బలప్రయోగాన్ని స్పష్టంగా గుర్తించకపోతే, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ క్రమేణా బలహీనపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా జరిగితే ఇతర దేశాలు కూడా అదే తర్కాన్ని ఉపయోగించి బలప్రయోగం చేసే అవకాశం ఉందంటూ చైనాను ఉదాహరణగా చెబుతున్నారు. చైనా తైవాన్‌ను తననుంచి విడిపోయిన ప్రావిన్స్‌గా భావిస్తుంది.
"అంతర్జాతీయ వ్యవస్థకు పెద్ద ప్రమాదం ఏమిటంటే, మనం చట్టవిరుద్ధమైన బలప్రయోగాన్ని అంగీకరించడం" అని బ్రో అన్నారు.
భవిష్యత్తులో రష్యా మరింత దూకుడుగా వ్యవహరించడం లేదా చైనా విస్తరణ చర్యలను వ్యతిరేకించడం కష్టమవుతుందని, అప్పుడు అమెరికా సహా ఇతర దేశాలు "దీని వల్ల చట్టపరమైన, నైతిక విశ్వసనీయత కోల్పోయామని పశ్చాత్తాపపడతాయని చాథమ్ హౌస్ కోసం రాసిన ఒక వ్యాసంలో వెల్లర్ అన్నారు.
శక్తిమంతమైన దేశాలు పదేపదే అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, దాని ఫలితాలు ఎదుర్కోకుండా కొనసాగితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన వ్యవస్థ కూలిపోవచ్చు. దాని స్థానంలో "బలవంతుడి చట్టం" అనే కొత్త ప్రపంచం ఏర్పడే ప్రమాదం ఉంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














