జాతీయ జలమార్గాలు, రైల్వే కారిడార్లు, ఆరెంజ్ ఎకానమీ.. కేంద్ర బడ్జెట్‌లో తెలుసుకోవాల్సిన 10 ముఖ్యాంశాలు

ఆరెంజ్ ఎకానమీ, గేమింగ్, వార్షిక బడ్జెట్

ఫొటో సోర్స్, PonyWang/Getty Images

ఫొటో క్యాప్షన్, ఆరెంజ్ ఎకానమీ అనేది సృజనాత్మకత, నైపుణ్యాలు, మేధో సంపత్తిపై ఆధారపడిన రంగాలను సూచిస్తుంది. దీని గురించి బడ్జెట్లో ప్రస్తావించారు.
    • రచయిత, వద్ది ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఈ బడ్జెట్ మూడు ప్రధాన "కర్తవ్యాల" ప్రాతిపదికన రూపొందించినట్లు మంత్రి ప్రకటించారు:

మూడు ప్రధాన కర్తవ్యాలు:

  • ఆర్థిక వృద్ధి వేగవంతం
  • ప్రజల సామర్థ్యం పెంపు
  • సమగ్రాభివృద్ధిని సాధించడం.

ఈ బడ్జెట్‌లో మొత్తం వ్యయం రూ. 53.47 లక్షల కోట్లుగా అంచనా వేశారు.

బడ్జెట్‌లో తయారీ, మౌలిక వసతులు, రవాణా, ఎనర్జీ వంటి రంగాలకు ప్రాధాన్యం, అదే సమయంలో విద్య, ఆరోగ్యం, మహిళల సంక్షేమం, పర్యటక రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో, వార్షిక బడ్జెట్‌‌ 2026లో గమనించదగిన 10 ముఖ్యాంశాలు ఒకసారి తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నిర్మలా సీతారామన్, వార్షిక బడ్జెట్ 2026

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

1. రైల్వే కారిడార్లు- హైస్పీడ్ కనెక్టివిటీ

భారతదేశానికి తూర్పున ఉన్న డాంకుని నుంచి పడమరలోని సూరత్ వరకు కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ప్రత్యేక రైల్వే రవాణా మార్గాన్ని ) నిర్మించనున్నారు.

అదనంగా, 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లు: ముంబయి–పుణె, పుణె–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, చెన్నై–బెంగళూరు, దిల్లీ–వారణాసి, వారణాసి–సిలిగురి ప్రకటించారు.

రైల్వే కారిడార్లు, కేంద్ర బడ్జెట్

ఫొటో సోర్స్, David Talukdar/NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

2. మౌలిక వసతులు – భారీ పెట్టుబడులు

మౌలిక సదుపాయాల కల్పన కోసం 'ప్రజా మూలధన వ్యయాన్నిను ఈ బడ్జెట్లో రూ. 12.2 లక్షల కోట్లకు పెంచారు.

మౌలిక వసతుల నిర్మాణంలో ప్రైవేట్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి 'ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారెంటీ ఫండ్' ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

నేషనల్ వాటర్ వే, వార్షిక బడ్జెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

3. జాతీయ జలమార్గాలు

పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు రాబోయే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాల(నేషనల్ వాటర్‌వేస్)ను కార్యాచరణలోకి తీసుకురానున్నారు.

మొదటి దశలో ఎన్‌డబ్ల్యూ-5 ద్వారా ఒడిశాలోని తల్చర్, అంగుల్ ఖనిజ ప్రాంతాలను పరదీప్, ధమ్రా పోర్టులతో అనుసంధానం చేస్తారు.

వారణాసి, పట్నాలలో 'షిప్ రిపేర్ ఎకోసిస్టమ్' ఏర్పాటు చేయనున్నారు. మారుమూల ప్రాంతాల అనుసంధానం, పర్యటక ప్రాంతాల అభివృద్ధికి 'సీప్లేన్ వీజీఎఫ్ స్కీం' ప్రవేశపెట్టారు.

నిర్మలా సీతారామన్, వార్షిక బడ్జెట్ 2026

ఫొటో సోర్స్, Getty Images

4. తయారీ రంగం – వ్యూహాత్మక విస్తరణ

బయోఫార్మా, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాలలో తయారీని పెంచే కార్యక్రమాలను బడ్జెట్‌లో ప్రస్తావించారు.

రాబోయే ఐదేళ్లలో బయో ఫార్మా తయారీని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభించారు.

చిప్ తయారీలో భారత్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫాక్ఛరింగ్ స్కీం కింద రూ. 40,000 కోట్లు కేటాయించారు.

అలాగే, ఖనిజాల వెలికితీత కోసం ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా సహా 5 రాష్ట్రాల్లో 'రేర్ ఎర్త్ కారిడార్లు' ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ కామిక్స్ రంగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

5. ఆరెంజ్ ఎకానమీ

"భారతదేశంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ కామిక్స్ రంగం అభివృద్ధి చెందుతోంది. దీనికి 2030 నాటికి 20 లక్షల మంది నిపుణులు అవసరం" అని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అన్నారు.

15,000 మాధ్యమిక పాఠశాలలు, 500 కళాశాలల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంలో ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్‌కు సాయం చేసేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు.

ఆరెంజ్ ఎకానమీ, లేదా క్రియేటివ్ ఎకానమీ అనేది సృజనాత్మకత, నైపుణ్యాలు, మేధో సంపత్తిపై ఆధారపడిన రంగాలను సూచిస్తుంది. వీటిలో కళ, డిజైన్, ఫ్యాషన్, సినిమా, సంగీతం, డిజిటల్ కంటెంట్ ఉన్నాయి.

కేంద్ర బడ్జెట్, వైద్యం, మెడిసిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

6. ఔషధాలపై సుంకాల తగ్గింపు

వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే 'సుంకం విధించదగిన అన్ని వస్తువుల'పై టారిఫ్ రేటును 20 నుంచి 10 శాతానికి తగ్గించారు.

అంతేకాదు, 17 ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తొలగించారు.

ఏడు అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులు, ప్రత్యేక ఆహారంపై గతంలో ఉన్న దిగమతి పన్నులను రద్దు చేశారు.

బాలికల హాస్టల్, వార్షిక బడ్జెట్ 2026

ఫొటో సోర్స్, Christian Ender/Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

7. ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్

దేశంలో ప్రతీ జిల్లాలో బాలికలకు వసతి గృహాలు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ మద్దతుతో దీన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

దేశంలో మూడు ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీల ఏర్పాటును ప్రకటించారు.

సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్‌నగర్‌లో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.

వాణిజ్యం, వార్షిక బడ్జెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో బ్యాగేజీ నిబంధనలను సవరించనున్నారు.

8. సులభతర వాణిజ్యం

ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా, కస్టమ్స్ క్లియరెన్స్‌కు అవసరమైన అనుమతులను వివిధ ప్రభుత్వ ఏజెన్సీల నుంచి సింగిల్ డిజిటల్ విండో ద్వారా పొందే విధానాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు.

భారతీయ మత్స్యకార నౌకలు భారత్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఈఈజెడ్) లేదా అంతర్జాతీయ సముద్రాల్లో పట్టే చేపలపై ఇకపై సుంకం ఉండదు. ఈ చేపలను విదేశీ పోర్టుల్లో దించితే, అవి ఎగుమతులుగా పరిగణిస్తారు.

కొరియర్ ద్వారా చేసే ఎగుమతులపై ఉన్న ఒక్కో సరుకు విలువ పరిమితి(రూ. 10 లక్షలు)ని తొలగించారు. దీంతో చిన్న వ్యాపారులు, కళాకారులు, స్టార్టప్‌లు ఈ-కామర్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా వస్తువులు పంపవచ్చు.

అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో బ్యాగేజీ నిబంధనలను సవరించనున్నారు. ప్రస్తుత ప్రయాణ అవసరాలకు అనుగుణంగా సుంకం లేకుండా తీసుకురాగల వస్తువుల పరిమితిని పెంచనున్నారు.

వివాదాలు పరిష్కరించుకోవాలనుకునే పన్ను చెల్లింపుదారులు జరిమానాకు బదులుగా అదనపు మొత్తాన్ని చెల్లించడం ద్వారా కేసులను క్లోజ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

టూరిస్టులు, భారత్, వార్షిక బడ్జెట్

ఫొటో సోర్స్, swissmediavision/getty

ఫొటో క్యాప్షన్, దేశంలో 20 పర్యటక ప్రాంతాల్లో పనిచేసే 10,000 మంది టూరిస్ట్ గైడ్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

9. పర్యటకం

దేశంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో పనిచేసే 10,000 మంది టూరిస్ట్ గైడ్స్‌కు నైపుణ్యాలు పెంచేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇందులో ఐఐఎంతో కలిసి 12 వారాల పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో నాణ్యమైన శిక్షణ ఇస్తారు.

నేననల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ ఏర్పాటుచేసి వారసత్వ, సాంస్కృతిక ప్రదేశాలను డిజిటల్‌గా డాక్యుమెంట్ చేయనున్నారు.

లోథాల్, ధోలావీర, రాఖీగర్హి, ఆదిచనల్లూర్, సారనాథ్, హస్తినాపూర్, లేహ్ ప్యాలెస్‌తో సహా 15 పురావస్తు ప్రదేశాలను సాంస్కృతిక ప్రదేశాలుగా అభివృద్ధి చేయనున్నారు.

10. పర్యావరణ పరిరక్షణ

కార్బన్ ఉద్గారాల నియంత్రణ కోసం కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ (సీసీయూఎస్) టెక్నాలజీలకు రూ.20,000 కోట్లు (5 సంవత్సరాలకు) కేటాయించారు.

దీర్ఘకాలిక ఎనర్జీ సెక్యురిటీ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలకు ఇది తోడ్పడనుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)