ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది? 7 అంచనాలు

అమెరికా, ఇరాన్, డోనల్డ్ ట్రంప్, సర్జికల్ స్ట్రైక్స్, ఇరాన్ అణు కార్యక్రమం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్, అలీ ఖమేనీ

అమెరికా కొన్ని రోజుల్లో ఇరాన్‌పై దాడి చేయబోతుందన్నది కొందరి అంచనా.

అయితే, ఈ దాడి ఫలితం ఎలా ఉంటుందో అంచనా వేయడం అంత తేలిక కాదు.

దాడి చేయాలంటూ అమెరికా బలగాలను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆదేశిస్తే కలిగే పరిణామాలు ఏంటి?

ఇరాన్‌పై అమెరికా చర్యలు ఎలా ఉండొచ్చు.. వాటి పరిణామాలు ఎలా ఉండొచ్చు?

1. పౌరుల భద్రతను కాపాడుతూ లక్ష్యాలపై సర్జికల్ స్ట్రైక్స్

అమెరికా వైమానిక, నావికా దళాలు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ), బసీజ్ యూనిట్ సైనిక స్థావరాలు (ఐఆర్‌జీసీ నియంత్రణలో ఉన్న పారామిలిటరీ దళం), బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి నిల్వ కేంద్రాలపై అమెరికా దాడి చేయొచ్చు.

దీంతోపాటు ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని కచ్చితమైన దాడులు చేయగలదు.

ఈ దాడులు ఇప్పటికే బలహీనపడిన ప్రభుత్వం పతనానికి దారితీస్తే చివరకు ఇరాన్‌కు నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. ఇరాన్ మిగిలిన ప్రపంచంతో తిరిగి అనుసంధానమవుతుంది.

అయితే, గతంలో ఇరాక్, లిబియా రెండింటిలోనూ పాశ్చాత్య సైనిక జోక్యం జరిగిన వెంటనే ప్రజాస్వామ్యం నెలకొనలేదు.

రెండు సందర్భాల్లోనూ ఈ జోక్యం క్రూరమైన నియంతృత్వ పాలనలను అంతం చేసినప్పటికీ అది సంవత్సరాల తరబడి గందరగోళం, రక్తపాతానికి దారితీసింది.

2024లో పాశ్చాత్య సైనిక సహాయం లేకుండానే సొంత తిరుగుబాటుతో సిరియా ప్రజలు అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ను గద్దెదించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

2. ఇరాన్ విధానాలపై నియంత్రణ

దీనిని విస్తృతంగా "వెనెజ్వెలా మోడల్" అని పిలుస్తారు. ఇది ప్రభుత్వాన్ని యథావిధిగా ఉంచుతుందిగాని దాని విధానాలను మారుస్తుంది.

ఇరాన్ విషయానికొస్తే ఇస్లామిక్ రిపబ్లిక్ మనుగడ సాగిస్తుంది. ఇది ఎక్కువమంది ఇరాన్ ప్రజలను సంతృప్తిపరచదు. కానీ పశ్చిమాసియా అంతటా హింసాత్మక మిలీషియాలకు దాని మద్దతును తగ్గించాల్సి ఉంటుంది.

ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిలిపివేయాలి లేదా తగ్గించాలి. అలాగే నిరసనలపై అణచివేతను నియంత్రించాలి.

ఈ పరిస్థితి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ.

ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వం 47 సంవత్సరాలుగా తన విధానాలలో స్థిరంగా ఉంది. మార్పును స్వాగతించలేదు.

అమెరికా, ఇరాన్, డోనల్డ్ ట్రంప్, సర్జికల్ స్ట్రైక్స్, ఇరాన్ అణు కార్యక్రమం

3. సైనిక ప్రభుత్వం ఏర్పాటు?

చాలా మంది ఈ పరిస్థితి అత్యంత సహజమని భావిస్తారు.

ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వానికి ప్రజాదరణ అంతగా లేదన్నది నిరసనల ఆధారంగా స్పష్టమవుతోంది. కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రతి కొత్త నిరసన కార్యక్రమం ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నట్టు కనిపిస్తోంది.

అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితిని కొనసాగించగల విస్తృతమైన భద్రతా యంత్రాంగం ఇరాన్‌కు ఉంది.

ఈ నిరసనలు ఇప్పటిదాకా ప్రభుత్వాన్ని పడగొట్టలేకపోయాయి. ప్రస్తుత పాలకులు అధికారాన్ని నిలుపుకోవడానికి అపరిమితమైన బలప్రయోగం, క్రూరత్వాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారు.

అమెరికా దాడి చేస్తే, తర్వాత తలెత్తే గందరగోళంలో ఇరాన్‌ను బలమైన, సైనిక ప్రభుత్వం పాలించే అవకాశం ఉంది.

అమెరికా, ఇరాన్, డోనల్డ్ ట్రంప్, సర్జికల్ స్ట్రైక్స్, ఇరాన్ అణు కార్యక్రమం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జనవరి మొదటి వారంలో ఇరాన్ వీధుల్లో ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు జరిగాయి.

4. అమెరికా దళాలు, పొరుగు దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు?

అమెరికా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని, అందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అంటోంది.

అమెరికా, నేవీ, వైమానిక దళం శక్తికి ఇది సరిపోలదని స్పష్టంగా తెలుస్తుంది. కానీ బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో ఇరాన్ దాడులు చేయగలదు. ఇవి చాలా వరకు గుహలలో, భూగర్భంలో లేదా మారుమూల పర్వతాలలో ఉన్నాయి.

అమెరికా స్థావరాలు గల్ఫ్‌లోని అరేబియా సముద్రం వైపు, ముఖ్యంగా బహ్రెయిన్, ఖతార్‌లలో ఉన్నాయి. అయితే ఇరాన్ అనుకుంటే అమెరికా దాడిలో భాగస్వామిగా భావించే జోర్డాన్ వంటి ఏ దేశంలోనైనా కీలకమైన మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చు.

2019లో సౌదీ అరామ్‌కో పెట్రోకెమికల్ స్థావరాలపై విధ్వంసకర క్షిపణులు, డ్రోన్లతో దాడి జరిగింది. దీనికి ఇరాక్‌లో ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియాలే కారణమన్న ఆరోపణలు వినిపించాయి.

ఇరాన్ క్షిపణులకు తామెంత తేలికపాటి లక్ష్యంగా ఉన్నాయో ఈ దాడులు సౌదీకి తెలియజేశాయి.

గల్ఫ్‌లోని ఇరాన్ అరబ్ పొరుగు దేశాలు ఇప్పుడు సహజంగానే చాలా ఆందోళన చెందుతున్నాయి. ఇవన్నీ అమెరికా మిత్రదేశాలు.

అమెరికా తీసుకునే ఏదైనా సైనిక చర్య వల్ల తమకు ఎదురుదెబ్బ తగలవచ్చని భయపడుతున్నాయి.

అమెరికా, ఇరాన్, డోనల్డ్ ట్రంప్, సర్జికల్ స్ట్రైక్స్, ఇరాన్ అణు కార్యక్రమం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, జనవరి తొలినాళ్లలో ఇంటర్నెట్ నిలిపివేసినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల దృశ్యాలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.

5. గల్ఫ్‌లో మందుపాతరలు పేల్చడం ద్వారా ఇరాన్ ప్రతీకారం?

ఇరాన్-ఇరాక్ యుద్ధం నుంచి ప్రపంచ షిప్పింగ్, చమురు సరఫరాలకు ముప్పుకలిగించగలస్థితిలో ఇరాన్ ఉంది.

ఆ యుద్ధం సమయంలోనే జల రవాణా మార్గాల్లో మందుపాతరలు ఉంచింది. రాయల్ నేవీ మైన్‌స్వీపర్లు వాటిని తొలగించడంలో సహాయపడ్డాయి.

ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న ఇరుకైన హార్ముజ్ జలసంధి కీలకమైనది.

ప్రపంచంలోని ఎల్ఎన్‌జీ ఎగుమతుల్లో దాదాపు 20శాతం , చమురు, చమురు ఉత్పత్తులలో 20–25శాతం రవాణా ఏటా ఈ మార్గంలో సాగుతుంది.

ఇరాన్ సముద్రంలో వేగంగా మందుపాతరలు అమర్చడం అలవాటు చేసుకుంది. ఇరాన్ అలా చేస్తే అది కచ్చితంగా ప్రపంచ వాణిజ్యం, చమురు సరఫరాలు, ధరలపై ప్రభావం చూపుతుంది.

అమెరికా, ఇరాన్, డోనల్డ్ ట్రంప్, సర్జికల్ స్ట్రైక్స్, ఇరాన్ అణు కార్యక్రమం
ఫొటో క్యాప్షన్, ప్రపంచ చమురు రవాణాలో 20 నుంచి 25 శాతం హార్ముజ్ జలసంధి మీదుగా వెళుతోంది.

6. అమెరికా యుద్ధనౌకను ముంచివేయడం

ఇరాన్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలపై అధిక పేలుడు జరపగల డ్రోన్లు, వేగవంతమైన టార్పెడో బోట్లను పెద్దసంఖ్యలో ప్రయోగిస్తుంది.

అమెరికా బలమైన నావికా దళం కూడా వాటన్నింటినీ సకాలంలో నాశనం చేయలేదు.

గల్ఫ్‌లోని సంప్రదాయ ఇరానియన్ నావికాదళం స్థానంలో ఐఆర్‌జీసీ నావికాదళం ఉంది.

ఇరాన్ నావికా దళాలు తమ శిక్షణలో ఎక్కువ భాగాన్ని అసాధారణ యుద్ధంపై, ప్రధాన ప్రత్యర్థి అయిన అమెరికా నౌకాదళం ఫిఫ్త్ ఫ్లీట్‌కున్న సాంకేతిక ఆధిక్యాలను అధిగమించడానికున్న మార్గాలపై కేంద్రీకరించాయి.

ఒక అమెరికా యుద్ధనౌక మునిగిపోవడం అమెరికాకు తీవ్ర అవమానం.

అలాంటిది అసాధ్యమని భావించినప్పటికీ 2000 సంవత్సరంలో అడెన్ ఓడరేవులో అల్-ఖైదా ఆత్మాహుతి దాడిలో బిలియన్ డాలర్ల విలువైన డిస్ట్రాయర్ యూఎస్ఎస్ కోల్ తీవ్రంగా దెబ్బతింది. 17 మంది అమెరికా నావికులు మరణించారు.

అంతకుముందు 1987లో ఒక ఇరాకీ జెట్ పైలట్ అనుకోకుండా రెండు క్షిపణులను అమెరికన్ యుద్ధనౌక యూఎస్ఎస్ స్టార్క్‌పై ప్రయోగించింది. అప్పుడు 37 మంది నావికులు మరణించారు.

అమెరికా, ఇరాన్, డోనల్డ్ ట్రంప్, సర్జికల్ స్ట్రైక్స్, ఇరాన్ అణు కార్యక్రమం

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా సైనిక జోక్యం ముప్పు పెరుగుతున్న కొద్దీ ఇరాన్ వీధుల్లో గోడల మీద అమెరికా వ్యతిరేక చిత్రాలు కనిపిస్తున్నాయి.

7. ఇరాన్‌లో గందరగోళం ఏర్పడే ప్రమాదం

సిరియా, యెమెన్, లిబియాలలో జరిగినట్టుగా అంతర్యుద్ధం జరిగే అవకాశంతో పాటు గందరగోళం వల్ల జాతి ఉద్రిక్తతలు సాయుధ పోరాటంగా పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఖతార్, సౌదీ అరేబియా వంటి పొరుగు దేశాల ప్రధాన ఆందోళనలలో ఇది ఒకటి.

ఎందుకంటే కుర్దులు, బలూచ్, ఇతర మైనారిటీలు దేశవ్యాప్త పరిణామాల మధ్య తమ ప్రజలను రక్షించుకోవాలనుకుంటారు.

ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచి ఇరాన్ విముక్తి పొందితే పశ్చిమాసియాలోని చాలా ప్రాంతాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ కచ్చితంగా సంతోషపడతాయి.

ఇరాన్‌కు ఇప్పటికే భారీ నష్టాలను కలిగించిన ఇజ్రాయెల్, ఇరాన్ అనుమానిత అణు కార్యక్రమం తన ఉనికికి ముప్పుగా ఉంటుందని భయపడుతోంది.

పశ్చిమాసియాలో ఎక్కువ జనాభా ఉన్న ఇరాన్ గందరగోళంలో కూరుకుపోకూడదు. ఇది మానవీయ, శరణార్థుల సంక్షోభానికి కూడా దారితీస్తుంది.

ఇరాన్ సరిహద్దుల దగ్గర శక్తివంతమైన సైనిక దళాన్ని మోహరించిన అధ్యక్షుడు ట్రంప్, చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంటారా లేదా అన్నది చూడాలి.

ఇది స్పష్టమైన ముగింపు లేని, అనూహ్యమైన, హానికరమైన పరిణామాలతో కూడిన యుద్ధానికి కారణమవుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)