సెక్స్, ఆల్కహాల్ ‘నేరాలలో’ జంటకు 140 కొరడా దెబ్బల శిక్ష

అచేలో బహిరంగంగా శిక్షను అమలుచేస్తుండటంతో, కన్నీరుమున్నీరవుతున్న ఆ మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అచేలో బహిరంగంగా శిక్షను అమలుచేస్తుండటంతో కన్నీరుమున్నీరవుతున్న మహిళ
    • రచయిత, హిదయతుల్లా, కో ఈవ్
    • హోదా, బీబీసీ ఇండోనేసియా

వివాహేతర సంబంధం, మద్యం తాగడం వంటి పనులతో షరియా చట్టాలను ఉల్లంఘించినందుకుగాను ఇండోనేషియాలోని అచే ప్రావిన్స్‌కు చెందిన ఓ జంటకు 140 కొరడా దెబ్బల శిక్షను అమలు చేశారు.

బహిరంగంగా ఈ శిక్షను అమలుచేస్తున్నప్పుడు, 21 ఏళ్ల ఆ యువతి కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నప్పటికీ ముగ్గురు మహిళా అధికారులు ఒకరి తరువాత ఒకరు కొరడాతో ఆమెను కొట్టారు.

కొరడా దెబ్బలు తట్టుకోలేక ఆ యువతి కుప్పకూలిపోవడంతో వారు ఆమెను అంబులెన్స్ వరకు మోసుకెళ్లారు.

షరియా చట్టాలను ఉల్లంఘించినందుకు గురువారం ఈ జంటతో పాటు మరో నలుగురికి శిక్ష పడింది. వీరిలో ఇస్లామిక్ పోలీస్ విభాగానికి చెందిన ఒక అధికారి కూడా ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మానవ హక్కుల సంఘాల విమర్శలు

మతపరంగా అత్యంత ఛాందసభావాలు కలిగిన అచేలో ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించిన వారికి కొరడా దెబ్బలు సర్వసాధారణమైన శిక్ష.

అయితే, ఇది అత్యంత క్రూరమైన చర్య అని మానవ హక్కుల సంఘాలు గత కొంతకాలంగా తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

అచే ఇస్లామిక్ శిక్షాస్మృతి ప్రకారం, వివాహేతర సంబంధానికి 100 కొరడా దెబ్బలు, మద్యం తాగినందుకు 40 కొరడా దెబ్బల శిక్ష విధిస్తారు.

అయితే, ఈ శిక్షా విధానం సరైన నియంత్రణలో లేదని ఇండోనేసియా హక్కుల సంఘం 'కాంట్రాస్' అచే కోఆర్డినేటర్ అజహరుల్ హుస్నా పేర్కొన్నారు. శిక్ష పూర్తయ్యాక సదరు వ్యక్తులకు బాసటగా నిలిచేలా నిబంధనలను మెరుగుపరచాలని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇక, ఒక ప్రైవేట్ ప్రదేశంలో సన్నిహితంగా ఉన్నందుకుగాను ఇస్లామిక్ పోలీస్ విభాగానికి చెందిన ఆ అధికారికి, ఆయనతో ఉన్న మహిళా భాగస్వామికి చెరో 23 కొరడా దెబ్బల శిక్షను అమలు చేశారు. ఆయనను విధుల్లో నుంచి తొలగిస్తున్నామని అచే ఇస్లామిక్ పోలీస్ చీఫ్ ముహమ్మద్ రిజాల్ బీబీసీ ఇండోనేసియాతో తెలిపారు.

ఇండోనేసియాలో షరియా చట్టాన్ని అమలు చేస్తూ బహిరంగంగా ఇటువంటి శిక్షలు విధిస్తున్న ఏకైక ప్రావిన్స్ అచే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)