హలాల్ హాలిడేస్ అంటే ఏంటి... ముస్లింలలో వాటికి డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హస్మీ
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

“నాకు ఎండలో ఉండటమంటే ఇష్టం. డి విటమిన్ కావాలి. ఏడాదంతా ఇలా ఎండలో ఉండమన్నా ఉంటాను. సెలవు దొరికిందంటే చాలా ప్రాంతాలకు తిరుగుతుంటాను’’ అన్నారు జహ్రా రోజ్.

టూర్లు వేయడమంటే ఎంతో ఇష్టపడే రోజ్, తన విహార యాత్రలు ముస్లిం విశ్వాసాలకు కట్టుబడి ఉండాలని కోరుకుంటారు. ఆమె ఇప్పటి వరకు 30కి పైగా హలాల్ హాలిడేస్‌ ఎంజాయ్ చేశారు.

అరబిక్‌లో హలాల్ అంటే ఇస్లాం మతాన్ని అనుసరించేవారికి ఆమోదయోగ్యమైనది అని అర్ధం. ముస్లింలు తమ మత విశ్వాసాలు, ఆచారాలపై రాజీ పడకుండా సందర్శించగల విహార యాత్రల ప్యాకేజ్‌లను హలాల్ హాలిడేస్ అంటున్నారు.

జోహ్రా రోజ్

ఫొటో సోర్స్, ZAHRA ROSE

హలాల్ హాలిడేస్...

జనాభా ప్రకారంగా క్రైస్తవం తరువాత ఇస్లాం రెండవ స్థానంలో ఉంది.

అనేక ముస్లిం దేశాలలో మధ్య తరగతి వర్గం పెరుగుతోంది. పశ్చిమ యూరప్, నార్త్ అమెరికాలలో రెండో తరం, మూడోతరం ముస్లింల దగ్గర హాలీడేస్‌కు ఖర్చు పెట్టడానికి తమ తల్లిదండ్రులకన్నా ఎక్కువ డబ్బుంది.

"నాకు హలాల్ హాలీడేస్, మామూలు హాలిడేస్‌కు మధ్య ఉన్న పెద్ద తేడా ఏంటంటే ప్రైవసీ" అని జహ్రా రోజ్ అన్నారు. హలాల్ హాలిడేస్‌లో తనకు హలాల్ ఫుడ్ దొరకడం కూడా చాలా సులభమవుతుందని జహ్రా రోజ్ అంటారు.

ముగ్గురు పిల్లల తల్లయిన హెజార్ సుజోగ్లు ఆదిగుజాయ్ ఇస్తాంబుల్‌లో ఉంటారు. తుర్కియేలో హలాల్ హాలిడేస్‌ను కనుక్కోవడానికి ఆమెకు ఎక్కడా ఇబ్బంది ఎదురు కాలేదు.

కానీ, ఇస్లామేతర దేశాలకు వెళ్లినప్పుడు మాత్రం వీటికోసం ఆమె చాలా రీసెర్చ్ చేసి, ప్లాన్‌లు గీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

"ఈ మధ్య మాసిడోనియా, కొసావోలకు వెళ్లాం. హోటల్‌‌లోనే బ్రేక్‌ఫాస్ట్ చేశాం. భోజనం కోసం మద్యం లేని, సంప్రదాయ ఆహారం లభించే రెస్టారెంట్‌లకు వెళ్లాం’’ అన్నారామె.

ఆదిగుజాయ్ రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేస్తారు. ఇస్లామిక్ సంప్రదాయాలు పాటించడంలో ఆమె చాలా నిష్టగా ఉంటారు.

"హలాల్ హాలిడే హోటళ్లలో వాళ్లు ప్రార్థన చేసేందుకు అవసరమైన చాపలను అందిస్తారు. మామూలు హోటల్‌కు వెళితే నేను స్వయంగా చాప తీసుకెళ్లాల్సి ఉంటుంది’’ అన్నారు జహ్రా రోజ్.

"హోటళ్లలో పొట్టి దుస్తులు ధరించే వ్యక్తులను చూడటం నాకు ఇష్టం ఉండదు. మా మత విశ్వాసం, సంస్కృతిని పాటించే పిల్లలతో మా పిల్లలకు కలిసి ఉండాలని కోరుకుంటాను. బీచ్‌లలో నగ్నంగా సన్‌బాత్‌లాంటివి నాకు ఇష్టం ఉండదు" అన్నారామె.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

పర్యాటకుల సంఖ్యలో పెరుగుదల

ఆన్‌లైన్ ఆంట్రప్రెన్యూర్‌షిప్, సోషల్ మీడియాలో మహిళలకు హెడ్జర్ శిక్షణనిస్తున్నారు. హలాల్ హాలిడేస్ నిర్వహణ వల్ల కలిగే ప్రయోజనాలను టూరిజం ఇండస్ట్రీ ఇప్పటికీ పూర్తిగా ఉపయోగించుకోలేకపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

గ్లోబల్ ముస్లిం ట్రావెల్ ఇండెక్స్ ప్రకారం, 2022లో హలాల్ ట్రావెల్ బిజినెస్ 220 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా హలాల్ టూరిజం నిర్వహిస్తుండగా, కొన్ని దీన్ని ఒక ఆప్షన్‌గా అందిస్తున్నాయి.

మాల్దీవులు పాశ్చాత్య దేశాల వారి కోసం నిర్వహించే హోటల్ బిజినెస్‌కు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చే హలాల్ పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది.

"మాల్దీవులు ముస్లిం దేశం. మేం ఇప్పటికే ముస్లిం ఫ్రెండ్లీ టూరిజాన్ని నిర్వహిస్తున్నాము. ఈ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది" అని మాల్దీవుల పర్యాటక మంత్రి డాక్టర్ అబ్దుల్లా మౌసూమ్ అన్నారు.

అక్కడి హోటళ్లలో నాలుగింట ఒక వంతు ఇప్పుడు కమ్యూనిటీ బేస్డ్, లేదంటే లోకల్ టూరిజం కోసం కేటాయిస్తున్నారని డాక్టర్ మౌసూమ్ చెప్పారు.

"అనేక రిసార్ట్‌లలో రూమ్‌ల కేటాయింపు, డిజైన్, ఫుడ్...ఇలా అన్నీ ముస్లిం ఫ్రెండ్లీగా ఉంటాయి" అని ఆయన చెప్పారు.

హలాల్ హాలిడేస్ కోసం మార్పులు

2023 గ్లోబల్ ముస్లిం ట్రావెల్ ఇండెక్స్‌లో చాలా ముస్లిం దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇండోనేషియా, మలేషియాలు ఇందులో అగ్రస్థానంలో ఉన్నాయి.

ముస్లిమేతర దేశాలైన సింగపూర్ (11వ స్థానం), బ్రిటన్ (20వ స్థానం) మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

లండన్‌లోని ఫైవ్ స్టార్ ల్యాండ్‌మార్క్ హోటల్‌ను 1899లో ప్రారంభించారు. ఇప్పుడది హలాల్ మీట్‌ (మాంసం)ను అందిస్తోంది. హోటల్ సిబ్బందికి మిడిల్‌ ఈస్ట్ దేశాల మత సంప్రదాయాల గురించి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు.

“మా దగ్గర ఆల్కహాలిక్ డ్రింక్స్‌తోపాటు, ఆల్కహాల్ లేని డ్రింక్స్ కూడా ఉంటాయి. మా బార్‌లో మీరు చాలా పాపులరైన నాన్-ఆల్కహాలిక్ కాక్‌టెయిల్‌ను కూడా తాగొచ్చు’’ అని మిడిల్ ఈస్ట్ సేల్స్ డైరెక్టర్ మాగ్డి రుస్తుమ్ అన్నారు.

హోటల్‌లోకి రెండు ఎంట్రన్స్‌లున్నాయి. నార్త్‌గేట్ అంటే మిడిల్ ఈస్ట్ దేశాల వారికి చాలా ఇష్టం. ముఖ్యంగా స్త్రీలు ఎవరికీ కనిపించకుండా ఉంటారు కాబట్టి వాళ్లు నార్త్ గేట్ ద్వారా హోటల్‌లోకి ప్రవేశిస్తారు. వారు ఎవరికీ కనిపించకుండా నేరుగా వాళ్ల గదికి తీసుకెళ్లే స్పెషల్ లిఫ్ట్ కూడా ఉంది.

హోటల్‌లో పెళ్లిళ్ల కోసం పెద్ద బాల్‌రూమ్‌ ఉంది. ఇక్కడ ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మగ, ఆడ అతిథులు విడివిడిగా కూర్చోవచ్చు. అయితే, ఇలాంటి ఏర్పాట్లకు డబ్బు బాగా ఖర్చవుతోందని జహ్రా అంటారు.

‘‘మామూలు హాలిడే ప్యాకేజ్‌లకన్నా ఇక్కడ ప్రైవసీ అన్నది ఎక్కువ ధరకు లభిస్తుందని నాకు తెలుసు. ఆడా మగా తేడా లేకుండా ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్, ప్రైవేట్ బాల్కనీలకన్నా ప్రైవసీ ఉన్న హోటళ్లలో హాలిడే బుక్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ధరలో కచ్చితంగా తేడా ఉంటుంది’’ అన్నారు జహ్రా.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)