రూఢకోట: ఈ ఊరి మహిళలు గర్భం దాల్చాలంటేనే భయపడుతున్నారు

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
వ్యాన్ డ్రైవరుగా పనిచేసే అశోక్ ఆగస్ట్ 11న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికొచ్చి తన మూడు నెలల పాపను ఆడిస్తూ గడిపారు. కొద్దిసేపటికే ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు.
అక్కడికి కొన్ని నిమిషాలలోనే పాప రెండు పిడికిళ్లు బిగబట్టి, తల వెనక్కి వాల్చి ఏడుస్తూ ప్రాణాలు విడిచింది. ఆసుపత్రికి తీసుకెళ్లేంత సమయం కూడా దొరకలేదు.
ఇలాంటి స్థితిలో పిల్లలను కోల్పోవడం అశోక్ దంపతులకు ఇది రెండోసారి.
రెండేళ్ల కిందట 2021 ఆగస్ట్ నెలలో అశోక్, మత్స్యమ్మ దంపతులకు పుట్టిన మొదటి బిడ్డకు రెండు నిండి, మూడో నెల నడుస్తున్న సమయంలో...ఒక రోజు తల్లి మత్స్యమ్మ పాలు ఇచ్చిన కాసేపటికే పిడికిలి బిగిపెట్టి ఏడుస్తూ ప్రాణాలు వదిలేసింది ఆ శిశువు.
పిల్లలకు ఏ పేర్లు పెట్టాలా అని అశోక్, మత్స్యమ్మల కుటుంబాల్లో చర్చలు జరుగుతున్న సమయానికే పిల్లల ప్రాణాలు పోయాయి.
మత్స్యమ్మ, అశోక్ ఇంట్లో జరిగినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం, రూఢకోట గ్రామంలో గత మూడేళ్లలో 20 మంది శిశువులు మరణించారు.
వారి మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు వైద్య బృందాలు పరిశోధనలు చేసినా నిర్దిష్టమైన కారణం ఇంతవరకు తెలియలేదు.
చనిపోయిన చిన్నారులంతా మూడు నుంచి ఆరు నెలల లోపు వయసు వారే.

‘ఇక మాకు పిల్లలు వద్దు’
‘మా చేతుల్లో చనిపోడానికే అయితే పిల్లల్ని కనడం ఎందుకు? మాకు పిల్లలు వద్దు, ఊరులో పరిస్థితులు బాగుపడితేనే పిల్లల్ని కంటాం. లేదంటే పిల్లలు వద్దు’ అని మూడు నెలల వయసున్న ఇద్దరు శిశువుల్ని పొగొట్టుకున్న బాలు, సంధ్యారాణి దంపతులు బీబీసీతో చెప్పారు.
బీబీసీతో మాట్లాడిన అశోక్, మత్స్యమ్మ దంపతులు కూడా ఇలాగే స్పందించారు.
“ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాను. కారణాలేంటో తెలియడం లేదు. చనిపోయే క్షణం వరకు పిల్లలు ఆరోగ్యంగానే ఉంటున్నారు. మాతో చక్కగా ఆడుకున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఒక్కసారిగా పిడికిలి బిగబట్టి, తల వాల్చేసి క్షణాల్లో చనిపోతున్నారు. పీహెచ్ సీ కూడా పక్కనే ఉంది. కానీ అక్కడకు తీసుకెళ్లేంత సమయం కూడా దొరకడం లేదు. ఇంకేం చేయాలి?” అని సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసారి గర్భం దాల్చినా కూడా ఈ గ్రామంలో ఉండను. వేరే గ్రామానికి వెళ్లిపోయి, అక్కడే శిశువుకి జన్మనిచ్చి, కొంచెం పెద్దయ్యాకే గ్రామంలోకి అడుగు పెడదామనుకుంటున్నాను అని చెప్పారామె.
రూఢకోటకు కోడలిగా వచ్చిన ఓ మహిళ గర్భం దాల్చగానే తన పుట్టినిల్లయిన హుకుంపేటకు వెళ్లిపోయారు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ఆ బిడ్డ కూడా మూడు నెలలకే ఈ ఏడాది మేలో మరణించాడు.
ఈ విషయాన్ని రూఢకోట పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ నిర్థరించారు. రూఢకోటకు హుకుంపేటకు మధ్య దూరం 35 కిలోమీటర్లు.

‘ఆరు నెలలు ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు’
2019 నుంచి 2022 మే వరకు 17 మంది శిశువులు మరణించారు. ఆ తర్వాత ఆరు నెలలు ఏ విధమైన మరణాలు సంభవించలేదు.
మళ్లీ ఈ ఏడాది జనవరి, మే, ఆగస్ట్ నెలల్లో ముగ్గురు శిశువులు మరణించారు.
ఇప్పటి వరకు 20 మంది శిశువులు రూఢకోట గ్రామంలో మరణించారని రూఢకోట పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ సత్యారావు బీబీసీతో చెప్పారు.
రూఢకోటలో గర్భం దాల్చిన మహిళలు గ్రామంలో ఉన్నా, బయటకు వెళ్లినా, ఇంటి దగ్గరే ప్రసవమైనా లేదా ఆసుపత్రిలో ప్రసవమైన వారిలోని కొందరు శిశువులు మరణిస్తున్నారు. కారణాలపై మాత్రం స్పష్టత రాలేదని డాక్టర్ సత్యారావు చెప్పారు.
“వరుసగా శిశువులు మరణిస్తుండటంతో మా ఊర్లో పిల్లలను కనేందుకు భయపడ్డాం. అందునే 2022 మే, జూన్ తర్వాత ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు. ఆరు నెలలు పాటు ఊరిలో ఎటువంటి మరణాలు సంభవించకపోవడంతో సంతోషపడ్డాం. కానీ మళ్లీ 2023 జనవరిలో ఒక శిశువు మరణిచడంతో మళ్లీ పిల్లల మరణాలు మొదలయ్యాయి. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు” అని రూఢకోటకు చెందిన సుభద్ర బీబీసీతో చెప్పారు.
సుభద్రకు 2021 ఆగస్ట్‌లో పుట్టిన మగ బిడ్డ నాలుగు నెలలకే మరణించాడు.
ఇలా పిల్లలు వరుసగా చనిపోవడం ఇంతకుముందెన్నడూ చూడలేదని రూఢకోటకు చెందిన 64 ఏళ్ల వృద్ధురాలు రాములమ్మ బీబీసీతో అన్నారు.
ప్రభుత్వ కమిటీ ఏం తేల్చింది
రూఢకోటలో వరుస శిశుమరణాల నేపథ్యంలో 2021 నవంబరులో బీబీసీ ఈ గ్రామంలో పర్యటించింది. ఇక్కడ పరిస్థితిపై కథనాలు ప్రచురించింది.
ఇక్కడ జరుగుతున్న విషయాలు, గ్రామస్థుల ఆవేదనను ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లింది.
970 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో చదువుకున్న వారే ఎక్కువగా కనిపించారు.
ముఖ్యంగా డిగ్రీ వరకు చదివిన వారే ఉన్నారు. గ్రామంలోని ఎక్కువ మంది ఒకరికి ఒకరితో బంధుత్వం ఉన్నవారే కనిపించారు.
ఆ తర్వాత 2022 జనవరి మొదటి వారంలో ప్రభుత్వం ఈ మరణాలకు కారణాలను కనుగొనేందుకు విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల వైద్య బృందంతో ఒక కమిటీని నియమించింది.
ఈ కమిటీ 2022 జనవరి 12న రూఢకోట గ్రామంలో పర్యటించింది.

కమిటీ నివేదికలో ఏం ఉందంటే..
- - శిశువులు వాంతులు చేసుకుంటూ, ఏడుస్తూ మరణించారు.
- మరణించిన శిశువులు అంతా తగినంత బరువు ఉన్నవారే.
- 3 నుంచి 6 నెలల వయసున్న శిశువుల్లో మరణాలకు సాధారణ కారణాలైన నాటు మందుల వాడకం, సమయానికి పాలు ఇవ్వకపోవడం, మోతాదుకు మించి ఇవ్వడం, ఊపిరి సరిగా అందకపోవడం, డయేరియా వంటివేవీ ఇక్కడి చిన్నారుల మరణాలకు కారణం కాదని తేలింది.
- శిశు మరణాలకు ముందు, లేదంటే.. మరణించిన వెంటనే వారిని పరీక్ష చేసే అవకాశం తమ బృందానికి లేనందుకున మరణాలకు స్పష్టమైన కారణాలు కనుగొనలేకపోయాం
అని ఆ నివేదికలో పేర్కొన్నారు.
రూఢకోట స్థానిక పీహెచ్‌సీని, దగ్గరలోని ఉన్న ఆసుపత్రులను బలోపేతం చేయాలని, అంగన్వాడీ, వైద్య సిబ్బంది తరుచూ గ్రామానికి వెళ్లి గ్రామంలోని శిశువుల అందరి పరిస్థితిని పరిశీలించాలని, గర్భవతులు, బాలింతలు, వారి శిశువులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన వారిని ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందించాలని ఆ రిపోర్టులో సూచించారు.
గుర్రగరువులోనూ..
గతేడాది రూఢకోటకు 60 కిలో మీటర్ల దూరంలో ఉండే గుర్రగరువు గ్రామంలో కూడా ముగ్గురు శిశువులు మరణించారు. ఆ తర్వాత మళ్లీ 2023లో రూఢకోటలో ఇప్పటీ వరకు ముగ్గురు మరణించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరుస శిశు మరణాల కారణాలపై ప్రభుత్వం నియమించిన వైద్య బృందం నివేదికలో ఎటువంటి స్పష్టత రాలేదు.

రాష్ట్రంలో శిశుమరణాలు తగ్గాయి
కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. జాతీయ స్థాయి సగటుతో పోల్చితే శిశు మరణాలు రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యి జననాల్లో శిశు మరణాలు 2018లో 29 ఉండగా 2019లో 25కు, 2020లో 24కు తగ్గినట్లు ఆ నివేదిక పేర్కొంది.
కానీ రూఢకోటలో గత మూడేళ్లుగా శిశు మరణాలు సంభవిస్తున్నా కూడా అధికారులు పెద్దగా చర్యలు చేపట్టినట్లు కనపడటం లేదని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మరణాలు జరిగినప్పుడు కాస్త హడావిడి చేసి ఆ తర్వాత వదిలేస్తున్నారని అంటున్నారు.
“ఇప్పుడు రూఢకోటలో సంభవిస్తున్న శిశు మరణాలకు స్పష్టమైన కారణాలను కనుగొనలేకపోతున్నారు. అదేంటో తెలుసుకునే వరకు రూఢకోట, గుర్రగరువు వంటి గ్రామాల్లో హెల్త్ ఏమర్జెన్సీ ప్రకటించాలని మేం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం” అని గిరిజన సంఘం నాయకుడు బుచ్చిబాబు బీబీసీతో అన్నారు.

అధ్యయనాలు జరుగుతున్నాయి: పీవో అభిషేక్
రూఢకోటలో వరుస శిశు మరణాలపై ఐటీడీఏ పీవో వి. అభిషేక్‌తో బీబీసీ మాట్లాడింది.
“రూఢకోటలో శిశు మరణాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి. మరో వైపు గ్రామంలో వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
మరణాలకు స్పష్టమైన కారణాలు తెలియకపోయినా, ప్రాథమిక నివేదికల ప్రకారం గ్రామంలో శుద్ధమైన తాగు నీరు సరఫరా, బర్త్ వెయింటింగ్ హాల్ నిర్మించాం.
నాటు మందుల వాడటం, మద్యపానం మంచిది కాదనే విషయంపై అవగాహన కల్పిస్తున్నాం” అని పీవో చెప్పారు.
“రూఢకోట శిశుమరణాలకు సంబంధించి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇచ్చిన రిపోర్టులోనూ స్పష్టమైన కారణాలు లేవు. రూఢకోటలో మరణించిన శిశువులెవ్వరిలోనూ ఆ వయసులో వచ్చే జబ్బులేవీ రాలేదు. పిడికిలి బిగబట్టి, తలవెనక్కి వాల్చి చనిపోతున్నారనే తల్లిదండ్రులు చెప్తున్నారు. శిశువులను ఆసుపత్రికి తీసుకుని వచ్చేలోగానే చనిపోతున్నారు” అని రూఢకోట పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్యారావు బీబీసీతో చెప్పారు.
ప్రస్తుతం రూఢకోటలో బీబీసీ పర్యటించినప్పుడు ముగ్గురు గర్బిణులు గ్రామంలో కనిపించగా, మరో ఇద్దరు ప్రసవం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లినట్లు స్థానికులు చెప్పారు.
గ్రామంలో బిడ్డలను కోల్పోయిన వారు, ఆ శిశువుల ఫొటోలను తమ సెల్ ఫోన్లలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను మరోకరితో చెబుతూ కనిపిస్తున్నారు.
అధికారులు, వైద్య సిబ్బంది అంతా కలిసి ఊరిలో శిశు మరణాలు లేకుండా చేయగలిగినప్పుడే తాము పిల్లలను కంటామని గ్రామంలోని యువ జంటలు అంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
- చంద్రయాన్-3 ల్యాండింగ్‌లో ఆ 15 నిమిషాలే ఎందుకు కీలకం... ‘ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అని ఇస్రో మాజీ చైర్మన్ ఎందుకన్నారు?
- BRICS కూటమి ఎలా మొదలైంది... ఇందులో చేరాలని 40 దేశాలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాయి?
- ఎంటర్ ది డ్రాగన్‌కు 50 ఏళ్లు: విడుదలకు ముందే బ్రూస్ లీ ఎలా మరణించారు, ఈ చిత్రం సినిమా చరిత్రను ఎలా మార్చింది?
- మేడ మీద చేపల పెంపకం - ఆదాయం ఎంతో తెలుసా
- చంద్రుడు లేకపోతే భూమికి ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















