మతిమరుపు వ్యాధిపై పోరాటానికి కొత్త ఔషధం ‘డొనానిమబ్’

అల్జీమర్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫెర్గూస్ వాల్ష్, మిషెల్లె రాబర్ట్స్
    • హోదా, బీబీసీ న్యూస్

అల్జీమర్స్‌పై పోరాటంలో డొనానిమబ్ అనే కొత్త ఔషధం మేలి మలుపని చెప్తున్నారు.

మస్తిష్క సామర్థ్యాల క్షీణతను ఈ మందు నెమ్మదింపజేయగలదని ప్రపంచవ్యాప్తంగా జరిగిన క్లినికల్ ట్రయల్స్‌లో తేలడంతో దీనికి ప్రశంసలు దక్కుతున్నాయి.

అల్జీమర్స్‌ తొలిదశలో ఉన్నవారి మెదడులో పేరుకుపోయే ఒక రకమైన ప్రోటీన్‌ను తొలగించడం ద్వారా ఈ యాంటీబాడీ మెడిసిన్ వ్యాధి తీవ్రతను తగ్గించడానికి తోడ్పడుతుంది.

వ్యాధిని ఈ మందు పూర్తిగా నయం చేయలేనప్పటికీ, ‘జామా’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన ఫలితాలు సూచిస్తున్న ప్రకారం ఇది అల్జీమర్స్ చికిత్సలో కొత్త శకానికి నాంది పలుకుతోందని పలు సంస్థలు అంటున్నాయి.

బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఇప్పుడు దీన్ని నేషనల్ హెల్త్ సర్వీసెస్(ఎన్‌హెచ్ఎస్‌) సేవల్లో ఉపయోగించే దిశగా యోచిస్తోంది.

ఈ మందు అల్జీమర్స్‌కు పనిచేస్తుంది. వేస్కులర్ డిమెన్షియా లాంటి ఇతర రకాల మతిమరుపు సమస్యలకు పనిచేయదు.

ఈ మందుపై క్లినికల్ ట్రయల్స్ జరిపినప్పుడు అల్జీమర్స్ వ్యాధి ముదిరే వేగాన్ని మూడో వంతు మేర ఇది తగ్గించినట్లు తేలింది. వంట చేసుకోవడం, అభిరుచులను ఆస్వాదించడం వంటి రోజువారీ పనులను కొనసాగించడంలో అల్జీమర్స్ బాధితులకు ఈ మందు ఉపయోగపడింది.

డొనానిమబ్ గ్లోబల్ ట్రయల్స్‌లో బ్రిటన్ నుంచి పాల్గొన్నవారిలో 80 ఏళ్ల మైక్ కోలీ ఒకరు.

మైక్ కాలీ, ఆయన కుటుంబం ‘బీబీసీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

లండన్‌లోని ఒక క్లినిక్‌లో మైక్ కోలీకి ప్రతి నెలా రక్తంలోకి మందు ఎక్కిస్తారు. ఈ మందు తీసుకుంటున్నందుకు తాను అదృష్టవంతుడినని మైక్ చెప్తున్నారు.

మైక్ కోలీ, మార్క్
ఫొటో క్యాప్షన్, మైక్ కోలీ, మార్క్

జ్ఞాపక శక్తి, నిర్ణయం తీసుకోవడంలో సమస్యలతో మైక్ ఇబ్బంది పడుతున్నట్లు ఆయనపై క్లినికల్ ట్రయల్స్‌కు కొద్దికాలం ముందు గుర్తించినట్లు ఆయన కుటుంబసభ్యులు చెప్పారు.

మొదట్లో ఆయన ఇబ్బందులను చూడ్డం చాలా కష్టంగా ఉండేదని మైక్ కుమారుడు మార్క్ చెప్పారు.

‘‘సమాచారాన్ని ప్రాసెస్ చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవడంలో ఆయన పడుతున్న కష్టాలను చూడడం మాకు బాధగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆయనలో మస్తిష్క సామర్థ్యాల క్షీణత తగ్గిందనిపిస్తోంది’’ అన్నారు మార్క్.

కెంట్‌కు చెందిన మైక్ మాట్లాడుతూ- తానిప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నానన్నారు.

ఎలీ లిలీ కంపెనీ తయారుచేసిన ఈ మందు- ఈసాయి, బయోజెన్ సంస్థలు అభివృద్ధి చేసిన లెకానమబ్ తరహాలోనే పనిచేస్తుంది.

వ్యాధి నియంత్రణలో ఈ మందులు ఎంతో ఆశాజనకమైనవి అయినప్పటికీ పూర్తిగా ప్రమాద రహితమైన మందులు మాత్రం కావు.

డొనానిమబ్ క్లినికల్ ట్రయల్స్ సమయంలో దాదాపు మూడొంతుల మంది రోగులలో కామన్ సైడ్ ఎఫెక్స్ట్‌గా మెదడు వాపును గుర్తించారు. లక్షణాలేవీ బయటకు కనిపించకుండానే చాలా మందికి ఈ సమస్య పరిష్కారమైంది. అయితే ఇద్దరు వాలంటీర్లు మెదడు ప్రమాదకరంగా వాచిపోవడంతో మరణించారు. క్లినికల్ ట్రయల్స్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన మరో వాలంటీర్ మృతికీ ఇదే కారణంగా భావిస్తున్నారు.

మరో యాంటీబాడీ అల్జీమర్స్ ఔషధం ‘ఆడుకానుమబ్’ను యూరప్ ఔషధ నియంత్రణ సంస్థలు ఇటీవల తిరస్కరించాయి. నిర్దిష్టమైన పనితీరుకు సంబంధించిన ఆధారాలు లభించకపోవడంతో పాటు భద్రతపరమైన ఆందోళనలతో దీన్ని ఆమోదించలేదు.

డొనానిమబ్ ట్రయల్స్‌లో అల్జీమర్స్ తొలి దశలో ఉన్న 60 నుంచి 85 ఏళ్ల వయస్కులైన 1,736 మందిపై ప్రయోగాలు చేశారు. వీరిలో సగం మందికి నెలకోసారి చొప్పున 18 నెలల పాటు రక్తంలోకి మందు ఎక్కించగా, మిగతా సగం మందికి ఉత్తుత్తి ఔషధం (ప్లాసిబో) ఇచ్చారు.

ప్రయోగాలలో తేలిందిదీ..

  • కనీసం కొందరు రోగులకు ఇది అర్థవంతమైన ప్రయోజనాలు అందించింది.
  • వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నవారు, మెదడులో అమిలాయిడ్(ప్రోటీన్ పేరుకుపోవడం) తక్కువగా ఉన్నవారిలో ఈ మందు ఎక్కువ ప్రభావం చూపించింది.
  • ఔషధం తీసుకున్నవారు ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయడం, అభిరుచులను కొనసాగించడం, జరుగుతున్న విషయాలపై చర్చించగలగడం వంటి పనులతో రోజువారీ జీవితాన్ని గడపగలిగారు.
  • వ్యాధి ముదిరే వేగం 20 నుంచి 30 శాతం తగ్గింది. కొందరు రోగుల్లో ఈ ప్రభావం 30 నుంచి 40 శాతం ఉంది.
  • కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. రోగులు ఈ చికిత్స వల్ల కలిగే ముప్పు విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి.
  • సగం మంది రోగులకు ఏడాది తరువాత ఈ చికిత్స ఆపేసినా సరిపోయింది. మెదడులో పేరుకున్న ప్రోటీన్ నిల్వలు తొలగడంతో వారికి తదుపరి చికిత్స అవసరం లేకపోయింది.
అల్జీమర్స్

ఈ మందు ప్రభావం ఒక మోస్తరుగా ఉండే అవకాశం ఉన్నా, మెదడులోని అమిలాయిడ్ నిల్వలను తొలగించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందనే విషయాన్ని ప్రయోగాలు నిర్ధరించాయి.

యూకే డిమెన్షియా రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ గైల్స్ దీనిపై మాట్లాడుతూ- ‘‘అల్జీమర్స్ చికిత్సల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం. క్షేత్రస్థాయిలో వేగం అందుకోవడం అనేది నిజంగా ప్రోత్సాహకరం’’ అన్నారు.

యూకే అల్జీమర్స్ రీసర్చ్‌కు చెందిన మరో ప్రొఫెసర్ సుసాన్ కొహ్లాస్- ‘‘ఈ అధ్యయన ఫలితాలు మరో మైలు రాయి’’ అని చెప్పారు.

‘‘దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిశోధనలకు థాంక్స్ చెప్పుకోవాలి. సమాజం, ప్రజలపై డిమెన్షియా ప్రభావం మారుతోంది. దీనికి చికిత్స చేసే అవకాశం పెరుగుతుండడంతో ఇలాంటి వ్యాధుల విషయంలో కొత్త శకంలోకి అడుగుపెడుతున్నాం’’ అన్నారు.

అల్జీమర్స్ లక్షణాలు

‘బీబీసీ రేడియో 4’లో ప్రసారమైన కార్యక్రమంలో మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ మాట్లాడుతూ- ఇలాంటి ప్రయోగాల కోసం మరిన్ని వనరులు కల్పించాలని సూచించారు.

ఈ ఔషధం మాత్ర రూపంలో రావాలని, రోజూ కానీ వారానికోసారి కానీ ఆ మాత్ర తీసుంటే మెదడులో పేరుకున్న ప్రోటీన్ కరిగి వ్యాధి తగ్గేలా మాత్రలు అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

కొత్త చికిత్సలు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం నుంచి పెట్టుబడుల సహాయం ఉండొచ్చా అనే ప్రశ్నకు కామెరాన్ సమాధానమిస్తూ- ‘‘ఆరు కోట్ల మంది ఉన్న ఈ దేశంలో 10 లక్షల మంది డిమెన్షియాతో బాధపడుతున్నారు. వారిలో చాలా మంది వ్యాధి వల్ల కలిగే ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం, ఇళ్లలో సహాయ ఏర్పాట్ల కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. ప్రజలకు సమర్థమైన చికిత్సలను అందుబాటులోకి తేగలిగితే అలాంటి ఖర్చులు తగ్గుతాయి’’ అన్నారు.

యూకేలో వినియోగానికి లైసెన్స్ ఉన్న లెకనెమబ్ ఔషధానికి సుమారు రూ. 22 లక్షలు ఖర్చవుతుంది.

ఇప్పుడీ డొనానిమబ్‌ ధర ఎంత ఉండబోతోంది, ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అల్జీమర్స్ నిపుణులు మాత్రం రెండు రకాల మందులు అందుబాటులోకి వస్తే పోటీ పెరిగి ధర కూడా తగ్గొచ్చంటున్నారు.

**బ్రిటన్‌లో లైసెన్స్ పొందేందుకు వీలుగా ఎన్‌హెచ్ఎస్‌లో డొనానిమబ్ వినియోగానికి సిఫారసులు తీసుకోవడం మా లక్ష్యం"" అని బ్రిటన్ డ్రగ్స్ వాచ్‌డాగ్ నైస్‌కు చెందిన ప్రతినిధి ఒకరు చెప్పారు.

మైక్ కోలీ
ఫొటో క్యాప్షన్, 80వ పుట్టిన రోజు సందర్భంగా పాట పాడుతున్న మైక్ కోలీ

మైక్ కోలీకి ఏప్రిల్‌లో 80 ఏళ్లు పూర్తయ్యాయి. తన 80వ పుట్టిన రోజు పార్టీలో ఆయన 40 మంది అతిథుల ముందు ‘మై వే’ అనే పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.

‘ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాను నేను. ఏడాది కిందట ఇలా లేను" అని బీబీసీతో చెప్పారు కోలీ.

‘‘మా నాన్నను మళ్లీ ఇలా చూస్తామని అనుకోలేదు. ఇవి అద్భుతమైన క్షణాలు’’ అని మైక్ కుమారు మార్క్ చెప్పారు.

బ్రిటన్‌లో డొనానిమబ్ క్లినికల్ ట్రయల్స్ ‘కాగ్నిషన్ హెల్త్’లో మెడికల్ డైరెక్టర్‌గా పనిచేసే న్యూరోరేడియాలజిస్ట్ డాక్టర్ ఎమర్ మెక్‌స్వీనే నేతృత్వంలో జరిగాయి.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ- ‘‘ఇది గణనీయమైన మార్పు, చాలా పెద్ద పరిణామం’’ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)