ఫేస్ బ్లైండ్‌నెస్: మతిమరుపు కాదు... మనుషుల ముఖాలను గుర్తించలేని మానసిక వ్యాధి

బ్లైండ్‌నెస్ అంటే చూపు లేకపోవడం. మరి, ఫేస్ బ్లైండ్‌నెస్ అంటే ఏమిటో తెలుసా? ఇదో వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు అందరిలాగే అన్నీ చూడగలరు. కానీ, మనుషుల ముఖాలను మాత్రం గుర్తుపట్టలేరు. ఆఖరికి ఇంట్లో వాళ్లను, ప్రాణ స్నేహితులను కూడా గుర్తించలేరు.
వైద్య పరిభాషలో దీన్ని 'ప్రోసో-పాగ్-నోసియా' అంటారు. ఈ సమస్య ఉన్న వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తే దీని గురించి మరింత లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని బ్రిటన్ పరిశోధకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఫేస్ బ్లైండ్‌నెస్‌తో బాధపడుతున్న ఒక బ్రిటిష్ మహిళతో బీబీసీ మాట్లాడింది.
‘బహుశా తను మా అమ్మేమో...’
కాఫీ షాపులో ఎందరున్నా సరే మీరు మీ జీవిత భాగస్వామిని గుర్తుపట్టగలుగుతారు కదా. కానీ బూ జేమ్స్‌కు మాత్రం అది సాధ్యం కాదు. ఎందుకంటే, ఆమె ఫేస్ బ్లైండ్‌నెస్‌తో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను మాత్రమేకాదు... ఆఖరికి తన ముఖాన్ని కూడా ఆమె గుర్తుపట్టలేరు.
''నేను బస్సులో వెళుతున్నపుడు ఎవరో అపరిచితులు నా వైపు చూసి, పలకరింపుగా చెయ్యి ఊపుతుంటారు. ఆ సమయంలో వాళ్లెవరో నాకు అర్థం కాదు. ఆ తరువాత మాటల సందర్భంగా ఆమె మా అమ్మ అయ్యుంటుందని అనుకుంటాను. ఇంట్లోవాళ్లైనా సరే గుర్తించడం కష్టమే'' అని బూ జేమ్స్ బీబీసీతో అన్నారు.
'నేను గ్రహాంతరవాసినేమో అనుకున్నా..!'
తనకు నలభై ఏళ్లపుడు ఈ రుగ్మతను ఈమే స్వయంగా గుర్తించారు.
''ఇతరులంటే నాకు నచ్చకపోవడం వల్లే ఇలా జరుగుతుందేమోనని మొదట్లో నాకు నేను సర్దిచెప్పుకునేదాన్ని. నచ్చని వ్యక్తులను కలిసిన వెంటనే వాళ్లను నా మెమరీలోంచి తుడిచేస్తున్నానేమో అనుకున్నాను. బహుశా జనాలతో ఎక్కువ కలిసిపోకూడదని నిర్ణయించుకున్నానేమో అనుకునేదాన్ని. లేదా వాళ్ల పట్ల నాకున్న ఆసక్తి అంతేనేమో అనుకున్నాను. కొన్నిసార్లు నేను ఏదైనా వేరే గ్రహం నుంచి వచ్చిపడ్డానా అని కూడా అనుకునే దాన్ని’' అన్నారు.
జేమ్స్ లాంటి వాళ్లకు ముఖాలు ఎలా కనిపిస్తాయో చెప్పడం కాస్త కష్టమే. కానీ తన సమస్య గురించి వివరించడానికి ఆమె ప్రయత్నించారు. ఆమెకు మనుషుల ముఖాలు ఎలా కనిపిస్తాయో ఆమె మాటల్లోనే..
''నేను ముఖంలోని భాగాలను గుర్తించగలను. ముక్కు, కళ్లు, నోరు, చెవులు ఇలా విడివిడిగా మాత్రమే కనిపిస్తాయి. వాటన్నింటినీ కలిపి ఒక వ్యక్తి ముఖంగా గుర్తుపెట్టుకోవడం నా మెదడుకు కష్టం. ఉదాహరణకు ఇప్పుడు మీ ముఖం చూస్తున్నాను కదా... ఒక్క నిమిషం తలను పక్కకు తిప్పి, మళ్లీ ఇటు చూస్తే మీ ముఖం నాకు చాలా అస్పష్టంగా కనిపిస్తుంది'' అన్నారు.

బూ జేమ్స్‌కు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫోటో చూపించి, ఈయన ఎవరో చెప్పగలరా అని అడిగాం. కానీ ఆమె ట్రంప్‌ను గుర్తించలేకపోయారు.
ప్రోసో-పాగ్-నోసియా గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని వేల్స్ పరిశోధకులు భావిస్తున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారికోసం స్వాన్సీ యూనివర్సిటీ అన్వేషిస్తోంది. ఈ వ్యాధి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు.
''మెదడులో ఏ భాగంలో సమస్య ఉందో కచ్చితంగా తెలుసుకోగలిగితే, దానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయొచ్చు. ప్రోసో-పాగ్-నోసియా ఉన్నవారికి సాంత్వన కలిగించే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందిస్తున్నాం'' అని స్వాన్సీ యూనివర్సిటీకి చెందిన న్యూరోసైంటిస్ట్ జోడీ డేవిస్ అన్నారు.
''ఇప్పటికైతే బూ జేమ్స్ సమస్యకు పరిష్కారం లేదు. కానీ ఫేస్ బ్లైండ్‌నెస్‌పై సరైన అవగాహన పెంచుకోవడం ద్వారా వాళ్లు పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో నిర్భయంగా తిరగొచ్చు'' అని జోడీ డేవిస్ ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- 'ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశం మంచిదే... కానీ, మోదీ ఎలా ఉన్నారంటే...' - పర్వేజ్ ముషారఫ్‌తో బీబీసీ ఇంటర్వ్యూ
- Fact Check: జవాన్ల కుటుంబాలకు 110 కోట్లు విరాళం ఇస్తానన్న ముర్తాజా అలీ మాటల్లో నిజమెంత...
- డేటా చోరీ వివాదం: #TSGovtStealsData హ్యాష్‌ట్యాగ్‌ను డబ్బులిచ్చి ట్రెండ్ చేయించారా...
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- మహిళలకు పురుషులతో సమానంగా ఆర్థిక హక్కులు అందిస్తున్న దేశాలెన్ని...
- శివరాత్రి: మానవాకారంలో శివుడు ఎక్కడ ఉన్నాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









