తలలోకి పేలు ఎలా వస్తాయి? పేల వ్యాప్తికి, స్మార్ట్‌ఫోన్‌కి లింకేంటి?

తలలో పేలు.. ఈ సమస్య ఎదుర్కోని వారు బహుశా ఎవరూ ఉండరేమో. పేల గురించి వినగానే.. మనలో చాలామందికి తల మీద చిటచిట పెట్టినట్లు అనిపిస్తుంది. పేలు మరీ ఎక్కువగా ఉంటే.. జుట్టు పీకేస్తే బాగుండన్నంత చిరాకు పుట్టుకొస్తుంటుంది. మరి, ఇంతగా ఇబ్బంది పెట్టే పేలు ఎలా పుడతాయి? ఎలా వ్యాప్తి చెందుతాయి?
గుడ్ల నుంచి పేలు పుడతాయి. ఆ గుడ్లను ఈపి (ఆంగ్లంలో నిట్) అంటారు.
మనిషి రక్తమే పేలకు ఆహారం. అవి మన తల మీద జుట్టు మధ్యలో తిరుగుతూ రక్తాన్ని పీల్చుతాయి.
మీ తల మీదికి ఎలా వస్తాయి?
తలలు పరస్పరం తాకినప్పుడు ఒకరి నుంచి మరొకరికి పేలు వ్యాపిస్తుంటాయి.
చిన్న పిల్లలను చాలామంది దగ్గరకు తీసుకుని ఆడిస్తుంటారు. ఎత్తుకుంటారు. అలాంటప్పుడు వారి తలలు ఎక్కువ మందికి తాకే అవకాశం ఉంటుంది. అందుకే, పెద్దలతో పోల్చితే పిల్లలకు పేల సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువ మందితో కలిసి ఉండటం వల్ల కూడా పేల సమస్య పెరుగుతుంది. పొడవాటి జుట్టు ఉండటం కూడా పేలు వ్యాప్తి చెందడానికి మరో కారణం.
పేల వ్యాప్తికి, స్మార్ట్‌ఫోన్‌కి లింకేంటి?
నిజానికి ఫోన్ల ద్వారా పేలు వ్యాపించవు. కానీ, టీనేజీ పిల్లల్లో పేల సమస్యకు, స్మార్ట్‌ఫోన్ వినియోగానికి సంబంధముందని చర్మ నిపుణురాలు టెస్ మెక్‌ఫర్సన్ చెబుతున్నారు.
ఎందుకంటే, యువతీ యువకులు ఎక్కువగా సెల్ఫీలు తీసుకునేటప్పుడు, సరదాగా వీడియోలు, ఫొటోలు చూసేటప్పుడు ఒకే ఫోన్ ముందు తలలు దగ్గరగా పెట్టి చూస్తుంటారు. అప్పుడు ఒకరి జుట్టు మరికొరి జుట్టుకు తాకడం ద్వారా పేలు ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపిస్తాయి.

ఎగరలేవు, దూకలేవు
తల్లో పేలు ఎగరలేవు, దూకలేవు. కొత్త వ్యక్తి జుట్టు తాకగానే.. ఆ వెంట్రుకలను పాకుతూ వెళ్లిపోతాయి. తల మీదకు చేరి గుడ్లు పెడతాయి.
మీ తలలో పేలున్నాయని మీకు తెలిసేలోపే అవి ఇతరులకూ వ్యాపిస్తాయి. పేలు వచ్చాక వెంటనే తెలియదు. కొన్ని రోజుల తర్వాత అలర్జీ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
అయితే, ఆలోపే పేలు మన ద్వారా ఇతరులకూ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
"మనిషి తల మీద కొద్ది కాలంపాటు మాత్రమే పేలు బతకగలవు. పిల్లుల తలలు, కుక్కల తలల్లో పేలు బతికేందుకు అనుకూలమైన పరిస్థితి ఉండదు. అందుకే, వాటి నుంచి పేలు వ్యాపించవు. మనిషి నుంచి మనిషికే వ్యాపిస్తాయి. జంతువుల మీద అవి సంతోషంగా బతకలేవు" అని టెస్ మెక్‌ఫర్సన్ వివరించారు.
పేల సమస్య తీవ్రంగా ఉంటే, వైద్యులను సంప్రదించాలని ఆమె సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం... దాన్ని కాపాడుతున్నదెవరు?
- చేతన్ సకారియా: టెంపో డ్రైవర్ కుమారుడు ఇండియన్ క్రికెట్ టీమ్ దాకా ఎలా వచ్చాడు?
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









