చేతన్ సకారియా: టెంపో డ్రైవర్ కుమారుడు ఇండియన్ క్రికెట్ టీమ్ దాకా ఎలా వచ్చాడు?

చేతన్ సకారియాకు స్కూలు రోజుల నుంచి క్రికెట్ అంటే ఇష్టం.

ఫొటో సోర్స్, INSTAGRAM CHETAN SAKARIYA

ఫొటో క్యాప్షన్, చేతన్ సకారియా
    • రచయిత, జిగర్‌ భట్
    • హోదా, బీబీసీ కోసం..

జూలైలో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనబోతున్న భారత జట్టులో గుజరాత్‌కు చెందిన చేతన్ సకారియాకు స్థానం లభించింది. చేతన్‌ది గుజరాత్‌లోని భావ్‌ నగర్ జిల్లా వర్తేజ్ గ్రామం. నిన్న మొన్నటి వరకు ఆయన కుటుంబం అనేక సమస్యలతో కష్టాలు పడింది.

ఫిబ్రవరిలో చేతన్ తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఎంపికయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఆయన్ను రూ. కోటి 20 లక్షలకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్‌లో ఎంపిక కావడానికి ముందు చేతన్ సకారియా తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐపీఎల్ తర్వాత తండ్రి మరణించారు. ఆ షాక్ నుంచి అతని కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

''చేతన్ ఎంతో కష్టపడి ఐపీఎల్‌లో చోటు సంపాదించాడు. ఆర్ధికంగా ఇబ్బందులున్నా మేం అతనికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకున్నాం'' అని ఆయన తల్లి వర్షా సకారియా ఫిబ్రవరిలో బీబీసీతో అన్నారు.

చేతన్ తమ్ముడు చదువు మానేసి అన్న క్రికెట్ కెరీర్ కోసం కష్టపడి పని చేశాడు. కానీ, ఈ రోజు చేతన్ విజయాలను చూడటానికి అతడు ఈ ప్రపంచంలో లేడు.

''చేతన్ తమ్ముడు రాహుల్ ఇప్పుడు జీవించి ఉంటే, అన్న విజయాలను చూసి ఆనందంతో డాన్స్ చేసేవాడు. చేతన్ ఆటను చూసి వాడు ఇంట్లో గంతులు వేస్తుండేవాడు'' అన్నారు తల్లి వర్ష.

ఐపీఎల్‌కు ముందు చేతన్ తమ్ముడిని కోల్పోగా, ఐపీఎల్ జరుగుతున్న సమయంలో అతని తండ్రికి కోవిడ్ సోకింది. మ్యాచ్‌లు రద్దవడంతో తండ్రిని స్వయంగా ఆసుపత్రిలో చేర్పించి చేతన్ చికిత్స చేయించాడు. కానీ, ఫలితం దక్కలేదు.

''మొదట నా తమ్ముడిని కోల్పోయాను. ఒక నెల తరువాత నాకు ఐపీఎల్ కాంట్రాక్ట్ వచ్చింది. గత నెలలో నాన్న చనిపోయారు. ఇప్పుడు నేను టీమ్ ఇండియాకు ఎంపికయ్యాను. నేను భారత జట్టులో ఆడుతుంటే చూడాలని నాన్న అనుకునే వారు. కానీ, ఆయన ఇప్పుడు లేరు'' అన్నారు చేతన్

23 ఏళ్ల చేతన్ సకారియా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇప్పటి వరకు అతను భారత్-ఏ జట్టులో చేరలేదు. కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ రద్దయింది. రద్దుకు ముందు జరిగిన మ్యాచుల్లో చేతన్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏడు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీశారు.

బ్యాటింగ్‌లో చేతన్ రాణిస్తున్నా, బౌలింగ్ స్టైల్ ను చూసి అందులో శిక్షణ ఇచ్చింది స్కూల్ యాజమాన్యం

ఫొటో సోర్స్, CHETAN SAKARIA

ఫొటో క్యాప్షన్, ట్రోఫీని ముద్దాడుతున్న సకారియా

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డా...

చేతన్ తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు, విద్యా విహార్ సెకండరీ స్కూల్ తరఫున క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఈ పాఠశాల, వాళ్ల ఊరుకు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

''మా స్కూల్లో క్లాసులు ముగిసిన తర్వాత ఓ గంట సేపు క్రికెట్ కోచింగ్ ఇస్తాము. టెన్నిస్ బాల్‌తో మొదలు పెట్టి, టోర్నమెంట్లలో పాల్గొనే వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లలో చేతన్ బాగా పరుగులు చేసేవాడు'' అని స్కూల్ టీచర్ కమలేశ్ పేర్కొన్నారు.

''చేతన్ బంతిని విసిరే స్టైల్‌ను చూసి బౌలింగ్‌లో శిక్షణ ఇచ్చాం. అందులో బాగా రాణించాడు'' అని ఆయన వెల్లడించారు.

2012, 2015 మధ్య చేతన్ తన స్కూల్ తరఫున టోర్నమెంట్లు ఆడి, బ్యాటింగ్, బౌలింగ్‌లలో రాణించి అనేకసార్లు తన జట్టును ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. అప్పట్లో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

''చేతన్ వాళ్ల నాన్న టెంపో డ్రైవర్‌గా పని చేస్తారు. ఆర్ధిక సమస్యల కారణంగా నేను ఇటుక బట్టీలో పనికి వెళ్లేదానిని. ఒక ప్రమాదంలో చేతన్ తండ్రి వికలాంగుడయ్యారు'' అన్నారు చేతన్ తల్లి వర్షా సకారియా.

ఆర్థిక సంక్షోభంలో చేతన్ మామ వారి కుటుంబానికి సహాయం చేశారు. చేతన్ చిన్నప్పుడు భావ్‌నగర్‌లోని తన మామ ఇంట్లో పెరిగాడు. ఆయన మామ స్టేషనరీ దుకాణం నడుపుతుండేవారు. చదువుల్లోనూ రాణిస్తున్న చేతన్‌ను ప్రభుత్వ అధికారిని చేయాలని ఆయన అనుకునేవారు.

''చేతన్ క్రికెటర్ కావాలని అనుకున్నాడు. కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదు. కాబట్టి అతడు ఏదో ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగంలోకి పంపించాలని నేను అనుకున్నాను. ఒక రోజు చేతన్ స్కూల్ టీచర్ నన్ను పిలిచి, అతను మంచి క్రికెటర్ అవుతాడు, ఆడనివ్వండి అన్నారు. నేను కాదనలేకపోయాను.'' అన్నారు చేతన్ మామ మన్‌సుఖ్ భాయ్.

ఆర్ధికంగా కుటుంబం ఇబ్బంది పడుతున్నా, చేతన్ సకారియాను క్రికెట్ ఆడటంలో ప్రోత్సహించింది.

ఫొటో సోర్స్, JIGNASHA SAKARIYA

క్రికెట్ ఆడినందుకు దెబ్బలు

చేతన్ కుటుంబం కూడా అతను త్వరగా చదువులు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని కోరుకుంది. క్రికెట్ కోసం కెరీర్‌ను పణంగా పెట్టవద్దని తల్లిదండ్రులు హెచ్చరిస్తుండేవారు.

''క్రికెట్ అంటే చేతన్‌కు ప్రాణం. అతను స్కూల్ ఎగ్గొట్టి క్రికెట్ ఆడటానికి వెళ్లేవాడు. ఒకసారి నాన్నకు తెలిసి కొట్టారు'' అని చేతన్ సోదరి జిజ్ఞాస అన్నారు. 10 వ తరగతిలో చేతన్ 87 శాతం మార్కులు సాధించాడు.

చేతన్ సకారియా కోసం రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు ఛాలెంజర్స్ జట్లు పోటీ పడ్డాయి.

ఫొటో సోర్స్, KALUBHAI JAMBUSARA

ఫొటో క్యాప్షన్, మేనమామ, అత్తతో చేతన్ సకారియా

తమ్ముడి త్యాగం

చేతన్‌ భావ్‌నగర్‌లో క్రికెట్ కోచింగ్ తీసుకోవడం ప్రారంభించాడు. భావ్‌నగర్‌కు చెందిన భరూచ క్రికెట్ క్లబ్‌ తరఫున ఆడేవాడు. మంచి ప్రతిభ కనబరచడంతో సౌరాష్ట్ర అండర్-16, అండర్ -19 జట్టుకు ఎంపికయ్యాడు. కానీ, ఆటకు, చదువుకు మధ్య సమతుల్యత సాధించలేకపోయాడు.

భావ్‌నగర్‌లో మధ్యాహ్నం తన మామ స్టేషనరీ షాపులో పని చేయడం, ఉదయం, సాయంత్రం క్రికెట్ ప్రాక్టీస్ కోసం భరూచ క్రికెట్ క్లబ్‌కు వెళ్లడం చేతన్ పనిగా ఉండేది.

ఆర్థిక సమస్యల కారణంగా చేతన్ తమ్ముడు చదువును ఆపేయాల్సి వచ్చింది. అతను కూడా తన మామ స్టేషనరీ షాపులో పని చేయడం ప్రారంభించాడు. చేతన్‌ ప్రతిభను గుర్తించి అన్నకు సాయపడేవాడు. అదే సమయంలో, అనారోగ్యం కారణంగా చేతన్ తండ్రి టెంపో నడపలేక పోయారు.

చేతన్ అండర్-16 జట్టులో స్థానం సంపాదించినా, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. అయితే, సౌరాష్ట్ర అండర్-19 జట్టులో ఆడే అవకాశం దక్కింది.

కూచ్‌ బెహర్ ట్రోఫీలో సౌరాష్ట్ర అండర్ -19 జట్టు కోసం చేతన్ ఆరు మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు. కర్ణాటకపై అయిదు వికెట్లు తీసినప్పుడు అందరి దృష్టిలో పడ్డాడు.

చేతన్ సకారియ తమ్ముడు ఆత్మహత్య చేసుకోగా, తండ్రి కోవిడ్ తో మరణించారు.

ఫొటో సోర్స్, JIGNASHA SAKARIYA

ఫొటో క్యాప్షన్, ట్రోఫీతో చేతన్ సకారియా

బూట్లు కూడా లేవు

ఫాస్ట్‌ బౌలింగ్‌లో మెలకువలు నేర్చుకోవడానికి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చేతన్‌ను ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ అకాడమీకి పంపింది. అక్కడ ఫాస్ట్ బౌలర్ గ్లెన్‌ మెక్‌గ్రాత్ నుండి శిక్షణ పొందిన తరువాత, చేతన్ గంటకు 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బంతిని విసరడం ప్రారంభించాడు.

ట్రైనింగ్ కోసం ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌కు వచ్చినప్పుడు చేతన్‌కు సరైన షూ కూడా లేవు. కూచ్ బెహర్ ట్రోఫీ సందర్భంగా తోటి క్రికెటర్ల బూట్లు ధరించి మ్యాచ్‌లలో పాల్గొన్నాడు.

చేతన్ ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నప్పుడు, ఇండియన్ యువ క్రికెటర్ షెల్డన్ జాక్సన్ అతనికి స్పైక్‌లు ఉన్న బూట్లను బహుమతిగా ఇచ్చారు.

''షెల్డన్ జాక్సన్ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. అతను సీనియర్ ఆటగాడు. నేను అతని వికెట్ తీస్తే నాకు స్పైక్ బూట్లు బహుమతిగా ఇస్తానని చెప్పాడు. నేను వికెట్ తీసి గిఫ్ట్ సాధించాను'' అని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేతన్‌ వెల్లడించాడు.

2018-19లో చేతన్‌కు అవకాశాలు రాలేదు. అయితే, రంజీ ట్రోఫీలో బాగా రాణించాడు. సౌరాష్ట్ర ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కడ్ గాయంతో తప్పుకోవడంతో చేతన్ సకారియాకు అవకాశం లభించింది.

గుజరాత్‌ తరఫున తన తొలి రంజీ మ్యాచ్ ఆడి అందులో అయిదు వికెట్లు పడగొట్టాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో మొత్తం 30 వికెట్లు తీశాడు.

చేతన్ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మరోసారి ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ అకాడమీకి వెళ్ళాడు. గాయం కారణంగా, విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనలేక పోయాడు.

రంజీ ట్రోఫీ చివరి సీజన్లో కూడా చేతన్ పెద్దగా రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 11 వికెట్లు మాత్రమే వచ్చాయి. కానీ, సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

రాజస్థాన్ రాయల్స్ చేతన్‌ను రూ.కోటి 20 రూపాయలతో కొనుగోలు చేసింది.

ఫొటో సోర్స్, JIGNASHA SAKARIYA

ఫొటో క్యాప్షన్, చేతన్‌ను మేనమామ బాగా ప్రోత్సహించారు.

లాక్‌డౌన్‌లో ప్రాక్టీస్

కరోనా కారణంగా లాక్‌డౌన్ కొనసాగడంతో చేతన్‌ ప్రాక్టీస్‌కు ఇబ్బంది ఏర్పడింది. దీంతో అతని మామ మన్సుఖ్ భాయ్ ప్రత్యామ్నాయం ఆలోచించారు. ''పొలంలోనే పిచ్ తయారు చేశాము. జిమ్‌ కూడా ఏర్పాటు చేశాము. ఇక్కడే చేతన్ ప్రాక్టీస్ చేశాడు. అతని కష్టానికి ఫలితం లభించి ఐపీఎల్‌లో చోటు దక్కింది'' అన్నారు మన్సుఖ్ భాయ్.

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతన్‌ను 1.20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అతని ఆరంభ ధర కేవలం రూ.20 లక్షలు.

గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)లో నెట్ బౌలర్‌గా చేరినందున చేతన్‌ను దక్కించుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ జరిగింది. గతంలో చేతన్ బెంగళూరు జట్టుతో దుబాయ్ కూడా వెళ్లాడు.

''ఐపీఎల్‌కు ఎంపికవుతానని నాకు నమ్మకం ఉండేది. నెట్ బౌలర్‌గా దుబాయ్‌ వెళ్లాను. మైక్ హెస్సన్, సైమన్ కటిచ్‌లు నన్ను ప్రోత్సహించారు'' అని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేతన్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)