సీకే నాయుడు: క్రికెట్ 'ఉక్కు మనిషి'.. భారత క్రికెట్ టెస్ట్ జట్టుకు ప్రప్రథమ కెప్టెన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
యాభయ్యేడేళ్ల ఒక పెద్దాయన బ్యాటు పట్టుకుని క్రీజులోకి వచ్చాడు.. ప్రత్యర్థి బౌలర్లకు వణుకు మొదలైంది.
బౌన్సర్లతో భయపెట్టే తమ జట్టు బౌలర్‌ను రంగంలోకి దించారు..
ఆయన వేసిన బంతి ఆ పెద్దాయన ముఖానికి తాకి పళ్లు కదిలిపోయాయి.
అయినా, ఆయన ఏమాత్రం చలించలేదు. ఆ తరువాత బంతికే సిక్సర్ బాదారు. మొత్తంగా ఆ ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేశాక కానీ శాంతించలేదు.
ఇది ఈనాటి ఆట కాదు.. 1952లో బాంబే, హోల్కర్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్.
యాభయ్యేడేళ్ల ఆ క్రికెట్ ఉక్కు మనిషి పేరు కల్నల్ సీకే నాయుడు. అప్పటికి హోల్కర్ జట్టుకు కెప్టెన్ ఆయన.
భారతదేశంలో ఉక్కుమనిషిగా పిలుచుకునే సర్దార్ వల్లభాయి పటేల్ జన్మదినం, సీకే నాయుడు జన్మదినం ఒకటే(అక్టోబరు 31). అందుకే.. ఆరడుగుల ఎత్తుతో, బలిష్టమైన దేహంతో బలమైన షాట్లతో విరుచుకుపడే సీకే నాయుడిని క్రికెట్లో ఉక్కుమనిషిగా అభివర్ణిస్తుంటారు.


ఫొటో సోర్స్, CKNayudu-A Daughter Remembers(Rupa&Co)/Twitter
భారత క్రికెట్‌కు మొట్టమొదటి కెప్టెన్.. తెలుగువారే
భారత క్రికెట్ టెస్ట్ జట్టుకు ప్రప్రథమ కెప్టెన్ సీకే నాయుడు. 1932 జూన్ 25వ తేదీన భారత్ తన తొలి టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడింది. ఆ జట్టుకు సీకే నాయుడే కెప్టెన్.
నాగపూర్‌లో పుట్టిపెరిగి.. అక్కడే స్కూలు రోజుల నుంచి క్రికెట్ ఆడి భారత జట్టుకు తొలి కెప్టెన్ అయిన సీకే తెలుగువారు. ఆయన పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం.
అందుకే జులై 24వ తేదీ మంగళవారం మచిలీపట్నంలో సీకే నాయుడి విగ్రహాన్ని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆవిష్కరించారు.

ఫొటో సోర్స్, Getty Images
52 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ
భారత క్రికెట్‌లో అరుదైన క్రికెటర్‌గా సీకే నాయుడి పేరు చెబుతారు. బౌలర్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన బ్యాట్స్‌మన్‌గా మారి భారీ సిక్సర్లకు పెట్టింది పేరయ్యారు.
అరవయ్యేళ్ల వయసు వరకు క్రికెట్ ఆడిన ఆయన యవ్వనంలో ఉండగా 1923లో సైన్యంలో పనిచేస్తున్న సమయంలో బ్రిటిష్ జట్టుతో ఆడుతూ స్కోరును ఉరకలేయించేవారు.
భారత జట్టుకు చీఫ్ సెలక్టర్‌గానూ కొనసాగారు. చీఫ్ సెలక్టర్‌గా ఉంటూనే ఆయన 52 ఏళ్ల వయసులో రంజీ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్‌లో ఆయన ఏకంగా డబుల్ సెంచరీ చేశారు.

ఫొటో సోర్స్, సి.వెంకటేశ్
ముంబయి జింఖానా గ్రౌండ్స్‌లో ఓసారి ఎంసీసీ జట్టుతో ఆయన హోల్కర్ టీం తరఫున ఆడినప్పుడు జట్టు మొత్తం 187 పరుగులు చేస్తే అందులో సీకే ఒక్కరే 153 చేశారు.
ఇక 1956-57 రంజీ ట్రోఫీలో ఆయన చివరిసారిగా ఆడారు. అప్పటికి ఆయన వయసు 62 ఏళ్లు. ఆ మ్యాచ్‌లో ఆయన 52 పరుగులు చేశారు. ఆ సందర్భంగా వినూ మన్కడ్ వేసిన ఒక ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టడాన్ని ఇప్పటికీ క్రికెట్ అభిమానులు గుర్తు చేస్తుంటారు.
భారత క్రికెట్‌కు ఆయన చేసిన సేవల నేపథ్యంలో ఏటా కల్నల్ సీకే నాయుడు టోర్నీ నిర్వహిస్తున్నారు. అలాగే సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు నెలకొల్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆద్యుడు.. ఆరాధ్యుడు
* భారత క్రికెట్ టెస్ట్ జట్టుకు ప్రప్రథమ కెప్టెన్ సీకే నాయుడు.
* పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తొలి క్రికెటర్ కూడా ఆయనే.
* వాణిజ్య ప్రకటనలకు క్రికెటర్లను ఎంపిక చేసుకోవడం కూడా ఆయనతోనే మొదలైంది. అప్పట్లో ఓ టీ కంపెనీ తమ ప్రకటనల్లో సీకే నాయుడి చిత్రాన్ని వాడుకునేది.

ఫొటో సోర్స్, సి.వెంకటేశ్
* క్రికెట్ చరిత్రలో మొదటి మహిళా కామెంటేటర్ 'చంద్ర సీకే నాయుడు' ఆయన కుమార్తే. ‘సీకే నాయుడు ఏ డాటర్ రిమెంబర్స్’ పేరుతో ఆమె పుస్తకం రాశారు.
* సీకే నాయుడు సోదరుడు సీఎస్ నాయుడు(కొఠారి సుబ్రహ్మణ్య నాయుడు) కూడా భారత్ తరఫున ఆడారు. మరో ఇద్దరు సోదరులు కూడా క్రికెటర్లే అయినప్పటికీ భారత్‌కు ఆడలేదు. సీకే నాయుడు కుమారులు కూడా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడారు.
ఆల్‌రౌండ్ ప్రతిభ
కెరీర్‌లో 207 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సీకే నాయుడు మొత్తం 11,825 పరుగులు చేశారు. అందులో 26 సెంచరీలున్నాయి. బౌలర్‌గానూ ప్రతిభ చూపిన ఆయన కెరీర్లో 411 వికెట్లు తీశారు. అటు ఫీల్డింగ్‌లోనూ 170 క్యాచ్‌లు పట్టారు. ఏడు టెస్ట్ మ్యాచ్‌లూ ఆడారు.
పూర్తి పేరు: కఠారి కనకయ్య నాయుడు
జననం: 1895, అక్టోబర్ 31న నాగపూర్‌లో
మరణం: 1967, నవంబరు 14



సీకే నాయుడిది మచిలీపట్నమే: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర
సీకే నాయుడు స్మారకంగా ఆయన విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. సీకే నాయుడి పూర్వీకులది మచిలీపట్నం కావడంతో ఆ ప్రఖ్యాత క్రికెటర్ విగ్రహాన్ని పట్టణంలో నెలకొల్పాలని చాలా కాలంగా అనుకుంటున్నామని.. అందులో భాగంగా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించి జులై 24న ఆవిష్కరించామని ఆంధ్రప్రదేశ్ క్రీడల మంత్రి కొల్లు రవీంద్ర ‘బీబీసీ’కి తెలిపారు.
భారత జట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం అక్కడే ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కుంబ్లే శంకుస్థాపన చేశారు. రూ.8 కోట్లతో ఈ మినీ స్టేడియం నిర్మించనున్నామని మంత్రి చెప్పారు. మరో రూ.5 కోట్లతో స్విమింగ్‌పూల్ కూడా నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- వన్డే.. టీ20.. ఇప్పుడు 100-బాల్ క్రికెట్
- 34 ఏళ్లు వెతికితే కానీ భారత మొదటి ఒలింపియన్ కుటుంబం ఆచూకీ దొరకలేదు
- హిమా దాస్: పంట పొలాల్లో పెరిగిన నిన్నటి ఫుట్‌బాల్ ప్లేయర్.. నేడు 400 మీటర్ల రేసులో స్వర్ణపతక విజేత
- బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా సంస్థా?
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- ‘అందరికీ చెడ్డ రోజులుంటాయి’.. ధోనీ ‘డిఫెన్స్’కి కోహ్లీ సమర్థన
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- ముంబయి టైటానిక్: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








