ఈ టెన్నిస్ బంతులు ఏ రంగులో ఉన్నాయో చెప్పగలరా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టామ్ గెర్కెన్
- హోదా, బీబీసీ యూజీసీ, సోషల్ న్యూస్
ఈ టెన్నిస్ బంతులు పసుపు రంగులో ఉన్నాయా? లేక ఆకుపచ్చ రంగులో ఉన్నాయా? మీకేం కనిపిస్తోంది?
ఇది చాలా సులభమైన ప్రశ్నలా కనిపిస్తోంది. ఈ బంతుల రంగు కచ్చితంగా పసుపు. కానీ కొందరు మాత్రం ఇవి కచ్చితంగా ఆకుపచ్చ రంగు బంతులంటారు.
మరికొందరేమో.. కచ్చితంగా ఇవి ఆ రెండు రంగుల్లోనూ ఉన్నాయంటారు.
అసలు టెన్నిస్ బంతుల రంగేంటి? దీనికి టెన్నిస్ దిగ్గజం, ప్రస్తుత ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు ఇలా సమాధానం ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
టెన్నిస్ బంతుల రంగుకు సంబంధించి ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అవి పసుపు రంగులో ఉన్నాయని రోజర్ ఫెదరర్ సమాధానం ఇచ్చారు.
‘‘ఈ టెన్నిస్ బంతులు ఏ రంగులో ఉన్నాయి? ఆకు పచ్చా లేక పసుపా?’’ అని సదరు వ్యక్తి అడగ్గా.. ‘‘అవి పసుపు రంగుల్లో ఉన్నాయనుకుంటున్నాను. కరెక్టే కదా!’’ అని ఫెదరర్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
‘‘నేనేమో ఆకుపచ్చ అనుకుంటున్నాను. నా కుమారుడేమో పసుపు అంటున్నాడు’’ అని ఆ వ్యక్తి చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో ట్విటర్‌లో వైరల్ అయ్యింది.
చాలామంది ఫెదరర్ చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందారు. ‘‘ఫెదరర్ పసుపు అన్నాడంటే అవి పసుపే’’ అని నరెల్లె అనే వ్యక్తి అభిప్రాయపడగా, ‘‘నేనెప్పుడూ టెన్నిస్ బంతులు ఆకుపచ్చ రంగులో ఉంటాయనుకునే వాడిని. కానీ, రోజర్ ఫెదరర్ వాటిని పసుపు అంటే.. ఇక వాదించటానికి నేనెవరిని’’ అని బ్ర్యాన్ హఫ్ ట్వీట్ చేశారు.
బ్రియాన్ థామ్ అనే వ్యక్తి మాత్రం.. ‘‘వింబుల్డన్ కోర్టులో గడ్డి పచ్చగా ఉంటుంది, బంతులు కూడా పచ్చగా ఉండటానికి వీలు లేదు’’ అంటూ.. ఫెదరర్ సమాధానంతో సంతృప్తి చెందనట్లుగా పేర్కొన్నారు.
‘‘రోజర్ ఫెదరర్ (సమాధానం) తప్పు’’ అని ప్రకటించారు ఆడ్రా అనే మహిళ. ప్రత్యూష్ శ్రీవాస్తవ అనే వ్యక్తి మాత్రం టెన్నిస్ బంతులు ‘‘ఫ్లోరోసెంట్ పసుపు’’ వంటివి అని, అవి పచ్చగా కూడా కనిపించగలవని ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, PA
అసలు కొందరు భిన్నమైన రంగుల్ని ఎందుకు చూస్తారు?
రెండేళ్ల కిందట.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన తెలుపు, బంగారు వర్ణంలోని వస్త్ర దృష్టి భ్రాంతి వ్యవహారమే దీనికి సమాధానం కావొచ్చు. అప్పట్లో ఆ వస్త్రం తెలుపు - బంగారు వర్ణంలో ఉందని కొందరు, కాదు.. నీలం - నలుపు రంగులో ఉందని మరికొందరు సమాధానాలు ఇచ్చారు.
ప్రజలు రంగుల్ని చూడటంలో చాలా తేడాలు ఉంటాయని, వారి దృష్టిలో భారీగా వ్యత్యాసాలుంటాయని అప్పట్లో లీడ్స్ విశ్వవిద్యాలయం రంగుల శాస్త్ర, సాంకేతిక విభాగం అధిపతి ప్రొఫెసర్ స్టీఫెన్ వెస్ట్‌లాండ్ చెప్పారు.
‘‘మనం రంగుని ఒకే దృష్టితో చూడం. చాలా మంది రంగుల్ని వేర్వేరుగా చూడటానికి ఆస్కారం ఉంది. అయితే వాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటం మాత్రం కష్టం’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









