వస్త్రధారణపై ‘హిందూ’ ముద్ర వేయవద్దు

చేనేత, హిందూధర్మం, ఫ్యాషన్ షో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లైలా త్యాబ్జీ, దస్తకార్ ఛైర్ పర్సన్
    • హోదా, బీబీసీ కోసం

న్యూయార్క్ టైమ్స్‌లో అస్ఘర్ ఖాద్రీ వ్యాసం - 'ఇన్ ఇండియా, ఫ్యాషన్ హ్యాజ్ బికమ్ ఎ నేషనలిస్ట్ కాజ్' అన్న వ్యాసం వివాదాస్పదంగా మారింది. దానిలోని అసంబద్ధ, తప్పుడు విషయాల కారణంగా దానికి అంత ప్రచారం వచ్చి ఉండకూడదేమో.

సమకాలీన భారతీయ ఫ్యాషన్ విషయంలో ఆయన అభిప్రాయాలు చాలా హాస్యాస్పదం. అయితే విచిత్రం ఏమిటంటే - యోగ, ఆయుర్వేద వైద్యం, ఇతర భారత సాంప్రదాయ విజ్ఞానాన్ని, చివరికి శాకాహారాన్ని కూడా ప్రోత్సహిస్తున్న ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం.. భారతీయ దుస్తుల్ని ధరించాలన్న ప్రచారానికి మాత్రం దూరంగా ఉంది.

ఇప్పటివరకు భారతదేశ ప్రధానులంతా భారతీయ సాంప్రదాయ దుస్తులనే ధరిస్తే.. ప్రస్తుత ప్రధాని మాత్రం వారికి భిన్నం. మోదీ విదేశీ పర్యటనల్లో తరచుగా సూట్‌లో కనిపిస్తుంటారు.

చేనేత, హిందూధర్మం, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

''సాంప్రదాయ వస్త్రధారణను ప్రోత్సహించాలని, పాశ్చాత్య ధోరణులను వదిలేయాలని భారతీయ ఫ్యాషన్ పరిశ్రమపై చాలా ఒత్తిడి ఉంది. అనేక విశ్వాసాలు కలిగిన, 130 కోట్లకు పైగా ప్రజలున్న భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలనే ఆ పార్టీ యొక్క విస్తృత రాజకీయ కార్యక్రమానికి ఇది సరిగ్గా సరిపోతుంది అని అస్ఘర్ ఖాద్రీ అన్నారు.

ఇది చాలా చెత్త వాదన. భారతీయ సాంప్రదాయ వస్త్రధారణ - చీర, సల్వార్ కమీజ్, ధోతీ, లెహంగా ఓర్డ్నీ, లుంగీ, మేఖల ఛదోర్, షేర్వానీ, అచకన్, నెహ్రూ జాకెట్లు.. వీటన్నిటికీ హిందూధర్మంతో ఎలాంటి సంబంధమూ లేదు. భారతదేశంలోని వివిధ రకాల వస్త్రధారణ దాని బహుళ సంస్కృతి స్వభావాన్ని తెలియజేస్తుంది.

చేనేత, హిందూధర్మం, ఫ్యాషన్ షో

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశ దుస్తులు (మోదీ బంద్‌గలా వెయిస్ట్ కోట్, చురీదార్-కుర్తా సహా) ఇక్కడి ప్రాంతీయ వైవిధ్యం, వాతావరణం, జీవనవిధానం, సంస్కృతితో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వస్త్రధారణల ప్రభావంతో పరిణామం చెందాయి.

అలెగ్జాండర్‌ గ్రీకులు, మధ్య ఆసియా బందిపోట్లు, బ్రిటిషర్లు కూడా మన అంగరఖా, అనార్కలి, అచ్‌కన్ కట్స్‌పై ప్రభావం చూపారు.

మన దేశం విదేశీ దుస్తుల కంపెనీలను ప్రోత్సహించకుండా ఉన్నదీ లేదు. భారతీయ మార్కెట్‌లో లగ్జరీ, హై స్ట్రీట్ బ్రాండ్స్ రెండింటికీ కూడా చాలా ప్రోత్సాహం లభిస్తోంది.

హెర్మెస్, కార్టియర్, గుస్సీ, జరా, టామీ హిల్‌ఫిగర్, లెవీస్, బెనెట్టెన్‌ లాంటి బ్రాండ్‌లు చిన్న చిన్న సిటీ మాల్స్‌లో కూడా కనిపిస్తున్నాయి. టీ షర్ట్‌లు, జీన్స్, పొట్టి డ్రస్సులు మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. చీరకట్టులో ఒకోసారి నాకు నేనే డైనోసార్‌లా కనిపిస్తాను.

చేనేత, హిందూధర్మం, ఫ్యాషన్ షో, స్మృతి ఇరానీ

ఫొటో సోర్స్, Getty Images

మన కోసమా, వాళ్ల కోసమా?

ఏదేమైనా - భారతీయ వస్త్రాలను దేశం లోపల ఎక్కువగా ప్రోత్సహించే బదులు, వాటిని అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేయడానికి ప్రభుత్వం ఎక్కువగా ప్రయత్నిస్తోంది.

జౌళి శాఖ వారణాశికి, ఇతర చేనేత కేంద్రాలకు డిజైనర్లను పంపుతోంది ఎక్కువ మంది భారతీయులు చీరలు ధరించేలా చేయడానికి కాదు. అంతర్జాతీయ వినియోగదారుల కోసం పాశ్చాత్య తరహాలో వాటిని డిజైన్ చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ రాజధానుల్లో జరిగే ఫ్యాషన్ షోలు, ట్రేడ్ ఫెయిర్స్‌లో వాటిని ప్రదర్శించడానికి.

జౌళి శాఖ మంత్రా స్మృతి ఇరానీ గొప్పగా సాధించింది ఏదైనా ఉందీ అంటే అది ఓ విదేశీ మెన్స్‌వేర్ బ్రాండ్ తన షర్ట్స్ కోసం మన చేనేత వస్త్రాలు ఆర్డర్ చేయడం.

చేనేత, హిందూధర్మం

ఫొటో సోర్స్, Getty Images

చేనేతను దెబ్బ తీసిన నోట్ల రద్దు, జీఎస్టీ

ఇది కాకుండా, మన చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి జరుగుతున్న మరో రెండు ప్రయత్నాలు - హ్యాండ్లూమ్ మార్క్, చేనేత దినోత్సవం. చిన్న చేనేత కళాకారులను పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పెద్ద దెబ్బ తీసింది. అలాంటి వారికి ప్రభుత్వం పెద్దగా సహాయం చేయడం లేదని చేనేత రంగంలో పని చేస్తున్న నాలాంటి వారు అభిప్రాయపడుతున్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి అన్ని ప్రభుత్వాలూ చేనేతను ప్రోత్సహిస్తున్నాయి. ఇది హిందూధర్మాన్నో, జాతీయ వాదాన్నో ప్రచారం చేయడానికి కాదు. కేవలం వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం అదే కాబట్టి.

మిల్లులు, పవర్ లూమ్‌ల కారణంగా చేనేత కళాకారుల అసాధారణ నైపుణ్యాలు నేడు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రతి దశాబ్దం సుమారు 15 శాతం మంది ఆ రంగం నుంచి తప్పుకుని ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకొంటున్నారు.

చేనేత, హిందూధర్మం

ఫొటో సోర్స్, Getty Images

చేనేతను వివాదాల్లోకి లాగొద్దు

చేనేతకు హిందూధర్మంతో ఎలాంటి సంబంధమూ లేదు. ప్రధాని నియోజకవర్గం వారణాసి సహా, ఇతర చోట్ల ఆ వృత్తిలో ఉన్న చేనేత కళాకారులు ఎక్కువగా ముస్లింలు. ఈశాన్య భారతదేశం, మధ్య భారతంలోనూ ఆ వృత్తిలో ఎక్కువగా ఉన్న మరో వర్గం - గిరిజనులు.

చేనేత వస్త్రాలు ధరించడం లేదా సాంప్రదాయ చేనేత వారసత్వాన్ని ప్రోత్సహించడాన్ని హిందూ ఛాందసవాద అజెండాతో ముడిపెట్టడం మూర్ఖత్వం. ఒక ముస్లింనైన నేను నిత్యమూ నేత చీరలను ధరించడానికి ఏవో హిందుత్వ కారణాలను వెతకడం అసంబద్ధం.

చేనేత, హిందూధర్మం, ఫ్యాషన్ షో

ఫొటో సోర్స్, Getty Images

నిజానికి భారతదేశ సాంస్కృతిక, ఆధ్మాత్మిక చరిత్ర గురించి ఎంతగానో ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం, జాతీయ వస్త్రంపై మాత్రం అంతగా దృష్టి పెట్టకపోవడం చాలా ఆసక్తికరం.

దీనికి రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి: మన ఆహారంలాగా భారత సంప్రదాయ వస్త్రదారణ కూడా చాలా వైవిధ్యభరితం. అందువల్ల ఏదో ఒక్కదాన్ని ఎంపిక చేయడం కష్టం కావచ్చు. భారతీయ వస్త్రాలు ప్రాంతీయం, జాతీయం కాదు. (ఉదాహరణకు చీర కట్టుకునే విధానంలో సుమారు 60 రకాలు ఉన్నాయి).

రెండో కారణం - ప్రభుత్వానికి ఆ పని ఇష్టం లేకపోవడం. పాశ్చాత్య వస్త్రధారణ పెరుగుతుండగా, అదే సమయంలో భారతీయులు మరీ ముఖ్యంగా యువత భారతీయ వస్త్రాలను కూడా నిర్లక్ష్యం చేయడం లేదు.

ఈ విషయంలో మనకు నచ్చింది ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నా, మిస్టర్ ఖాద్రీ మన వస్త్రాలను ఒక వాదంలో ఇరికించడానికి చేసిన ప్రయత్నం మాత్రం నాకు అసహనం కలిగిస్తోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)