ముంబై: మేడ మీదే విమానం తయారు చేసిన పైలెట్

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ న్యూస్, ముంబై
ఏడేళ్ల క్రితం అమోల్ యాదవ్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్ మేడ మీదే విమానాన్ని నిర్మిస్తానని తన కుటుంబం, స్నేహితులతో సవాలు చేశాడు.
విమానం తయారు చేయడం పూర్తయ్యాక దాన్ని కిందికి ఎలా తెస్తావంటూ వాళ్లు అమోల్‌ను ఎగతాళి పట్టించారు.
అయితే ట్విన్-ఇంజెన్ టర్బోప్రాప్ ప్లేన్ పైలెట్ అయిన అమోల్ చాలా మొండిఘటం.
ముంబైలో అమోల్ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదంతస్తుల భవనానికి కనీసం లిఫ్ట్ కూడా లేదు.
అందువల్ల విమాన నిర్మాణానికి అవసరమైన లేత్ మెషీన్లు, కంప్రెషర్లు, వెల్డిండ్ మెషీన్‌లను, ఇంపోర్టెడ్ ఇంజెన్‌ను మెట్ల మీదుగానే ఇంటి పైభాగానికి చేరవేశారు.
ఆ రోజు నుంచి ఎండను, వానను లెక్క చేయకుండా అమోల్ తన సిబ్బంది - ఒక ఆటో గ్యారేజ్ మెకానిక్, ఒక ఫ్యాబ్రికేటర్‌తో కలిసి ఇంటిపై టెన్నిస్ కోర్టుకన్నా తక్కువ స్థలంలో పని మొదలు పెట్టాడు.

ఫొటో సోర్స్, Amol Yadav
గత ఏడాది ఫిబ్రవరిలో అమోల్ 6-సీటర్ ప్రొపెల్లర్ ప్లేన్ సిద్ధమైంది.
అతని విమానం 13,000 అడుగుల ఎత్తుకు వెళ్లగలదు. దాని ట్యాంక్‌లోని ఇంధనంతో 2 వేల కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. దాని గరిష్ట వేగం గంటకు 342 కి.మీ..
సరిగ్గా అప్పుడే ప్రభుత్వం ప్రధాని మోడీ మానస పుత్రిక 'మేకిన్ ఇండియా' పేరిట ముంబైలో ఓ ఎయిర్ షోను ఏర్పాటు చేసింది.
అక్కడ తన విమాన ప్రదర్శన కోసం అమోల్ అనుమతి కోరగా, స్థలం లేదంటూ అధికారులు అనుమతి నిరాకరించారు. అయితే అతని సోదరులు ఎలాగో తిప్పలు పడి, సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి విమాన ప్రదర్శనకు వాళ్లను ఒప్పించగలిగారు.
అయితే ఇంటి పైనుంచి విమానాన్ని విడదీసి, ఎయిర్ షో జరుగుతున్న ప్రాంతానికి తరలించడం పెద్ద సమస్య అయింది.
ఇంజన్‌ను, రెక్కలను, తోకను, ఫ్యూసలాజ్‌ను వేటికవి వేరు చేసి, ఒక క్రేన్ సాయంతో వాటిని ఇంటిపై భాగం నుంచి కిందికి దింపారు.
మధ్యలో క్రేన్‌లో సాంకేతిక లోపం తలెత్తి, ఫ్యూసలాజ్ ప్రమాదకరంగా గాలిలో వేలాడ్డంతో అందరి గుండెలూ ఆగినంతపనైంది.
ఎలాగోలా విమాన భాగాలన్నీ కిందికి దింపి రెండు ట్రక్కులలోకి ఎక్కించారు.
ఆ అర్ధరాత్రి అక్కడి నుంచి సుమారు 25 కి.మీ. దూరంలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వాటిని తరలించి, మూడు గంటల్లో తిరిగి విమానాన్ని బిగించారు.

ఫొటో సోర్స్, Amol Yadav
షో ప్రారంభం కాగానే, పెవిలియన్‌కు దూరంగా ఉన్న అమోల్ ప్లేన్‌ను మొదట ఎవరూ పట్టించుకోలేదు. కానీ క్రమక్రమంగా దాని చుట్టూ గుమికూడడం ప్రారంభించారు.
ఒక స్థానిక పేపర్, న్యూస్ ఛానెల్ దానిపై వార్తలను ప్రసారం చేసాయి. దీంతో అనేక మంది విమానం వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించారు.
భారత విమానయాన శాఖ మంత్రి, సీనియర్ అధికారులు, కొంత మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు అతని విమానాన్ని సందర్శించారు.
దీంతో ఒక్కసారిగా అమోల్ యాదవ్ పేరు మీడియాలో మార్మోగిపోయింది.
ఈ ఏడాది మేలో అతని విమానాన్ని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. ఓ బిలియనీర్‌కు చెందిన ప్రైవేట్ ఎయిర్ బస్ పక్కనే అది ఠీవీగా కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Amol Yadav
1998లోనే బీజం
నిజానికి 1998లోనే అమోల్ భారత సైన్యానికి చెందిన ఓ 6- సిలిండర్ ట్రక్ ఇంజన్‌ను పది వేల రూపాయలు పెట్టి కొని, దానితో విమానాన్ని తయారు చేయానికి ప్రయత్నించాడు. కానీ 'చాలా తప్పులు చేయడం'తో తొందరగానే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
ఆ తర్వాత ఓ సెకెండ్ హ్యాండ్ 8-ఇంజన్ పెట్రోల్ సిలిండర్‌ను కొని, విమానాల నిర్మాణంపై ఓ యాభై పుస్తకాలు చదివి నాలుగేళ్లు కష్టపడి ఓ 6- సీటర్ ప్లేన్ తయారు చేశాడు. దాన్ని ఇంటికి దగ్గరలో ఉన్న రోడ్డుపైనే పరీక్షించాడు.
2004లో అమోల్ ఢిల్లీకి వెళ్లి ఓ సీనియర్ మంత్రిని కలిసి, తన విమానం రిజిస్ట్రేషన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేసాడు. అయితే మంత్రి సుముఖంగానే ఉన్నా, పక్కనున్న అధికారి మాత్రం 'విమానం పైకెళ్లి కూలిపోతేనో?' అంటూ అడ్డుపుల్ల వేశాడు.
దాంతో కథ కంచికి చేరింది.

ఫొటో సోర్స్, Anushree Fadnavis/Indus Images
ఐదేళ్ల తర్వాత మరోసారి తన మేడ మీద అతను చేసిన ప్రయోగం విజయవంతమైంది.
మేడ మీద నిర్మించిన విమాన నిర్మాణం విజయవంతం కావడంతో.. ప్రస్తుతం అమోల్ స్వతంత్రంగా విమానాలను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాడు. పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లూ తయారుగా ఉన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 19 సీటర్ల విమానాలు నిర్మించేందుకు అతనికి 157 ఎకరాలు ఇస్తామని హామీ ఇచ్చింది.

ఫొటో సోర్స్, Ansuhree Fadnavis/Indus Images
‘సామాన్యులను పట్టించుకోరు’
అయితే అమోల్ దారిలో ఇంకా ఒక అడ్డంకి ఉంది.
భారత వైమానిక నియంత్రణ సంస్థ అతని విమానానికి గుర్తింపు ఇవ్వడానికి సందేహిస్తోంది.
విమానయాన శాఖ స్వతంత్రంగా తయారు చేసిన విమానాల స్పెసిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లే తాము అనుమతి ఇవ్వలేకపోతున్నామని అధికారులు అంటున్నారు.
ప్రస్తుతం అమోల్ మరోసారి తన ఇంటి మీద 19-సీటర్ ప్లేన్ ప్రొటోటైప్ నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు అతను రూ.5 కోట్ల వరకు ఖర్చు చేశాడు. కుటుంబ ఆస్తులను అమ్మేశాడు. నగలను తాకట్టు పెట్టాడు.
అధికారుల అనుమతి లభిస్తే, తన ఫ్యాక్టరీ వల్ల భారతదేశంలో ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుందని, అనేక మందికి ఉపాధి లభిస్తుందని అమోల్ విశ్వసిస్తున్నాడు.
''భారతదేశంలో నా లాంటి సామాన్యులను ఎవరూ పట్టించుకోరు. కానీ ఏదో ఓ రోజు నేను వైమానిక రంగంలో చరిత్ర సృష్టిస్తాను'' అని అమోల్ ఘంటాపథంగా చెబుతున్నాడు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








