హమాస్ దాడుల నుంచి పాలస్తీనా వరకు.. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోదీ ఏమేం మాట్లాడారు?

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఇజ్రాయెల్ పర్యటనలో ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.
తన ప్రసంగంలో ఆయన.. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7 హమాస్ దాడి చేయడాన్ని ఖండించారు.
"ఈ అనాగరిక ఉగ్రవాద దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల భారత్ సంతాపం వ్యక్తం చేస్తోంది. బాధితుల దుఃఖాన్ని పంచుకుంటోంది" అన్నారు.
భారతదేశం, ఇజ్రాయెల్ మధ్య సారూప్యతలు ఉన్నాయని, రెండు దేశాలు అనేక విషయాలలో సహకరించుకుంటున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
భద్రతా మండలి ఆమోదించిన గాజా శాంతి ప్రణాళికకు భారతదేశం మద్దతు ఇచ్చిందని మోదీ అన్నారు.
"ఇది ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో సహాయపడుతుందని, పాలస్తీనా సమస్యను కూడా పరిష్కరిస్తుందని భావిస్తున్నాం" అన్నారాయన.
"పౌరుల హత్యను ఏ విధంగానూ సమర్థించలేం" అన్నారు మోదీ.
"ముంబయి దాడుల్లో ఇజ్రాయెల్ పౌరులు సహా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని" అన్నారు.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన నరేంద్ర మోదీ "స్నేహితుడు మాత్రమే కాదు, సోదరుడు" అని అభివర్ణించారు.
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. రాజధాని టెల్ అవీవ్ చేరుకున్న ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, భార్య సారాతో కలిసి విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
పర్యటన గురించి మోదీ సోషల్ మీడియా 'ఎక్స్'లో పోస్టు చేస్తూ "నేను ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టాను. విమానాశ్రయంలో ప్రధానమంత్రి నెతన్యాహు, శ్రీమతి నెతన్యాహు స్వాగతం పలికినందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. మా ద్వైపాక్షిక చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని, భారతదేశం-ఇజ్రాయెల్ స్నేహం మరింత బలపడుతుందని ఆశిస్తున్నాను" అని తెలిపారు.

ఫొటో సోర్స్, NARENDRA MODI/YT
'భారత్ ఇజ్రాయెల్‌ను గుర్తించిన రోజే పుట్టాను'
హోలోకాస్ట్‌ను ప్రపంచ చరిత్రలో చీకటి అధ్యాయంగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఇరు దేశాల నాగరిక వారసత్వాన్ని ప్రస్తావించిన మోదీ, ఇజ్రాయెల్ సాధించిన ప్రతి విజయాన్ని భారత ప్రజలు గౌరవంతో చూస్తారని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌తో తనకున్న ప్రత్యేక సంబంధాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశం ఇజ్రాయెల్‌ను గుర్తించిన 1950 సెప్టెంబర్ 17న తాను జన్మించానని మోదీ అన్నారు.
ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ 'షాలోమ్ నమస్తే' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఇజ్రాయెల్ పార్లమెంట్ భవనాన్ని ఇండియా జెండా రంగులతో అలంకరించినందుకు స్పీకర్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
"స్నేహితులం మాత్రమే కాదు, సోదరులం"
అంతకుముందు, నెస్సెట్‌లో మోదీని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వాగతిస్తూ "నా ప్రియమైన మిత్రమా, నరేంద్ర, మీరు ఈ రోజు ఇక్కడికి రావడం నన్ను చాలా కదిలించింది" అన్నారు.
"ఈ రోజు నేను మీ సందర్శనతో ఎంతగా కదిలిపోయానంటే, ఇలా ఎప్పుడూ జరగలేదు. మీరు ఇజ్రాయెల్‌కు చాలా సన్నిహిత మిత్రులు, భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యానికి గొప్ప మద్దతుదారు. ప్రపంచ వేదికపై గొప్ప నాయకుడు. జెరూసలేంకు స్వాగతం, నా ప్రియమైన మిత్రమా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మీ విశిష్ట ప్రతినిధి బృందానికి స్వాగతం" అన్నారు నెతన్యాహు.
"మీరు స్నేహితులు మాత్రమే కాదు, సోదరులు అని నేను ధైర్యంగా చెప్పగలను. మీరు చివరిసారి ఇక్కడికి వచ్చినపుడు, మనమిద్దరం మధ్యధరా తీరానికి వెళ్లాం. 'మనం బూట్లు తీసి నీటిపై ఎందుకు నడవకూడదు?' అని అడిగాను. నీటిపై నడవలేదు కానీ, అప్పటి నుంచి అద్భుతాలు సాధించాం. ఎందుకంటే మనం వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకున్నాం, సహకారాన్ని మూడు రెట్లు పెంచుకున్నాం. పరస్పర అవగాహనను నాలుగు రెట్లు పెంచాం" అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











