బెడ్‌షీట్లను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి?

బెడ్‌షీట్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మనీశ్ పాండే
    • హోదా, న్యూస్ బీట్ రిపోర్టర్

ఈ విషయాన్ని బహిరంగంగా చర్చించేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ, ఇది మనందరిపైనా ప్రభావం చూపుతోంది. మీరు ఎన్నిరోజులకు ఒకసారి బెడ్‌షీట్లను మారుస్తుంటారు? లేదా ఉతుకుతుంటారు?

ఈ ప్రశ్నకు ప్రజల నుంచి భిన్నరకాల స్పందనలు వస్తున్నట్లు బ్రిటన్‌లో 2,250 మందిపై చేపట్టిన తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది.

ఒంటరి పురుషుల్లో సగం మంది, నాలుగు నెలల వరకు తమ బెడ్‌షీట్లను మార్చుకోమని ఈ అధ్యయనంలో వెల్లడించారు. మరో 12 శాతం తమకు గుర్తుకు వచ్చినప్పుడు ఉతకడానికి ఇస్తామని చెప్పారు. అంటే ఒక్కోసారి నాలుగు నెలల కంటే ఎక్కువ సమయమే పట్టొచ్చని వెల్లడించారు.

‘‘అది అసలు మంచిది కాదు’’అని సైకాలజిస్ట్, న్యూరోసైంటిస్ట్, స్లీప్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ లిండ్సీ బ్రౌనింగ్.. బీబీసీ రేడియో-1 న్యూస్‌బీట్‌తో చెప్పారు.

ఒంటరి మహిళలు కాస్త తరచుగా బెడ్‌షీట్లను మారుస్తుంటారు. వారిలో 62 శాతం మంది రెండు వారాలకు ఒకసారి బెడ్‌షీట్లను మారుస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు జంటలు అయితే, మూడు వారాలకు ఒకసారి బెడ్‌షీట్లు మారుస్తున్నట్లు పేర్కొన్నారు.

బెడ్‌షీట్లు

ఫొటో సోర్స్, Getty Images

బెడ్‌షీట్లను ఎందుకు మార్చాలి?

కనీసం వారానికి ఒకసారైనా లేకపోతే రెండు వారాలకు ఒకసారైనా బెడ్‌షీట్లను మార్చాలని డాక్టర్ బ్రౌనింగ్ సూచించారు.

‘‘పరిశుభ్రత అనేది చాలా కీలకమైన అంశం. బెడ్‌షీట్లను మనం తప్పనిసరిగా మార్చాలి. హీట్‌వేవ్ సమయంలో ఎక్కువగా చెమట దుప్పటిలోకి ఇంకిపోతుంది. దీంతో దుప్పట్లు దుర్వాసన వస్తాయి. వాటిలో దుమ్ముధూళి కూడా విపరీతంగా పేరుకుంటాయి’’అని ఆమె చెప్పారు.

‘‘బెడ్‌షీట్ల విషయంలో చెమటతోపాటు చాలా విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన చర్మం నుంచి మృతకణాలు బయటకు వస్తుంటాయి. మనం పడుకున్నప్పడు ఇవి దుప్పట్లలోకి చేరుకుంటాయి’’అని ఆమె అన్నారు.

‘‘బెడ్‌షీట్లలో ఈ డెడ్‌ స్కిన్ సెల్స్ భారీగా పేరుకుంటాయి. ఇది వినడానికి కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ మృతకణాల వల్ల చిన్నచిన్న సూక్ష్మజీవులు దుప్పట్లలోకి వస్తాయి. చివరగా ఇవి దద్దుర్లకు కారణం అవుతాయి’’అని ఆమె చెప్పారు.

‘‘చెమట దుర్వాసనతోపాటు మృతకణాలు, సూక్ష్మజీవుల మధ్య మీరు పడుకోవాల్సి ఉంటుంది’’అని ఆమె అన్నారు.

బెడ్‌షీట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఏ కాలంలో ఎక్కువ ఉతకాలి

‘‘కావాలంటే శీతాకాలంలో మనం కాస్త ఎక్కువ రోజులు తీసుకోవచ్చు’’అని బ్రౌనింగ్ చెప్పారు. అయితే, వారానికి ఒకసారి ఉతకడం మంచిదని ఆమె అన్నారు.

‘‘రెండు వారాలకుపైనే గడిస్తే, మీరు మురికి మధ్య నిద్రపోతున్నట్లు అర్థం’’అని ఆమె చెప్పారు.

‘‘శీతాకాలంలో మనకు చెమట కాస్త తక్కువగా పట్టే మాట వాస్తవమే. కానీ, మృతకణాలు మాత్రం ఎప్పటిలానే విడుదల అవుతాయి’’అని ఆమె అన్నారు.

‘‘మీ చేతులు కూడా మురికిగానే ఉంటాయి. మీ నోటి నుంచి వచ్చే శ్వాస కూడా దుప్పట్లో దుర్వాసనకు కారణం కావొచ్చు’’అని ఆమె అన్నారు.

అధ్యయనంలో పాల్గొన్నవారిలో 18 శాతం మంది రాత్రిపూట నిద్రపోయే ముందు స్నానం చేస్తామని చెప్పారు. బెడ్‌షీట్లు శుభ్రంగా ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు.

అయితే, వేసవిలో మాత్రం తరచూ బెడ్‌షీట్లను శుభ్రం చేసుకోవాలని బ్రౌనింగ్ సూచిస్తున్నారు. ‘‘వేసవిలో మనకు కొన్ని అలర్జీలు కూడా వస్తుంటాయి. వీటివల్ల బెడ్‌షీట్లు మరింత మురికిగా మారతాయి’’అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, సెక్స్ తర్వాత గర్భం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

చాలా కారణాలున్నాయి

బెడ్‌షీట్లను మార్చకపోవడానికి అధ్యయనంలో పాల్గొన్నవారు కొన్ని కారణాలు చెప్పారు. వీటిలో మరచిపోవడం (67 శాతం), పట్టించుకోకపోవడం (35 శాతం), వేరే బెడ్‌షీట్ లేకపోవడం (22 శాతం) ఉన్నాయి. అయితే, మరో 38 శాతం మంది బెడ్‌షీట్లను తరచూ ఉతకాల్సిన అసవరంలేదని అభిప్రాయపడుతున్నట్లు ఈ అధ్యయనాన్ని నిర్వహించిన పీజూనా లైనెన్స్ రీసెర్స్ సంస్థ తెలిపింది.

బెడ్‌షీట్లు హాయిగా నిద్ర పట్టేందుకు సహకరించేలా ఉండాలని, తరచూ ఉతకడం వల్లే ఇది సాధ్యం అవుతుందని బ్రౌనింగ్ చెప్పారు.

తన దగ్గరకు వచ్చే రోగుల్లో కొందరు నిద్రలేమితో కూడా బాధపడుతుంటారని ఆమె చెప్పారు. ‘‘బెడ్‌షీట్లు సరిగా ఉతక్కపోతే వాటిలో దుమ్ముధూళి పేరుకుంటాయి. దుర్వాసన కూడా వస్తుంటుంది. నిద్రలేమి పరిస్థితులను ఇవి మరింత తీవ్రం చేస్తాయి’’అని ఆమె వివరించారు.

‘‘హాయిగా, సంతోషంగా, ప్రశాతంగా నిద్రపోవాలంటే బెడ్‌షీట్లను తరచూ ఉతుక్కోవాలి’’అని ఆమె సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)