విదేశాంగ మంత్రి జైశంకర్ అంటే ప్రధాని మోదీకి ఎందుకంత ఇష్టం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత మాజీ రాయబారి కె.సుబ్రహ్మణ్యం ను దౌత్యరంగంలో భీష్మ పితామహుడిగా చాలామంది పేర్కొంటారు. సుబ్రహ్మణ్యాన్ని అనేక ప్రభుత్వాలు పద్మ అవార్డులకు ఎంపిక చేశాయి. కానీ ఆయన వాటిని ఎప్పుడూ తీసుకోలేదు.
బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులు ప్రభుత్వం నుంచి ఇలాంటి గౌరవం తీసుకోవడం మానుకోవాలని ఆయన అనేవారు. కానీ మార్చి 2019లో, ఆయన కుమారుడు, ప్రస్తుత భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ బ్యూరోక్రాట్‌గా ఉన్నసమయంలోనే పద్మశ్రీ ని అందుకున్నారు.
మోదీ కేబినెట్‌లోని ఎస్.జైశంకర్ కు ఉన్న కుటుంబ నేపథ్యం ఏ మంత్రికీ లేదు. జైశంకర్ ప్రసిద్ధ పండిత కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి కె.సుబ్రహ్మణ్యం దేశంలో ప్రసిద్ధి చెందిన దౌత్యవేత్త. ఆయన 1951 ఐఏఎస్ బ్యాచ్ టాపర్. ఆయన్ను చాలామంది కె.ఎస్ అని, సుబ్బు అని పిలుస్తుంటారు.
సుబ్రమణ్యం భారత అణు విధానానికి రూపశిల్పిగా కూడా పరిగణిస్తారు.'భారత్ మొదట అణ్వాయుధాలను ఉపయోగించదు' అనే సూత్రాన్ని అందించింది కూడా సుబ్రహ్మణ్యమే.
సుబ్రహ్మణ్యం హోమీ భాభాతో కూడా పనిచేశారు. ఆయనను భారత దౌత్య రంగానికి గురువు అని కూడా పిలుస్తారు. 1962 నుండి 1966 వరకు భారతదేశ రక్షణ మంత్రి వై.బి.చవాన్, కె.ఎస్.ను బాగా నమ్మేవారు. చైనా (1962), పాకిస్తాన్ (1965) భారతదేశం పై దాడి చేసిన కాలం ఇదే. కార్గిల్ యుద్ధాన్ని సమీక్షించే కమిటీకి అటల్ బిహారీ వాజ్‌పేయి కె.ఎస్.ను చైర్మన్‌ను చేశారు.
జైశంకర్ తల్లి సులోచన సుప్రసిద్ధ తమిళ పండితురాలు. ఆయన సోదరులలో ఒకరైన ఎస్.విజయ్ కుమార్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో గనుల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. మరో సోదరుడు సంజయ్ సుబ్రహ్మణ్యం ప్రసిద్ధ చరిత్రకారుడు.
ఎస్.జైశంకర్ వేగవంతమైన దౌత్యవేత్తగా కూడా గుర్తింపు పొందారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పుడు ఎస్.జైశంకర్ అమెరికాలో భారత రాయబారిగా ఉన్నారు. నరేంద్రమోదీ హయాంలో సుష్మా స్వరాజ్‌కు విదేశాంగ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

ఫొటో సోర్స్, Getty Images
2005లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా ఆయనకు వీసా మంజూరు చేసేందుకు నిరాకరించింది. కానీ, ప్రధాని అయ్యాక మోదీకి అమెరికా స్వాగతం పలికింది. 2014 సెప్టెంబర్‌లో ప్రధానిగా మోదీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు.
జైశంకర్ అప్పట్లో అమెరికాలో భారత రాయబారి. మోదీ పర్యటనకు జైశంకర్ ప్లాన్ చేసిన తీరు మోదీని బాగా ఆకట్టుకుందని అంటారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015లో భారతదేశాన్ని సందర్శించారు. ఇందులో కూడా ఎస్.జైశంకర్ పాత్ర ప్రముఖమైందిగా చెబుతారు.
''ప్రధాన మంత్రిగా తొలి అమెరికా పర్యటన సందర్భంలో జైశంకర్ పాత్రపై మోదీ చాలా సంతోషించారు'' అని ప్రొఫెసర్ డా.రాజన్ అన్నారు. ఆయన దిల్లీలోని జవహరాల్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో రష్యన్ అండ్ సెంట్రల్ ఏషియా స్టడీస్ సెంటర్లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్‌లో ప్రధాని మోదీకి వేలాది మంది భారతీయ-అమెరికన్లు ఘనస్వాగతం పలికారు. మోదీ స్పీచ్ వినేందుకు వచ్చిన వారితో స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ పర్యటన చాలా విజయవంతమైంది. ఆ ఘనత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు దక్కింది.
ఇది కాకుండా చైనా, రష్యాలు భారతదేశానికి చాలా ముఖ్యమైన దేశాలు. జైశంకర్ ఈ రెండు దేశాల్లోనూ భారత రాయబారిగా పని చేశారు. ఈ అనుభవం కూడా ప్రధాని మోదీని ఆకర్షించిందని చెబుతారు.
2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మరోసారి భారీ మెజారిటీ సాధించింది. మోదీ రెండో పర్యాయం కేబినెట్ మంత్రుల జాబితా బయటకు వచ్చింది.ఈ జాబితాలో సుష్మా స్వరాజ్ పేరు లేదు. ఆరోగ్య పరిస్థితి కారణంగా చూపి ఆమెకు మంత్రి పదవిని నిరాకరించినట్లు ప్రచారం జరిగింది.
మరి, కొత్త విదేశాంగ మంత్రి ఎవరనే ప్రశ్న తలెత్తింది. మోదీ రెండవసారి ప్రధాని అయ్యాక, ఎస్.జైశంకర్ విదేశాంగ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆయనకు ఈ బాధ్యతలు అప్పజెప్పినట్లు అందరికీ తెలిసింది.

ఫొటో సోర్స్, Getty Images
జైశంకర్ కెరీర్
- సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్
- జేఎన్‌యూ నుంచి పొలిటికల్ సైన్స్‌లో అంతర్జాతీయ సంబంధాలపై ఎం.ఎ, ఎం.ఫిల్, పీహెచ్‌డీ చేశారు.
- 1977లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో తొలి ఉద్యోగం.
- విదేశాలలో మొదటి పోస్టింగ్ మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో మొదటి, రెండవ కార్యదర్శి
- 1985లో వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ప్రథమ కార్యదర్శిగా నియమితులయ్యారు.
- 1988లో శ్రీలంకలోని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌కు రాజకీయ సలహాదారు బాధ్యతలు నిర్వహించారు.
- 1990లో హంగరీ లోని భారత రాయబార కార్యాలయంలో కాన్సులేట్‌గా పని చేశారు.
- 1993లో భారతదేశానికి తిరిగి వచ్చారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో తూర్పు యూరోపియన్ విభాగానికి డైరెక్టర్ అయ్యారు
- 1996 లో జైశంకర్ టోక్యోలోని భారత రాయబార కార్యాలయానికి డిప్యూటీ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
- 2000లో మొదటిసారిగా చెక్ రిపబ్లిక్‌లో అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
- 2007లో సింగపూర్‌లో భారత హైకమిషనర్ అయ్యారు
- 2009 నుంచి 2013 వరకు చైనాలో భారత రాయబారిగా ఉన్నారు
- 2013 నుండి 2015 వరకు అమెరికాలో భారత రాయబారి
- 2015 లో విదేశాంగ కార్యదర్శిగా పని చేశారు.
- 2019లో భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు

ఫొటో సోర్స్, Getty Images
కఠినంగా మారిన జైశంకర్
తన మొదటి టర్మ్‌లో శివసేన నాయకుడు సురేష్ ప్రభును కూడా నరేంద్ర మోదీ ఇదే విధంగా ఆశ్చర్య పరిచారు. రైల్వే మంత్రిని చేసేందుకు ప్రభు శివసేన నుంచి బీజేపీలో చేరారు. అయితే మూడేళ్ల లోపే సురేశ్ ప్రభు రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
కానీ, జైశంకర్ పై మాత్రం ప్రధాని మోదీకి నమ్మకం ఏమాత్రం సడలలేదు. యుక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత విదేశాంగ మంత్రిగా జైశంకర్ వైఖరిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లు చర్చల కోసం ఈ నెల ఏప్రిల్ 11న అమెరికా వెళ్లారు.
చర్చల తర్వాత, భారత విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రులు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌లతో విలేఖరుల సమావేశం నిర్వహించారు.
భారతదేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడంపై విలేఖరి ఒక ప్రశ్న అడగగా, 'ఒక నెలలో రష్యా నుండి భారతదేశం కొనుగోలు చేసినంత చమురును, యూరప్ ఒక రోజులోనే కొనుగోలు చేస్తుంది' అని జైశంకర్ సూటిగా సమాధానం ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
జైశంకర్ చెప్పిన ఈ సమాధానం ప్రపంచవ్యాప్తంగా మీడియాలో చర్చనీయాంశమైంది. జైశంకర్ ఇక్కడితో ఆగలేదు. అదే విలేఖరుల సమావేశంలో జైశంకర్ ఇంకో ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు.
భారతదేశంలో మానవహక్కుల పరిస్థితిని తాము ఒక కంట గమనిస్తున్నామంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్ వ్యాఖ్యలపై విలేఖరులు స్పందన కోరగా, ''భారతదేశంలో మానవ హక్కులపై అమెరికా తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. అదే విధంగా అమెరికాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై భారతదేశం కూడా తన అభిప్రాయాలను తెలియజేస్తుంది'' అని ఘాటుగా సమాధానమిచ్చారు.
జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని, తొలిసారిగా ఓ భారత విదేశాంగ మంత్రి అమెరికా గడ్డపై తన ఆత్మగౌరవాన్ని ప్రదర్శించారని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ రష్యన్ అండ్ సెంట్రల్ ఏషియా స్టడీస్ ప్రెసిడెంట్ అర్చన ఉపాధ్యాయ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మరోసారి నిర్మొహమాటంగా
యుక్రెయిన్ పై రష్యా దాడిని వ్యతిరేకించాలని యూరప్ భారత్‌పై ఒత్తిడి తెస్తోంది. మంగళవారం, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ విషయంపై మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చారు.
నార్వే విదేశాంగ మంత్రి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ "అఫ్గానిస్తాన్ లో ఏం జరిగిందో గుర్తుంచుకోండి. ప్రపంచం మొత్తం అక్కడి పౌర సమాజాన్ని వదిలివేసింది. అక్కడ ఎలాంటి న్యాయాన్ని అనుసరించారు? ఎవరూ ఘర్షణను కోరుకోరు. యుక్రెయిన్-రష్యా వివాదంలో విజేత ఎవరూ ఉండరు.'' అని జైశంకర్ అన్నారు.
''ఇది జైశంకర్ ప్రకటన మాత్రమే కాదు. ఇది భారత విదేశాంగ విధానంలో కొత్త మార్పు అని నేను భావిస్తున్నాను. జైశంకర్‌ను అమెరికా అనుకూల వ్యక్తిగా పరిగణించేవారు. అమెరికాలో మోదీ ప్రచారంలో భాగంగా అక్కడ స్థిరపడిన భారతీయులను కలిపే పనిలో పడ్డ తీరును చూస్తే అలాగే అనిపించింది. అయితే గతేడాది ఆగస్టు నుంచి భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. భారత్‌కు సమాచారం ఇవ్వకుండా అఫ్గానిస్థాన్‌లో అమెరికా తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. ఇది మోదీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. భారతదేశం అక్కడ బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది'' అని ప్రొఫెసర్ డాక్టర్ రాజన్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భారత్ గురించి జైశంకర్ ఏమనుకుంటున్నారు?
సెప్టెంబర్ 2020లో జైశంకర్ పుస్తకం 'ది ఇండియా వే' వచ్చింది. మూడు అంశాలు భారత విదేశాంగ విధానాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేశాయని జై శంకర్ ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
మొదటిది దేశ విభజన. జైశంకర్ పుస్తకం ప్రకారం, విభజన కారణంగా భారతదేశం పరిమాణం తగ్గింది. చైనా ప్రాముఖ్యత మునుపటి కంటే పెరిగింది.
రెండవది ఆర్ధిక సంస్కరణలు. 1991 ఆర్థిక సంస్కరణలు ఆలస్యమయ్యాయి. ఇవి ఇంకా ముందే జరగాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలా జరిగినట్లయితే భారతదేశం సంపన్న దేశంగా అవతరించేదని జైశంకర్ రాశారు.
మూడోది అణ్వాయుధాలు. అణ్వాయుధ విధానం ఎంపికలో భారత్ జాప్యం చేయడం ప్రతికూల అంశమని ఆయన పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అయితే జై శంకర్ ఈ మూడు వాదనలను ప్రసిద్ధ కాలమిస్ట్ ఆకర్ పటేల్ డెక్కన్ క్రానికల్‌కు రాసిన ఓ కథనంలో తిరస్కరించారు
"విభజన కారణంగా భారతదేశం పరిమాణంలో చిన్నదిగా మారింది. విభజన జరగకపోతే, భారతదేశం మియన్మార్ నుండి ఇరాన్ వరకు భౌగోళికంగా విస్తరించి ఉండేది. జనాభా 170 కోట్లు ఉండేది. రెండో అంశం ఆర్థిక సంస్కరణల్లో ఆలస్యం. ఇది జైశంకర్ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఆర్థికవేత్త కాదు. భారతదేశం 1974లో మొదటి అణు పరీక్ష నిర్వహించింది. దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికాలోని అనేక దేశాలకు కూడా ఈ సామర్థ్యం ఉంది. అయితే అవి తమను తాము అణు బాంబు నుండి దూరంగా ఉన్నాయి'' అన్నారాయన.
జైశంకర్ తండ్రి సుబ్రహ్మణ్యం తన నైపుణ్యంతో రాజీవ్ గాంధీ నుంచి మన్మోహన్ సింగ్ వరకు పలువురు ప్రధానుల గౌరవాన్ని అందుకున్నారు. ఈ ప్రధానమంత్రులందరూ భావజాల స్థాయిలో భిన్నంగా ఆలోచించారు. కానీ జైశంకర్ మాత్రం దూకుడుగా వ్యవహరించే దౌత్యవేత్తగా పేరు తెచ్చుకున్నారని, మోదీ ప్రభుత్వంపై సానుకూల విమర్శలను కూడా జైశంకర్ పాజిటివ్ గా తీసుకోరని ఆయనపై విమర్శలున్నాయి.
ఇవి కూడా చదవండి:
- రష్యా 'సీక్రెట్ ఫస్ట్ లేడీ'గా పిలిచే పుతిన్ ‘గర్ల్ ఫ్రెండ్’ ఎవరు... ఆమెపై ఆంక్షలు విధించడానికి అమెరికా ఎందుకు భయపడుతోంది?
- బందరు పోర్టు కల ఎప్పటికైనా నిజమవుతుందా?
- అంతరిక్షంలో బతకాలంటే ఆహారం ఎక్కడినుంచి వస్తుంది? చెట్లు మొలుస్తాయా? మాంసం తయారు చేయొచ్చా?
- ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి పర్యటన కోసం సామాన్యుల కార్లు ఎందుకు? సీఎంకు ప్రత్యేక కార్లు ఉండవా?
- కూమా జైలు: స్వలింగ సంపర్కులకు మాత్రమే
- ఏపీ మంత్రి కాకాణి చుట్టూ మరో వివాదం, ఆ విల్లాలో యువకుడి మృతికి కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













