Russia-Ukraine: యుక్రెయిన్‌పై రష్యా దాడికి అనుకూలంగా ఉన్న మూడు ప్రధాన మార్గాలు ఇవే...

యుక్రెయిన్ సంక్షోభం
    • రచయిత, డేవిడ్ బ్రౌన్
    • హోదా, బీబీసీ న్యూస్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తమకు యుక్రెయిన్‌పై దాడి చేసే ఆలోచన లేదని నొక్కి చెప్పారు. కానీ అమెరికా మాత్రం ఏ సమయంలోనైనా యుక్రెయిన్‌పై రష్యా దాడి చేయవచ్చని చెబుతోంది.

యుద్ధానికి క్రెమ్లిన్ సన్నద్ధంగా ఉందని కొన్ని రోజుల క్రితమే యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అన్నారు.

''దాడి చేసే అవకాశమున్న మార్గాలేంటో అందరికీ తెలుసు.''

యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా 1,50,000 బలగాలను మోహరించిన నేపథ్యంలో.... ఒకవేళ దాడి చేయాలని నిర్ణయించుకుంటే రష్యాకు అనేక అవకాశాలున్నాయని నిపుణులు అంగీకరిస్తున్నారు.

యుక్రెయిన్ సంక్షోభం

బెలారస్ మార్గం

యుక్రెయిన్‌ ప్రభుత్వంలో సమూల మార్పులను రష్యా కోరుకుంటే, ఉత్తరం నుంచి దాడి చేసే అవకాశముంది అని అమెరికా పరిశోధనా సంస్థ సీఎన్‌ఏకు చెందిన మైఖేల్ కోఫ్‌మన్ అన్నారు.

బెలారస్‌లో సంయుక్త మిలిటరీ వ్యాయామాల కోసం రష్యా 30 వేల మంది సైనికులను మోహరించింది. ఇస్కాండర్ స్వల్ప శ్రేణి క్షిపణులు, వివిధ రాకెట్ లాంచర్లు, ఎస్‌యూ-25 విమానాలతో పాటు ఎస్‌యూ-35 ఫైటర్లను సైనిక వ్యాయామాల కోసం అక్కడ ఏర్పాటు చేసింది.

''రష్యా గడ్డపై తూర్పు వైపున '41 ఆర్మీ ఆఫ్ రష్యా' బెటాలియన్ సరిహద్దుల్లో వేచి ఉంది'' అని కోఫ్‌మన్ చెప్పారు.

బెలారస్ నుంచి కీవ్‌లోకి వస్తే చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చుట్టూ ఉన్న మినహాయింపు జోన్‌ను రష్యా దాటవచ్చు.

సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషన్ స్టడీస్‌కు చెందిన సేత్ జోన్స్ ప్రకారం, రష్యా వైపు నుంచి అయితే నోవీ యుర్కోవిచి, ట్రోబర్ట్‌నో ప్రాంతాల నుంచి దాడికి పాల్పడవచ్చు.

క్రిమియా వైపు నుంచి

క్రిమియా వైపు నుంచి...

ఒకవేళ రష్యా దాడి చేయడానికి సిద్దమైతే క్రిమియా నుంచే దండయాత్ర చేయడం ఖాయమని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌కు చెందిన బెన్ బారీ చెప్పారు.

''శక్తిమంతమైన ఆయుధాలతో, ఫిరంగుల సహాయంతో వేగంగా యుక్రెయిన్‌లోకి చొచ్చుకెళ్లొచ్చు'' అని ఆయన తెలిపారు.

క్రిమియా నుంచి దాడిని ప్రారంభిస్తే, డ్నిపర్ నదికి తూర్పువైపున్న పెద్ద సంఖ్యలోని యుక్రెయిన్ సేనలను తప్పించుకొని కీవ్‌ నగరంలోకి వెళ్లవచ్చని ఆయన అన్నారు.

పశ్చిమాన, తూర్పున, ఉత్తర దిశలతో పాటు క్రిమియాలో దళాలను మోహరిస్తే యుక్రెయిన్‌ సైన్యాన్ని రష్యా చుట్టుముట్టవచ్చు.

ప్రస్తుతం నల్లసముద్రంలో ఉన్న నావికా దళాలను కూడా రష్యా వినియోగించుకోవచ్చు.

ఆ ప్రాంతంలోని రష్యా నౌకల ద్వారా బలగాలు, సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంకులను మోహరించవచ్చు.

యుక్రెయిన్ సంక్షోభం

తూర్పు వైపు నుంచి...

రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు, 2014లో రెండు కీలక ప్రాంతాలైన లుహాన్క్స్, డోనెట్స్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.

లుహాన్క్స్, డోనెట్స్క్‌ ప్రాంతాల్లోని దాదాపు 15,000 మంది వేర్పాటువాదులు కూడా రష్యా దళాల్లో చేరిపోతారని అందరూ అనుకుంటున్నారు.

వీరి సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని యుక్రెయిన్ అభిప్రాయపడుతోంది.

రోస్తోవ్ ప్రాంతంలో రష్యాకు దాదాపు 10 వేల మంది శాశ్వత సైనికులు ఉన్నారు. ఇటీవలి కాలంలో అక్కడికి మరింత మంది సైనికులను తరలించింది.

తూర్పు వైపు నుంచి దాడి చేయాలని రష్యా భావిస్తే... యుక్రెయిన్ ఆగ్నేయ తీరం వెంట ల్యాండ్ బ్రిడ్జిని తయారు చేసి రష్యా సేనలు క్రిమియాలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ఆ తర్వాత బెల్గోరాడ్ నుంచి ఖార్కివ్‌లోకి, ఆ తర్వాత క్రెమెన్‌చుక్‌కు చేరుకోవచ్చు.

తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని రష్యన్ మాట్లాడేవారిని రక్షించాలని అనుకుంటే మాత్రమే రష్యా, తూర్పు వైపు నుంచి దాడిని ప్రారంభించవచ్చు.

సైబర్ దాడులు, క్షిపణి ప్రయోగాలు ఇలా ఏకకాలంలో అనేక మార్గాల్లో రష్యా దాడికి పాల్పడవచ్చని విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు.

యుక్రెయిన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోకుండా, అక్కడి కీలకమైన మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేసే లక్ష్యంతో రష్యా సైబర్ దాడులకు పాల్పడవచ్చని వారు విశ్వసిస్తున్నారు.

రష్యా చేసే ఏ దాడి అయినా, రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగానే జరుగుతుందని కోఫ్‌మన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, అమెరికా-రష్యా ఆధిపత్య పోరు ప్రభావం యూరప్ దేశాలపై ఎందుకు పడింది?
ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)