అమెరికాతో రూ.3,734 కోట్ల ఒప్పందంపై నేపాల్ ప్రభుత్వం ఎందుకు వివాదంలో చిక్కుకుంది? దీనికి భారత్ ఆమోదం ఎందుకు?

నేపాల్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నేపాల్ ప్రధాని దేఒబా
    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేపాల్‌లో అమెరికా ఆర్థిక సాయానికి సంబంధించిన ఓ కార్యక్రమం వివాదాస్పదమైంది. ‘‘మిలీనియమ్ ఛాలెంజ్’’ కార్యక్రమంలో భాగంగా 500 మిలియన్ల డాలర్లను (రూ.3,734.22 కోట్లు) నేపాల్‌కు సాయంగా అందించాలని అమెరికా నిర్ణయించింది.

అయితే, ఈ ఒప్పందంలో నిబంధనలను నేపాల్‌లోని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వీటితో దేశ సార్వభౌమత్వానికే ముప్పని చెబుతున్నాయి.

ఈ ఒప్పందం అమలుకు నేపాల్ పార్లమెంటు అనుమతి తప్పనిసరి. అయితే, ప్రభుత్వంలోని పార్టీలు, విపక్షాలు, సాధారణ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తుండటంతో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది.

నేపాల్

ఫొటో సోర్స్, AFP

ఏమిటీ నేపాల్-అమెరికా ఒప్పందం?

ఈ 500 మిలియన్ల డాలర్ల (రూ.3,734.22 కోట్లు) ఒప్పందం 2017లో అమెరికా, నేపాల్‌ల మధ్య కుదిరింది. దీన్ని మిలీనియమ్ ఛాలెంజ్ కార్పొరేషన్ నేపాల్ (ఎంసీసీ-నేపాల్)గా పిలుస్తున్నారు. దీనిలో భాగంగా నేపాల్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు 500 మిలియన్ల డాలర్లను అమెరికా అందించనుంది. ఈ ప్రాజెక్టుల్లో భారత్, నేపాల్‌లను అనుసంధానించే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగా నేపాల్‌లో అల్ట్రా హైవోల్టేజీ విద్యుత్ లైనును కూడా అమెరికా ఏర్పాటు చేయనుంది. దీని సాయంతో భారత్‌కు నేపాల్ విద్యుత్ విక్రయించేందుకు వీలుపడుతుంది. దీనితోపాటు కొన్ని రహదారుల ప్రాజెక్టులు కూడా చేపట్టబోతున్నారు. ఈ ఒప్పందానికి భారత్‌ కూడా ఆమోదం తెలపాల్సి ఉంది.

నేపాల్

వివాదం ఏమిటి?

ఈ ఒప్పందం అమలు చేయడానికి నేపాల్ పార్లమెంటు ఆమోదం తప్పనిసరని బీబీసీ నేపాలీ సర్వీస్‌కు చెందిన ఫణీంద్ర దాహల్ చెప్పారు. అయితే, ఈ విషయంలో అధికార కూటమిలోనే కొన్ని విభేదాలు ఉన్నట్లు ఆయన వివరించారు.

అధికారంలో కొనసాగుతున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు), యూనిఫైడ్ సోషలిస్టు పార్టీ లాంటి కొన్ని పార్టీలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనిలోని కొన్ని నిబంధనలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ పార్టీలు భావిస్తున్నట్లు ఫణీంద్ర చెప్పారు.

మరోవైపు ఈ కార్యక్రమంపై కొందరు అమెరికా అధికారుల ప్రకటనలు గందరగోళాన్ని మరింత పెంచాయి. అమెరికా ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. మళ్లీ కొన్నిరోజుల తర్వాత ఈ వ్యాఖ్యల్లో నిజంలేదని వారు చెప్పుకొచ్చారు.

దీంతో నేపాల్ ప్రభుత్వంలోని కమ్యూనిస్టు పార్టీలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశాయి. చైనా ప్రబల్యానికి అడ్డుకట్టవేయడానికే ఈ ఒప్పందాన్ని తీసుకొచ్చినట్లు నేపాల్ కమ్యూనిస్టు పార్టీలు చెబుతున్నాయి. నేపాల్ ఏ దేశానికీ వ్యతిరేకంగా చర్యలు తీసుకోదని, అన్ని దేశాలతోనూ తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని వివరిస్తున్నాయి.

‘‘ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం పేరుతో నేపాల్‌లో అమెరికా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోందని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా చైనాకు కళ్లెం వేసేందుకే ఈ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చినట్లు వారు వివరిస్తున్నారు. దీంతో నేపాల్ సార్వభౌమత్వానికే ముప్పుందని అంటున్నారు. అందుకే నేపాల్ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న కొందరిని అరెస్టు చేశారు కూడా’’అని ఫణీంద్ర చెప్పారు.

ఈ ఒప్పందానికి వ్యతిరేకత వ్యక్తం కావడంతో దీన్ని రద్దుచేసుకుంటామని అమెరికా హెచ్చరికలు కూడా జారీచేసింది. ఫిబ్రవరిలోగా ఒప్పందానికి ఆమోదం తెలపకపోతే, సాయాన్ని వెనక్కి తీసుకుంటామని అమెరికా అధికారులు చెప్పినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

అమెరికా గడువులో నిజమెంత?

ఈ ఒప్పందానికి ఆమోదం తెలపడానికి ఫిబ్రవరిని అమెరికా గడువుగా విధించిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు.

నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేఒబా, కూటమిలో మరో నాయకుడు పుష్ప కమల్ దాహల్ ప్రచండ ఈ ఒప్పందంపై అమెరికా అధికారులకు గత ఏడాది సెప్టెంబరులో ఒక లేఖ రాశారు. నాలుగైదు నెలల్లో తమ పార్లమెంటు ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తుందని వారు లేఖలో పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు ఈ ఒప్పందం ఆమోదం పొందకపోవడంపై అమెరికా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేపాలీ నాయకులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేదంటే తాము ఒప్పందం నుంచి వైదొలుగుతామని అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, కోవిడ్ సెకండ్ వేవ్‌తో తల్లడిల్లుతున్న నేపాల్

ఈ ఒప్పందానికి భారత్‌తో సంబంధం ఏమిటి?

‘‘ఈ ఒప్పందం కుదిరినప్పుడు దీనికి భారత్‌ కూడా అంగీకారం తెలపాల్సి ఉంటుందని అమెరికా ముందే చెప్పింది. ఎందుకంటే హైవోల్టేజీ విద్యుత్ లైను నేపాల్‌లోని గుట్వాల్ నుంచి భారత్‌లోని గోరఖ్‌పూర్ వరకు నిర్మించాలని తలపెట్టారు’’అని ఫణీంద్ర చెప్పారు.

అయితే, ఈ ఒప్పందం అమెరికా-నేపాల్ మధ్య కుదరినప్పుడు, మధ్యలో భారత్‌ను ఎందుకు తీసుకొస్తున్నారని కొందరు నేపాలీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

భారత్‌ను ఈ ఒప్పందంలోకి తీసుకురావడం ద్వారా అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాల క్వాడ్ కూటమికి నేపాల్‌ కూడా మద్దతు ప్రకటించినట్లు అవుతోందని కొందరు నేపాలీ మేధావులు విశ్లేషిస్తున్నారు. నేపాల్ విదేశాంగ విధానానికి ఇది మంచిదికాదని వారు వివరిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, నేపాల్: భూకంపాన్ని ఎదుర్కొన్న ప్రాంతం ఇప్పుడు కోవిడ్‌తో విలవిల్లాడుతోంది

అన్ని వేళ్లూ చైనా వైపు ఎందుకు చూపిస్తున్నాయి?

ఈ విషయంలో చైనా ఇప్పటివరకు అధికారంగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. అయితే, నేపాల్‌లో అమెరికా ప్రాబల్యం పెరగకూడదని చైనా భావిస్తోంది. ఒకవేళ ఈ ఒప్పందాన్ని నేపాల్ రద్దుచేసుకుంటే, నేపాల్‌లో చైనా ప్రాబల్యంతోపాటు అవినీతి కూడా పెరిగే అవకాశముందని అమెరికా అధికారులు చెబుతున్నారు.

‘‘నేపాల్‌లో చైనా ప్రాబల్యం పెరుగుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే ఇటీవల కాలంలో చైనా కమ్యూనిస్టు పార్టీ, నేపాల్ కమ్యూనిస్టు పార్టీల మధ్య బంధాలు బలపడుతున్నాయి. అందుకే ఈ ఒప్పందంపై చర్చ మొదలైన ప్రతిసారీ చైనా ప్రస్తావన కూడా వస్తోంది’’అని ఫణీంద్ర అన్నారు.

ఈ ఒప్పందంపై హెచ్చరికలు జారీచేస్తూ చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్‌లో ఇటీవల ఓ కథనం కూడా ప్రచురితమైంది. చైనాకు వ్యతిరేకంగానే అమెరికా ఈ ఒప్పందాన్ని తెరపైకి తీసుకొచ్చిందని దానిలో వ్యాఖ్యానించారు. దక్షిణాసియాలో నేపాల్‌ను చైనా వ్యతిరేక దేశంగా అమెరికా మార్చాలని అనుకుంటోందని పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, నేపాల్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు

ఇప్పుడు ఏం జరుగుతుంది?

ఈ ఒప్పందానికి నేపాల్ పార్లమెంటు ఆమోదం లభిస్తుందా? లేదా అమెరికా దీని నుంచి తప్పకుంటుందా? అనే ప్రశ్నలు నేడు ఉత్పన్నం అవుతున్నాయి.

‘‘ఈ ప్రశ్నలు నేడు వివాదాస్పదంగా మారాయి. రాజకీయ పార్టీలు ఈ ఒప్పందానికి మద్దతు పలికితే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు వాటిని తిరస్కరించే ముప్పుంది’’అని ఫణీంద్ర అన్నారు.

ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న నేపాలీ కాంగ్రెస్ ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఈ కూటమిలోని మిగతా పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఒక పార్టీ అయితే, ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపితే, తాము ప్రభుత్వం నుంచి వైదొలగుతామని కూడా హెచ్చరికలు జారీచేసింది.

దీంతో ప్రతిపక్షమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) మద్దతును కూడగట్టేందుకు ప్రధాన మంత్రి దేఒబా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నం పరిస్థితులను మరింత దిగజారుస్తోంది.

అయితే, ఈ ఒప్పందంపై ఇప్పుడప్పుడే నేపాల్ నిర్ణయం తీసుకునే సూచనలు కనిపించడం లేదు. ఆలస్యం చేస్తే సాయం వెనక్కి తీసుకుంటామని అమెరికా అధికారులు మరోవైపు హెచ్చరిస్తున్నారు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)