నేపాల్‌ మాజీ ప్ర‌ధాని ప్ర‌చండ తన కూతురుతో 'విప్లవం కోసం పెళ్లి చేసుకోలేవా' అని ఎందుకన్నారు?

ప్రచండ

ఫొటో సోర్స్, Tekbahadur Pathak

ఫొటో క్యాప్షన్, కుమార్తెలు రేణు, గంగాలతో నేపాల్ మాజీ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ
    • రచయిత, రజనీశ్‌ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, కాఠ్‌మాండూ

రేణు దహల్‌ వయసు అప్పుడు 18 ఏళ్లు. 1996 ఫిబ్రవరిలో పుష్పకమల్‌ దహాల్‌ అలియాస్ ప్రచండ నేపాల్‌లో రాజరికానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అప్పటికాయన వయసు 44 సంవత్సరాలు.

తుపాకులు పట్టుకుని తిరుగుతున్న తండ్రిని చూసినప్పుడు మీకు ఏమనిపించింది అని ప్రశ్నించినప్పుడు “న్యాయం కోసం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మా నాన్న తుపాకీ పట్టారు” అని రేణూ దహల్ అన్నారు.

ఏడాదిలో ఆరు నెలలపాటు ప్రచండ కుటుంబానికి దూరంగా ఉండేవారు.

అయితే ఒకపక్క రాజరికంతో పోరాడుతున్నా తనకు కూతుళ్లు ఉన్నారన్న విషయాన్ని ప్రచండ మర్చిపోలేదు. తాను కూడా తండ్రినేనని, తనకూ బాధ్యతలున్నాయని ఆయన భావించేవారు.

రాచరిక వ్యవస్థపై తన పోరాటం నెల, రెండు నెలల్లో ముగిసేది కాదని ఆయనకు తెలుసు. ఈ సమయంలో తన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని ప్రచండ భయపడేవారు.

ఆయన ముగ్గురు కూతుళ్లలో జ్ఞాను పెద్దది కాగా, రేణూ రెండో సంతానం. చిన్న కూతురి పేరు గంగా.

ప్రచండ ‘జనయుద్ధం’ పేరుతో ఉద్యమం మొదలుపెట్టడానికి మూడేళ్ల ముందే పెద్ద కూతురు జ్ఞానుకు పెళ్లయింది. రెండో కుమార్తె రేణూ వివాహ అంశంపై నేపాల్ కమ్యూనిస్ట్‌ పార్టీ (మావోయిస్ట్) ఒక సమావేశం నిర్వహించి చర్చించింది.

1997లో అంటే ఉద్యమం ప్రారంభమైన మరుసటి ఏడాది రేణు వివాహ ప్రతిపాదనను పార్టీ ఆమోదించింది. పార్టీ నిర్ణయాన్ని రేణూకు తెలిపారు.

పెళ్లి తరువాత రేణు, అర్జున్ పాఠక్

ఫొటో సోర్స్, Tekbahadur Pathak

ఫొటో క్యాప్షన్, పెళ్లి తరువాత రేణు, అర్జున్ పాఠక్

అబ్బాయిని చూడటానికి రేణు భారతదేశంలోని జలంధర్‌కు రావాల్సి వచ్చింది. అప్పుడామె వయసు 19 ఏళ్లు.‘‘ మామూలుగా అయితే అమ్మాయిని చూడటానికి అబ్బాయి వస్తారు. కానీ నేనే అబ్బాయిని చూడటానికి వెళ్లాను. రెండు రోజులు అతని ఇంటిలోనే ఉన్నాను.’’ అని రేణూ నవ్వుతూ అన్నారు.

‘‘కానీ నేను పెళ్లి చేసుకునే మూడ్‌లో లేను. అప్పటికి నేను చాలా చిన్నదానిని. నేను పెళ్లి చేసుకోవాలన్నది పార్టీ నిర్ణయం. నా ఫీలింగ్స్ నాన్నతో చెప్పాను. అందుకు నాన్న ‘ఉద్యమం కోసం చాలామంది ప్రాణాలు ఇస్తున్నారు. నువ్వు పెళ్లి చేసుకోలేవా? విప్లవానికి మీ పెళ్లి అవసరం చాలా ఉంది’ అని నాన్న అన్నారు. నేను ఏమీ మాట్లాడలేకపోయాను.” అన్నారు రేణూ.

లఖ్‌నవూలో పెళ్లి ఎందుకు?

జలంధర్‌లో రేణూ కలవడానికి వచ్చిన అబ్బాయిపేరు అర్జున్‌ పాఠక్. అప్పుడతని వయసు 21 సంవత్సరాలు. సిటీలోని డీఏవీ కాలేజీలో చదువుతున్నారు. “ మా మధ్య పెద్దగా మాటలు లేవు. పెళ్లి అన్నది పార్టీ నిర్ణయం. పార్టీ సూత్రాలకు కట్టుబడి ఉండాలి. నిజం చెప్పాలంటే నాకు కూడా అప్పుడు పెళ్లి మీద ఆసక్తి లేదు” అన్నారు పాఠక్‌.

1997 ఫిబ్రవరి 9న లఖ్‌నవూలోని లీలా హోటల్‌లో సీక్రెట్‌గా వివాహం జరిగింది. అదే సమయంలో రేణూ చెల్లెలు గంగ వివాహం కూడా జరిగింది. లఖ్‌నవూలోని పోలీసులకు, అధికారులకు ఈ విషయం తెలియదు. పెళ్లికి చాలా తక్కువమంది హాజరయ్యారు.

“పిల్లల బాధ్యతలు ఉంటే ఉద్యమం నడవదని మావోయిస్టు పార్టీ భావించింది. అందుకే వాటిని నెరవేర్చాలని ప్రచండకు సూచించింది. ఆయన అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నప్పుడే మా వివాహం జరిగింది. అది కూడా రహస్యంగానే జరిగింది. పార్టీపట్ల మాకున్న నిబద్ధత కారణంగా పెళ్లికి ఇద్దరం అంగీకరించాం” అని పాఠక్‌ వెల్లడించారు.

ప్రచండ తుపాకీని నమ్ముతారని అర్జున్‌, రేణూలిద్దరికీ తెలుసు. అది అప్పుడు అవసరం కూడా. తుపాకీ లేకుండా రాజరికం పోదని అర్జున్‌ కూడా నమ్మేవారు.

ప్రస్తుతం రేణూ నేపాల్‌లోని చిట్వాన్‌ జిల్లా భరత్‌పూర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా కొనసాగుతుండగా, అర్జున్‌ పాఠక్‌ సోషల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు.

అర్జున్‌ నేపాల్‌లోని గుల్మి జిల్లావాసి కాగా, ఆయన తండ్రి టెక్ బహదూర్‌ పాఠక్‌ 1967లో భారత్‌ సైన్యంలోని గూర్ఖా రెజిమెంట్‌లో చేరారు. ఏడేళ్ల వయసులో అర్జున్‌ భారత్‌ వచ్చారు.

టేక్ బహదూర్ పాఠక్

ఫొటో సోర్స్, Tekbahadur pathak

ఫొటో క్యాప్షన్, ప్రచండ కుమార్తెలు రేణు, గంగల పెళ్లి 1997 ఫిబ్రవరి 9న జరిగింది. అప్పటి ఫోటో

భారత సైన్యం నుంచి టేక్ బహాదూర్ ఎందుకు వెళ్లిపోయారు?

ఏడు సంవత్సరాల తర్వాత టేక్ బహాదూర్ పాఠక్ భారత సైన్యానికి వీడ్కోలు పలికారు. “1962లో భారత్‌, చైనాల మధ్య యుద్ధం జరిగింది. అందులో పెద్ద సంఖ్యలో నేపాలీలు మరణించారు. నేను లద్ధాఖ్‌ వెళ్ళినప్పుడు యుద్ధంలో మరణించిన గూర్ఖాల స్మారక చిహ్నాలను చూశాను.గూర్ఖాల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లు అర్ధం చేసుకున్నాను.” అని టెక్‌ బహదూర్‌ వెల్లడించారు.

"ఒకసారి దిల్లీలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ సమావేశానికి వెళ్లాను. మన దేశంలో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారని నేపాలీ నాయకులు చెప్పారు. అది విన్నాక నా ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి వెళ్లి ఏదో ఒకటి చేయాలని భావించాను” అని తెలిపారు టేక్‌ బహాదూర్‌.

ఆర్మీ ఉద్యోగాన్ని వదిలి, టెక్ బహదూర్ నేపాల్ వెళ్ళారు. కానీ అక్కడ జీవితం సరిగా సాగలేదు. డబ్బు లేదు. దీంతో తిరిగి భారతదేశం వచ్చి జలంధర్‌లోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో ఉద్యోగం పొందారు. కానీ నేపాల్‌ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటంపై ఆయనకు మక్కువ మాత్రం పోలేదు.

అర్జున్ పాఠక్ , రేణు దాహల్

ఫొటో సోర్స్, Tekbahadur Pathak

ఫొటో క్యాప్షన్, అర్జున్ పాఠక్ , రేణు దాహల్

బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే భారతదేశంలో పనిచేస్తున్న నేపాలీలను ఏకం చేయడం ప్రారంభించారు. నేపాల్‌ ఏక్తా సమాజ్‌ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఒకపక్క ఉద్యోగం, మరోవైపు ఉద్యమాన్ని నడిపించారు టేక్ బహాదూర్.

నేపాల్‌ ప్రజాస్వామ్య పోరాటంలో సామాన్య భారతీయులెందరో సహాయపడ్డారని టెక్‌ బహదూర్‌ అంటారు. 1985లో గోరఖ్‌పూర్‌లో జరిగిన నేపాల్ కమ్యూనిస్ట్‌ పార్టీ సమావేశంలో టేక్‌ బహాదూర్ తొలిసారి ప్రచండను గురించి విన్నారు.

1988లో కమ్యూనిస్టు పార్టీ టెక్‌ బహదూర్‌ను నేపాల్‌ పిలిపించింది. సైన్యంలో పనిచేసిన అనుభవం ఉండటంతో గెరిల్లా శిక్షణ బాధ్యతలు అప్పజెప్పారు.

“అడవులలో ఆయుధాలు ప్రయోగించడానికి, శత్రువులను నిర్మూలించడానికి నేను మావోయిస్టులకు శిక్షణ ఇచ్చాను. ప్రచండ సహా అనేకమంది పెద్ద నాయకులు ఇందులో పాల్గొన్నారు.” అన్నారు టేక్‌ బహాదూర్‌ పాఠక్‌.

टेकबहादुर पाठक

ఫొటో సోర్స్, Tekbahadur pathak

ఫొటో క్యాప్షన్, భార్యతో టేక్ బహాదూర్ పాఠక్

“ట్రైనింగ్‌ సమయంలో ప్రచండ, నేనూ స్నేహితులమయ్యాం. గ్రెనేడ్లు, టైమ్ బాంబులు ఎలా తయారు చేయాలో కూడా ప్రచండకు తెలుసు. అతని లక్ష్యం గురి తప్పదు.” అన్నారు టేక్‌ బహాదూర్‌.

విప్లవం మొదలైన తర్వాత పెళ్లి ప్రతిపాదనతో ప్రచండ నన్ను దిల్లీ పిలిపించారు. మా అబ్బాయితో తన కూతురికి పెళ్లి చేయాలని అడిగారు. నేను సరేనన్నాను. పెళ్లి తర్వాత నా కొడుకు, కోడలు ఇక్కడే ఉండిపోయారు” అని టేక్‌ బహాదూర్‌ తెలిపారు.

నేపాల్‌లో రాజరికం అంతమయ్యాక 2008లో టేక్‌ బహాదూర్‌ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ ఉద్యోగం మానేశారు. 2015లో జలంధర్‌లోని తన ఇంటిని అమ్మేశారు.

నేపాల్‌ విప్లవానికి సాక్షిగా ఉన్న ఈ ఇంటి కాఠ్‌మాండూలో ఇల్లు కట్టుకోవడానికి అమ్మేయాల్సి వచ్చిందని పాఠక్ చెప్పారు.

భార్య సీతా దాహల్‌తో ప్రచండ

ఫొటో సోర్స్, Tekbahadur Pathak

ఫొటో క్యాప్షన్, భార్య సీతా దహల్‌తో ప్రచండ

భారతీయుల మద్దతు

2008లో ప్రచండ నేపాల్‌ ప్రధాని అయ్యారు. కానీ ఏడాదిలోనే అప్పటి ఆర్మీ చీఫ్‌తో వివాదం తరువాత రాజీనామా చేశారు. ఈ నిర్ణయాన్ని రేణూ తప్పుబట్టారు.

“ఒక చిన్న వివాదంతో రాజీనామా చేయడం సరికాదు. ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. వ్యవస్థను మార్చడమే ఉద్యమ లక్ష్యం. ఇది కమ్యూనిస్టు పార్టీ తొందరపాటు నిర్ణయం” అన్నారు రేణూ దహల్‌. నేపాల్‌లో విప్లవానికి భారతీయులు ఎంతో సహకరించారని రేణూ చెప్పారు.

ప్రకాశ్ దహల్

ఫొటో సోర్స్, Tekbahadur pathak

ఫొటో క్యాప్షన్, ప్రచండ కుమారుడు ప్రకాశ్ దహల్ 36 ఏళ్ల వయసులో 2017లో చనిపోయారు

ప్రచండ తన జీవితంలో అనేక పోరాటాలను, విషాదాలను ఎదుర్కొన్నారు. 2017 ఆయన ఏకైక కుమారుడు 36 ఏళ్ల ప్రకాశ్‌ దహల్ మరణించారు. అంతకు ముందు పెద్ద కూతురు జ్ఞాను క్యాన్సర్‌తో మృతి చెందారు.

ప్రచండ భార్య సీత అనేక ఆరోగ్య సమస్యలతో ముంబైలో చికిత్స పొందుతున్నారు.

BBC ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)